విగ్రహారాధనను వైదిక ధర్మం సమర్థిస్తుందా?

దేవుని విగ్రహాలను ధ్వంసం చేస్తుంటే దేవుడేం చేస్తున్నాడు? తనను తాను కాపాడుకోలేడా? అన్న ప్రశ్నను కొందరు నాస్తికులూ, విగ్రహారాధ వ్యతిరేకులూ చాలా సందర్భాల్లో ప్రశ్నిస్తూ ఉంటారు. అంతకంటే ముందు అసలు హిందూ మాతానికి మూలమైన వైదిక ధర్మంలో విగ్రహారాధన ఉందా? అని ప్రశ్నించుకుంటే..
హిందూ మతానికి విగ్రహారాధనే ఆధారమని చెప్పే చాలా మందికి తెలీని విషయం సనాతన వైదిక ధర్మంలో విగ్రహారాధన అసలు లేనే లేదన్నది. ఇది ఎవరో చెబుతున్న విషయం కాదు.

“రాతితో విగ్రహం చేసి మందిరములలో ఉంచి గాంధాదులతో పూజింపవలయును, అను ఒక్క వాక్యమైనా ఎక్కడా వేదములయందు కనపడదు” – సత్యార్ధప్రకాశము పేజీ 270
***

హిందూ ధర్మానికి ప్రామాణిక గ్రంథాలు ఏవి? అంటే వేదాలు, ఉపనిషత్తులు, వాటి సారాంశమైన భగవద్గీత అన్న విషయం హిందూశాస్త్రాల జ్ఞానం ఉన్న వారెవరైనా చెబుతారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే.. “వేదకాలంలో విగ్రహారాధన లేదు” అన్న విషయాన్ని ప్రఖ్యాత హిందూ పండితులే తేల్చి చెప్పేశారు. ముందుగా అసలు వేదోపనిషత్తులే దేవుడన్న వానికి విగ్రహం లేదని తేల్చి చెప్పేసాయి.

“పైనగానీ అడ్డంగా గానీ మధ్యలోగానీ ఎవడునూ అతనిని పట్టుకొనలేరు. మహాశయుడనే పేరుగల అతనికి విగ్రహం లేదు” – శ్వేతాశ్వరోపనిషద్ 4:19

“అవ్యాక్తానికన్నా భగవంతుడు శ్రేష్టుడు. ఆయన సర్వవ్యాప్తి. ఏ అనవాలూ లేనివాడు” – కఠోపనిషద్ – 2:3:8

“అతనికి ప్రతిమ (విగ్రహం) లేదు” – యజుర్వేదం 32:3

ఇక్కడే విగ్రహారాధనను సమర్ధించేవారు చెప్పేది ప్రత్యక్షంగా విగ్రహారాధన మేము చెయ్యటం లేదు కేవలం దాని ద్వారా అసలు దేవుడిపై నిగ్రహం కోసమే విగ్రహం అన్నది. ఈ ప్రక్రియ సైతం కొందరు పండితుల ద్వారా సామాన్య పామర జనాన్ని దైవారాధన వైపు మరల్చటానికి ప్రాధమిక అజ్ఞాన స్థాయిలో ఉండగా విగ్రహారాధన (దీనినే సాకరోపాసన) తప్పనిసరి.. ఆ తరువాత ఆధ్యాత్మికతలో ఉన్నత స్థాయికి అంటే జ్ఞానపరమైన స్థాయికి చేరుకున్నాక విగ్రహారాధన స్థితి దాటిపోయి ఏ విగ్రహమూ పెట్టకుండా ఆరాధన చేసే స్థితికి (దీనినే నిరాకారోపాసన) చేరాలన్న విధానం ప్రవేశపెట్టారు.

మొత్తానికి ఒకప్పుడు ప్రాధమిక దశలో దేవునికి విగ్రహం పెట్టాలన్న నియమం ప్రవేశపెట్టిన వారి అంతిమ లక్ష్యం సైతం “అవ్యక్తం”గా ఉన్న సృష్టికర్త అయిన సర్వేశ్వరుడి ఆరాధన వైపు మరల్చటమే అని తెలుస్తుంది. కానీ, తరువాతి కాలాల్లో విగ్రహారాధన హిందూత్వంలో మరెందుకు శాశ్వతంగా స్థిరపడిపోయింది? అన్న ఒక ప్రశ్న మన ముందుకు వస్తుంది.
దానికి కారణం డబ్బు సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్న మతపండితులు ప్రజలను తమ అదుపులో ఉంచుకునేందుకు దేవుడు సర్వవ్యాప్తి ఆయనను ఎప్పుడైనా ఎక్కడి నుండైనా ఆరాధించవచ్చన్న ఉన్నత స్థాయి (నిరాకారోపాసన స్థాయి) కి చేరకుండా ప్రాథమిక దశలో అంటే విగ్రహారాధన చేసే (అజ్ఞాన స్థితిలో) నే కట్టబెట్టేయటం. ఆ తరువాత్తరువాత మేము విగ్రహం ద్వారా ఆ సర్వేశ్వరుణ్ణే ఆరాధించటంలో తప్పులేదన్న మూడవ దశకు ప్రజలు తమంతట తామే చేరుకున్నారు. విగ్రహారాధన చెయ్యటంలో తప్పులేదన్న వాదనలు, సమర్ధింపులు బయలుదేరాయి. దానితో పాటు అనేక దేవతారాధన కూడా హిందూత్వంలో ఒక భాగమైపోయింది. నదులన్నీ చివరకు సముద్రంలో కలిసినట్టే ఎవర్ని ఏ రూపంలో ఆరాధించినా ఆ దేవుణ్ణే ఆరాధించినట్టవుతుంది వగైరా కొటేషన్లు కూడా కామనైపోయాయి. గమనించదగ్గ విషయం ఏమిటంటే- ఇలాంటి వాటన్నిటినీ వైదిక ధర్మం ఖండిస్తుందన్నది.

1. “అల్పబుద్ధి కలిగినవారి యొక్క ఫలము నాశవంతమై యున్నది. దేవతలను పూజించువారు దేవతలను పొందుచున్నారు. నా భక్తులు నన్నే పొందుచ్చున్నారు” – 7:23

పై ఈ శ్లోకంలో దేవతారాధన అల్పబుద్ధి కలిగిన వారి విధానం అని చెప్పటమే కాక, నా భక్తులు నన్నే పొందుచున్నారు అని చెప్పటం జరిగింది. అంతేకాదు “దేవతలను సృష్టించిన వాడు కూడా సర్వేశ్వరుడే” (శ్వేతాశ్వరోపనిషద్ 3:4)” పైగా.. “సకల దేవతలందరూ ఒక్క సర్వేశ్వరుణ్ణి మాత్రమే ఉపాసిస్తారు (ఋగ్వేదం 2:26:3)” అని వేదోపనిషత్తులు చెబుతున్నాయి.

2. “ఎవరు ఇతర దేవతలయెడల భక్తి గలవారై శ్రద్ధతో గూడి వారి నారాధించుచున్నారో వారు నన్ను ఆవిధి పూర్వకముగా ఆరాధించుచున్నారు” – గీత 9:23

ఏ రూపంలో ఎవరిని పూజించినా ఆ సర్వేశ్వరుడైన దేవుణ్ణి పూజించినట్టే అని ఎవరైతే ఇతర దేవతలను పూజిస్తున్నారో అలాంటి ఆరాధన “అవిధిపూర్వకమైనదని” పై శ్లోకం ద్వారా తెలుస్తుంది. మరొక శ్లోకం గమనించండి.

“దేవతలను ఆరాధించువారు దేవతలను, పితృదేవతలను ఆరాధించువారు పితృ దేవతలనూ, భూతములను (ప్రకృతి వస్తువులను) ఆరాధించువారు భూతములను నాన్నారాధించువారు నన్నే పొందుచున్నారు” – గీత 9:25

ఎవరు దేన్ని ఆరాధిస్తే వాటినే పొందుతారు దేవుణ్ణి ఆరాధించేవారు దేవుణ్ణే పొందుతారు తప్ప దేన్ని పడితేదాన్ని ఎవరిని పడితేవారిని వారిని పూజించేస్తే దేవుణ్ణి పూజించినట్టవ్వదని పై శ్లోకం వివరిస్తుంది.

3. “ఎవరైతే ప్రాకృతిక వస్తువులను పూజిస్తారో వారు చీకటిలో ప్రవేశిస్తారు. ఎవరైతే సంభూతిని పూజిస్తారో వారు మరింత అంధకారంలో ప్రవేశిస్తారు” – యజుర్వేదం 40:9

పై మంత్రంలో “ప్రకృతిలో దేన్ని పూజించినా అంధకారం (నరకం) లో ప్రవేశిస్తారని తెలుస్తుంది. ఇది స్పష్టంగా విగ్రహారాధనను ఖండిస్తున్న వాక్యం.

4. “మన కళ్ళతో చూడజాలనిది కానీ మన దృష్టిని చూచేది మాత్రమే నిజ దైవము. ఇక్కడ ప్రజలు పూజించేవేవీ దైవము కాదు” – కేనోపనిషత్తు 1:5

ఇక్కడ ప్రజలు పూజించేవి అంటే.. భూమి మీద దైవత్వ శక్తి మహిమాలూ ఉన్నాయని భ్రమపడి ప్రజలు పూజించే మహనీయులు బాబాలు, చెట్లూ పుట్టలూ, జంతువులూ, విగ్రహాలూ సూర్యచంద్రాదులూ వగైరా ప్రకృతిలో ఉన్న సమస్త వస్తువులన్న మాట. అవేమీ దైవాలు కావు వాటికి ఎటువంటి దైవత్వ మహిమలు లేవు. కానీ అవ్యక్తంగా ఉంటూ సమస్తాన్ని గమనిస్తున్న సర్వేశ్వరుడే దేవుడు అన్నది ఈ వాక్యార్థం.

మరి సర్వేశ్వరుడైన దేవుణ్ణి ఎలా గుర్తించాలి?

భౌతిక ప్రపంచంలో గొప్పతనాన్ని చూచి, ప్రత్యక్షంగా కనపడుతున్న రాళ్లనూ, జంతువులనూ, సూర్య చంద్రాదులను పూజించాలా? లేక ఈ గొప్ప సృష్టిని ఉనికిలోకి తెచ్చిన అవ్యక్త దేవుణ్ణి ఆరాధించాలా? అన్న ప్రశ్నకు ప్రకృతిలో ఉన్న మహత్తును చూచి రాళ్లూ, రప్పలూ, జంతువులనూ, మహనీయులనూ పూజించే మూర్త ప్రజ్ఞుల మాదిరిగా కాక, ఈ సృష్టిలో గొప్పతనాన్ని, మహత్తును చూచి దానికి అతీతంగా ఉన్న సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించాలి. అలా ఆరాధించే జ్ఞానులనే అమూర్త ప్రజ్ఞులు అంటారు.

ఆ సృష్టికర్త అయిన సర్వేశ్వరుడిని అనేక రూపాల్లో గుర్తించవచ్చా? అనేక పేర్లతో గుర్తించవచ్చా? అన్న ప్రశ్నకు.. వేదం “ఏకం సత్ విప్రాబహుదా వదంతి” “దేవుడు ఒక్కడే ఋషులు ఆయనను అనేక పేర్లతో పిలిచారు” – ఋగ్వేదం 1:164:46 అన్న సమాధానం ఇస్తుంది. అనేక పేర్లు అంటే అనేక భాషల్లో ఆయన గుణగణాలు సూచించే పేర్లు అని అర్థం. “సర్వానికి ఈశ్వరుడు అన్నా” హెబ్రూలో “యెహోవా (సజీవంగా ఉండేవాడు)” అన్నా సంస్కృతంలో “అక్షర పరబ్రహ్మ” అన్నా.. అరబ్బీ భాషలో “అల్లాహ్ (ఆరాధనీయుడు)” అన్నా ఇంకా ఖుదా, భగవాన్ అన్నా ఏ పేరుతో అయినా పిలవాలనుకున్నా పిలవవచ్చు .. వివిధ పేర్లతో పిలువబడే దేవుని అస్తిత్వం మటుకు ఒక్కటే. ఆ ఒక్క సర్వేశ్వరుడు ఇంద్రియాలకు గోచరం కానివాడు, అవ్యక్తుడు, మరణించనివాడు అన్న గుణగణాల ద్వారా మాత్రమే గుర్తించి ఆయన్ని మాత్రమే ఆరాధించాలన్నది సనాతన వైదిక ధర్మ ఆదేశం.

“పరమేశ్వరుడుక్కడే ఉపాసనీయుడై యున్నాడు” – అథర్వవేదం 4:11:6

“ఏ పరమేశ్వరుడైతే ఒకే ఒక్కడో ఓ మానవులారా మీరు ఆయన్నే స్తుతించుడు” – ఋగ్వేదం 5:54:16

“సకల మానవులకూ ఒకడే పరమేశ్వరుడు పూజనీయుడై యున్నాడు” – ఋగ్వేదం 6:22:1

————————- Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *