‘హలాల్’ హిందువులకు నిషిద్ధం అని క్రొత్తగా ప్రచారం మొదలెట్టిన వారిలో ఎవరీకీ ‘హలాల్’ అన్న అరబీ పదానికి అసలు అర్థం తెలియదనే చెప్పాలి. ఒకవేళ తెలిస్తే జీవితంలో తిరిగి ‘హలాల్’ మాకు నిషిద్ధం, మేము తినము అని చెప్పే ధైర్యం చెయ్యరనటం అతిశయోక్తికాదు.
చాలా మంది ‘హలాల్’ అన్న పదానికి చెప్పే అర్థం- ముస్లిములు ‘బిస్మిల్లా’ అని పలుకుతూ మేక, కోడి లేక ఆవు మెడ కొయ్యటాన్ని మాత్రమే ‘హలాల్’ అంటారన్నది. అసలు నిజానికి “హలాల్” అంటే ఏమిటో తెలుసుకుందాం.
‘హలాల్’ అన్న అరబిక్ పదానికి = తినుటకు/వాడుటకు ‘శుద్ది (Purify) చేయుట’ లేక ‘పరిశుద్ధ పరచుట’ అని అర్థం. వివరంగా చెప్పాలంటే “హలాల్” చెయ్యటం అంటే-
1. హానికర పదార్థాలను తొలగించుట
2. తినటానికి/వాడుటకు యోగ్యమైనదిగా చేయుట అని అర్థం.
దీనికి భిన్నంగా ‘హరామ్’ అంటే- ‘తినుటకు/వాడుటకు యోగ్యము కానిది లేదా నిషిద్ధమైనది’గా నిర్ధారించటం అని అర్థం.
ఉదాహరణకు గోధుమలు తీసుకుంటే పంట నుండి కోయగానే అలాగే తినేయలేము కదా. వాటిని ఎండబెట్టి, పిండి ఆడి, అందులో వ్యర్థాలను తొలగించి, తినటానికి యోగ్యంగా మార్చాలి. ఈ శుద్దీకరణ (Purify) ప్రక్రియనే (Process) నే “హలాల్” అనగా శుద్ది (Purify) చెయ్యటం అంటారు.
ఖురాన్ లో- “ప్రజలారా, భూమిలో ధర్మ సమ్మతమైన పరిశుభ్రమైన వాటినన్నిటినీ మీరు తినండి” (ఖుర్ఆన్ 2:168) అని చెప్పబడింది. ఈ వాక్యంలో “ధర్మ సమ్మతమైన పరిశుభ్రమైన” అన్న వాక్యం అరబ్బీలో “హలాలన్ తయ్యబ” అని చెప్పబడింది. కాబట్టి ఒకవేళ ఏ హిందువైనా “నేను హలాల్ తిననండీ!” అన్నాడంటే అర్థం = “నేను పరిశుభ్రమైన వాటిని తినను” అని చెప్పటమే అవుతుంది.
మేక, కోడి లేక ఆవు మెడ కొయ్యటాన్ని ‘హలాల్’ ఎందుకు అన్నారు?
వాస్తవానికి జంతు కంఠాన్ని, మెడ నాళము (Jugular Vein) ను కోయటాన్ని ‘జిబహ్’ అంటారు. దానిని “హలాల్” ఎందుకన్నారంటే జంతు కంఠాన్ని కోసి తినటానికి యోగ్యమైనదిగా ‘శుద్ది (Purify)’ చేయబడుతుంది కాబట్టి. కనుక ఏ జంతువైనా ‘హలాల్’ చేయటం జరిగింది అంటే- అది తినటానికి యోగ్యగా ‘శుద్ది (Purify)’ చేయబడిందని అర్థం.
“హలాల్” పద్ధతిని సైన్స్ కూడా ఆరోగ్యవంతమైనదని ఆమోదిస్తుంది. డా. V.K మోడీ (head of department of meat technology at ‘The Central Food Technology Research Institute in Mysore), చెబుతున్నదేమిటంటే “హలాల్ పద్ధతిలో జంతువు శరీరంలో రక్తం పూర్తిగా బయటకు వచ్చేస్తుంది, మరియు ఎక్కువ సమయం తాజాగా ఉంటుంది. దీనికి భిన్నంగా ‘జట్కా’ పద్ధతి (మెడ వేరు చెయ్యటం) లో జంతువు శరీరంలో రక్తం గడ్డ కట్టేస్తుందని, తద్వారా శరీరంలో “సూక్ష్మజీవులు” ఉండిపోయి మాంసం విషతుల్యంగా మారిపోతుందని” చెప్పటం జరిగింది.
డా. కరుణా చతుర్వేది (Consultant nutritionist at Apollo Hospitals in New Delhi) సైతం- “హలాల్ పద్ధతి ఎంతో ఆరోగ్యకరమైందని దాని వల్ల జంతువు శరీరంలో రక్తం ఎక్కడా గడ్డ కట్టి విషతుల్యంగా మారిపోకుండా ఉంటుంద”ని చెప్పటం జరిగింది.
‘జట్కా’ పద్ధతి హైందవుల ఆచారామా?
నిజానికి ‘జట్కా’ పద్ధతి అసలు హైందవుల ఆచారం కానే కాదు. అది పంజాబ్ సిక్కుల ఆచారం! వారే 20 వ శతాబ్దంలో ‘జట్కా’ పద్ధతిని ప్రచారంలోకి తెచ్చారు. సిక్కు పండితులు కూర్చిన “రెహత్ మర్యాదా” అన్న గ్రంథంలో (Chapter 13, Section 6) లో చూడవచ్చు- “ముస్లిములు చేసే హలాల్ పద్ధతిలో జంతు మాంసం తినటం నిషిద్ధం అని రాసుకున్నారు”. ఈ ప్రచారమే కొందరు హిందూపండితులు పుణికి పుచ్చుకున్నారు. పై సమాచారం నేను స్వంతంగా రాసింది కాదు. క్రింది లింక్ ఓపెన్ చేసి చదువుకోగలరు.
https://timesofindia.indiatimes.com/…/arti…/11672654.cms
——————————
‘హలాల్’ అన్నది- పదునైన కత్తితో జంతువు కంఠాన్ని మరియు మెడ నాళము (Jugular Vein) ను మాత్రమే కోయటం. ఈ పద్ధతి వలన జంతు శరీరంలో పూర్తి రక్తం బయటకు వచ్చేస్తుంది. ఈ ప్రక్రియలో జంతువు మెడ శరీరంతో పూర్తిగా వేరు చెయ్యకపోవటం వలన జంతువు గుండె ఒక్క సారిగా ఆగిపోకుండా వెన్నపూస ద్వారా మెదడుకు, హృదయానికి మధ్య రక్తం సరఫరా అయ్యే నాళాలు (vessels) దెబ్బతినకుండా పూర్తి రక్తం బయటకు వచ్చేస్తుంది. అదే “జట్కా” పద్ధతిలో ఒక్కసారిగా మెడ నరికేయటం వలన ఆ జంతువు శరీరంలో ఉండే నాళికలలో (vessels) లో ఎక్కడి రక్తం అక్కడే ఆగిపోయి గడ్డకట్టుకుపోతుంది. నిజానికి ఎన్నో రోగాలకు నిలయం రక్తమే
ఇక ఎప్పుడైతే మెడ నాళము (Jugular Vein) కత్తిరించబడుతుందో మెదడుకు రక్తప్రవాహం ఆగిపోయి ఆ జంతువుకు నొప్పి అనేది తెలియదు. కానీ శరీరంలో మొత్తం రక్తం ప్రవాహంలా బయటకు తన్నేస్తుంది. ఆ సమయంలో జంతువు గిజగిజలాడుతూ, కాళ్లూ రెక్కలు ఆడించేది నొప్పివల్ల కాదు రక్తం వేగంగా ప్రవహించే సమయంలో కండరాలు వేగంగా కొట్టుకోవటం జరుగుతుంది.
‘హలాల్’ పద్ధతిని హిందూ శాస్త్రాలు కూడా నిర్దేశిస్తున్నాయి
ధార్మిక పద్ధతిలో ‘హలాల్’ అంటే దైవనామ స్మరణ చేస్తూ జంతువును జంతు కంఠాన్ని, మెడ నాళము (Jugular Vein) ను కోసి బలి ఇవ్వటం అన్నమాట. ఇదే విషయాన్ని స్వామి భాస్కరానందగారి మాటల్లో గమనిస్తే…
“ఏ ఆహారమైనా, మాంసమైనా ముందుగా దైవార్పణం చేసి తినాలి” – స్వామి భాస్కరానంద [హిందూమత సారాంశం 58,59] అని చెప్పటం జరిగింది.
భగవద్గీతలో సైతం…
“ఓ అర్జునా! నీవేది చేసినను, తినినను, హోమ మొనర్చినను దానము చేసినను, తపస్సు చేసినను దానిని “నాకార్పింపుము” – గీతా 9:27
మనుధర్మ శాస్త్రంలో సైతం…
“వేదమంత్రములచే బ్రోక్షణమునేయక యూరక చంపబడిన పశువులను విప్రుడెన్నడును భుజింపరాదు” -మనుధర్మశాస్త్రం 5:36
“యాగమున మంత్రముతోగాక యూరకచంపబడిన జంతుమాంసమును నాహోమము చేయక ముందుపయోగించెడి హవిస్సును భక్షింపజనదు” – మనుధర్మశాస్త్రం 5:7
ఈ విధంగా హిందూ శాస్త్రాలలో సైతం చచ్చిన జంతువులను కాక, దైవ నామ స్మరణ చేసి, కోయబడిన దానినే తినాలని చెబుతున్నాయి. ఇదే విషయం ఖురాన్ ఈ క్రింది విధంగా చెబుతుంది.
“అల్లాహ్ కు కాక ఇతరులకు సమర్పించబడిన దానిని తినకండి” -ఖురాన్ 2:172
దైవనామస్మరణ చేసిన తర్వాతనేమాంసమును భుజింపవలయును” – మనుధర్మశాస్త్రం 2:176
అల్లాహ్ అంటే ముస్లిముల దేవుడు అన్నది కేవలం ధార్మిక గ్రంథ జ్ఞానం లేని వారు చెప్పే మాట. అల్లాహ్ అంటే దేవుని గుణగణాల్లో “ఆరాధనీయుడు” అని అర్థం. సర్వేశ్వరుడు, అక్షర పరబ్రహ్మ, అని హిందూ శాస్త్రాల్లో, యెహోవా (నిత్యం ఉండువాడు) అని బైబిల్లో పరిచయమైన సృష్టికర్తే అరబ్బీ భాషలో అల్లాహ్ గా పిలువబడ్డాడు.
“అల్లాహ్ (దైవం) నిషేధించినవి ఏమన్నా ఉంటే అవి ఇవి మాత్రమే: మరణించిన వాటిని తినకండి. రక్తాన్ని పందిమాంసాన్ని ముట్టకండి.ఇంకా అల్లాహ్ కు కాక ఇతరులకు సమర్పించబడిన దానిని తనకండి” – ఖురాన్ 2:172
“వరాహ (పంది) మాంసం అమ్మేవారి కుడిచెయ్యి,ఎడమకాలు లేదా ఎడమకాలు కుడిచెయ్యి ఖండించాలి” -విష్ణుస్మృతి 5:49
ఈ విధంగా ఊరకే చంపబడిన జంతువులను కాక, దైవనామ మంత్రోచ్ఛారణ చేసిన జంతువు మాత్రమే తినాలని అటు హిందూ శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. అలా ఎందుకంటే “దేవుని అనుమతితో” ఈ జంతు మాంసాన్ని నేను తింటున్నాను అని చెప్పటం అన్నమాట. కాబట్టే ముస్లిములు “బిస్మిల్లాహు అల్లాహుయాక్బర్” (అంటే- దేవుని నామంతో, దేవుడే గొప్పవాడు)” అని పలుకుతూ జంతువును బలి ఇవ్వటం జరుగుతుంది. ఇది ముస్లిముల పద్ధతే కాదు, హిందూ శాస్త్రాలు నిర్దేశించిన పద్ధతి కూడా.
——————————
“హలాల్ సర్టిఫై (Halal certify)” దేనికి?
ముస్లిం దేశాల నుండి వచ్చే ఆహార పదార్థాలపై ‘హలాల్ సర్టిఫై’ అని ఉన్నప్పుడు హిందువులైన మేము కాషాయ జండాలు పెట్టుకోవటంలో తప్పేముంది అన్నది తాము ప్రదర్శించే మతోన్మాదాన్ని సమర్ధించుకునే కొందరి వాదన.
“హలాల్ సర్టిఫై (Halal certify)” అంటే సింపుల్ గా- “అత్యుత్తమ ప్రమాణాలతో శుద్ది (Purify) చెయ్యబడిందని సర్టిఫై చెయ్యటం అన్నమాట! నిజానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభాలో 1/3 శాతం ప్రజలు ముస్లిములున్నారు. దాదాపు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 52 ముస్లిం దేశాలకు ఎగుమతి అయ్యే మాంసాహార వస్తువులే కాక చివరకు బియ్యం, గోధుమలు కూడా “హలాల్” సర్టిఫై తీసుకుని ఎగుమతి అవుతుంటాయి.
మహారాష్ట్రకు చెందిన ‘P.P Foods’ అనే సంస్థ నిజానికి ‘బియ్యం’ ఎక్స్ పోర్ట్ చేసే కంపెనీ. ఈ కంపెనీ ఎటువంటి మాంసాహార ఉత్పత్తులు ఎగుమతి చెయ్యదు. అయినప్పటికీ ఇది ముస్లిం దేశాల్లో ఉన్న అతిపెద్ద మార్కెట్ లో వ్యాపారం చేయటానికి ‘హలాల్’ సర్టిఫికేషన్ తో ఎగుమతి చేస్తుంది.
అలాగే ITC కంపెనీ ఇండియా నుండి ముస్లిం దేశాలకు ఎగుమతి అయ్యే గోధుమ ప్యాకెట్లపై సైతం ‘హలాల్’ సర్టిఫికేషన్ తో ఎగుమతి చేస్తుంది. గోధుమలు, బియ్యం, పిండి పదార్థాలకు ‘హలాల్’ సర్టిఫికేషన్ దేనికి? అంటే- అవి అత్యుత్తమ ప్రమాణాలతో శుద్ధి (Purify) చెయ్యబడినవి అని అర్థం.
అలాగే కొన్ని కంపెనీల బిస్కెట్లు, కేకులు, ఐస్ క్రీమ్స్, పిజ్జాలే కాక కొన్ని రకాల కాస్మోటిక్స్ వగైరా వాటి మీద కూడా ‘హలాల్’ సర్టిఫికేషన్ ఉంటుంది దేనికి? అంటే వాటిలో “పంది కొవ్వు కలపకుండా ఒకవేళ కొవ్వు పదార్థాలు వాడినప్పటికీ మేక, గొర్రె, ఆవు వగైరా హలాల్ చేయబడిన జంతువుల కొవ్వును ఉపయోగించబడిందని చెప్పటానికి ‘హలాల్’ సర్టిఫికేషన్ తీసుకోవటం జరుగుతుంది. ఇక ధార్మిక గ్రంథాల ప్రకారం పంది మాంసం, కొవ్వు నిషిద్ధం (హరామ్) అని మనం గమనించి ఉన్నాం.
తప్పితే కొందరు ప్రచారం చేస్తున్నట్లు ఆయా వస్తువులపై ‘హలాల్’ సర్టిఫికేషన్ అన్నది మతవిశ్వాసాలును హిందువులపై రుద్దటానికి కాదు. ఆస్ట్రేలియా ముస్లిం దేశం కాదు, కానీ అక్కడ దొరికే అన్ని ఫుడ్స్ ‘హలాల్’ సర్టిఫికేషన్ పొంది ఉంటాయి. అలా ఎన్నో దేశాల్లో ‘హలాల్’ సర్టిఫికేషన్ ఉండటానికి కారణం ప్రపంచవ్యాప్తంగా 52 ఇస్లామిక్ దేశాలతో సహా 1.8 బిలియన్ల ముస్లిం జనాభా ఉండటమే! అంతపెద్ద మార్కెట్ లో వస్తు అమ్మకాల కోసం ఇతర దేశాల మాదిరిగా ఇండియా నుండి విదేశాలకు ఎగుమతులు అయ్యే ప్రతీ వస్తువుకు ‘హలాల్’ సర్టిఫికేషన్ తీసుకోవటం తప్పనిసరి అవుతుంది. దానికి కారణం ముస్లిం దేశాల్లో “అత్యుత్తమ ప్రమాణాలతో శుద్ది (Purify) చెయ్యబడిన వాటిని మాత్రమే తినటం/వినియోగించటం మాత్రమే.
‘హలాల్’ ఆహారం తినటం అంటే- ‘పరిశుభ్రమైన మరియు తినటానికి యోగ్యమైన ఆహారం భుజించటం అని అర్థమైంది కదా! ఒకవేళ మేము ‘హలాల్’ తినము అనేవారు- “మేము అపరిశుభ్రమైన పనికిమాలిన ఆహారం తింటామని చెప్పటమే అవుతుంది. దీనిని బట్టి మతోన్మాదం ఎంత గుడ్డితనాన్ని కలగజేస్తుందో అర్థమౌతుంది కదా.
‘హలాల్’ హిందువులకు నిషిద్ధమా?
