నిజంగా ఏ మతమైనా ప్రమాదంలో పడుతుందా?

మతం/ధర్మం అన్నవి ఎప్పుడూ ప్రమాదంలో పడవు. అయినప్పటికీ ప్రజల మధ్య చీలికలు తెచ్చి, మత రాజకీయాలు నడిపే కొందరు వేర్పాటువాదులు “హిందూత్వం ప్రమాదంలో ఉందన్న” హాస్యాస్పదమైన వాదన లేవనెత్తుతుంటారు.

ధార్మికులే ప్రమాదంలో పడతారు!

మతం/ధర్మం ప్రమాదంలో ఉన్నాయని చెప్పటం అత్యంత హాస్యాస్పద విషయం. నిజంగా ప్రమాదంలో పడితే ధార్మికులే ప్రమాదంలో పడతారు.

ఏదైనా మతవర్గం ఎప్పుడైతే తన వద్ద ఉన్న ధార్మిక గ్రంథాల ఆదేశాలను వదిలిపెట్టి తమ ఇష్టానుసారంగా నడుచుకుంటూ నైతికంగా దిగజారిపోతుందో.. ఎప్పుడైతే తన వద్ద ఉన్న ధార్మిక గ్రంథాలు నిషేధిస్తున్న చెడు పనులు ఆ మతవర్గంలో సర్వసామాన్యమైపోతాయో నిజానికి అప్పుడే ఆ మతవర్గపు ప్రజలు ప్రమాదంలో పడినట్టు లెక్క! ఆ లెక్కన చూసుకుంటే నేడు ఒక్క హిందుత్వమే కాదు దాదాపుగా సకల మతవర్గాలూ ప్రమాదంలోనే ఉన్నాయని చెప్పొచ్చు. కాబట్టి ఏ మతంలో అయినా అసలు ప్రమాదకారులు ఎవరంటే.. మతదురభిమానం తలకెక్కి.. ధార్మిక గ్రంథాల అవగాహన కించిత్తుకుడా లేకుండా.. మా మతమే గొప్ప అంటూ మూర్ఖంగా ప్రవర్తించే మతోన్మాదులతోనే. ఇలాంటి మూర్ఖులు ప్రతి మతవర్గంలోనూ ఉంటారు.

ఉదాహరణకు: కొందరు మూర్ఖులు ప్రవక్త ముహమ్మద్(స) కార్టూన్లు వేశారని ఆవేశంతో ఊగిపోయి దాడులకు దిగే కొందరు ఛాందసవాద ముస్లిములకు అంతకంటే ఘోర అవమానాలు ఆయన ఉన్నప్పుడే ఆయన శత్రువులు ఎన్నోచేసేవారని అయినప్పటికీ ఆయన తన శత్రువులను ప్రేమించి వారి మనసు గెలుచుకున్నారే తప్ప ఏనాడూ బూతులు మాట్లాడటంగానీ, ఎదురు దాడులకు దిగటం గానీ చెయ్యలేదన్న జ్ఞానం ఉండదు. నిజంగా ప్రవక్త ముహమ్మద్(స) ప్రేమించేవారే ఆ ప్రేమను ఆయన ఆదర్శాలను పాటించటంలో చూపాలి.

హిందుత్వం ప్రమాదంలో ఉందని గోలచేసే వారు.. ముస్లిముల వలనో, క్రైస్తవుల వలనో హిందూత్వం ఎప్పుడూ ప్రమాదంలో పడలేదు, పడదు కూడా అన్నది గమనించాలి నిజంగా హిందూత్వం ప్రమాదంలో పడితే.. అందులో ప్రజలు వేదోపనిషత్తుల జ్ఞానానికి, అవి బోధించే ఉత్తమ బోధలకు దూరమైపోవటం వలన హిందుత్వం ప్రమాదంలో పడిందని చెప్పుకోవాలి. అవి ఖండించే చెడుల్లో మునిగిపోయి అనేకులు నైతికంగా దిగజారిపోవటం వల్ల హిందుత్వం ప్రమాదంలో పడిందని చెప్పుకోవాలి. వేదోపనిషత్తులు ప్రబోధిస్తున్న ఏకేశ్వరోపాసనకు దూరమై.. వేదోపనిషత్తులు ఖండిస్తున్న బాహుదైవోపాసన, విగ్రహారాధనలకు దగ్గరవ్వటం వల్ల హిందుత్వం ప్రమాదంలో పడిందని చెప్పుకోవాలి. సర్వేజనాసుఖినోభవంతు అన్న గొప్ప సందేశాన్నిస్తున్న వేదోపనిషత్తుల సారాన్ని విడిచి.. కులతత్వం-మతతత్వం చూపుతూ వ్యక్తుల మధ్య వివక్ష, ఉచ్చనీచ భావాలు, అంటరాని తనాన్ని ప్రదర్శించేవారి వల్ల హిందుత్వం ప్రమాదంలో పడిందని చెప్పుకోవాలి

ఒక్క హిందుత్వంలోనే కాదు.. పై చెడులన్నిటిలో కూరుకుపోయిన అధికశాతం మంది అటు క్రైస్తవంలో ముస్లిం సమాజంలోనూ ఉన్నారు. వారి వల్ల నేటి ముస్లిం, క్రైస్తవ సమాజాలు కూడా ప్రమాదంలో పడి ఉన్నాయన్నది అతిశయోక్తి కాదు.

నిజానికి ఈనాడు మా మతం ప్రమాదంలో పడిపోయిందని తెగబాధపడేవారు తమ వర్గంలో ఉన్న యువతలో ఎందరో చెడువ్యసనాలకు బానిసైపోతున్నారు.. ఎందరు తాగుడు, మందు, డ్రగ్స్ కు అలవాటు పడిపోతున్నారు అన్నది పెద్ద పట్టించుకోరు. తమవర్గంలో కులాల పేరుతో విడిపోయి తలలు బద్దలు కొట్టుకుంటున్నా పట్టించుకోరు. తమవర్గంలోని స్త్రీలపై ఆ వర్గంలోని దుర్మార్గులే అత్యాచారాలు చేస్తున్నా..
కట్నకానుకలకు కకృత్తిపడి ఎందరో స్త్రీలను చంపేస్తున్నా.. ఆర్థిక బాధలకు గురై ఎందరో ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. అలాంటి వాటిని పెద్దగా పట్టించుకోరు. కానీ ఎవరో దేవాలయానికో దాని చిహ్నానికో హాని కలిగిస్తేనో లేక ఎవడో రాయి విసిరి గుడి అద్దాలు బద్దలుగోడితేనో మా మతం ప్రమాదంలో పడిపోయింది మన మతాన్ని కాపాడుకోవాలంటూ మతరాజకీయాలు నడిపేవారు ధర్నాలు మటుకు మొదలెడతారు.

ఎప్పుడో మధ్యయుగాల్లో కొందరు ముస్లిం పాలకులు దేవాలయాలు పడగొట్టేశారు కాబట్టి ఇప్పుడు హిందుత్వంలో ప్రమాదంలో ఉంది.. ముస్లిములు నాలుగురేసి పెళ్లిళ్లు చేసేసుకుని, పదేసి పిల్లల్ని కని భారతదేశాన్ని ఇస్లామిక్ స్టేట్ గా మార్చేయ్యబోతున్నారు కాబట్టి హిందుత్వం ప్రమాదంలో ఉంది.. వగైరా చిల్లర నినాదాలు చేసే చవకబారు వ్యక్తులకు సోషల్ మీడియాలో కొదవలేదు.

చరిత్రలో ఒక్క ముస్లిం పాలకులే కాదు హిందూ పాలకులు సైతం ఆలయాలు ధ్వంశం చేశారన్న విషయం అతి తక్కువ మందికి తెలిసిన వాస్తవం. నిజానికి అటు హిందూ రాజులైనా ముస్లిం రాజులైనా దేవాలయాలు ధ్వంసం చెయ్యటమన్నది- రాజ్యాధికారం చేజిక్కుంచుకోవాలన్న ‘యుద్ధోన్మాదమే’ తప్ప ‘మతోన్మాదం కాదు’.

ఉదాహరణకు: ఒకప్పటి హర్యానా, గురుగ్రామ్ జిల్లాలో ‘జామా మసీదు’, మహారాష్ట్ర లోని దౌలతాబాద్ (ఔరంగాబాద్) కు చెందిన ఖిలిజ్ జుమ్మా మసీదు, హర్యానాలోని హిసార్ జిలాల్లో ‘డానా షీర్ మసీదు’, హర్యానా సోనిపట్ పట్టణంలో ‘జామా మసీదు’ వగైరా ఎన్నో మసీదులు నేడు ఈనాడు దేవాలయాలుగా కూడా మారిపోయి ఉన్నాయి. అలాగే.. ముస్లిం పాలకులు ఆలయాలు నిర్మించిన, పునరుద్ధరించిన అనేక సంఘటనలూ చరిత్రలో ఉన్నాయి. కాబట్టి ఒకప్పుడు గుళ్లు మసీదులైనా.. మసీదులు గుళ్లైనా ఈనాడు ఎవరివల్లా ఏ మతానికీ కూడా వచ్చిపడిన ప్రమాదం ఏమీ లేదు.

వెయ్యేళ్లు ముస్లిం, మొఘల్ పాలకుల తరువాత.. రెండొందల ఏళ్లు క్రైస్తవ పాలకుల తరువాత కూడా స్వతంత్రం వచ్చినానాటికీ నేటికీ కూడా భారతదేశంలో వారు మైనారిటీలుగానే ఉన్నారు. నేడు 80 శాతం మంది భారతదేశంలో ఉన్నది ముస్లిం-క్రైస్తవేతర ప్రజలే తప్ప.. ముస్లిములైతే కాదుకదా? స్వతంత్ర సంగ్రామంలో పాల్గొని దేశాన్ని కాపాడి ప్రాణాలర్పించిన యోధుల్లో 65 శాతం ముస్లిములున్నారు. అలాగే జైహింద్ నినాదాన్ని ఇచ్చింది ఒక ముస్లిం.. త్రివర్ణ పతాకాన్ని రూపొందించింది ఒక ముస్లిం.. “మాదరే వతన్ భారత్ కి జై”.. “ఇంక్విలాబ్ జిందాబాద్”.. “భారత్ చోడో” (క్విట్ ఇండియా) అన్న నినాదాలిచ్చింది ఈ దేశాన్ని ప్రేమించే ముస్లిములే.
****

చివరిగా ఏ ధార్మికులైనా అసలు ఎప్పుడు ప్రమాదంలో పడతారో వివరిస్తున్న ఈ క్రింది గీతా, బైబిల్, ఖురాన్ వాక్యాలను గమనించగలరు.

“ఏలయనగా సమస్త యజ్ఞములకు భోక్తను, ప్రభువును నేనే అయియున్నాను. అలాంటి నన్ను యథార్థముగా తెలుసుకొనుట లేదు. ఇందుమూలముగా పతనమగుచున్నారు” – గీత 9:24
“యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట వలన మనుష్యులు చెడు తనము నుండి తొలగిపోదురు” – సామెతలు 16:6

“… నిశ్చయముగా అల్లాహ్ దాసులలో (అల్లాహ్ గూర్చిన) జ్ఞానం గలవారు మాత్రమే ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉంటారు” – ఖురాన్ 35:28

ఏ మతవర్గంలో ప్రజాలైనా ఎప్పుడైతే సృష్టికర్త అయిన దేవుని అవగాహన, ఆయన పట్ల భయభక్తులు, జ్ఞానాన్నీ కోల్పోతారో అప్పుడే ఆ మతవర్గ ప్రజలు ప్రమాదంలో పడినట్టు లెక్క. అలాంటి వారిలో నుండే మూర్ఖులూ, మతతత్వవాదులూ పుట్టుకొస్తారు. వారి వల్లే ఏ మతానికైనా ప్రమాదం తప్ప ఏ మతమూ ఇంకో మతం వల్ల ప్రమాదంలో పడనే పడదు.

Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *