ఇంతకూ ఇదా “రంజాన్ పండుగ” అంటే..?

‘రంజాన్ పండుగ’ అంటే ముస్లిములు ఉపవాసాలు ఉండే నెల, సేమియాలు, బిర్యానీలు వండుకుని తినే పండుగ వగైరా… అని మాత్రమే చాలా మంది అనుకుంటూ ఉంటారు. వాస్తవానికి ‘రంజాన్ పండుగ’ అసలు పేరు “ఈదుల్ ఫిత్ర్”! అంటే- “దానాల పండుగ” అని అర్థం… రంజాన్ అన్నది అరబిక్ క్యాలండర్ లో 9 వ నెల పేరు…
* * * *

రంజాన్ అనేది కేవలం పన్నెండు నెలల్లో ఒక నెల పేరు మాత్రమే. వాస్తవానికి రంజాన్ నెల మొత్తం ఉపవాసాలు ఉండి, షవ్వాల్ నెల మొదటి రోజు పండుగ చేసుకోటాన్ని బట్టి “రంజాన్ పండుగ” అని సర్వసాధారణంగా పిలుస్తుంటారు. తప్పితే ఈ పండుగ అసలు పేరు “ఈదుల్ ఫితర్” అంటే- “దానాల పండుగ” అని అర్థం.

“దానాల పండుగ” – ఈ పదం వినటానికే ఆశ్చర్యంగా ఉంది కదూ!

ఒక రకంగా ఈ “ఈదుల్ ఫితర్” పండుగ రోజును సామాన్య పరిభాషలో “ఛారిటీ డే (Charity Day)” అని చెప్పాల్సి ఉంటుంది!

దానాలను చెయ్యటాన్ని కూడా పండుగలా సెలబ్రేట్ చేసుకునే ఒక రోజుంటుందా? అన్నది ఆలోచిస్తేనే ఆశ్చర్యం కలుగుతుంది కదూ!. కానీ ఇస్లాం, ముస్లిం సమాజానికి మీ కుటుంబంలో, ఇరుగు పొరుగున ఉండే బీదలను కలుపుకుని వారికి దానమిచ్చి పండుగ చేసుకునే విధానాన్నే నిర్దేశిస్తుంది.

అటు భయభక్తులు, నైతిక విలువలతో పాటు ఇటు బీదసాదల, అవసరార్ధుల, అన్నార్తుల హక్కును పటిష్టంగా నెరవేర్చటానికి, దానం విధిగా చెయ్యటాన్ని ఆచరణాత్మకం (Practical) గా నేర్పటానికి నిర్దేశించబడిన నెలే “రంజాన్”.
ఇస్లాం నిర్దేశించే రెండే రెండు పండుగల్లో ఒకటి “ఈదుల్ ఫిత్ర్” అన్నది దానాలు చెయ్యటాన్ని నేర్పే నెల అయితే దీని తరువాత వచ్చే మరో పండుగ “ఈదుల్ – అద్ హా (Festival of Sacrifice)” అంటే “త్యాగాల పండుగ” అని అర్థం దీనినే “బక్రీద్” అంటారు.

ఈ విధంగా ఇస్లాం చివరకు ఆనందంగా జరుపుకునే పండుగలను సైతం వ్యక్తిత్వ నిర్మాణం ప్రాతిపదికన, బీదసాదల అవసరాలను తీర్చే విధంగా ముస్లిం సమాజానికి నిర్దేశిస్తుందన్న విషయం చాలా మంది ఇస్లాం విమర్శకులకు తెలీనే తెలియదు.
****

దానం విషయంలో చివరకు ఒక ఖర్జూరమైనా దానం చేసి మీరు నరకాగ్ని నుండి రక్షించుకోమని ప్రవక్త ముహమ్మద్ (స) సెలవిచ్చారు. అలాగే స్వయంగా ప్రవక్త ముహమ్మద్ (స) – పొరుగువాడు ఆకలిగా ఉండగా తాను మాత్రం కడుపునిండా తినేవాడు అసలు విశ్వాసే కాదన్నారు.

రంజాన్ నెలలో ప్రతీ ఒక్కరూ “ఫిత్రా (దానం)” మాత్రమే కాక ఆస్తి పరులకు “జకాత్” సైతం ఇవ్వమనే ఆజ్ఞను సైతం ఖురాన్ ఇస్తుంది. ఖురాన్ లో నమాజ్ (ప్రార్ధన) చెయ్యమనే ఆజ్ఞ ఇవ్వబడినప్పుడల్లా దానితో పాటే “జకాత్” సైతం ఇవ్వమనే ఆజ్ఞను కొన్ని వందల సార్లు చూడగలం. “జకాత్” అన్నది ఆస్తిపాస్తులు, భూములు, డబ్బు బంగారం కలిగి ఉన్నవారు వాటిపై కొంత శాతాన్ని తీసి బీదసాదలు, అగత్యపరులకు పంచాల్సిన దానం అని అర్థం.
****

“దానాల పండుగ” రోజు“ చెయ్యాల్సింది”

దానలు విస్తృతంగా చెయ్యటమే! మన సంతోషంలో బీదసాదలకు భాగస్వాములు చెయ్యాలి. అందుకోసమే ఈ “ఈదుల్ ఫితర్” పండుగ నిర్దేశించబడింది. అలాగని పండుగ రోజు కొత్త బట్టలు, హంగూ ఆర్భాటాలు అవసరంలేదా? అంటే అవకాశం ఉనోల్లు ఇంటిల్లిపాదీ కొత్తబట్టలు కొని ధరించటంలో తప్పులేదు, కానీ అది రూల్ కూడా కాదు, సెంటిమెంటుగా అప్పు చేసి మరీ కొనాల్సిన పని అస్సలు లేదు. ఉన్న దాంట్లోనే మంచి బట్టలు ధరించి పండుగ చేసుకోవటం ప్రవక్త సాంప్రదాయం కూడా. కానీ, అత్యధికంగా ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అంశం మటుకు కేవలం ఉన్నంతలో ఎక్కువగా దానాలు చెయ్యటమే! అప్పుడే “దానాల పండుగ” అసలు ఉద్దేశం నెరవేరేది కూడా.

ఇక చివరిగా, దానం గురించి ప్రవక్త ముహమ్మద్ (స) చెప్పిన గొప్ప విషయం…

“దానం వలన మీ సంపద ఏ మాత్రం తగ్గిపోదు” – (సహీహ్ ముస్లిం 2588)

Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *