ఒక విషయం మటుకు సుస్పష్టమయ్యింది

అక్కడ కర్నాటకలో జరుగుతున్న హిజాబ్ వివాదంలో కోర్టు ఏ విధమైన తీర్పు ఇస్తుంది ఏం జరుగుతుంది అన్న విషయాలు ప్రక్కన పెడితే.. ఇన్నాళ్లుగా సోషల్ మీడియాలో స్త్రీల హక్కులు, మహిళా సాధికారత, ఫెమినిజం అంటూ లక్చర్లు దంచే కొందరు సోకాల్డ్ స్త్రీ జనోద్ధారకులు “ముస్లిం మహిళలు పాపం తలిదండ్రుల బలవంతం మీద హిజాబ్ ధరిస్తూ స్వేచ్ఛను కోల్పోయి ఇస్లాం తాలూకు మతపరమైన సంకెళ్లలో బంధించబడి నానా అవస్థలూ పడుతూ తిరోగాభి వృద్ధివైపుకు వెళ్లిపోతున్నారని, పరదా ప్రగతికి ప్రతిబంధకమని తెగ భాధపడిపోయి పొడవాటి వ్యాసాలు, గంభీరమైన కవిత్వాలూ, కథలూ రాసిపడేసి మొత్తానికి ముస్లిం స్త్రీలకు స్వతహాగా ఆలోచించటానికి బుర్రల్లో మెదళ్లు ఉండవని తమకు తామే డిక్లేర్ చేసేసిన అపర మేధావులందరికీ “హిజాబ్ మా హక్కు” “మేము మా తలలపై మాత్రమే వస్త్రం కప్పుకున్నాం మా మెదళ్లకు కాదు” అంటూ ఫ్లా కార్డులు పట్టుకుని పోరాటం చేస్తున్న ఆ ముస్లిం స్త్రీలను బట్టి వారు స్వతహాగా ఆలోచన కోల్పోయి ఇంట్లోవాళ్ల బలవంతం మీదనో మతపరమైన ఒత్తిళ్లకు లోనయో హిజాబ్ ధరించటం లేదని తమ ఇష్టానుసారమే ధరిస్తున్నారని వారికి ఈ పాటికే స్పష్టమైపోయి ఉండాలి.

నిజంగా ఆ సోకాల్డ్ స్త్రీ జనోద్ధారకులు ఊహించుకుంటున్నట్టు ముస్లిం స్త్రీలు అటు మతపరమైన ఒత్తిళ్ల క్రింద, తలిదండ్రుల బలవంతం మీద నలిగిపోతూ నానా అవస్థలు పడుతూ తలకు హిజాబ్ ధరిస్తున్నారన్నదే నిజమైతే బహుశా… ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ “మీరు ఆ హిజాబ్ ఉంటే లోపలికి రావటానికి వీల్లేదని” చెప్పినప్పుడే ఆ విద్యార్థినులు తమ తలపై కప్పుకున్న ఆ వస్త్రాలను అక్కడే పీకి పారేసి హమ్మయ్యా ఇన్నాళ్లకు పీడ విరగడయ్యిందని ఫీలై స్కూల్ లోపలికెళ్లిపోయేవారేమో!

కానీ, సీన్ రివర్స్ అయ్యింది. వారు మేము చావనైనా చస్తాం గానీ మీ మాటకు లొంగే ప్రసక్తే లేదు “తలపై ఈ హిజాబ్ మా హక్కు”, అది మా ఛాయిస్ ప్రకారమే ధరిస్తున్నాం తప్ప “మేము బుర్ర లేకో, బుద్ది తక్కువయ్యో లేక ఎవరి బలవంతం మీదనో దానిని ధరించటం లేదని.. కేవలం “తలకు మాత్రమే మేము వస్త్రాన్ని కప్పుకున్నాం కానీ మా మెదళ్లకు కాదని” ఫ్లాకార్డులు పట్టుకుని మరీ అగ్రరాజ్యం వరకు వినపడేలా నిరసనలు చేస్తున్నారు.

ఆ సోకాల్డ్ స్త్రీ జనోద్ధారకుల స్వంత ఫిలాసఫీల మీద వారి రాతలు, కవిత్వాలు, పిట్ట కథల మీద వారి ఆశల మీద నీళ్లు చల్లేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *