ఏదోలా ఖురాన్ లో పరస్పర విరుద్ధ విషయాలు ఉన్నాయని నిరూపించాలి, ఖురాన్ ను తప్పుడు సిద్ధాంతాలు కలిగిన గ్రంథంగా చూపాలన్నది కొందరు క్రైస్తవ బోధకుల మరియు మిషనరీల ప్రయత్నం! కారణం కాస్త పరిశీలనా దృష్టి, పరిశోధన చేసే అలవాటు, ఆలోచించే గుణం ఉన్న క్రైస్తవుడు ఎవడైనా బైబిల్ తో పాటు ఒకవేళ ఖురాన్ ను, ఇస్లాంను పరిశోధించటం మొదలెడితే దేవుని పట్ల అతనికున్న అపార్థాలన్నీ తొలిగి, కల్పిత విశ్వాసాల నుండి ప్రక్షాళన కాబడి, అతడు మొట్టమొదట ముస్లింగా మారి ఇస్లాం నే స్వీకరిస్తాడు కనుక! ఈ ప్రక్రియ ముందుకు వెళ్లకుండా క్రైస్తవ బోధకుల, మిషనరీల మొదటి ప్రయత్నం ఏమిటంటే- బైబిల్లో ఉన్న దేవుని ఏకత్వ భావన నుండి సామాన్య క్రైస్తవ ప్రజానీకాన్ని దూరం చెయ్యటం కోసం బైబిల్లో లేని త్రిత్వం, యేసు దైవత్వ సిద్ధాంతాలను సర్వసామాన్యం చెయ్యటం. రెండవ ప్రయత్నం- సామాన్య క్రైస్తవులు ఇస్లాం పట్ల ఆకర్షితులు కాకుండా ఉండటానికి ఖురాన్ లో లేని లోపాలు దానికి ఆపాదించి, దానిని ఓ పరస్పర విరుద్ధ విషయాలు కలిగిన గ్రంథమనే భావన కలగ జెయ్యటం! అందులో భాగంగా ఖురాన్ యొక్క ఏ మాత్రం అవగాహన లేని కొందరు క్రైస్తవ బోధకులు లేవనెత్తే విమర్శలలో ఒకటి ఏమిటంటే- “ఖురాన్ లో ఒక ప్రక్క అనేక వాక్యాల్లో భూమ్యాకాశాలను దేవుడు 6 రోజుల్లో సృష్టించాడని చెబుతూనే, అదే ఖురాన్ లో 41 వ ఆద్యాయం 9-12 వాక్యాల్లో అందుకు విరుద్ధంగా దేవుడు భూమ్యాకాశాలను 8 రోజుల్లో సృష్టించినట్లు ఉంది! ఇంతపెద్ద పరస్పర విరుద్ధమైన విషయం వ్రాయబడి ఉన్న ఖురాన్ దైవ గ్రంథం ఎలా కాగలదు అన్నది?”
నిజానికి ఇదేమంత పెద్ద బలమున్న విమర్శ కాదు! ఎందుకంటే అధిక శాతం క్రైస్తవ బోధకుల అవగాహన లోపంలో భాగంగానే ఖురాన్ 41 వ ఆద్యాయం 9-12 వాక్యాలను సైతం అపార్థం చేసుకోవటం వలన ఖురాన్ లో అనేక చోట్ల 6 రోజుల్లో సృష్టి నిర్మాణం జరిగినట్లు, మరొక చోట 8 రోజుల్లో సృష్టి నిర్మాణం జరిగినట్లు ఉందనే విమర్శ లేవనెత్తటానికి కారణం అయింది. నిజంగానే ఖురాన్ లో అనేకచోట్ల సృష్టి నిర్మాణం 6 రోజుల్లో జరిగినట్లుగా ఉండి, మరొక చోట 8 రోజుల్లో జరిగినట్లు ఉందా? నిజంగా ఉంటే కచ్చితంగా అది పరస్పర విరుద్ధమనే విషయాన్ని అంగీకరించాల్సిందే! ఎందుకంటే తప్పు తప్పే అవుతుంది కనుక. అయితే ఇంతకూ ఖురాన్ 41 వ ఆద్యాయం 9-12 వాక్యాలలో సృష్టి నిర్మాణం 8 రోజుల్లో జరిగినట్లు ఉందా అన్నది పరిశీలిద్దాం. ముందుగా ఆ వాక్యాన్ని ఈ క్రింది గమనించగలరు.
“ప్రవక్తా! వారితో ఇలా అను: “భూమిని రెండు రోజులలో సృష్టించిన దేవుణ్ణి మీరు తిరస్కరిస్తారా? ఇతరులను ఆయనకు సరిసమానులుగా నిలబెడతారా? సకల లోకాల వారికి ప్రభువు ఆయనే కదా! ఆయనే భూమి మీద పర్వతాలను నెలకొల్పాడు; అందులో శుభాలను పెట్టాడు; అర్థించేవారందరి కోసం దాని లోపల వారి కోరికలకు, అవసరాలకు అనుగుణంగా కచ్చితంగా అంచనా వేసి ఆహార వస్తువులను సమకూర్చాడు. ఈ పనులన్నీ నాలుగు రోజులలో పూర్తి అయ్యాయి. తరువాత కేవలం పొగగా ఉన్న ఆకాశం వైపు ఆయన తన ధ్యానాన్ని మరల్చాడు. ఆయన ఆకాశాన్నీ, భూమిని ఉద్దేశించి ఇలా అన్నాడు: “ఉనికిలోకి రండి, మీకు ఇష్టమైనా, ఇష్టం కాకపోయినా.” అవి రెండూ- “అవి రెండూ “మేము వచ్చేశాము, విధేయుల మాదిరిగా” అని అన్నాయి. అప్పుడు ఆయన రెండు రోజులలో ఏడు ఆకాశాలను నిర్మించాడు” – 41:9-12
పై ఖురాన్ వాక్యాన్ని జాగ్రత్తగా చదివితే భూమిని 2 రోజుల్లో + దానిమీద పర్వతాలు వగైరా వన్నీ 4 రోజుల్లో + ఆకాశాలను 2 రోజుల్లో కలిపి మొత్తం 8 రోజుల్లో సృష్టించినట్లు పైకి కనపడుతుంది. వాస్తవానికి ఇక్కడ “రోజు” అంటే ప్రస్తుత 24 గంటలు కలిగిన ఒక దినం అని కాదు, ఒక సుదీర్ఘమైన కాలం (Period) కావచ్చు. బైబిల్లో సైతం “దేవుడు ఆరు దినాల్లో భూమ్యాకాశాలను సృజించినట్లు చూడగలం (నిర్గమ 20:11). సరే, ఏదైనప్పటికీ ఇంతకూ ఖురాన్లో దేవుడు భూమ్యాకాశాలను 8 రోజుల్లో సృజించాడా? 6 రోజుల్లో సృజించాడా? అన్నది గమనిస్తే- పై వాక్యంలో “తరువాత కేవలం పొగగా ఉన్న ఆకాశం వైపు ఆయన తన ధ్యానాన్ని మరల్చాడు” అన్న వాక్య భాగంలో “తరువాత” అన్నపదం అరబ్బీ మూలంలో “Summa (సుమ్మ)” అని చదవగలం. ఈ పదం మూడు అర్థాల్లో వాడబడుతుంది అవి: 1. Then – అప్పుడు 2. Moreover – అంతేకాక 3. “Simultaneously” – ఏకకాలంలో” లేదా “అదే సమయంలో”
వాస్తవానికి “తరువాత కేవలం పొగగా ఉన్న ఆకాశం వైపు ఆయన తన ధ్యానాన్ని మరల్చాడు” అన్న వాక్యం- “అదే సమయంలో (Simultaneously) కేవలం పొగగా ఉన్న ఆకాశం వైపు ఆయన తన ధ్యానాన్ని మరల్చాడు” అన్నది సరైన అనువాదం అవుతుంది. ఈ విషయం మరింత సులువుగా అర్థమవ్వాలంటే ఈ ఉదాహరణ గమనించండి. ఓ వ్యక్తి బట్టలు కుట్టే టైలర్ వద్దకు వెళ్లి మూడు ఫ్యాంట్లు, అదనంగా ఒక చొక్కా కూడా కుట్టమని పని అప్పజెప్పి ఎన్ని రోజుల్లో ఇవ్వగలరని అడిగాడు. దానికి ఆ టైలర్ ఒక్కో ఫ్యాంటు కుట్టటానికి 2 రోజులు పడుతుంది కనుక మీకు 6 రోజుల్లో ఇస్తానని చెప్పాడు. 6 వ రోజు మూడు ఫ్యాంట్లు మరియు అదనంగా కుట్టమన్న చొక్కాకూడా అతను ఇచ్చేశాడు. అయితే ఆ వ్యక్తి టైలర్ ను ఇలా అడిగాడు- “ఒక్కో ఫ్యాంటుకు 2 రోజులు పడుతుందని చెప్పారుగా! మరి చొక్కా కూడా కుట్టటానికి అదనంగా 2 రోజులతో కలిపి 8 రోజులు పట్టాలికదా! 6 రోజుల్లో ఎలా ఇవ్వగలిగారు?” అని. దానికి ఆ టైలర్ – ఈ ఆరు రోజుల్లో ఫ్యాంట్లు కుడుతూనే అదే సమయంలో (Simultaneously) రెండు రోజుల్లో చొక్కా కూడా కుట్టటం జరిగిందని చెప్పాడు. అంటే ఆ టైలర్ 6 రోజుల్లో ఫ్యాంట్లు కుడుతూనే “ఏక కాలంలో (Simultaneously)” చొక్కాను కూడా 2 రోజుల్లో కుట్టాడు. దీనిని బట్టి 6+2 = 8 రోజులు అని కాదు, 6 రోజుల ఫ్యాంట్లు కుట్టే పనితోపాటే అదే సమయంలో 2 రోజుల చొక్కాకుట్టే పని కూడా జరిగిపోయింది.
అదే విధంగా ఖురాన్ 41 వ ఆద్యాయం 9-12 వాక్యాలలో చెప్పబడుతున్న విషయం ఏమిటంటే- “భూమిని రెండు రోజులలో సృష్టించి, దానిమీద మీద పర్వతాలను, అనేక వస్తువులను 4 రోజుల్లో సృష్టిస్తూనే, “అదే సమయంలో (Simultaneously)” రెండు రోజుల్లో ఆకాశాలను కూడా సృష్టించటం జరిగింది. దీనిని బట్టి భూమి+పర్వతాలు 6 రోజుల్లో సృష్టించబడుతున్నప్పుడే అందులో భాగంగా 2 రోజుల్లో ఆకాశాలు కూడా నిర్మించబడ్డాయి. ఈ విషయం ఖురాన్ లో మరొక చోట చెప్పబడింది.
“ఆయనే మీ కోసం భూమిలో ఉన్న సమస్త వస్తువులనూ సృష్టించాడు. తరువాత (అదే సమయంలో) ఆకాశం వైపుకు ధ్యానాన్ని మరల్చి, తగు రీతిలో సప్తాకాశాలను నిర్మించాడు” – 2:29
పై వాక్యంలో సైతం “తరువాత (అదే సమయంలో) ఆకాశం వైపుకు ధ్యానాన్ని మరల్చి” అన్న వాక్య భాగంలో “తరువాత” అన్న పదం అరబ్బీ మూలంలో “సుమ్మ (summa)” అని ఉన్నట్లు చూడగలం. దాని అర్థం- “అదే సమయంలో (Simultaneously)” అని. వివరంగా చెప్పాలంటే దేవుడు భూమిని, దానిలో సకల సౌకర్యాలను సృష్టిస్తూనే, అదే సమయంలో, ఆకాశాలను కూడా సృష్టించాడు.
ఇక్కడ గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయం- “భూమి, ఆకాశం” అన్న పదాలు మానవ పరిభాషలో మనకు అర్థమవ్వటానికి తప్ప, ఈ మొత్తం విశ్వంలో కోట్ల కొద్దీ ఇతర గ్రహాలతో పాటు శూన్యంలో భూమికూడా ఒక గ్రహం మాత్రమే! అంటే విశ్వంలో అనేక గ్రహాలతో పాటే ఏక కాలంలో భూమికూడా ఉనికిలోనికి తేబడింది.
“బిగ్ బ్యాంగ్ థియరీ” చెప్పేది కూడా అదే! శూన్యంలో ఓ మహా విస్పోటనం జరిగి సకల గ్రహాలు ఒకేసారి ఉనికి లోనికి వచ్చాయని. అంటే మనం నివశిస్తున్న భూమి, అనేక గ్రహాలు కలిగిన ఆకాశం కూడా ఒకేసారి ఉనికి లోనికి వచ్చాయని అర్థం. “బిగ్ బ్యాంగ్ థియరీ” ఏ విషయాన్నైతే చెబుతుందో అదే విషయం ఖురాన్ 1400 సం. కు పూర్వమే ఈ క్రింది విధంగా చెబుతుంది.
“ఆకాశాలు, భూమి కలిసి ఉండేవి, తరువాత మేము వాటిని వేరు చేశాము” – 21:30
ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త అయిన “స్టీఫేన్ హాకింగ్స్” అనేక పరోశోధనలు చేసి తాను వ్రాసిన “బ్రీఫ్ హిస్టరీ ఆ టైమ్” లో చెప్పేది ఏమిటంటే- ప్రస్తుతం ఏదైతే విశ్వం ఉందో అది స్థిమితంగా లేదు కానీ వ్యాపిస్తూ (Expand) వెళుతుంది అన్నది. ఆ విధంగా విశ్వం వ్యాపిస్తున్న వేగానికి సమానంగా వ్యతిరేక దశలో అనేక సూత్రాల ద్వారా గణించి, “స్టీఫేన్ హాకింగ్స్” చెప్పిన విషయం ఏమిటంటే- పూర్తి విశ్వంలో ప్రస్తుతం అనేక గ్రహాలు, మనకు దగ్గరలో కనిపిస్తున్న సూర్యుడు, చంద్రుడు వగైరా వన్నీ ఒకప్పుడు ఒకే పదార్థం (Matter) గా కలిసి ఉండేవనీ, దానిని “Primary Nebula / ప్రైమరీ నెబ్యులా” అంటారని, ఆ తరువాత ఒక మహా విస్పోటనం జరిగి కొన్ని బిలియన్ కోట్ల గోళాలుగా ఆ పదార్థం వ్యాపించిందని, తద్వారా మనకు కనిపిస్తున్న అనేక గ్రహాలు ఏర్పడ్డాయని, ఆ విస్పోటనం నుండి విశ్వం వ్యాపించటం అనేది ప్రారంభం అయిందని చెప్పటం జరిగింది.
కానీ గమనార్హమైన విషయం ఏమిటంటే ఈనాడు అనేక పరిశోధనల అనంతరం ఏ “బిగ్ బ్యాంగ్ థియరీ” అయితే ఈనాడు ఆవిష్కరించబడిందో అది ఖురాన్ లో 1400 సం. కు ముందే “ఆకాశాలు, భూమి కలిసి ఉండేవి, తరువాత మేము వాటిని వేరు చేశాము” అని చెప్పటం జరిగింది.
కానీ, ఖురాన్ అవగాహన లేకుండా దానిపై చావకబారు చిల్లర విమర్శలు చేసేవారికి ఇలాంటి లోతైన జ్ఞానవంతమైన విషయాలతో పెద్ద పని ఉండదు. ఎందుకంటే వారి లక్ష్యమే సామాన్య వ్యక్తులను ఆలోచించకుండా చెయ్యాటం కదా! ఎందుకంటే ఆలోచించటం అన్నది మొదలైతే మనిషి పరిశోధన వైపు అడుగులు వేస్తాడు. తరువాత నిజానిజాలు తేల్చుకునే దశకు చేరుకుంటాడు. చివరిగా అసలు సత్యం వద్దకు చేరుకుంటాడు. ఈ చివరి దశకు చేరుకుంటే కల్పిత సిద్ధాంతాలతో ధర్మం ముసుగులో నిర్మించిన మత వ్యవస్థ అనే కప్పు కూలిపోతుంది కదా! అప్పుడు మరి సంపాదన పరిస్థితి ఏమిటి? కాబట్టి ఆదిలోనే అసలు ఫ్యూస్ పీకేయటం వల్ల ఇక ఆలోచన, పరిశోధన అనే ప్రసక్తే ఉండదు! ఎంచక్కా జనాలను “గొర్రె”లను చేసి ఎలా పడితే అలా ఆడించవచ్చు. ఈ ఆపరేషన్ లో భాగంనే ఇస్లాం కు వ్యతిరేకంగా కొందరు ఉనికిలో తెచ్చిన గ్రుడ్డి విమర్శల్లో ఒక గ్రుడ్డి విమర్శే ఖురాన్ లో దేవుడు భూమ్యాకాశాలను 6 రోజుల్లో సృజించాడా? 8 రోజుల్లో సృజించాడా? అన్న విమర్శ!
ఖురాన్ ప్రకారం సృష్టి నిర్మించబడింది ‘8 రోజుల్లోనా? 6 రోజుల్లోనా?
