హిందూ సలామత్ హై

“హిందూ ఖత్రేమే హై” అన్న నినాదం సోషల్ మీడియాలో 2014 తరువాతే ఊపందుకుంది. హిందూ vs ముస్లిం మతోన్మాద రాజకీయాలు నడిపే కొందరు వేర్పాటువాదులు ఎప్పుడో ముస్లిం పాలకులు ఈ దేశంపై దండెత్తారని, గుళ్లు పడగొట్టారని, ముస్లిములు లవ్ జిహాదీలని వగైరా పనికిమాలిన రాతలు రాస్తూ..

హిందువులు ముస్లిముల వల్ల ప్రమాదంలో ఉన్నారని ఎప్పటివో మధ్యయుగాల నాటి సంబంధంలేని సంఘటల్ని ఉటంకిస్తూ సోషల్ మీడియాలో హిందూ-ముస్లిముల మధ్య విష బీజాలు నాటే ప్రత్యేక క్యాంపైన్ నడుపుతూ వస్తున్న తరుణంలో గత సంవత్సరం ఢిల్లీలో తబ్లిక్ జమాత్ ముస్లిములు అవగాహనారాహిత్యంతో సభ నిర్వహించటం అందులో కొందరు కరోనా పాజిటివ్ అని తేలటంతో మతోన్మాద వేర్పాటువాదుల ‘హిందూ ఖత్రేమే హై’ అన్న క్యాంపైన్ మరింత ఊపందుకుంది.

ఈ దేశ ముస్లిములను హిందూ వ్యతిరేకులుగా, కరోనా వ్యాప్తి కుట్రదారులుగా చిత్రీకరించటానికి మతోన్మాద వేర్పాటువాదులు చెయ్యని ప్రయత్నమంటూ లేదు. సంబంధంలేని ఎప్పటివో వీడియోలు ఎడిటింగులు చేసి సోషల్ మీడియా ద్వారా హిందువుల్లో ముస్లిముల పట్ల తీవ్ర వ్యతిరేకత తేవటానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. ముస్లిముల వద్ద ఏదీ కొనకూడదని నినాదాలు లేవదీసి వారి వ్యాపారాలు దెబ్బతీశారు.

కానీ, తరువాత జరిగింది వేరు.. ముస్లిముల పట్ల ధ్వేషాన్ని రగిలించాలనే మాస్ హిస్టీరియాతో మతోన్మాద పైత్యం తలకెక్కిన వేర్పాటువాదుల కథ అడ్డం తిరిగింది..

ఏ తబ్లిక్ జమాత్ ముస్లిములనైతే కరోనా కుట్రదారులన్నారో వారే తమ తోటి హిందూ సోదరులను రక్షించుకోవటానికి ప్లాస్మాను దానం చెయ్యటానికి ముందుకొచ్చారు. వేలల్లో ముస్లిములు ప్లాస్మా దానం చేశారు..

ఏ ముస్లిములనైతే హిందూ వ్యతిరేకులుగా చూపటానికి ప్రయత్నాలు చేశారో ఆ ముస్లిములే టీములుగా ఏర్పడి లాక్ డౌన్ లో దేశవ్యాప్తంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.. వలస కూలీలను అన్ని విధాలుగా సేవలు చేసి ఆదుకున్నారు..

అన్నిటికంటే మరీ ముఖ్యంగా..

ఏ ముస్లిములనైతే మసీదుల్లో కరోనా వ్యాప్తికి కుట్రలు పన్నుతున్నారని విమర్శించటం మొదలెట్టారో ఆ ముస్లిములే తమ మసీదులను ‘క్వారంటైన్ సెంటర్లు’గా మార్చేసి తమ తోటి హిందూ సోదరులను అందులో పెట్టి భద్రంగా కాపాడుతున్నారు..

ఏ ముస్లిముల వల్లనైతే ‘హిందూ ఖత్రేమే హై’ అన్న నినాదాన్ని లేవనెత్తి వారిని కించపరిచారో.. ఆ ముస్లిములే ఈనాడు కరోనా వల్ల చనిపోయిన కారణంగా తమ స్వంతవారే దగ్గరకు రావటానికి భయపడుతున్న తరుణంలో తమ ప్రాణాలకు సైతం తెగించి కరోనాను లెక్క చెయ్యక పైగా ఉపవాసాలు పాటిస్తూ కూడా తమ తోటి హిందూ సోదరుల అంత్యక్రియలను ఎంతో గౌరవ మర్యాదలతో నిర్వహిస్తున్నారు..

ఈ దేశ స్వతంత్రం కోసం ఒకప్పుడు వ్యతిరేక శక్తులతో పొరాడిన ఈ దేశ ముస్లిములే.. ఇప్పుడు కరోనా రక్కసి వల్ల దేశం ప్రమాదంలో పడిన నేపథ్యంలో తిరిగి సంఘటితంగా ఏర్పడి తమ తోటి హిందూ సోదరులతో భుజం కలిపి కరోనా మహమ్మారితో పోరాడుతున్నారు. తమ వంతు సహాయ సహకారాల్ని అందిస్తున్నారు.

ఈ పరిణామాలను చూసి ఏ కాస్త ఆలోచన ఉన్నవారెవరైనా ఏ కాస్త మానవత్వం ఉన్నవారెవరైనా ముస్లిముల వల్ల ‘హిందూ ఖత్రేమే హై’ అని చెప్పటానికి సాహసించరు.. కానీ ముస్లిముల వల్ల ‘హిందూ సలామత్ హై’ అంటే ముస్లిముల వల్ల హిందువులు ఎంతో భద్రంగా ఉన్నారనే చెబుతారు.

Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *