బైబిల్ దేవుడి పుట్టిన రోజా..!?

చరిత్ర ప్రకారం రోమన్లు సూర్యదేవుని సంతానంగా భావించి ఆరాధించే ‘మిత్వా’ అనే ఓ మిద్యాదేవుని పుట్టుక తేదీనే ‘డిసెంబర్ 25’! ఆ తేదీనే ‘యేసుక్రీస్తు’ పుట్టుక తేదిగా మార్చబడి ‘క్రిస్మస్’ జరుపుకునే ఆచారం క్రైస్తవంలో ఎలా ప్రవేశపెట్టబడింది?

స్వయంగా బైబిల్ చెట్ల కొమ్మలను అలంకరించి ఊరేగించే అన్యపోకడలను అనుసరించవద్దని ఖండించినప్పటికీ ‘క్రిస్మస్’ చెట్లను అలంకరించి ఊరేగించే ఆచారం క్రైస్తవంలో ఎలా ప్రవేశపెట్టబడింది?

దీనికి సమాధానం క్రీ.శ 325 సంవత్సరంలో అప్పటి ఆన్యుడైన రోమన్ చక్రవర్తి ‘కైసర్ ఫ్లావిస్ కాన్స్టన్ టైన్’ ‘డిసెంబర్ 25’ను యేసు పుట్టుక తేదిగా ప్రకటించి, క్రిస్మస్ జరుపుకునే ఆచారం ప్రవేశపెట్టాడు. నైషియా సభలో ‘త్రిత్వ-అవతార’ వాదాలు సైతం ‘కాన్స్టన్ టైన్’ ప్రవేశ పెట్టిన తరువాతనే అవి ప్రకటించబడటమే కాక, అవే క్రైస్తవ మౌలిక సిద్ధాంతాల స్థానాన్ని ఆక్రమించాయని క్రైస్తవ చరిత్ర కారులే తేల్చి చెప్పేశారు. ఈ విషయాన్ని ప్రక్కనపెడితే…

‘డిసెంబర్ 25’నే యేసు పుట్టిన రోజు అనే విషయంలో క్రైస్తవ పండితుల మధ్యే బేధాభిప్రాయం ఉంది. ‘ఈస్ట్రన్ ఆర్ధోపెడిక్ చర్చీ’ వారు ‘జనవరి 6’వ తేదీన ‘క్రిస్మస్’ పండుగ జరుపుకుంటే… ‘ఆర్మేనియన్ చర్చీ’వారు ఇదే క్రిస్మస్ పండుగను ‘జనవరి 19’న జరుపుకుంటారు. మరికొందరు ‘డిసెంబర్ 25’ను యేసు పుట్టుక తేదిగా జరుపుకుంటారు. మొత్తానికి క్రీ.శ 325లో రోమనీకరణ చెయ్యబడిన క్రైస్తవంలో ప్రవేశపెట్టబడిన అనేక అన్య ఆచారాలు తరువాతి కాలాల్లో పుణ్య ప్రదమైన ఆచారాలుగా నిర్వహింపబడుతున్నాయని చెప్పటం అతిశయోక్తి కాదు.
****

‘డిసెంబర్ 25’ను యేసు పుట్టిన రోజని చెప్పే క్రైస్తవులే ఆ యేసును దేవుడని నమ్మటం విచిత్రం. నిజానికి భవిష్యత్తులో తన అనుచరులు తనను ఎక్కడ దేవుడని భ్రమపడతారో అని.. “భూమి మీద తండ్రి (అంటే దేవుడు) అని ఎవరికీ పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ దేవుడు ఆయన పరలోకంలో ఉన్నాడు (మత్తయి 23:9)” అని తేల్చి చెప్పేశారు.

అంతేకాదు, తన విషయంలో ఏ కన్ఫ్యూజన్ లేకుండా “నేను క్రీస్తనబడిన మెస్సియ (యోహాను 4:25)”ను మాత్రమే అని కూడా తేల్చి చెప్పేశారు.

యూదుల సంస్కర్తగా పంపబడిన యేసు తన మూడున్నరేళ్ల సువార్తా కాలంలో ఏ యెహోవా దేవునినైతే ఆనాడు ప్రకటిస్తూ ఉండేవారో ఆ దేవుడు పాతనిబంధనలో అప్పటికే- “నేను పరిశుద్ధ దేవుడను గానీ మనుష్యుడను కాను” (హోషేయ 11:6) అని చెప్పి, తాను “మానవ పుట్టుక లేని వాడిని” అని ప్రకటించుకుని ఉండటం గమనార్హం!

ఆయన మానవమాత్రుడిగా అవతరించేవాడు కాదన్న విషయాన్ని బైబిల్- “ఆయన నరుడు కాడు” (1 సమూయేలు 15:29) అని మరో చోట ఎలుగెత్తి ప్రకటించటం మరింత గమనార్హం.

అంతేకాదు, బైబిల్లో యెహోవా దేవుడు పుట్టుక లేనివాడే కాదు, చనిపోయే వాడు కూడా కాదని (రోమా 1:23) చెప్పబడుతున్నప్పటికీ… ఆ యెహోవాను ప్రక్కన పెట్టి, యేసును దేవుడిగా నమ్మే క్రైస్తవులు ‘గుడ్ ఫ్రైడే’ ను ‘మా దేవుడైన యేసు చనిపోయిన రోజు’ అని భావిస్తూ నిర్వహించటం మూఢత్వానికి పరాకాష్ఠ అని చెప్పవచ్చు.

విగ్రహాలకు, తాయెత్తులకు, నెల్లూరు రొట్లకు, పీర్లకు, దర్గాల్లో బాబాలకు ఏదో దైవ మహిమ ఉందని కొందరు నమ్మటం లాంటిదే యేసుకు కూడా దైవత్వం ఉందని, ఆయన కూడా దేవుడే అన్న నమ్మకం కూడ (మొత్తం క్రైస్తవులంతా యేసును దేవుడని నమ్మరు! నిజానికి బైబిల్ ను అర్థం చేసుకున్న క్రైస్తవులు యెహోవాను దేవునిగా, యేసును క్రీస్తుగా నమ్మే వారు కూడా అధిక శాతం మంది ఉన్నారు).
పోనీ, యేసును దేవుడని నమ్మితే నమ్మారు.. యేసును దేవునిగా నమ్ముతునే ఆయన చనిపోయిన రోజు, పుట్టిన రోజు అంటూ సెలబ్రేట్ చేసుకోవటం ఇక మరీ విచిత్రం.

పాతనిబంధనలో “నేను మనుష్యుడను కాను” అని ప్రకటించుకున్న ఆ యెహోవానే యేసు తన సువార్తలో దేవునిగా పరిచయం చేస్తూ, స్వయంగా ఆయన్ని ప్రార్ధిస్తూ, ప్రజలకు కూడా ఆయననే ప్రార్ధించమని ఆదేశిస్తూ ఉండేవారన్న విషయం బైబిల్ ని పరిశీలనగా చదివే ప్రతీ ఒక్కరికీ ఎరుకే.

ఆ యెహోవా దేవుడే కన్యమేరీ గర్భంలో మానవ పిండంగా మారిపోయి, ఆమె గర్భంలో తొమ్మిది నెలలు అపరిశుద్ధావస్థలో ఉండి తరువాత అత్యంత బలహీన స్థితిలో ఈ లోకంలో యేసు రూపంలో పుట్టేశాడన్న అధికశాతం క్రైస్తవుల ఊహాత్మక విశ్వాసాన్ని
“దేవుడు (అనగా- యెహోవా) ఇశ్రాయేలు ప్రజల కొరకు రక్షకుడగు యేసును పుట్టించెను” – అ.పో.కా 13:23 అన్న వాక్యం పటాపంచలు చేస్తుంది.

యేసు, ఆదిమ అపోస్తలులు, వారి అనుచరుల నుండి పౌలు వరకు.. దేవుడు ఒక్కడే ఆయన యెహోవా, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని, ఆయన భూమి మీద పుట్టడని, చనిపోడని ఆయనను ఎవరూ ఏ కాలమందైననూ చూడలేదని, చూడలేరని కరాఖండీగా తేల్చి చెప్పేసినట్లు బైబిల్లో వందల వాక్యాల్లో చూడగలం.

నిజానికి యేసు క్రైస్తవ్యాన్ని స్థాపించలేదు సరికదా క్రైస్తవం, క్రిస్మస్, గుడ్ ఫ్రైడే లాంతో పదాలు యేసు తన నోటితో ఎప్పుడూ పలకలేదు, అవి ఆయనకు తెలియని అపరిచిత పదాలు. “త్రిత్వం” అనే అన్య దృక్పథం యేసు చెప్పని ఆయనకు తెలీని “అపరిచిత సిద్ధాంతం”.

యేసు దేవుడని దేవుని గానీ, అవతారమని గానీ, త్రిత్వంలో ఒక దేవుడని గానీ బైబిల్లో ఎక్కడా రాయబడి లేదు. అయినప్పటికీ చాలా మంది క్రైస్తవులు ఆ సిద్ధాంతాలు నమ్మటానికి కారణం కొందరు బోధకులు అన్యుల నుండి ఎరువు తెచ్చుకున్న విశ్వాసాలను బైబిల్ వాక్యాలకు తగినట్టు కుదించి ఆయా సిద్ధాంతాలు బైబిల్లో ఉన్నట్లు భ్రమ కల్పించి బోధించటమే.

ఈ అన్య విశ్వాసాలు నమ్మే కొందరు సోకాల్డ్ క్రైస్తవులకు కావలసింది కూడా వాక్యానుసారమైన సత్యం కాదు. తాము నమ్ముకుంటున్న నమ్మకాలను తమ ప్రసంగాల ద్వారా సత్యాలుగా చిత్రీకరిస్తూ సాటిస్ఫై చేసే కొందరు సోకాల్డ్ సువార్తీకుల సోకాల్డ్ సువార్తలు మాత్రమే.

Md Nooruddin 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *