రాజకీయాధికారం కోసమో, దురాక్రమణ కోసమో, తమ స్వంత ఫిలాసఫీల కోసమో కోట్ల మంది సామాన్య ప్రజల ప్రాణాలను సైతం లెక్క చెయ్యకపోవటం ఒకవేళ ఉగ్రవాదమైతే రష్యాలో గత వందేళ్లలో జరిగిన ఎన్నో జనహననాలలో మిలియన్ల కొద్దీ ప్రజలు చంపబడటాన్ని బట్టి రష్యాది వందేళ్ల ఉగ్రవాదమని చెప్పటం అతిశయోక్తి కాదు.
ప్రస్తుతం రష్యా యుక్రెయిన్ పై చేస్తున్న యుద్ధం అనేకన్నా ఆ ‘దేశ దురాక్రమణ కోసం చేస్తున్న సామూహిక జనహననం’ అనటంలో సందేహం లేదు. 1991 లో రష్యాలో ‘సోవియట్ యూనియన్’ పూర్తిగా రద్దు చెయ్యబడిన తరువాత యుక్రెయిన్ యూరప్ లో ఇతర దేశాల్లాన్నే స్వతంత్ర దేశంగా అభివృద్ధి చెందాలని కలలు కన్నది. అయినప్పటికీ యుక్రెయిన్ ను రష్యాలో ఒక భాగంగానే భావిస్తూ వచ్చాడు పుతిన్. ఒకప్పుడు సోవియట్ యూనియన్ లో భాగమైన యుక్రెయిన్ అమెరికా అండదండలు చూసుకుని “నాటో”లో చేరటానికి ప్రయత్నించటం ప్రస్తుత యుద్ధానికి ఒక ప్రధాన కారణం.
“నాటో” అంటే “నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్”. అమెరికా, కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్ వగైరా 12 దేశాల కూటమితో ఏర్పర్చబడిండే “నాటో” సైనిక కూటమి. దాని ప్రధాన ఉద్దేశం సోవియట్ రష్యా యూరప్ లో విస్తరించకుండా అణచటం. నాటో సభ్య దేశాల్లో ఏ దేశంపై సైనిక దాడి జరిగినా నాటోలో మిగతా అన్ని దేశాలన్నీ కలిసి పోరాడటానికి ముందుకు రావాలన్నది ఒప్పందం. ఈ కూటమిలో యుక్రెయిన్ చేరితే ఎప్పటికీ దాన్ని దురాక్రమణ చెయ్యటం సాధ్యం కాదు. దానిని వ్యతిరేకిస్తూ యుక్రెయిన్ ను బలవంతంగా స్వాధీనం చేసుకోటానికి పుతిన్ సాగిస్తున్నదే ప్రస్తుత మారణహోమం.
ఇక అమెరికా, రష్యాల మధ్య తడిసిపోయిన పచ్చ గడ్డి వేసినా భగ్గుమని మండిపోయేంత శతృత్వం ఎప్పటి నుండో ఉందన్నది అందరికీ తెలిసిందే.
అమెరికాకు రష్యా మీద ఉన్న శత్రుత్వంతోనే ఒకప్పుడు రష్యా, ఆఫ్ఘనిస్తాన్ లో సైతం కమ్యూనిజం స్థాపించి దాన్ని దురాక్రమణ చెయ్యాలనుకున్నప్పుడు.. ఆఫ్ఘన్ అల్లరి మూకలకు ఆయిధాలు సప్లై చేసి కొన్ని టెర్రరిస్టు గ్రూపులను తయారు చెయ్యటం మొదలెట్టింది అమెరికా. అందులో నుండి పుట్టిందే ‘అల్-ఖైదా’ దాని తాలూకు మరొక శాఖ ‘ISIS’. తప్పితే ఈ టెర్రరిస్ట్ గ్రూపులకూ ఇస్లాంకు కించిత్తు సంబంధం లేదు. కేవలం మీడియా నోటి దురద కొద్దీ వారు చేసే చిల్లర పనులను “ఇస్లామిక్ టెర్రరిజం” అన్న పేరుతో ప్రసారం చేస్తూ ఉంటుంది. అమెరికన్ CIA ద్వారా కంట్రోల్ చెయ్యబడే ఈ టెర్రరిస్ట్ గ్రూపులపైనే యుద్ధం ప్రకటించి గతంలో ఆఫ్ఘనిస్తాన్ పై, అలాగే వినాశకర ఆయుధాలున్నాయన్న నెపంతో ఇరాక్ పై బాంబుల వర్షం కురిపించి లక్షల కొద్దీ ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకున్న అమెరికాది మరో పెద్ద చరిత్ర.
రష్యా మీద ఉన్న కోపంతోనే జో బైడెన్ సైతం రష్యాకు వ్యతిరేకంగా యుక్రెయిన్ కు సపోర్టుగా నిలబడతామని హామీ సైతం ఇవ్వటం జరిగింది. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా, రష్యాతో యుద్ధానికి దిగే పరిస్థితి లేదు. దాని కారణంగా యుక్రెయిన్ ఒంటరిదైపోయింది. ఇప్పుడు అక్కడ సామాన్య ప్రజలనే సైనికులుగా మార్చి వారి చేతులకు ఆయుధాలిచ్చి దాని అధ్యక్షుడుతో సహా అందరూ రష్యన్ సైనికులతో పోరాడుతున్నారు.
అచ్చం ఇలానే సిరియా ప్రజలు ఒకప్పుడు అసద్ తో పోరాడుతున్నప్పుడు, పాలస్తీనియన్లు ఇస్రాయీల్ తో పోరాడుతున్నప్పుడు అదే మీడియా వాళ్లు చేసే పోరాటాన్ని ఇస్లామిక్ టెర్రరిజంతో పోల్చటం విచిత్రం.
ఇక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం రష్యాకు వెన్నతో పెట్టిన విధ్య. గత వందేళ్ల రష్యా చరిత్రను తిరగేస్తే కమ్యూనిజం స్థాపించబడాలన్న ఒకే ఒక్క కారణం ద్వారా మిలియన్ల కొద్దీ సామాన్య ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోవటమే దానికి సాక్ష్యం.
1848 లో కార్ల్ మార్క్స్ ప్రాక్టికల్ గా సమాజంలో స్థాపించటానికి సాధ్యం కాని కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ను తయారు చేసిన తరువాత.. కమ్యూనిజాన్ని ఎలాగైనా స్థాపించాలని ప్రయత్నాలు మొదలెట్టిన నాస్తిక లీడర్లే లెనిన్ మరియు స్టాలిన్. అప్పటికే పూర్తిగా ఫేలైపోయిన కమ్యూనిజం కాన్సెప్టు కారణంగా మిలియన్ల కొద్దీ ప్రజలు చనిపోయారు. ఇక స్టాలిన్ తరువాత కమ్యూనిజాన్ని బలవంతంగా రుద్దటానికి వచ్చిన వ్యక్తే “మావో జెడాంగ్”. ఇతని కమ్యూనిస్ట్ ఐడియాలజీ మరీ వైలెంట్ గానూ ఎక్స్ ట్రీమ్ లేవల్లో ఉండేవి. ఇతని పేరు మీద పుట్టిందే “మావోయిజం”. ఇక్కడి నక్సలైట్లు సైతం ‘మావో’ ఐడియాలజీతోనే పనిచేస్తుంటారు. అందుకే నక్సలైట్లను “మావోయిస్టులు” అని అంటుంటారు. తమ లక్ష్య సాధన కోసం రక్తపాతం సృష్టించటం సైతం తప్పేమీ కాదన్నదే “మావోయిజం”.
కాకపోతే అడవుల్లో వారు అనాగరికంగా చేసే రక్తపాతాన్నే పుతిన్ అఫీషియల్ గా తన ప్రెసిడెన్షియల్ ఏ.సీ చాంబల్ లో కూర్చొని సైనిక బలగం ద్వారా నిర్వహిస్తున్నాడు అంతే తేడా. గతంలో 1999 లో చెచన్యాను నేలమట్టం చేసి అక్షరాలా 250,000 మందిని చంపి, 2015 లో సిరియాపై క్లస్టర్ బాంబులు వేసి వేల మందిని సిరియన్స్ ను చంపిన పుతిన్ ఇప్పుడు యుక్రెయిన్ పై దహన కాండను కొనసాగిస్తున్నాడు.
చివరిగా… మనిషి మదిలో మెదిలే చెడు తలంపు, ఎదుటి వ్యక్తి కలిగున్న దాన్ని ఎలాగైనా దురాక్రమణ చేసో, దౌర్జన్యం చేసో స్వంతం చేసుకోవాలన్న దురుద్దేశం, స్వార్థపూరిత ఆలోచనలు మనిషిని రక్తపాతం సృష్టించటానికైనా వెనుకాడని వాడిగా తయారు చేస్తాయి. మనస్సుల్లో పేరుకుపోయిన ఇలాంటి చెడు ఆలోచనలతో మనుషులు ముందు యుద్ధం చెయ్యటం మొదలెడితే నిజానికి భూమిపై భౌతిక యుద్ధాలే జరగవు. అచ్చం ఇదే విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ (స) 1400 సం.ల క్రితమే చెప్పారు.
“తనలో మెదిలే చెడు ఆలోచనలతో, మనస్సుతో పోరాడటమే నిజానికి మనిషి చేసే అత్యుత్తమ జిహాద్” – ప్రవక్త ముహమ్మద్ (స)
