మనస్సును గాయపరిచే దానం వ్యర్థం

ఇస్లాం నేర్పుతున్న నైతిక విలువలలో దానం చెయ్యటం ఒకానొక ప్రధాన అంశమైతే… ఆ దానాన్ని సైతం మనస్సును గాయపరిచే విధంగా చెయ్యవద్దని ఇస్లాం ఆదేశిస్తుంది. మనస్సును గాయపరిచే దానం అంటే ఏమిటి? అన్న ప్రశ్నకు ఖురాన్ లోనే ఈ వాక్యంలో మనకు చక్కటి సమాధానం లభిస్తుంది:  “లోకుల మెప్పు కోసం ప్రదర్శనా బుద్ధితో దాన ధర్మాలు చేసే వాడిలా, మీరు మీ దాన ధర్మాలను ఎత్తి పొడుపు మాటల ద్వారా, గ్రహీత మనస్సును గాయపరచి మీ దానం వృధా చేసుకోకండి” -ఖురాన్ 264

దానం మంచిదే! కానీ చేసిన దానాన్ని అందరి ముందూ పబ్లిసిటీ చేసుకుంటూ, ఫలానా అతనికి నేను దానం చేశానని గొప్పలు చెప్పుకోవటం వల్ల ఆ దానాన్ని అందుకున్న వ్యక్తి మనస్సు గాయపడుతుంది. అందుకే ఖురాన్: “దానం చేసి, ఆ తరువాత చేసిన మేలును మాటి మాటికీ చాటుతూ, గ్రహీతల మనస్సును నొప్పించని వారికి దేవుని వద్ద గొప్ప ప్రతిఫలం ఉంది (2:262)” అంటూ చేసిన దానాన్ని రహస్యంగా ఉంచిన వ్యక్తికి గొప్ప ప్రతిఫలం ఉందన్న శుభవార్తను కూడా ఖురాన్ తెలియజేస్తుంది.

కాబట్టి దానం చెయ్యటం ఎంత మంచి పనో ఆ దానం చేసి నలుగురి ముందూ చెప్పుకోవటం అంత చెడ్డ పని అవుతుంది కూడా! అందుకే ఖురాన్- “మీరు మీ దాన ధర్మాలను బహిరంగంగా చేసినా మంచిదే, కానీ రహస్యంగా నిరుపేదలకు దానం ఇవ్వటం మీకు ఎంతో మేలు చేకూరుస్తుంది (2:271)” అని చెప్పటం జరుగుతుంది. పేదలకు దానధర్మాలు చెయ్యాలన్న స్పృహను ఇతరులలో కలుగజేయటానికి బహిరంగ దానధర్మాలు మంచివే, అయినప్పటికీ రహస్యంగా నిరుపేదలకు దానం ఇవ్వటం మీకు ఎంతో మేలు చేకూరుస్తుంది అని ఖురాన్ ఎందుకు చెబుతుందంటే దానం చేసి కొందరు నలుగురి ముందూ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడు ఆ దానం అందుకున్న వ్యక్తి మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకే ఖురాన్, అలాంటి మనస్సును గాయపరిచే దానం చెయ్యటం కంటే, మృదుభాషణం, క్షమాగుణంతో వ్యవహరించమంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *