“సాటి హిందువుకే సహకరిద్దాం హిందువులమైన మనం హిందువులవద్దే ఏదైనా కొందాం” అంటూ మతోన్మాదాన్ని కావాలని రెచ్చగొట్టటానికి ఇంత కష్టపడి తయారు చేసుకున్న ఈ పోస్టును చూసి “అయితే ముందు ముస్లిం దేశాల నుండి వస్తున్న పెట్రోల్, డీజిల్ కొనటం మానెయ్యవచ్చుగా” అని నేను అడగను….
సాటి హిందువైన నువ్వు సాటి హిందువులకు నిజంగా సహకారం అందించగలుగుతున్నవా? నిజంగా అందిస్తూ ఉంటే…
నీ ఇంటి ముందు కేవలం ఆర్య వైశ్యులకే లేక బ్రాహ్మణులకే ఇల్లు అద్దెకివ్వబడును అని బోర్డులు ఎందుకు తగిలిస్తున్నావ్? ఏ కులపుటోల్లైతే నాకేంటి అంతా నా తోటి హిందువులే కదా అన్న నీ అంటరానితనాన్ని వదలగలుగుతున్నావా?
ఆస్తి పంపకాల్లో తేడా వస్తే తల్లి, చెల్లి, అన్నా, తమ్ముడు, తల్లి తండ్రి అనే బేధాలు లేకుండా వెళ్లగొడుతున్నావ్ లేక చంపుతున్నావ్. వారంతా నా తోటి హిందువులే అని ఆదరించగలుగుతున్నావా?
నీ వర్గం కానోణ్ణి, వేరే కులపుటోడిని నీ ఇంటి బిడ్డ ప్రేమిస్తే చంపటానికైనా సిద్ధతావ్ కానీ ప్రేమించింది నా తోటి హిందువునే కదా అని విశాలంగా ఆలోచించగలుగుతున్నావా?
ఇంట్లో ముసలితనం మీదపడిన తల్లో, తండ్రో ఉంటే తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్ లో పడేసి వస్తున్నావ్. అక్కడ కనీసం వార్ని నా తోటి హిందువులే అని అయినా చూడగలుగుతున్నావా?
కోరుకున్నంత కట్నం తేలేదని పెళ్లి చేసుకున్న భార్యను విడాకులిచ్చేస్తున్నావ్ లేక చంపేస్తున్నావ్ మరప్పుడు నీ భార్యను నా తోటి హిందువే కదా అని అక్కున చేర్చుకోగలుగుతున్నావా?
కులాలు చూసి పెళ్లి చేసుకుంటావ్, కులాల పేరుతో సపరేట్ కాలనీలు కట్టుకుంటావ్, కులాల పేరు మీద హోటళ్లు, పెళ్లి మంటపాలు కట్టుకుంటావ్, వేరే కులపుటోన్ని తక్కువ చేసి చూస్తావ్, వాడికి ఇల్లు అద్దెకివ్వటానికి సంకోచిస్తావ్, వాడితో కలిసి భోజనం చెయ్యటానికి అసహ్యంగా ఫీలవుతావ్, తక్కువ కులపుటోన్ని ఊరు చివరన పెడతావ్, చివరకు నువ్వు మేరేజ్ బ్యూరో పెడితే అక్కడకూడా అమ్మాయి, అబ్బాయిల్ని కులాలుగా, వర్గాలుగా విడగొడతావ్… ఏ కులమైతేనేం… అంతా నాతోటి హిందువులే కదా అన్న ఎమోషన్ అప్పుడు ఎందుకు ప్రదర్శించలేకపోతున్నావ్?
ఇప్పుడు కూడా ఓ హిందూ మరో హిందువుకు సహకారం అందించటానికి నువ్వు హిందుత్వ మతోన్మాదమనే ఓ మాస్ హిస్టీరియానే ప్రాతిపదిక చేసుకుంటున్నావ్ తప్ప మానవత్వాన్ని క్రైటీరియా గా చేసుకోలేకపోతున్నావ్
తోడబుట్టిన వారిని, తలిదండ్రులను ప్రేమించలేని, వేరే కులపుటోల్లను కనీసం సాటి హిందువులే కదా అని కలుపుకొలేని నువ్వు తోటి హిందువులకే నా సహకారం అని చెబుతుంది కేవలం నాటకం, బూటకం కాదా?
మైనారిటీలను హింసించటం…
ముస్లిములను ధ్వేషించటం…
పాకిస్తాన్ ను తిట్టటం….
అవులను ప్రేమించటం…
కాషాయం ధరించటం ….
అన్నది నీ ఇగో సాటిస్ఫ్యాక్షన్ తప్ప హిందుత్వం కాదు. ఎప్పుడో మధ్యయుగాల్లో కొందరు ముస్లిం రాజులు చేసిన అత్యాచారాలకు, అక్కడెక్కడో ముస్లిం పేర్లు పెట్టుకుని ఎవరో చేసే ఉగ్రవాదాలకు నీ ఇంటి ప్రక్కన, నీ ఇంటెదురుగా ఉండే ముస్లిములు బాధ్యులని, వారి వల్ల ఏదో ప్రమాదం ముంచుకొచ్చేస్తుందని, వారిని జిహాదీగాళ్లంటూ చులకన చేస్తూ, వారిని ధ్వేషించటం వల్లే హిందూత్వం కాపాడబడుతుందని ఎవరో నీ తలలో ఎక్కించిన హిందుత్వ మతోన్మాదమనే మాస్ హిస్టీరియాను వదిలి పెట్టి పవిత్ర వేదోపనిషత్తుల మనవసేవయే మాధవ సేవ అన్న సారాంశాన్ని, సర్వేజనా సుఖినోభవంతు అన్న గొప్ప సూత్రాన్ని అర్థం చేసుకొని, కులమతాల కతీతంగా తోటి మనుషులను మనుషులుగా చూడగలిగే ఉన్నత వ్యక్తిత్వాన్ని నువ్వు నీ తోటి హిందువుల్లో నిర్మించగలగటమే నువ్వు నీ సాటి హిందువులకు అందించే గొప్ప సహకారం అవుతుంది.
తప్పితే ముస్లిముల అంగళ్లలో రబ్బర్ బ్యాండ్లు, చంపిన్నీసులు, అగ్గిపెట్టెలు, కరీంబీడీ కట్టలు కొనటం మానేసినంత మాత్రానా సాటి హిందువుకు సహకారం అందించటం అవ్వదు మత పిచ్చ అవుతుంది
సాటి హిందువుకు నిజంగా సహకరిస్తున్నావా?
