మనం రోజూ తేదీలు చూసే కేలండర్లలో మొత్తం రెండు రకాలున్నాయి. ఒకటి- “చాంద్రమాన పంచాంగం (Lunar calendar)” రెండవది- “సూర్యమాన పంచాంగం (Gregorian calendar)”. ప్రస్తుతం మనం రోజులు, నెలలు, సంవత్సరాలు లెక్కించటానికి వాడుతున్న ఇంగ్లీష్ కేలండర్ ను “సూర్యమాన పంచాంగం (Gregorian calendar)” అంటారన్నమాట!
చాలా మందికి తెలీని విషయమేమిటంటే- హైందవంలో మరియు ఇస్లాంలో “చాంద్రమాన పంచాంగం (Lunar calendar)” ఆధారంగానే రోజులు, నెలలు, సంవత్సరాలన్నవి లెక్కించబడుతుంటాయన్నది. అలాగే హైందవంలో సంవత్సరాది ఉగాదితో, ఇస్లాంలో ముహర్రంతో ప్రారంభమవుతుంటాయి.
అందుకే ముస్లిములు రంజాన్ ఉపవాసాలు మొదలెట్టటానికి మరియు ముగించటానికి “చాంద్రమాన పంచాంగం (Lunar calendar) ఆధారంగానే తేదీలు నిర్ధారిస్తుంటారు. ఆ క్రమంలో రంజాన్ నెల ప్రారంభ నెలవంకను చూడగానే రంజాన్ ఉపవాసాలు మొదలెట్టి సరిగ్గా ముప్పై రోజుల తరువాత ఉపవాస విరమణ సైతం నెల వంక చూసాకే ముగిస్తారు.
అయితే రంజాన్ నెలవంక కనపడగానే ముస్లిములు రెండు చేతులెత్తి ఒక ప్రార్ధన చేస్తారు. దానర్థం-
“అల్లాహ్ అందరికంటే గొప్పవాడు, ఓ అల్లాహ్ ఈ చంద్రుణ్ణి మా పై శాంతియుతంగా, ప్రయోజనకరంగా దాటి వెళ్లేలా చెయ్యి! ఓ చంద్రుడా నాకూ నీకు ప్రభువు ఆ అల్లాహ్ యే” అని.
ఇది నెలవంకను లేదా చంద్రుణ్ణి ఆరాధించటం అని చాలా మంది ముస్లిమేతరులు అపార్థం చేసుకుంటుంటారు. ఏ ముస్లిమూ అలాంటి పని ఎప్పుడూ చెయ్యడు.
స్టార్ మరియు నెలవంక ఇస్లామిక్ సింబలా?
స్టార్ మరియు నెలవంక అన్నది ఇస్లామిక్ సింబల్ ఎంతమాత్రం కాదు. ముస్లిందేశాల్ని వందల సంవత్సరాలు పాలించిన ఒకప్పటి ఒట్టోమన్ సామ్రాజ్య జాతీయ జండాపై ఈ చిహ్నం కలిగి ఉండేది. దానితో కొన్ని ముస్లిం దేశాల జాతీయ జండాలపై ఈ సింబల్ ను వాడటం మొదలెట్టారు.
అలాగే ముస్లిం దేశాల్లో సైతం ఒకనాటి టర్కీ ఆర్కిటెక్ట్చర్ ఆధారంగానే మసీదులపై, వాటి స్థంబాలపై నెలవంక డిజైన్లతో నిర్మించటంతో ఆ ఆర్కిటెక్ట్చర్ ను మసీదు నిర్మాణాలకు సర్వసామాన్యంగా వాడటం అన్నది తరువాతి కాలాల్లో ప్రపంచవ్యాప్త ముస్లిం సమాజ సంస్కృతి (Culture)లో అదొక భాగంలా అయిపోయింది. 1570 లో మక్కా మస్జిద్ ఆర్కిటెక్ట్చర్ సైతం ఒట్టోమన్ సామ్రాజ్యం కాలంలో డిజైన్ చెయ్యబడిందే.
కాబట్టి స్టార్ మరియు నెలవంక అన్నది ఒకప్పటి టర్కీ ఆర్కిటెక్ట్చర్ లో భాగమే తప్ప అది ఇస్లామిక్ సింబల్ ఎంత మాత్రం కాదు.
ఆ ఆర్కిటెక్ట్చర్ సైతం కేవలం అందం కోసం తప్ప మసీదులపై, వాటి స్థంబాలపై చంద్రుని సింబల్ పెట్టినంత మాత్రానా అది ముస్లిములకు పవిత్రమైందనో, ఆరాధనకు అర్హమైందనో కాదు.
అలాగే కొందరు ముస్లిములు కొత్తగా ఇళ్లూ, భవనాలు నిర్మించుకునేటప్పుడు, వారి షాపులపైనో నెలవంక గుర్తులు పెట్టి వాటి మధ్యలో స్టార్ గుర్తులు లేదా 786 లాంటి నెంబర్లతో అలంకరించటం వగైరా పనులు చెయ్యటంతో ముస్లిమేతర్లు నెలవంకను లేదా చంద్రుణ్ణి ముస్లిములు ఆరాధిస్తూంటారని అది వారి పవిత్ర ఆరాధనా చిహ్నమని అపార్థం చేసుకుంటుంటారు.
ఒకవేళ ముస్లిం సమాజంలో ఎవరైనా నెలవంక గుర్తును, వాటిలో స్టార్లూ లేదా నెంబర్లు రాయటం పవిత్రంగా భావించి సెంటిమెంట్ గా ఫాలో అవుతుంటే అలాంటి సెంటిమెంట్లు ఇస్లాంలో లేవన్న విషయాన్ని గమనించాలి.
ఇస్లాం చిహాల్లోనో, కట్టడాల్లోనో, వ్యక్తుల వేషధారణల్లోనో ఉండదు, విశ్వాసంలో, సదాచరణలో ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.
“ఈ రేయింబవళ్లూ, ఈ సూర్యచంద్రాదులూ అల్లాహ్ సూచనలోనివే. సూర్యచంద్రాదులకు సాష్టాంగ పడకండి; వాటిని సృష్టించిన దేవునికి సాష్టాంగపడండి” -41:37 అంటూ ఇస్లాం ఎంతో స్పష్టంగా సూర్య, చంద్రుల ఆరాధనను ఖండిస్తుంది!
“చంద్రుని తరిగే పెరిగే దశలను కచ్చితంగా నిర్ణయించినవాడు ఆయనే. తద్వారా మీరు సంవత్సరాల, తేదీల లెక్కలను తెలుసుకోవాలని” – 10:5 అంటూ చంద్రుని నియామక లక్ష్యం తేదీల లెక్కల కోసం తప్ప మరి దేనికీ కాదని ఖురాన్ తెలియజేస్తుంది.
ఈ విధంగా సూర్యచంద్రాదుల వల్ల ఎలాంటి లాభనష్టాలేవీ ఉండవని ఇస్లాం కచ్చితంగా తేల్చిచెప్పటమే కాక, అనవసరమైన గుడ్డి నమ్మకాలు కలిగి ఉండటానికి ఎలాంటి అవకాశమూ ఇవ్వటం లేదు.
ముస్లిములు “నెలవంక”ను ప్రార్ధిస్తారా?
Silhouette of muslim man praying to god at night 