ప్రపంచంలో వివిధ మతాల, వర్గాల ప్రజలు దైవాలుగా ఎవరినైతే భావిస్తూ ఆరాధిస్తున్నారో వారంతా నిజానికి ఒకప్పుడు సృష్టికర్త అయిన దేవుణ్ణి పరిచయం చేసి, ఆయనను మాత్రమే ఆరాధించిన మహనీయులే! ఇది వినటానికి కాస్త ఆశ్చర్యంగా అనిపించవచ్చు.
ఇంతకూ ప్రజలు సృష్టించుకున్న ఆ దేవుళ్లు ఎవరు?
యేసు “భూమి మీద ఎవరికీ తండ్రి అని పేరు పెట్టవద్దు” -మత్తయి 23:9 అన్న వాక్యాన్ని కాస్త విశ్లేషిస్తే నిజానికి ఈ వాక్యం మూల భాషలో “భూమి మీద ఎవరినీ తండ్రి అని పిలువ వద్దు” అని ఉంటుంది.
తండ్రి అన్న పదం బైబిల్లో దేవునికి పర్యాయ పదం. యూదుల్లో దేవుణ్ణి ‘తండ్రి (అబ్బా)’ అని పిలిచే ఆచారం ప్రాచీన కాలం నుండీ ఉండేది. దీనిని బట్టి యేసు ఆదేశం- “భూమి మీద ఎవరినీ దేవుడు అని పిలువ వద్దు” అన్నది. అంతేకాదు మొత్తం సువార్తల్లో యేసు స్వయంగా ఆ యెహోవా దేవుణ్ణి నిత్యం ఆరాధించటమే కాక తన శిష్యులను సైతం ఆయన్ని మాత్రమే ఆరాధించమని ఆజ్ఞాపించేవారు.
ఇలా చెప్పిన యేసునే తరువాతి కాలాల్లో కొందరు అబద్ధ బోధకులు దేవుడిగా చేసేశారు. యేసు పరిచయం చేసిన దేవుడు యెహోవా అయితే… ఆ యెహోవాను ప్రక్కకు పెట్టి “మా దేవుడు యేసు” అంటూ క్రైస్తవులు తమ కోసం ఓ దేవుణ్ణి సృష్టించుకున్నారు. కొందరు ఇంకాస్త ముందుకెళ్లి యేసుతో పాటు పరిశుద్ధాత్మను, కన్యమేరీలను కూడా దైవాలుగా ఆరాధించే వరకు వెళ్లిపోయారు.
***
“సర్వమూ దైవమే చేయుచున్నది. దేవుని చేత హతుడైన వానినే శత్రువు చంపుచున్నాడు” – యుద్ధకాండ 113:23
“సుఖము, ధుఃఖము, శాంతము, క్రోధము, లాభము, నష్టము, జననము, మరణము అనువాటికి దైవము తప్ప మరొకటి కారణము కాదు” -అయోధ్యకాండ 22:22
ఈ మాటలు స్వయంగా శ్రీ రాముడు పలికినవే. ఆయన మాటల్లో సర్వేశ్వరుడైన దేవుని ప్రస్తావన చెయ్యటాన్ని చూడగలం.
చాలా సార్లు మనం వింటూ ఉండే సుప్రభాతంలో సైతం “నరుషార్దూలా కర్తవ్యం దైవమాన్వికమ్” అన్న వాక్యానికి “నరులలో పులివంటి వాడా లే! ఆ దైవాన్ని ఆరాధించటం నీ కర్తవ్యం” అనే అర్థం వస్తుంది. దీనిని బట్టి నేడు ప్రజలు దేవునిగా కొలిచే రాముడు సైతం ఒకప్పుడు సర్వేశ్వరుడైన దైవాన్ని ఆరాధించిన దాసుడు అని తెలుస్తుంది.
***
“ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రేమతో దైవం ప్రసన్నమైనప్పుడే పురుష ప్రయత్నాలు సఫలమవుతాయి” -శ్రీమధాంద్ర మహాభారతము 3:82
“నేను నా శక్తి కొలది సంధికొరకే ప్రయత్నిస్తాను. దేవుడు ఏమి చేయదలిచాడో చెప్పలేను” -శ్రీమధాంద్ర మహాభారతము 3:83
పై వాక్యాలో మాట్లాడుతున్న వ్యక్తి ఎవరో కాదు శ్రీకృష్ణులవారే! వాటిలో సైతం ఆయన తనకు అతీతంగా ఉన్న సర్వేశ్వరుడైన దేవుని ప్రస్తావన చేస్తున్నట్లు గమనించగలం. ముఖ్యంగా భగద్గీతను పరిశీలించినా నేడు హైందవంలో ఏ శ్రీకృష్ణుడినైతే స్వయంగా దేవునిగా భావిస్తూ ఉంటారో ఆయన్నే అర్జునుడు “ఓ కృష్ణా! ఆ బ్రహ్మమేది (ఆ సృష్టికర్త ఎవరు?)” -గీత 8:1 అని అడగటాన్ని గమనించగలం.
ఈ ప్రశ్నకు శ్రీకృష్ణులవారు “నేనే కదా దేవుణ్ణి తిరిగి నన్నే ఎందుకు ప్రశ్నిస్తున్నావని” సమాధానం చెప్పక “అక్షరం బ్రహ్మ పరమం (నాశనం కాని సృష్టికర్త పరమందు ఉన్నాడు)” అని వివరిస్తారు. దీనిని బట్టి నేడు ప్రజలు దేవునిగా కొలిచే శ్రీకృష్ణులవారు సైతం ఒకప్పుడు సర్వేశ్వరుడైన దైవాన్ని ఆరాధించిన దాసుడు అని తెలుస్తుంది.
***
“నేను ఆ అల్లాహ్ దాసుడిని. దేవుడే ప్రభువు మరియు యజమాని” -ఆచార్య. ఇ.భరద్వాజ, “సాయిబాబా ది మాస్టర్” పేజీ నెం. 228
“నిరుపేదలను కాపాడేవాడు దేవుడు మాత్రమే. ఒక్క దేవుడు తప్ప మరొకడు లేడు” -ఆచార్య. ఇ.భరద్వాజ, “సాయిబాబా ది మాస్టర్” పేజీ నెం. 235
ఇలాంటి ఎన్నో సాయిబాబా ప్రవచనాల్లో ఆయన సృష్టికర్త అయిన దేవుని ప్రస్తావన చెయ్యటాన్ని గమనించగలం. నిత్యం సాయిబాబా “అల్లాహ్ సబ్ కా మాలిక్ హై… సబ్ కా మాలిక్ ఏక్ హై” అంటూ ఉండేవారు. ఆయన బ్రతికి ఉన్నన్ని రోజులూ సర్వేశ్వరుడైన దేవుని ఆరాధన చేస్తూ భిక్షాటన చేసుకుంటూ తిరిగేవారు.
పాపం ఆయన చనిపోయాక ఎవరో ఆయన విగ్రహం కట్టి దాని ముందు హుండీ ఏర్పాటు చేశారు. క్రమంగా ఆయనే ప్రత్యక్షంగా దేవుడని, దేవుని అవతారమని కొందరు ఏదేదో ఊహించుకుని ఆయన్నే దేవుణ్ణి చేసెయ్యటమే కాక ఆ కాన్సెప్ట్ పై సీరియళ్లూ, సినిమాలు కూడా తీసేశారు.
దీనిని బట్టి నేడు ప్రజలు దేవునిగా కొలిచే సాయిబాబావారు సైతం ఒకప్పుడు నిజ దైవాన్ని ఆరాధించే దాసుడు అని తెలుస్తుంది.
***
“అల్లాహ్ ను వదలి నీకు నష్టాన్ని గానీ, లాభాన్ని గానీ కలిగించలేని ఏ శక్తినీ వేడుకోకు” – ఖురాన్ 10:106
ఈ ఆదేశం ఖురాన్ ముస్లిం సమాజానికి ఇస్తుంది. అయినప్పటికీ ముస్లిం సమాజంలో అధిక శాతం మంది ఖురాన్ ను నామమాత్రంగా చదవటం వల్ల లేక పూర్తిగా నిర్లక్ష్యం చేయటం వల్ల వారు దర్గాల్లోని సమాధి ఆరాధనకు దగ్గరైపోయారు.
అయితే దర్గాల్లోని వలియాల్లాల సమాధుల దగ్గరకు వెళ్లే ముస్లిములు ఆ సమాధుల్లో ఉన్నవారిని ప్రత్యక్షంగా దైవాలుగా భావించనప్పటికీ, సమాధుల ముందు మోకరిల్లటం, అక్కడ ప్రార్థనలు చెయ్యటం, పూలు కొబ్బరికాయలు, ఆగరొత్తులతో దర్గాల్లో చేసే తతంగాలన్నీ బహుదైవారాధకుల పోకడలకు తక్కువేమీ కాదు.
ఇవి కాక పీర్లు, తాయెత్తులు, నెల్లూరు రొట్టెల్లో తమ కోరికలు తీర్చే దైవత్వాన్ని వెతకటం కొందరి ముస్లిముల ఖురాన్ అవగాహనారాహిత్యానికి నిదర్శనం అనటం అతిశయోక్తి కాదు.
మొత్తానికి నేడు ఏ మత వర్గాన్ని తీసుకున్నా ప్రజలు దేవుళ్లుగా చేసుకుని ఆరాధిస్తున్న పుణ్యపురుషులు లేక మహనీయులు ఒకప్పుడు నిజదైవాన్ని పరిచయం చేసినవారే, నిజ దైవాన్ని ఆరాధించిన వారే.
“దేవుడు ఒక్కడే ఋషులు ఆయన్ని అనేక పేర్లతో పరిచయం చేశారు” -ఋగ్వేదం 1:164:46 అన్న వేద మంత్రాన్ని బట్టి అనేక కాలాల్లో, అనేక మంది ఋషులు అంటే రాముడు, శ్రీకృష్ణుడు, యేసు, ముహమ్మద్ వగైరా అనేకమంది మహనీయులు ఒకే దైవాన్ని వేరు వేరు భాషల్లో సర్వేశ్వరుడు, అక్షర పరబ్రహ్మ, యెహోవా, అల్లాహ్ వగైరా అనేక పేర్లతో పరిచయం చేసినవారే అని తెలుస్తుంది.
ఒకవేళ ఎవరైనా కొన్ని సంవత్సరాల పాటు సమయాన్ని తీసి మొత్తం వేదాలు, ఉపనిషత్తులు, గీతా, బైబిల్, ఖురాన్ గ్రంథాలు చదివేస్తే ఆ గ్రంథాల మొత్తం సారాంశాన్ని రెండు ముక్కల్లో చెప్పవచ్చు. అదేమిటంటే “ఈ సమస్త సృష్టిని ఉనికిలోకి తెచ్చిన ఒకే ఒక్క సృష్టికర్త ఉన్నాడు. ఆయన మానవుల్లా పుట్టి, చనిపోయేవాడు కాదు. ఆయన తప్ప వేరొక దైవం లేదు. ఆయన అనేక కాలాల్లో అనేక భాషల్లో అనేక పేర్లతో పిలువబడ్డాడు” “మంచి పనులు చేసి, ఆయన్ని మాత్రమే ఆరాధించే వారికి ఇహపరలోకాల్లో గొప్ప బహుమానం ఉంటుంది లేదంటే శాశ్వత శిక్ష ఉంటుంది” అన్నది.
కాకపోతే గౌరీపట్నం, గుణదల కొండలపై ధూపదీప నైవేధ్యాలతో కన్యమేరీ, యేసు విగ్రహాల్ని ఆరాధించేవారి నుండి చర్చీల్లో యేసే దేవుడని గొంతెత్తి సువార్తలు చెప్పే పాస్టర్లు, వారిని అనుసరించే క్రైస్తవుల వరకు, తిరుపతి కొండకు వెళ్లే భక్తుల నుండి షిర్డీ, శబరిమల, కేదార్నాథ్ వగైరా తీర్ధయాత్రలకు వెళ్లే భక్తుల వరకూ, కడప దర్గా నుండి ఆజ్మీర్ షరీఫ్ వెళ్లే ముస్లిముల వరకూ తమ స్వంత సెంటిమెంట్లలో ఎంతవరకూ మునిగిపోయారంటే వారిలో ఎవరూ కూడా “ఇంతకూ మేము ఆరాధిస్తుంది ఆ నిజ దైవాన్నేనా? కాదా?” అని ఆగి కాస్సేపు ఆలోచించలేనంత లోతుల్లోకి వెళ్లిపోయారు.
ఆరోగ్యం బాలేనప్పుడు ఏ డాక్టర్ ను పట్టుకుంటే సరైన వైధ్యం లభిస్తుందని ఎన్నో ఆరాలు తీసి, రేటింగులు, రివ్యూలు చూసి సరైన డాక్టర్ ను సెలెక్ట్ చేసుకునే ఈ ప్రజలే తాము ఆరాధిస్తున్నది నిజ దైవాన్నేన్నా? లేక ఒకప్పుడు ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించిన దాసులనా? అన్న పాయింట్ ను ఆలోచించే విషయంలో ఫేయిలైపోతుంటారు. దానికి కారణం వారు తమ తమ ధార్మిక గ్రంథాల్ని చదవకపోవటమే.
ఈ విధంగా ధార్మిక గ్రంథాల బోధలు ఒక వైపు, ఆధ్యాత్మికుల ఆరాధనా విధానాలు మరొక వైపు ఉండటమే అనేక మూఢాచారాలు సమాజంలో వేళ్లూనటానికి కారణం అయింది. ఇదే ఆస్తికుల్ని అవహేళన చెయ్యటానికి నాస్తికులకు అడ్వాంటేజ్ గా మారిపోయింది.
ప్రజలు సృష్టించుకున్న దేవుళ్లంతా ఒకప్పుడు దేవుని దాసులే!
