ఆ సినిమా ప్రొడ్యూసరు ముస్లిమైపోయాడు

కాశ్మీర్ ఫైల్స్, ది కేరళా స్టోరీల్లాంటి ఇస్లామోఫోబిక్ సినిమాల ట్రెండు ఇప్పుడు కొత్తగా మొదలైంది కాదు గతంలోనూ 2008 లో “ఫిత్నా” అనే ఓ యాంటీ ఇస్లామిక్ షార్ట్ ఫిల్మ్ రిలీజైందన్న విషయం బహుశా చాలా మందికి తెలిసే ఉంటుంది. లఘు చిత్రమైనా దాని విడుదలపై ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సమాజంలో తీవ్రస్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి.

ప్రవక్త ముహమ్మద్ (స) ను విమర్శిస్తూ ఇస్లాం అత్యంత ప్రమాదకర మతమని, హింసను ప్రేపిస్తుందని, టెర్రరిజం నేర్పుతుందని, స్త్రీలను అణచివేస్తుందని, ఖురాన్ ఓ ఫాసిస్టు పుస్తకమని వగైరా ఇస్లామోఫోబిక్ సిలబస్ తో తీసిన షార్ట్ ఫిల్మ్ “ఫిత్నా” అన్న పేరుతో అప్పట్లో విడుదలైంది.

ఆ షార్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ పేరు “అర్నాడ్ వాన్ డూర్న్ (Arnoudvan Doorn)”. ఫార్ రైట్ (PVV) అనే ఓ యాంటీ ఇస్లామిక్ పార్టీలో సభ్యుడైన అతను ఒకప్పుడు ఓ కరుడు కట్టిన ఇస్లాం ద్వేషి.

ఇస్లాంతో ఉగ్రవాదాన్ని ముడిపెట్టి ప్రజల్ని ముస్లిములకు వ్యతిరేకంగా రెచ్చగొట్టటం, ప్రవక్త ముహమ్మద్ (స) ను అవమానిస్తూ వ్యంగ్యంగా కార్టూన్లు వెయ్యటం, ప్రపంచంలో జరుగుతున్న ఉగ్రవాద ఘటనలకు కారణం ఇస్లామే అంటూ గాసిప్స్ క్రియేట్ చేసి చెయ్యటం ఆ ఫార్ రైట్ పార్టీ ఉద్యమ ప్రధాన లక్ష్యం.

అంతటితో ఆగలేదు! అర్నాడ్ వాన్ డూర్న్ ఇస్లాంను వక్రీకరిస్తూ 2008లో “ఫిత్నా” అనే షార్ట్ ఫిల్మ్ తీసి ఇంటర్నెట్ లో కూడా విడుదల చెయ్యటం జరిగింది. ఆ తరువాత ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం సమాజం నిరసనల కారణంగా దానిని బ్యాన్ చెయ్యటంతో ఆ గొడవ అక్కడితో సద్దుమణిగింది.

అంతవరకే చాలా మందికి తెలుసు. కానీ, ఆ తరువాత ఏం జరిగిందో బహుశా చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఈ షార్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసరైన “అర్నాడ్ వాన్ డూర్న్ (Arnoudvan Doorn)” కొన్నాళ్లకు 2013 లో ఇస్లాం స్వీకరించి ముస్లింగా మారిపోయాడు.

****

దానికి కారణం భలే చిత్రమైంది

ఎప్పుడైతే 2008 లో “ఫిత్నా” అనే ‘యాంటీ-ఇస్లామిక్’ చిత్రాన్ని నిర్మించటం జరిగిందో అప్పుడు ప్రపంచంలో ముస్లిములంతా కలిసి దాన్ని తీవ్రంగా వ్యతిరేకించటం మొదలెట్టటంతో అప్పటివరకూ ఇస్లాంను కేవలం గాసిప్పుల్లో వింటూ వచ్చిన సమాచారంతో ముస్లిం సమాజాన్ని ద్వేషిస్తూ ఉండే అర్నాడ్ వాన్ డూర్న్ కు ఎందుకో ఇస్లాంను పరిశీలించాలనిపించింది.

ఖురాన్ ను, ప్రవక్త ముహమ్మద్ (స) బోధనల్ని తానే స్వయంగా చదవటం మొదలెట్టాడు. ఆ పరిశీలన వాన్ డూర్న్ ను మరింత లోతుగా ఆలోచించేలా చేసింది. అప్పటివరకూ ఇస్లాం పట్ల తన మెదడులో ఎక్కించుకున్న ఆపార్థాలన్నీ పటాపంచలవుతూ పోయాయి.

ఇస్లాం పట్ల ధ్వేషంతో తాను చేస్తూ వచ్చిన విమర్శలు ఎంత అబద్ధమో తెలుసుకున్నాడు. ఇస్లాం పట్ల తాను అప్పటివరకూ చేస్తూ వచ్చిన విమర్శలకు, ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్(స) బోధనల్లో ఉన్న ఇస్లాంకు అసలేమాత్రం పొంతన లేదన్న విషయాన్ని గ్రహించిన అర్నాడ్ వాన్ డూర్న్ ఇస్లాం స్వీకరించి ప్రపంచాన్ని ఆశ్చర్య పరిచాడు. కొన్నాళ్లకు అతని కొడుకు సైతం తండ్రి మాదిరిగానే ఇస్లాంను పరిశీలించి అతను కూడా ఇస్లాం స్వీకరించాడు.

ఇస్లాం నేడు అనేక అపార్థాలకు గురవటానికి కారణమేంటి, ముస్లిం సమాజం ఇస్లాం వాస్తవికతను అర్థం చేసుకోవటంలో, దాన్ని ప్రజలకు అవగాహనపరచటంలో ఎక్కడ ఫేయిల్ అవుతున్నారు, ఇస్లాం వాస్తవికత వగైరా అనేక అంశాలకు సంబంధించి అర్నాడ్ వాన్ డూర్న్ మాట్లాడిన లెక్చర్స్ ను చూడాలనుకునేవారు యూట్యూబ్ లో చూడవచ్చు.

వాట్స్ యాప్ లో వచ్చేవన్నీ వాస్తవాలు కావు, గాసిప్పుల్లో చదివేవన్నీ నిజాలు కావు. నేడు ఇస్లామోఫోబులు ఇస్లాం పట్ల లేవనెత్తుతున్న విమర్శలు, తీస్తున్న సినిమాలు నిజమే అయితే ఇస్లాం ఈపాటికే ఎప్పుడో కనుమరుగైపోయి ఉండేది. దానికి బదులు అనేక మంది ఆలోచనాపరులు, విద్యావంతుల ద్వారా అది నేడు వేగంగా స్వీకరించబడుతూ ఉండేది కాదు.

రాజకీయ లబ్ది కోసంకొందరు హిందూ-ముస్లిం విభజన రాజకీయలు నడుపుతూ వాట్స్ యాపుల్లో, మీడియాలో ముస్లిం సమాజం పట్ల, ఇస్లాం పట్ల లేవనెత్తుతున్న విమర్శలను, అబద్ధాలను, సినిమాలను నిజనిజాలను పరిశీలించకుండా ఇట్టే నమ్మేయటం వల్ల సమాజంలో అనైక్యత ఏర్పడుతుంది. దాని వల్ల దేశాభివృద్ధి ఆగిపోతుంది.
కాబట్టి నిజాలను తెలుసుకోవాలంటే కొంత సమయం తీయాలి, పరిశీలన చెయ్యాలి…

డబ్బే కాదు జ్ఞానం కూడా ఎవరికీ ఊరికే రాదు!


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *