దేవుడికి ప్రాణప్రతిష్ట చేయడమేంటి?

“సర్వం సృష్టించిన దేవుడికి ఎవడో ప్రాణప్రతిష్ట చేయడమేంటో? పిచ్చిగానీ-సర్వశక్తి సంపన్నుడైన దేవుడు తనకు తానే అందులో ప్రవేశించాలి కదా? ఒక తుచ్ఛ మానవ మాత్రుడు ప్రాణప్రతిష్ట చేయడమేమిటీ?” అన్నది ఓ నాస్తికుడి ప్రశ్న.

“నాస్తికులు దేవుణ్ణి నమ్మరు కాబట్టి ఇలాంటి పిచ్చి ప్రశ్నలే వేస్తారు” అని ఏ ఆస్తికుడైనా అంటే గనుక కచ్చితంగా ధార్మిక పరిజ్ఞానం పూర్తిగా ఉన్నవారెవరైనా పై విధంగా ప్రశ్నిస్తున్న నాస్తికుడి ప్రశ్నను నూటికి నూరుశాతం కరక్టే అని ఒప్పుకోవాల్సి ఉంటుంది.

నిజమే, కాస్త లాజిగ్గా ఆలోచించే ఓ సామాన్యుడికి కూడా పైకి చెప్పలేనప్పటికీ లోలోపల మెదిలే ప్రశ్నే ఇది! అయితే ప్రశ్నిస్తే ఎక్కడ పాపం అంటుకుంటుందో అన్న మీమాంసతో మనకెందుకొచ్చింది ఎక్కువగా ఆలోచించకుండా గుంపుతో పాటు రాముడి విగ్రహానికి ఓ దణ్ణం పెట్టేసి సైలెంటుగా ఉంటే మంచిదన్న నిర్ణయానికి వస్తుంటారు ఫైనల్ గా.

సర్వం సృష్టించిన దేవుడు అంటే ఎవరు? అతని గుణాలక్షణాలు ఏమిటి? అన్నది తెలియని ఆస్తికుల అజ్ఞానమే పై విధంగా ఓ నాస్తికుడు ప్రశ్నించటానికి కారణం అయిందంటే బహుశా కొందరు ఆస్తికులకు బాధ కలగవచ్చు.

కానీ, సర్వం సృష్టించిన దేవుడు అంటే ఎవరు? ఆయన గుణాలక్షణాలేమిటి? అన్నవాటిని దృష్టిలో పెట్టుకుని రాముడు దేవుడేనా? అసలు ఓ విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేసే ఆచారం వేద శాస్త్రాలు నిర్దేశిస్తున్నాయా? అన్న ప్రశ్నలు వేసుకునే ముందుగా గమనించాల్సింది…

స్వయంగా శ్రీరాముడు పూర్తి రామాయణంలో ఎక్కడా ‘నేను సర్వం సృష్టించిన దేవుడి అవతామని’ చెప్పుకోలేదు. ఓ సామాన్య మానవునిగా పుట్టి జీవితాన్ని గడిపిన వ్యక్తిగానే రాముడిని చూడగలం అన్న విషయాన్ని గమనించాలి. పైగా విశ్వామిత్రుడు రాముడిని నిద్రలేపటానికి పాడే సుప్రభాతంలో “నరుషార్దూలా కర్తవ్యం దైవమాన్వికమ్” అన్న వాక్యానికి “నరులలో పులివంటి వాడా లే! ఆ దైవాన్ని ఆరాధించటం నీ కర్తవ్యం” అనే అర్థం వస్తుంది. దీనిని బట్టి నేటి ప్రజలు దేవునిగా భావించే రాముడు సైతం ఒకప్పుడు సర్వేశ్వరుడైన దైవాన్ని ఆరాధించిన దాసుడు అని తెలుస్తుంది.

అంతేకాదు, రామాయణంలో స్వయంగా రాముడే “సర్వమూ దైవమే చేయుచున్నది. దేవుని చేత హతుడైన వానినే శత్రువు చంపుచున్నాడు (యుద్ధకాండ 113:23)” అని, “సుఖము, ధుఃఖము, శాంతము, క్రోధము, లాభము, నష్టము, జననము, మరణము అనువాటికి దైవము తప్ప మరొకటి కారణము కాదు (అయోధ్యకాండ 22:22)” చెబుతున్న మాటలను గమనిస్తే ఆయన తనకు అతీతంగా ఉన్న సర్వేశ్వరుడైన దేవుని ప్రస్తావ చేస్తూ ఉండేవారన్న విషయాన్ని గమనించగలం.

అంతేకాదు రాముడు కౌసల్యకు పుట్టినవాడని తెలియని వారెవరూ? మరో ప్రక్క సర్వేశ్వరుడైన దేవునికి “తలిదండ్రులు లేరు (శ్వేతాశ్వతరోపనిషద్ 6:9)” అని, “ఆయన పుట్టుక లేనివాడు (గీత 10:3)” అని, ఆయనకు “శరీరం లేదని (యజుర్వేదం 40:8), “దేవుని రూపం ఇంద్రియాల పరిధిలో నిలవదని (శ్వేతాశ్వతరోపనిషద్ 4:20)”, “ఆయన అవ్యక్త రూపుడని (గీత 7:24)”, “ఆయన మరణం లేనివాడని (2:17), “ఆయన సమస్త దేవతలకు దైవము (శ్వేతాశ్వతరోపనిషద్ 6:6) అని ప్రకటిస్తున్న అనేక శ్లోకాలను బట్టి…

సర్వం సృష్టించిన దేవుడు అంటే తలిదండ్రులకు పుట్టిన మానవుడు కాదని, మనిషిగా స్త్రీ గర్భం ద్వారా ఈ లోకంలో అవతారం ధరించి వ్యక్తమయ్యేవాడు కాదని, శరీరం ధరించి మనుషుల మధ్య నివసించే వ్యక్తి కాదని, కొన్నాళ్లు భూమిపై బ్రతికి చనిపోయే సామాన్య మనిషి వంటి వాడు కాడని తెలుస్తుంది.

కిష్కిందకాండ 25:4 లో సైతం ఆంజనేయస్వామి “భగవంతుడే లోకములన్నిటికి కారణం. భగవంతుడే సకల కర్మల సాధనం. అతడే జీవులను నియమించువాడు” అని చెబుతున్నట్టు గమనించగలం. శ్రీరాముడికి అంత దగ్గర ఉంటూ కూడా రాముడే లోకములన్నిటికి కారణం, రాముడే జీవుల్ని పుట్టించేవాడని చెప్పక, భగవంతుడే సమస్తానికి కారణం అని చెప్పటం కాస్త ఆలోచించాల్సిన విషయం.

ఈ వాక్యాధారాల సంగతి కాస్త ప్రక్కన పెట్టి “నాలాగే తలిదండ్రులకు పుట్టి కొన్నాళ్లకు చనిపోయే ఎవరైనా సర్వం సృష్టించిన దేవుడు ఎలా కాగలుగుతాడు?” అని ఎవరు తమ మనస్సాక్షిని ప్రశ్నించుకున్నా… కచ్చితంగా కాదనే సమాధానమే మనసు చెబుతుంది.
***

శ్రీ రాముడు ఓ ఆదర్శ పురుషుడు?

పైన ప్రస్తావించిన అనేక శ్లోకాల వెలుగులో రాముడు సర్వం సృష్టించిన దేవుడుగా కనబడటం లేదు పైగా… సర్వం సృష్టించిన దేవుడి ప్రస్తావన చేస్తున్న మనిషిగా, ఆయన్ని ఆరాధిస్తూ ఉండే ‘దైవదాసుడిగానే’ మనకు కనిపించటం జరుగుతుంది.

మరి సామాన్య హిందూ ప్రజానీకం ఆయన్ని దేవునిగా ఎందుకు కొలుస్తుంటారు? అన్నది ప్రశ్న. అంతకంటే ముందు శ్రీ రాముడు ఎవరు? అన్న ప్రశ్నకు ఎవరైనా ఇచ్చే సమాధానం – తండ్రి మాటను జవదాటని తనయుడిగా, సోదరులను అభిమానించిన అన్నగా, భార్య దూరమైనా నిరంతరం అమె కోసం పరితపించే భర్తగా, ప్రజల సంక్షేమం కోసమే వారి మాటకు విలువిచ్చిన రాజుగా, ఎక్కడా ధర్మం తప్పకుండా మనిషి అనేవాడు ఇలా జీవించాలని చూపించిన ఆదర్శ పురుషుడు శ్రీరాముడు.

గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞతాభావం కలిగినవాడు, సత్యం పలికేవాడు, దృఢమైన సంకల్పం కలిగినవాడు, చరిత్రము కలిగినవాడు, అన్ని ప్రాణుల మంచి కోరేవాడు, విద్యావంతుడు, సమర్థుడు, చూడచక్కటి రూపం కలవాడు, ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించినవాడు, తేజస్సు కలిగినవాడు, ఎదుటివారిలో మంచిని చూసేవాడు,అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకోగలిగినవాడు. ఈ పదహారు సుగుణాలను బట్టే శ్రీరాముడు ఓ ఆదర్శ పురుషుడిగా, మర్యాద పురుషోత్తముడిగా నిలిచాడని చెబుతుంటారు.

ఈ విధంగా శ్రీరాముడి ధర్మనిబద్ధత, తండ్రి కొరకు ఇచ్చిన మాట కోసం నిలబడటం, ధర్మం ప్రకారం జీవించటం ఇవన్నీ ఆయన లోక కళ్యాణం కోసమే చేశారు కాబట్టి ఈ సుగుణాలను బట్టే రాముడిని ఓ దేవునిగా కొలుస్తున్నాము అన్నదే ఎవరైనా చెప్పే సమాధానం.

కానీ, శ్రీ రాముడిలో ఉన్న పై పదహారు గుణాలతో పాటు “ఆయన ఉదయాన్నే లేచి దైవాన్ని ఆరాధించే ఓ దైవదాసుడు” కూడా అన్న “పదిహేడవ గుణాన్ని” గుర్తించకపోవటం వల్ల మరియు హిందూ శాస్త్రాలు ప్రస్తావిస్తున్న నిజ దేవుని గుణగణాలు ఏమిటో అవగాహన లేని కారణంగా చాలా మందిలో రాముడు దేవుడు అన్న భావం ఏర్పడిపోయింది. నిజానికి నిజ హిందువులు రాముడిని ఆరాధించే బదులు ఆయన ఆదర్శాల్ని పాటించాల్సి ఉంది. ఆదర్శ పురుషుడు ఎప్పటికీ ఆరాధనీయుడు కాలేడు.

విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేసే ఆచారం వేద శాస్త్రాలు ఎక్కడా చెప్పటం లేదు. నిజం చెప్పాలంటే వేదకాలంలో అసలు విగ్రహాలే లేవు. పైగా రాళ్లు, చెట్లు, జంతువులు వగైరా సృష్టి పదార్థాలను ఆరాధించకూడదని వేదశాస్త్రాలే ఘోషిస్తున్నాయి (యజుర్వేదం 40:9, గీత 9:25). ఈ విషయాన్ని కాస్త ప్రక్కన పెడితే… రాముడి ఆదర్శాలు, ఆయన వ్యక్తిత్వాన్ని కచ్చితంగా గౌరవించాలి, పాటించాలి కూడా. కానీ, ఆయన్ని సర్వం సృష్టించిన దేవుడిగా భావించి ఆయన విగ్రహానికి ప్రాణప్రతిష్ట చెయ్యటం అన్నది ఆయన స్వయంగా ఏనాడూ నిర్దేశించని ఆచారం అని తెలుసుకోవాలి.

కానీ ఇది గుర్తించకపోవటం వల్ల నేడు విద్యావంతులు, హేతువాదులు సైతం “సర్వం సృష్టించిన దేవుడికి ఎవడో ప్రాణప్రతిష్ట చేయడమేంటి?” అని ప్రశ్నించే పరిస్థితి వచ్చింది.

అందరికీ ప్రాణం పోసే సర్వం సృష్టించిన దేవుడికి ప్రాణప్రతిష్ట చెయ్యాల్సిన పని లేదు. విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేస్తూ సర్వం సృష్టించిన దేవుడికి ప్రాణప్రతిష్ట చేస్తున్నామని అనుకోటంలో అర్థం ఉండదు.

కాకపోతే నాస్తికులు ధార్మిక గ్రంథాలను వాటి యదార్థాలను చదవకపోవటం వల్ల సొసైటీలో చాలా మంది అవలంబించే మూఢనమ్మకాలన్నీ ధర్మమే చెబుతుందన్న అపోహలో బ్రతుకుతుంటారు. ఇలాంటి వారికి సమాధానం ఇవ్వాలంటే ముందు సర్వం సృష్టించిన దేవుడంటే ఎవరు? ఆయన గుణగణాలేమిటి? అన్న కనీస అవగాహన ఆస్తికులమని చెప్పుకునేవారిలో ఉండాలి.

అయితే ఇప్పుడు ప్రస్తుతం శ్రీరాముని విగ్రహా ప్రాణప్రతిష్ట జరపటం తమ రాజకీయాధికారాన్ని తిరిగి నిలబెట్టుకోటానికి ముడి సరుకుగా కొన్ని మతతత్వ పార్టీలు వాడుకుంటున్న నేపథ్యంలో భక్తిపారవశ్యంలో మునిగిపోయి ఉన్న ప్రజలకు పై వాస్తవాలు మింగుడు పడకపోవచ్చు. కాకపోతే, ఆస్తికులకు సర్వం సృష్టించిన దేవుని కనీస అవగాహన లేకపోతే నాస్తికులకు లోకువైపోయే పరిస్థితి దాపురిస్తుంది.

అలాంటి పరిస్థితి ఎప్పుడూ తెచ్చుకోకూడదు.

Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *