సమాజ నాశనానికి ద్వారం – “డ్రగ్స్” /-

నేడు భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న అనేక సమస్యలలో ఒకానొక అతిపెద్ద సమస్య నేటి ఆధునిక యువత డ్రగ్స్ వ్యసనానికి బానిసైపోవటం అని చెప్పటం అతిశయోక్తి కాదు.

ఉన్నత చదువులు చదవటం, సైంటిఫిక్, టెక్నాలాజికల్, ఎకనామికల్ రంగాలలో డవలప్ అవ్వటంతో పాటు మోడ్రన్ గా ఉండటం, స్నేహితులతో సరదాగా గడపటంలో తప్పులేదు. కానీ, నేటి యంగ్ జనరేషన్ అమ్మాయిలు, అబ్బాయిలు ఎంజాయ్మెంట్ పేరుతో ఫ్రెండ్స్ తో రాత్రుళ్లు క్లబ్బుల్లో, పబ్బుల్లో కొకైన్, హెరాయిన్, కోడెక్స్, బ్రౌన్ షుగర్, గంజాయి వగైరా మత్తు పదార్థాలు సేవిస్తూ డ్యాన్సులు కడుతూ వాటికి అలవాటుపడి అనారోగ్యాలకు గురై, డిప్రెషన్లతో ఆత్మహత్యలు చేసుకునేంత వరకు వెళ్లకూడదు.

నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ప్రకారం భారతదేశంలో డ్రగ్స్ కు అలవాటు పడిన వారు 100 మిలియన్ల మందికి పైగా ఉన్నారని, వారిలో అత్యధికంగా ఉన్నది 16 నుండి 25 సం.ల లోపు యువతే అన్న విషయం మీకు తెలుసా?

భారతదేశంలో డ్రగ్స్ కు అలవాటు పడ్డవారిలో కేవలం 10 నుండి 17 ఏళ్ల మధ్యనున్న చిన్నారులు 1.58 కోట్ల మంది ఉన్నారన్న భయంకర నిజం మీలో ఎంతమందికి తెలుసు?

టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే ప్రకారం భారతదేశంలో డ్రగ్స్ కు అలవాటుపడి ప్రతీ గంటకు ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారని, అలాగే ఒక్క 2021 లోనే దేశంలో 10 వేల మంది డ్రగ్స్ మరియు ఆల్కహాల్ కారణంగా ఆత్మహత్యలు చేసుకున్నారన్న విషయం మీకు తెలుసా?

భారతదేశంలో డ్రగ్స్ కు అలవాటుపడిన వారిలో 13% మంది కేవలం 20 ఏళ్ల లోపు యువకులే ఉన్నారన్న విషయం మీకు తెలుసా?

‘ద మిక్స్’ అనే యూత్ ఛారిటీ సంస్థ ఒక సర్వే నిర్వహించి ఇచ్చిన రిపోర్ట్ ఏమిటంటే 2021 తరువాత డ్రగ్స్ వాడేవారు 50 శాతానికి పైగా పెరిగిపోయారని వారిలో అత్యధికంగా ఉన్నవారంతా 16 నుండి 25 సం.ల లోపు యువతే అన్నది. దీనిని బట్టి నేడు దేశానికి వెన్నుముక లాంటి యువత ఎటువంటి ప్రమాదకర స్థితిలో ఉందో గమనించవచ్చు.

డ్రగ్స్ వ్యాపారం ఎంతంటే..?

సంక్షిప్తంగా చెప్పాలంటే సెప్టెంబర్ 2021 న గుజరాత్ లో ‘ముంద్రా పోర్ట్’ లో 21 వేల కోట్లు విలువ చేసే 2988 కేజీల హెరాయిన్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పట్టుకోవటం జరిగింది. కాకపోతే ఆ పోర్టు ఆదానీకి చెందింది కావటంతో పెద్దగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఆ వార్త వినపడలేదు. అలాగే ఏప్రిల్ 2021 న తూటికోరిన్ పోర్ట్ లో 303 కేజీల కొకైన్, 337 కేజీల హెరాయిన్ ను సీజ్ చెయ్యటం జరిగింది.
దీనిని బట్టి భారతదేశంలో ఏ స్థాయిలో డ్రగ్స్ వ్యాపారం జరుగుతుందో అంచనా వెయ్యవచ్చు.

కొన్ని కోట్లు విలువచేసే ఇన్నేసి వేల కేజీల డ్రగ్స్ ను వాడుతుంది ఎవరు? అన్న ప్రశ్నకు పై రిపోర్ట్స్ ప్రకారం మత్తు వ్యసనాల విష వలయంలో చిక్కుకుపోతుంది నేటి మన భారతదేశపు ఆధునిక యువతే అని చెప్పటం అత్యంత బాధాకరం. కేవలం కాలేజ్ యూత్ డ్రగ్స్ కు అలవాటు పడుతూ ఉండటంతో ఇండియాలో కోట్ల రూపాయల డ్రగ్స్ బిజినెస్ జరుగుతుందంటే తమ పిల్లల పట్ల తలిదండ్రులు ఎంత బాధ్యతతో వ్యవహరించాలో అర్థమవుతుంది.

యువత డ్రగ్స్ కు అలవాటు పడటానికి కారణం?

“డ్రగ్ అబ్యుస్” లేదా “డ్రగ్ అడిక్షన్” అన్నది ఈ మధ్య చాలా ఎక్కువగా వినపడుతున్న పదం. ఇది ఎలా అలవాటవుతుంది? ఎందుకు అది ఒక అడిక్షన్ (వ్యసనంగా) గా మారిపోతుంది? అన్నది గమనిస్తే…

నిజానికి పనికట్టుకుని డ్రగ్స్ కు అడిక్ట్ అవ్వాలని ఎవరూ కోరుకోరు. వ్యాపారం, ఉద్యోగాల్లో కొందరు రకరకాల డిప్రెషన్ల లో, యాంగ్జైటీ, ఆందోళనలలో ఉండేవారు మొదట్లో మత్తు పానీయాలకు అలవాటుపడి, మరింత మత్తు పొందటం కోసం డ్రగ్స్ కు అలపాటు పడటం జరుగుతుంది.

మరి డ్రగ్స్ కు నేటి మన దేశపు మోడ్రన్ యూత్ ఎందుకు అలవాటు పడుతుంది? అంటే…
ఫ్రెండ్స్ తో పార్టీలు, పబ్బుల్లో సరదాగా “ఎక్స్పెరిమెంటల్ మోడ్” అంటే “ఒకసారి ట్రై చేసి చూస్తే ఎలా ఉంటుంది?” అన్న క్రేజీ ఆలోచనతోనే డ్రగ్స్ తీసుకోవటం అనే అలవాటు ప్రారంభమవుతుంది. ఫ్రెండ్స్ కూడా ఈ ఒక్కసారికి తీసుకుంటే పెద్ద కొంపలేమీ మునిగిపోవనే అలవాటు చేస్తారు.

డ్రగ్స్ తీసుకున్నప్పుడు బ్రేయిన్ లో “డొపమైన్” అనే ఓ ‘ఫీల్ గుడ్ హార్మోన్’ విపరీతంగా రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే ఇలా అసాధారణంగా ఈ “డొపమైన్” హార్మోన్ మెదడులో విడుదల అవుతుందో ఒక రకమైన గమ్మత్తైన ఆనందం, మత్తు మనిషికి ఆవహిస్తుంది. అతన్ని చుట్టుప్రక్కల ప్రపంచం నుండి దూరం చేసేస్తుంది. ఎప్పుడైతే మనిషి ఆ రకమైన ఆనందానికి, మత్తుకు అలవాటు పడతాడో అదో వ్యసనంగా మారిపోతుంది. మాటి మాటికి మెదడు ఆ మత్తును కోరుకుంటుంది.

ఈ విధంగా మనిషి మెదడులో అసాధారణ రీతిలో “డొపమైన్” మాటి మాటికీ రిలీజ్ కావటం వల్ల మనిషి సెంట్రల్ నెర్వస్ సిస్టమ్ దెబ్బతినటం మొదలవుతుంది. తద్వారా నరాల బలహీనత, శరీరంలో వణుకు, కండరాల జబ్బులు ప్రారంభమవుతాయి. ఫలితంగా డయాబెటిస్, హై బీపీ ఎటాక్ అయి సడన్ కార్డియాక్ అరెస్ట్ కావటం జరుగుతుంది.

కొన్నిసార్లు ఈ డ్రగ్స్ తీసుకుంటున్న సమయంలో దాని మోతాదు మించి తీసుకోవటం వల్ల సైతం సడన్ కార్డియాక్ అరెస్ట్ అయి స్పాట్ లో చనిపోవటం జరుగుతుంది. సెలబ్రిటీల నుండి సామాన్యుల వరకు సడన్ గా చనిపోయిన కేసులు ఈ మధ్య చాలా చూడటం జరిగింది.

బహుశా “జోకర్” సినిమాలో నటించిన ప్రఖ్యాత నటుడు ‘హేత్ లెడ్జర్’ అంటే తెలీనివారుండరు. అతనికి ఆ విధంగా డ్రగ్ ఓవర్ డోస్ కావటం వల్లే అతి చిన్న వయసులో కార్డియాక్ అరెస్టుతో చనిపోవటం జరిగింది.

ఉన్నత విద్య ద్వారా యువత బాధ్యతగా వ్యవహరించాలే తప్ప వెర్రిపుంతలు తొక్క కూడదు. హయ్యర్ ఎడ్యుకేషన్ పూర్తిచేసిన యువత ఒక ఉన్నత సమాజాన్ని నిర్మించాలే తప్ప మత్తు పదార్థాలకు అలవాటుపడి అనారోగ్యాలతో బాధపడుతూ ప్రమాదకరమైన సమాజాన్ని నిర్మించకూడదు.

ఏదో డిప్రెషన్ లోనో, ఆందోళనలోనో ఉన్నప్పుడు ఆ బాధను కాస్సేపు మరచిపోటానికి మత్తు కోసం మందో, డ్రగ్సో తీసుకోవటం వల్ల ఆ డిప్రెషన్, టెన్షన్ నుండి ఆ కాస్సేపు “షార్ట్ టైమ్ రిలీఫ్” దొరవచ్చునేమో గానీ సమస్య కు “శాశ్వత పరిష్కారం” అయితే మటుకు దొరకదు కదా.
సమస్య నుండి దూరమవటానికి డ్రగ్స్ తీసుకుని మత్తులో తుగే బదులు, ఆ సమస్యకు సోల్యూషన్ వెతకటం మీద దృష్టి పెడితే డిప్రెషన్, టెన్షన్ అన్న వాటి నుండి పూర్తిగా బయటపడవచ్చు.

మత్తు పదార్థాల గురించి ధార్మిక గ్రంథాలు ఏమంటున్నాయి?

మత్తు పదార్థాలు ప్రమాదకరం, వ్యక్తిగత, సామాజిక జీవన రంగాలను నాశనం చేస్తాయని ఈనాడు ఆధునిక మెడికల్ సైన్స్ చెబుతున్న విషయాన్నే వేల సంవత్సరాల క్రితం ధార్మిక గ్రంథాలు చెబుతున్నాయి.

ఉదాహరణకు ఖురాన్ గ్రంథాన్ని గమనిస్తే.. “మత్తు పదార్థాలు, జూదం ఈ రెండిటిలోనూ ప్రజలకు మహా కీడు ఉంది” – 2:219 అని చెప్పటం జరుగుతుంది.

అలాగే ప్రవక్త ముహమ్మద్(స)- “మత్తు కలగజేసే ప్రతీదీ మాదక ద్రవ్యమే. మరియు ప్రతీ మత్తు పదార్థమూ నిషేధమే” అని హెచ్చరించటం జరిగింది.

అలాగే బైబిల్లో గమనిస్తే “కాబట్టి మీరు మద్యాన్ని, మత్తు పదార్థాలను సేవించకూడదని, మరియు అపవిత్రమైనవాటిని తినకుండా జాగ్రత్త వహించండి” – న్యాయాధిపతులు 13:4 అని చెప్పినట్టు చూడగలం.

హిందూయిజంలో గమనిస్తే మనుస్మృతి 11:55 ప్రకారం మత్తు పదార్థాలను సేవించటాన్ని పంచ మహాపాతకాలలో ఒకటిగా ఎంచటం జరిగింది.

ఈ విధంగా డ్రగ్స్ తీసుకోవటాన్ని అటు మెడికల్ సైన్స్ మాత్రమే కాదు ఏనాడో ధార్మిక గ్రంథాలు సైతం నిషేధించటమే కాక, మత్తు పదార్థాల వల్ల ఎంతో కీడు సంభవిస్తుందని, వాటిని తీసుకోవటం మహా పాపమని హెచ్చరించటం జరిగింది.

అలాంటి ప్రమాదకరమైన డ్రగ్స్ ను వ్యతిరేకిస్తూ ప్రతీ సంవత్సరం జూన్ 26 న “అంతర్జాతీయ మత్తు పదార్ధాల వ్యతిరేక దినోత్సవాన్ని (International Day against Drug Abuse and Illicit Trafficking)” నిర్వహించటం జరుగుతుంది.

Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *