“పాతబస్తీ పై సజీకల్ స్ట్రైక్ చేస్తాం” అంటూ బండి సంజయ్ రెచ్చగొట్టే మాటలు మాట్లాడినా.. “దేశ్ కే గద్దారోంకో గోలీ మారో” అంటూ మరో నాయకుడు నినాదాలిచ్చినా.. వారి ఈ ధ్వేషం ఈనాటిది కాదు. దేశభక్తి అన్న పైపూతతో తయారైన ఈ విధ్వేషం వందేళ్ల క్రితమే పురుడుపోసుకుంది.
ఒకప్రక్క మహాత్మాగాంధీ దేశంలో అన్ని మతవర్గాల ప్రజల ఐక్యత పిలుపునిస్తూ స్వతంత్ర ఉధ్యమం చేస్తున్న నేపథ్యంలోనే మరోప్రక్క ఆ పిలుపును తిరస్కరిస్తూ సావర్కర్ హిందుత్వ ఐడియాలజీ ద్వారా కే.బీ.హెగ్డేవర్ స్థాపించిందే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్). 1915 లో మోహన్ మాలవియా, సావర్కర్ ల ద్వారా హిందూ మహాసభ స్థాపించబడి “హిందుత్వజాతీయవాదం” వెలుగులోకి తేబడింది అప్పటి నుండే. “అహింసా పరమో ధర్మః” అన్న గొప్ప హైందవ దృక్పథానికీ.. సర్వేజనాసుఖినోభవంతు అన్న హైందవ శాస్త్రాలు అభిలాషకూ.. ప్రజలంతా వసుదైక కుటుంబంలా ఐక్యతతో అలరారాలన్న వేదవాంగ్మేయానికి సంబంధం లేకుండా కేవలం ముస్లిం, క్రైస్తవ, కమ్యూనిస్ట్ వర్గాల పట్ల ధ్వేషాన్ని రగిలించటమే పునాదిగా అప్పటివరకూ లేని ఓ క్రొత్త “హిందుత్వవాద” నినాదాన్ని సావర్కర్, హెగ్డేవర్లు వెలుగులోకి తేవటం జరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎంతో ఉన్నతమైన హిందూ శాస్త్రాల “సనాతన హిందూ ధర్మానికీ” హెగ్డేవర్ స్థాపించిన “హిందుత్వవాదానికి” సంబంధం లేదన్న మాట. తరువాతి కాలాల్లో హెగ్డేవర్ వారసుడిగా ఆర్.ఎస్.ఎస్ కార్యకలాపాలను గోల్వాల్కర్ కొనసాగించటం జరిగింది.
హిందూ దేశాన్ని రక్షించాలంటే హిందువులను రక్షించాలి తప్ప అందరినీ కలుపుకుపోతే దేశాన్ని రక్షించటం ఎలా సాధ్యం.. హిందుస్తాన్ లో ఉంటే ఒక్క హిందువులే ఉండాలన్న గమ్మత్తైన దృక్పథంతో వెలుగులోకి తేబడిన హిందుత్వ వాద నినాదం దేశంలో ఉన్న మైనారిటీల పట్ల ధ్వేషాన్ని రగిలించటమే పరమావధిగా రూపుదిద్దబడింది. అదే ఆనాటి నుండి ఈనాటి వరకూ “దేశభక్తి” అన్న పైపూతతో చలామణీలో ఉంది. అంతేకాదు, త్రివర్ణ పతాకంలో మూడు రంగుల దృక్పథాన్ని కూడా తిరస్కరించి కేవలం ఒక్క కాషాయ రంగు జండానే ఉండాలని ఆర్.ఎస్.ఎస్. పత్రిక ఆర్గనైజర్ లో ప్రచురించటాన్ని బట్టి అన్ని మతవర్గాల ప్రజలు కలిసిమెలసి ఉండాలన్న దృక్పథానికి ఆర్.ఎస్.ఎస్ ఎంత వ్యతిరేకమైందో అర్థం చేసుకోవచ్చు. భారతదేశం ఒక్క హిందువులకు మాత్రమే చెందిందన్నది సావర్కర్ సిద్ధాంతం.
నిజానికి హిందువులందరినీ కాపాడాలన్న ఆర్.ఎస్.ఎస్ వాదం కూడా కేవలం రాజకీయ దృక్పథంతో కూడిన కవరింగ్ మాత్రమే. ఎంత హిందువులైనా ఆర్.ఎస్.ఎస్ దృక్పథాలకు వ్యతిరేకిస్తే అలాంటి వారు “లెఫ్టిస్టులు” లేదా “యాంటీ నేషనల్” అన్న మాట. ఆర్.ఎస్.ఎస్ దృక్పథాలను గౌరవించవారు మాత్రమే “రైటిస్టులు” లేదా “నేషనల్స్” అంటే “దేశభక్తులన్నట్టు. “నేను సనాతన హిందువును అని ప్రకటించుకునే గాంధీని బ్రాహ్మణుడైన గాడ్సే చంపటంతోనే ఆ దృక్పథం ప్రారంభమైందని చెప్పవచ్చు. నిజానికి భారత రాజ్యాంగం స్థానంలో ఇతర కులాలపై “బ్రాహ్మణ ఆధిపత్యాన్ని” ఏర్పర్చటానికి మనుస్మృతిని చట్టబద్దం చెయ్యటం అన్నది ఆర్.ఎస్.ఎస్ ప్రధాన ఏజండా.
గోల్వాల్కర్ రాసిన తన పుస్తకం “బంచ్ ఆఫ్ థాట్స్” లో అతను రాజ్యాంగం గురించి రాసిన రాతలను బట్టి రాజ్యాంగం పట్ల అతని వ్యతిరేకత ఏమిటో అర్థం చేసుకోగలం. అంతేకాదు.. గోల్వాల్కర్ తన మాటల్లో స్పష్టంగా “హిందువులు, మీ శక్తిని బ్రిటిష్ వారితో పోరాడటానికి వృథా చేయకండి; ముస్లింలు, క్రైస్తవులు మరియు కమ్యూనిస్టులు అయిన మన అంతర్గత శత్రువులతో పోరాడటానికి మీ శక్తిని ఆదా చేసుకోండి” అని చెప్పిన మాటల్లోనే ఆర్.ఎస్.ఎస్ అంతర్గత ఎజెండా ఏమిటో.. దేశస్వతంత్రోధ్యమంలో వారి పాత్ర ఎంతన్నది స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.
ఆనాడు గోవాల్కర్ చెప్పిన ఈ సైద్ధాంతిక దృక్పథం నేడు బీజేపీ తాలూకు అగ్రస్థాయి నాయకుల నుండి కార్పొరేటర్ స్థాయి ఛోటా లీడర్ల వరకూ వారి మాటల్లో చేతల్లో ఏదో చోట ఏదో కోణంలో బయట పడుతూనే ఉంటుంది. గుజరాత్, ఢిల్లీ జీనోసైడ్లు, బాబ్రీమసీద్ కూల్చివేత, గోసంరక్షణ పేరుతో మాబ్ లించ్ లు, సీ.ఎ.ఎ/ఎన్.ఆర్.సీ, ట్రిపుల్ తలాక్, లవ్ జిహాద్ చట్టాల నుండీ.. నిన్నా మొన్నటి వరకు బండి సంజయ్ లాంటి ఓ లోకల్ లీడర్ బహిరంగంగా “పాతబస్తీ పై సజీకల్ స్ట్రైక్ చేస్తాం” అంటూ రెచ్చగొట్టే మాటలు చెప్పే వరకూ ప్రతీ కోణంలో హిందూ, ముస్లిముల భావోద్రేకాలను రెచ్చగొట్టటం.. ముస్లిముల పట్ల ఇతర మైనార్టీల పట్ల సామాన్య హిందువుల్లో విద్వేష విషబీజాల్ని పెంచి పోషించే దృక్పథం చేప క్రింద నీరులా అంతర్గతంగా కొనసాగుతూ ఉంటుంది.
ఈనాడు చిన్న స్థాయి నాయకులైన రాజా సింగ్, బండి సంజయ్ లాంటి వారు సైతం అంత బహిరంగంగా ముస్లిముల పట్ల వ్యతిరేక మాటలు మాట్లాడటం, రెచ్చగొట్టే విధంగా ధ్వేష పూరిత నినాదాలు ఇవ్వటం అన్నది వారేదో ఈనాడు క్రొత్తగా మొదలెట్టింది కాదు. ఎప్పుడో వందేళ్ల క్రితమే వారి ఆది గురువుల ద్వారా ధ్వేషానికి “దేశభక్తి” అన్న పైపూత పూసి మార్కెట్టులో చలామణీ చేస్తూ వస్తున్న పాత ప్రొడక్టే.
చిత్రం ఏమిటంటే దేశ జీ.డీ.పీ అధమ స్థాయికి దిగజారిపోయి, దేశంలో నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభాలు, ఆకలిబాధలు విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో అలాంటి సమస్యల నుండి దేశాన్ని ఎలా బయటపడవెయ్యాలా అన్న వాటిపై చర్చలు జరగటానికి బదులు రామ మందిర నిర్మాణాలకు పునాదులు వెయ్యబడతుంటాయి, దేశంలో ప్రతీ ఐదు నిముషాలకు ఒక అత్యాచారం జరుగుతున్న ప్రమాదకర నేపథ్యంలో అలాంటి ఘోరాలను నిరోధించే గట్టి చట్టాలు తేవటానికి బదులు ట్రిపుల్ తలాక్, సీ.ఎ. ఎ / ఎన్.ఆర్.సీ బిల్లులు పాస్ చేయబడుతుంటాయి.. ఈ విధంగా ప్రతీ కోణంలోనూ హిందూ, ముస్లిం భావోద్రేకాలను రెచ్చగొట్టే ఆర్.ఎస్.ఎస్ అంతర్గత ఏజండా నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. దేశంలోనే అత్యధిక అత్యాచారాలతో, కాలుష్య సమస్యతో, నిరుద్యోగ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ సమస్యలన్నిటి కంటే“లవ్ జిహాద్” అతి పెద్ద సమస్య అయి కూర్చుంటుంది. ఆయా నాయకుల భక్త జనాంగానికి తనిష్క్ యాడ్ అతి పెద్ద సమస్య.. అదే దేశంలో సంవత్సరానికి లక్షల కొద్దీ హిందూ స్త్రీలు అత్యాచారాలకు గురికాబడి చంపబడుతుంటారు. అది అసలు సమస్యే కాదు.
మరో ప్రక్క హిందూ, ముస్లిముల మధ్య ఈ విష బీజాల్ని నిత్యం నాటుతూ అర్థం లేని శతృత్వాన్ని, కారణం లేని ధ్వేషాన్ని పెంచటానికి నిత్యం ఐ.టీ సెల్ పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడో మధ్యయుగాల్లో ముస్లిం పాలకులు భారతదేశంపై దండెత్తి హిందూ గుడులు కూల్చేశారు.. బలవంతంగా హిందువులను ఇస్లాంలోకి మార్చేశారు.. మనం చూస్తూ కూర్చుంటే ముస్లిములు నాలుగేసి పెళ్లిళ్లు చేసేసుకుని ఒకొక్కరు పదేసి మందిని కనేసి ముస్లిం జనాభా పెంచేసుకుని ఏదో రోజు ముస్లిములు దేశాన్ని ఇస్లామిక్ కంట్రీగా మార్చేస్తారు కాబట్టి “హిందూత్వం ప్రమాదంలో ఉంది” అంటూ పనికిమాలిన భయాలను సామాన్యుల్లో కలగజేయ్యటం.. ముస్లిములు త్రివర్ణ పతాకాన్ని గౌరవించరు, వారు పాకిస్తాన్ సపోర్టర్స్, జిహాదీలంటూ కొన్ని స్లోగన్స్ ను సోషల్ మీడియాలో సర్వసామాన్యం చేసి ధ్వేషాన్ని రగిల్చే గొప్ప బాధ్యతను ఐ.టీ సెల్ చూసుకుంటుంది.
భారతదేశ స్వతంత్రోధ్యమంలో 65 శాతం మంది ముస్లిములు పాల్గొన్నారు, వేలకొద్దీ సామాన్య ముస్లిములు, ముస్లిం పాలకులు ఈదేశ హిందువులతో భుజం కలిపి.. తమ ప్రాణాల్ని తృణప్రాయంగా వదిలేయటం కారణంగానే దేశ స్వతంత్రం సాధ్యమైందన్న వాస్తవాన్ని సామాన్య హిందూ ప్రజానీకం మెదళ్ల నుండి తుడుచిపెట్టి.. ముస్లిములు దేశద్రోహులన్నట్టు బ్రెయిన్ వాష్ చేసి వారి పట్ల ధ్వేషం పెంచటాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవటమే ప్రస్తుతం చలామణిలో ఉన్న దేశభక్తి.
నిజానికి ముస్లిం పాలకుల హయాములో హిందూ సంస్కృతి గొప్పగా అలరారింది దానికి తార్కాణం వారి వెయ్యెళ్ళ పాలన అనంతరం కూడా దేశంలో 80 శాతానికి పైగా హిందువులు ఉండటం.. దాదాపు వెయ్యేళ్లు ముస్లిం రాజుల క్రింద పాలించబడిన భారతదేశంలో స్వతంత్రం వచ్చేనాటికి హిందువులు ఎనభై శాతం కంటే ఎక్కువగా ఉన్నారు.
ఇక మధ్య యుగాల్లో ఒక రాజ్యం మరో రాజ్యాన్ని జయించినప్పుడు ఓడిపోయిన రాజ్యం యొక్క రాజ్య దేవతను, ధ్వంశం చెయ్యాటమో, తరలించుకుపోయి తమ రాజ్యంలో కలుపుకునేవారు. అలా చెయ్యటం యుద్ధాన్ని నెగ్గటానికి, వారి రాజ్యాన్ని తమ రాజ్యంలో కలుపుకోవటానికి సంకేతంగా (Symbolic) భావించేవారు. ఆ విధంగా రాజ్యాలకు రాజ్యాలకూ మధ్య జరిగిన అనేక యుద్ధల్లో ఒక్క ముస్లిం రాజులే కాదు అనేక హిందూ రాజులు సైతం ఆలయాలను ధ్వంశం చేసిన సంఘటనలు చరిత్రలో కోకొల్లలు. అదంతా కేవలం అప్పటి రాజ్యకాంక్ష తాలూకు యుద్ధోన్మాదమే తప్ప మతోన్మాదం కాదు. కానీ, మతరాజకీయాలు నడపటానికి ఆ చరిత్ర వక్రీకరించబడింది.
ముస్లిములు నాలుగేసి పెళ్లిళ్లు చేసేసుకుంటారు.. ఒకొక్కరు పదేసి మందిని కనేసి ముస్లిం జనాభా పెంచేసుకుని ఏదో రోజు ముస్లిములు దేశాన్ని ఇస్లామిక్ కంట్రీగా మార్చేస్తారని మెదడును మోకల్లో పెట్టుకుని మాట్లాడేవారికి సైతం లోకజ్ఞానం లేని మూర్ఖులే. భారతదేశ మొత్తం ముస్లిం సమాజాన్ని పరిశీలిస్తే ఉన్న 14 శాతం ముస్లిముల్లో అధికశాతం మంది దారిద్ర రేఖకు దిగువున బ్రతుకుతూ.. ఇంట్లో ఉన్న ఒక భార్య ఒకరిద్దరు పిల్లల్ని పోషించుకోవటానికి ఇబ్బందులు పడుతూ కష్టంగా జీవనాన్ని నెట్టుకొచ్చే మిడిల్ క్లాస్ మనుషులే ఉన్నారు. ఇది కంటికి కనపడే వాస్తవమైనా.. హిందూ ముస్లిముల భావోద్రేకాలు రెచ్చగొట్టటమే ధ్వేషం నిండిన దేశభక్తుల ప్రధాన లక్ష్యం కాబట్టి అవి కంటికి కనపడవు.
కానీ ఈ ధ్వేషం చెదలు పట్టి తినేసినట్టు దేశాన్ని లోలోపల డొల్లగా మార్చేసి తద్వారా ఏర్పడే నష్టానికి తిరిగి అందరూ బాధ్యులు కావలసివస్తుందన్న వాస్తవాన్ని నేడు మతోన్మాదాన్ని తమ భుజాలపై మోసుకుంటూ తిరిగేవారు గ్రహించలేకపోతున్నారు. వారిని మటుకు దేశభక్తుల కార్డు తగిలించి “అచ్చే దిన్ ఆయెంగే” అన్న పగటి కలలో విహరింపజేస్తూ.. ఆకాశాన్నంటిన నిత్యావసర సరుకుల మరియు పెట్రో-డీజిల్ ధరలు, దారుణంగా క్షీణించిన జీడీపీ, గత నభై ఏళ్లలో లేనంత నిరుద్యోగ సమస్య, ప్రభుత్వ రంగాల ప్రయివేటీకరణలు మరియు భారీ ఆర్ధిక పతనం తాలూకు నష్టాలను వారి నెత్తిపై రుద్దుతూనే తిరిగి వారితో జై కొట్టించుకుని వారిపై అధికారం సాగించే నేపథ్యం నేడు కొనసాగుతుంది. ఈ నష్టాలకు ఒక్క ముస్లిములే గురవ్వటం లేదు అందరూ వాటికి గురవుతున్నారు. కానీ అది గమనించకుండా మెదళ్లను మొద్దు బారేలా చెయ్యగలిగేదే ఫాసిజం. అది ఒక పట్టాన మొదలైతే సమాజం పూర్తిగా నాశనమయ్యేదాకా వదలదు. వాస్తవానికి ముస్లిముల వల్ల హిందువులు ప్రమాదంలో లేరు.. హిందువుల వల్ల ముస్లిములూ ప్రమాదంలో లేరు కానీ మతతత్వవాదం వల్ల హిందూ, ముస్లిం వర్గాలిరువురూ ప్రమాదంలో ఉన్నాయి.
కాబట్టి పనిగట్టుకుని ధ్వేషాన్ని పెంచాలనుకుంటే.. వంద దారులు వెతకవచ్చు. కానీ, హిందూత్వానికి మూల గ్రంథాలైన వేదోపనిషత్తులు, గీతా శాస్త్రాలైనా వ్యక్తుల మధ్య ఐక్యతను అభిలాషిస్తున్నాయే తప్ప హిందూత్వాన్ని కాపాడటానికి ఇతరమతాలను హింసించమని చెప్పటం లేదు. అలాగని నూటికి నూరుశాతం ముస్లిములంతా మహానుభావులు, ఏ తప్పూ చెయ్యని దేవదూతల జాతికి చెందినవారని చెప్పటం కూడా ఇక్కడ నా ఉద్దేశం కాదు. ప్రతీ మతవర్గంలో మంచివారితో పాటు చెడ్డవారు ఉండటం సహజం. ముస్లిం సమాజంలోనూ గొప్ప సంస్కారవంతులూ ఉన్నారు మూర్ఖపు పనులు చేసినవారు గతంలోనూ ఉన్నారు ఇప్పుడూ ఎప్పుడూ ఉంటారు. కానీ ఆ కొందరు చేసే చెడు పనులను మాత్రమే భూతద్దంలో చూపిస్తూ మొత్తం ముస్లిం సమాజంపై బురదజల్లే ప్రయత్నాలు చెయ్యకూడదు. అదే నేడు జరుగుతుంది.
నుదుటిపై పొడవాటి కుంకుమ బొట్లు పెట్టుకుని ఎంత కాషాయ బట్టలు కట్టుకుని, గర్వంగా నేను హిందువని ప్రకటించుకున్నప్పటికీ.. దేశప్రజలందరినీ కులమతాలతో సంబంధంలేకుండా “ప్రతీ హిందూ నా బంధువు” అనటానికి బదులు.. “ప్రతీ భారతీయుడూ నా బంధువు” అని నినదిస్తూ అందరినీ సమానంగా ప్రేమించటమే “నిజ దేశభక్తి” అవుతుందన్న వాస్తవాన్ని గ్రహించకుండా మేము దేశభక్తులమని ప్రకటించుకుంటే అది “నామమాత్ర దేశభక్తి” లేదా సోకాల్డ్ పేట్రియాటిజం అవుతుంది. అలాంటి సోకాల్డ్ దేశభక్తుల నుండి అలాంటి భావజాలం కలిగిన నాయకులను దేశాన్ని కాపాడే బాధ్యత అటు ఆలోచనాపరులైన హిందూ, ముస్లిం ఇతర వర్గాల ప్రజలందరిపై ఉంది. అలాంటి ఆలోచనా పరులపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది.
