ఇస్లాం నేర్పుతున్న నైతిక విలువలలో ఒకానొక అంశం దుబారా ఖర్చులు సైతం చేయకూడదు అన్నది. నిజానికి ఈ ఆదేశం చాలా చిన్నదిలానే కనిపించవచ్చు. కానీ మనిషి జీవితంలో ఈ అంశానికి ఎంతో ప్రాధాన్యత ఉందని చెప్పటం అతిశయోక్తి కాదు.

ఇస్లాం అన్ని విషయాల్లోనూ మధ్యేమార్గాన్ని నిర్దేశిస్తుంది. ఖురాన్ ఒకచోట “పిసినారి తనంతో వ్యవహరించ కూడదు (4:37)” అని చెబుతూనే…  అలాగని, దుబారాగానూ ఖర్చు చెయ్యవద్దని ఆదేశిస్తుంది.

మనిషి తన అవసరాలను తీర్చుకోటానికి కష్టపడి పనిచేస్తూ జీవించినంత కాలం ఏ సమస్యా ఉండదు, కానీ ఎదుటివారిలా జీవించాలనుకున్నప్పుడే అసలు సమస్య. అప్పుడే అతను లేనిపోని ఖర్చులు మీద వేసుకుంటాడు. అనవసరమైన ఆర్భాటాలకుపోయి లగ్జరీగా జీవితం గడపటానికి వృద్ధా ఖర్చులన్నీ చెయ్యటం మొదలెడతాడు.

ఈ ఆదేశం ముఖ్యంగా లక్షల కొద్దీ డబ్బు ఖర్చుచేసి డెకరేషన్లు, రకరకాల వంటకాలతో పెళ్లిళ్లు చేసుకునేవారికి కూడా వర్తిస్తుంది. కొందరు పెళ్లిళ్లలో చేసే వృధా ఖర్చుతో సామాన్య కుటుంబాలలో నాలుగు పెళ్లిళ్లు చెయ్యవచ్చు. కాబట్టే “తక్కువ ఖర్చుతో ఏ వివాహం అయితే చెయ్యబడుతుందో అదే ఉత్తమమైనది (అబూ దావూద్ 2117)” అని ప్రవక్త ముహమ్మద్ చెప్పటం జరిగింది. డబ్బున్నవారు నిజంగా చెయ్యాల్సింది పెళ్లిళ్లలో ఊళ్ళో సగం మందిని పిలిచి లక్షల కొద్దీ వంటకాలు వండి తినిపించేకంటే, వివాహాన్ని తక్కువ ఖర్చుతో చేసుకుని, వృధాగా పెళ్లిళ్లలో ఖర్చుపెట్టే డబ్బును సమాజంలో లేమికి గురైన వారికి, కష్టాల్లో ఉన్న బంధువులకు, బీదవారికి సహాయం చెయ్యటం వల్ల, వారిని ఆర్ధికంగా ఆదుకోవటం వల్ల నిజానికి ఎంతో శుభం చేకూరుతుంది.   కాబట్టి వృధా ఖర్చు చేసేకంటే ఆర్ధిక అవసరాలు ఉన్నవారికి ఖర్చుపెట్టమని ఇస్లాం ఆదేశిస్తుంది. అవసరం ఉన్నవారిని ఆడుకునే విషయంలో పిసినారి తనం పాటించవద్దని వారిస్తుంది.

One thought on “వృధా ఖర్చు చెయ్యకండి”
  1. మిస్తేక్: ఆడుకునే(ఆదుకునే) ధన్యవాదాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *