కాబట్టి ముస్లిములకు దేశభక్తి లేనట్టేనా..!?

వందేమాతరం, భారత్ మాతకు జై చెప్పకపోతే ముస్లిముల్లో దేశభక్తి ఇక లేనట్టే! అలాంటి వారు భారతీయులే కారన్నట్టు తీర్మానాలు ఇవ్వటం గత పదేళ్లుగా వాట్సాప్, సోషల్ మీడియాల్లో ఊపందుకున్నంతగా గతంలో ఎన్నడూ లేదు… ఇప్పటివరకు వాట్సాప్పుల్లో చక్కర్లు కొట్టిన ఇలాంటి చవకబారు డిక్లరేషన్లు ఇప్పుడు కమర్షియల్ సినిమాలో హీరో చెప్పే డైలాగుల వరకు చేరిపోయాయి…
* * * *

సరే, భారత జాతీయ గేయమైన “వందేమాతరం పాడటంలో ఈ దేశ ముస్లిముల్లో అభ్యంతరం ఉందంటే వారిలో దేశ భక్తి లేనట్టేనా? అన్నది ప్రశ్న. అదే నిజమనుకుంటే… భారతదేశ ముస్లింలు భారత జాతీయ గీతమైన “జనగణమన”, అలాగే “సారే జహాఁ సే అచ్ఛా” వంటి గీతాలను ఎలాంటి అభ్యంతరం లేకుండా పాడతారు కదా!? మరి దాని సంగతేంటి?

అంతేకాదు… జాత్యాభిమానం ఈ దేశ ముస్లిముల నరనరాల్లో ఉందనటానికి గొప్ప ఆధారం వేలల్లో ముస్లిములు ఈ దేశం కోసం బలిదానాలు చెయ్యటమే కాదు భారతదేశానికి జాతీయవాద నినాదాలన్నీ ముస్లిములు ఇచ్చినవి కావటమే!

1.”మాదరే వతన్ భారత్ కి జై” నినాదాన్ని 1857 లో అజీముల్లా ఖాన్ ఇచ్చారు.
2.“జై హింద్” నినాదాన్ని అబిద్ హసన్ ‘సఫ్రానీ’ ఇచ్చారు
3.”ఇంక్విలాబ్ జిందాబాద్” నినాదాన్ని హస్రత్ మోహని ఇచ్చారు
4.భారత్ చోడో” (క్విట్ ఇండియా) నినాదం యూసుఫ్ మెహర్ అలీ ఇచ్చారు
5.యూసుఫ్ మెహర్ అలీ “సైమన్ గో బ్యాక్” నినాదాన్ని కూడా ఇచ్చారు.
6.”సర్ఫరోషి కి తమన్నా, అబ్ హమారే దిల్ మె హై” అనే నినాదాన్ని 1921 లో బిస్మిల్ అజీమాబాది రాశారు.
7.”తరానా-ఎ-హిందీ” ‘సారే జహాన్ సే ఆచ్చా హిందోస్తాన్ హమారా’ ను అల్లామా ఇక్బాల్ రాశారు.
8.సురయ్య తయ్యబ్జీ, ట్రై-కలర్‌ జండాను రూపొందించారు.

మరి అధికశాతం ముస్లిముల్లో వందేమాతర గేయాన్ని ఆలాపించటంలో అభ్యంతరం ఏమిటంటే… ఒక్క సృష్టికర్తను తప్ప ఎవరి పట్లా ఆరాధనా భావం కలిగి ఉండకూడదు అనే విశ్వాసం బలంగా ఉండటమే! భారత్ మాతాకుజై, “వందేమాతరం” పదాల్లో మాతృభూమిని ఒక దేవతగా రూపొందించి నీకు ప్రణమిల్లుతున్నాను” అని అర్థం వస్తుంది. ఈ అభ్యంతరమే తప్ప దేశంపై భక్తిభావం లేకపోవటమో లేక పాకి.స్తాన్ పై ప్రేమ ఉండటమో కాదు!

నా ఈ వ్యాసం అధిక శాతం ముస్లిములు వందేమాతరం, భారత్ మాతాకు జై అనటంలో వారు కలిగి ఉన్న అభ్యంతరం కరెక్టా? కాదా? అన్నది తేల్చటం కాదు. కానీ, వందేమాతర గేయాన్ని వారు తమ మత విశ్వాసాల ఆధారంగా చెప్పనప్పటికీ వారిలో దేశభక్తి లేదని తీర్మానించటం మటుకు ఘోరమైన నేరం అన్నది స్పష్టపరచటమే.

వందేమాతరం, భారత్ మాతాకుజై అని చెప్పమని బలవంతం చెయ్యవచ్చా?

వందేమాతరం, భారత్ మాతాకుజై అని చెప్పమని బలవంతం చెయ్యటం అటు రాజ్యాంగానికీ, ఇటు సుప్రీం కోర్టు తీర్పుకూ వ్యతిరేకం అన్నది గమనించాలి. 1950 జనవరి 26 న డా. రాజేంద్ర ప్రసాద్ భారత రాజ్యాంగ సభలో ‘జన గణ మన’ను “జాతీయ గీతం”గా… ‘వందేమాతరం’ ను “జాతీయ గేయంగా” ఉంటాయని ప్రకటించటం జరిగింది. వందేమాతర గేయాన్ని బకిం చంద్ర చటర్జీ భారతావనిని ఒక దేవతగా అభివర్ణిస్తూ స్వరపరచి తన ‘ఆనంద మఠం’ అనే నవలలో చేర్చారు.

ఇకా ఆనాటి నుండి ఈనాటి వరకు చాలా మంది ముస్లిములు మేము ‘జన గణ మన’ను మనసారా పాడతాము ఎందుకంటే ఆ గీతాలలో విగ్రహారాధన లేదా దేవతా స్తుతి ఉండదు, కేవలం దేశ గొప్పతనాన్ని మాత్రమే కీర్తిస్తాయి అనే వాదననే చేస్తూ రావటం జరిగింది. కానీ తరువాతి కాలంలో హిందూ-ముస్లిం వేర్పాటు రాజకీయాలు చేసేవారు ఏదైతే ముస్లిములకు అభ్యంతరం ఉందో దాన్నే బలవంతంగా చెప్పించాలని బలవంత పెట్టటం మొదలెట్టారు. వందేమాతరం అనకపోతే దేశభక్తి లేనట్టే అంటూ విద్వేషాలను రెచ్చగొట్టటం మొదలెట్టారు. వీరంతా జనవరి 26, 2002 వరకు గత 52 ఏళ్లుగా కనీసం జాతీయ పతాకాన్ని గౌరవించని గురువులకు చెందిన శిష్యులే కావటం గమనార్హం…

భారత రాజ్యాంగం ప్రకారం జాతీయ గీతాన్ని (జనగణమన), జాతీయ జెండాను గౌరవించడం ప్రతి పౌరుడి ప్రాథమిక విధి, అందులో సందేహం లేదు. కానీ, దానితో పాటు గమనించాల్సింది… జాతీయ గేయమైన “వందేమాతరం” పాడాలని బలవంతం చేయకూడదని సుప్రీంకోర్టు కూడా గతంలో పలు సందర్భాల్లో స్పష్టం చేసిందన్నది. అలా బలవంతంగా చెప్పించటం రాజ్యాంగనికే విరుద్ధం. వాస్తవం ఇదైనప్పుడు వినోదం అందించే కమర్షియల్ సినిమాలో హీరో పిస్టల్ ను ఏదో దీపావళి తుపాకు కాల్చినట్టి కాలుస్తూ “భారత్ మాతాకు జై అనటంలో మీరు ఇబ్బందేంట్రా.. ఆ .. ఆ ..?” అంటూ బలవంతంగా చెప్పించే ప్రయత్నం చెయ్యటం రాజ్యాంగ స్పూర్తికి ఎంత వ్యతిరేకం?

ఇక ముస్లిం సమాజంలోనే “వందే మాతరం” పాడినంత మాత్రానా అల్లాహ్ తో సంబంధం తెగిపోయినట్టు కాదు, చేసే ప్రతీ పని సంకల్పం మీద ఆధారపడి ఉంటుంది కనుక నా మాతృ భూమిపై గౌరవంతో “వందే మాతరం” పాడినప్పటికీ, నా ఆరాధనలన్నీ అల్లాహ్ కు చెందినవే అని భావిస్తూ వందేమాతర గేయాన్ని నిరభ్యంతరంగా పాడే ముస్లిములూ ఎంతో మంది ఉన్నారు… లేదు, మాతృ భూమిని దేవతగా కొలుస్తూ ఆరాధించే విధంగా పాడటం మా విశ్వాసానికి విరుద్ధం అని భావించే ముస్లిములూ ఉన్నారు.

అలాంటి ముస్లిములు జాతీయ గీతాన్ని ఆలపించటంలో, జాతీయ పతాకానికి సాల్యూట్ చెయ్యటంలో, జై హింద్ అనటంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అన్న విషయాన్ని తెలియజేస్తూనే… జాతీయ గేయమైన వందేమాతరం పాడటంలో ఉన్న అభ్యంతరం ఏమిటో మర్యాదగా వివరించాలి.

ఇక హిందూ మిత్రులు సైతం ముస్లిముల్లో కొందరు కేవలం వందేమాతరం పాడనంత మాత్రాన మొత్తం ముస్లిం సమాజాన్ని ఒకే గాటన కట్టేసి అసలు మొత్తం ముస్లిములే దేశద్రోహులన్న చవకబారు తీర్మానాలు చెయ్యకూడదు.

దేశ శాంతి భద్రతలు మొండి పట్టు మీద కాదు… సర్దుబాటుపైనే ఆధారపడి ఉంటుంది.

Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *