భూలోక వాసులపై కారుణ్యం చూపితే ఆకాశ వాసి అంటే సృష్టికర్త అయిన దేవుడు మీపై కారుణ్యం చూపుతాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇదే ఇస్లాం సందేశం!
ఇస్లాం మానవులపై కారుణ్యం చూపమని అభిలాషిస్తుంది. పొరుగువాడు ఆకలితో ఉండగా మీరు మాత్రమే తిని పడుకోవద్దని వారిస్తుంది… ఏ ప్రాణాన్నీ అన్యాయంగా హతమార్చ వద్దని హెచ్చరిస్తుంది… పేదరికం భయం వల్ల మీ సంతానాన్ని చంపవద్దని కోరుతుంది… ప్రజలతో మర్యాద మృదు స్వభావంతో మాట్లాడమంటుంది… ప్రజలతో ముఖం చిట్లించుకుని అహంకారంతో మాట్లాడవద్దని, భూమిపై విర్రవీగుతూ నడవవద్దని ఆదేశిస్తుంది… తోటివారిని ఎగతాళి చెయ్యవద్దని, చెడ్డ పేర్లతో ఎదుటివారిని పిలవవద్దని ఆజ్ఞాపిస్తుంది… మత్తుపానీయాలు, అశ్లీలం, వ్యభిచారాల దరిదాపులకు కూడా పోవొద్దని చెబుతుంది… తలిదండ్రులను విసుగ్గా ఛీ అని కూడా అనవద్దని, పొరుగువారితో, బంధువులు, నిరుపేదలతో ఉదార బుద్ధితో వ్యవహరించమని చెబుతుంది ఇస్లాం.
అయితే నేడు కొందరు ఇస్లాం అవగాహన లేని ముస్లిముల ప్రవర్తన వల్ల ఇస్లాం హింసను ప్రేరేపించే మతం అంటూ విమర్శించబడుతుందన్నది కాదనలేని వాస్తవం. బాధాకరమైన విషయం ఏమిటంటే… ఇస్లాం అవగాహన లేని ముస్లిమేతరులు ఆయా విమర్శలను నిజమని నమ్మటం. కాబట్టి కొందరు ఇస్లాం ద్వేషకులు ఖురాన్ పై చేసే విమర్శలను గుడ్డిగా నమ్మేసే ముందు ప్రపంచవ్యాప్తంగా రెండొందల కోట్ల మంది ఆచరిస్తున్న ఇస్లాం నిజంగా హింసను నేర్పుతుందా? శాంతిని నేర్పుతుందా? అన్నది స్టడీ చెయ్యాలి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే… ఇస్లాంను విపరీతంగా ద్వేషించే ఎంతో మంది ఏదో సందర్భంలో ఖురాన్ చదివి తాము ఇస్లాం పట్ల ప్రదర్శించిన ద్వేషానికి సిగ్గు పడి ఇస్లాం స్వీకరించటం సైతం జరిగింది. ఎందుకంటే ఆకాశవాసి కరుణ పొందాలంటే దానికి ఇస్లాం పెడుతున్న షరతు- భోలోక వాసులపై కరుణ చూపాలన్నది. అలాంటి కారుణ్యాన్ని నేర్పే ఇస్లాం హింసను ఎలా నేర్పుతుందన్న విషయాన్ని వారు గ్రహించటమే.
