రమజానైపోయిన రెండవరోజు…

నుండి పొద్దుటే సహరీ, నమాజులకు నిద్ర లేపిన గడియారపు అలారాలు మూగబోతుంటాయి, జనాలతో కళకళలాడిన మసీదులు మళ్లా వెల వెల బోతుంటాయి.

చెడు తలంపులను, చెడు మాటలను నియంత్రించుకుంటూ.. అబద్ధమాడకుండా నోటిని, చెడు చూడకుండా కంటిని కాపాడుకుంటూ నైతికంగా, శాంతియుతంగా నెలంతా గడిపి రమజానైపోయిన రెండవ రోజు నుండి ఆ పవిత్ర వాతావరణం నుండి చాలా మంది బయటకు వచ్చి జైలు నుండి బయటకు వచ్చిన వ్యక్తిలా మరలా రోటిన్ లైఫ్ మొదలెడుతుంటారు.

రమజాన్ నెలంటే కేవలం పుణ్యాలు సంపాదించుకునే నెల మాత్రమే కాదు… ఖురాన్ కోరుకునే ఉత్తమోత్తమ వ్యక్తిత్వ నిర్మాణం పెంపొందించటమే రమజాన్ నెల ఉపవాసాల లక్ష్యం. సృష్టికర్త అయిన దేవుడు మనిషి చేసే ప్రతీ మంచీ-చెడు పనులపై గట్టి నిఘా పెట్టి ఉన్నాడన్న విషయాన్ని మేల్కొల్పటమే ఉపవాసాల ఉద్దేశం.

నెలంతా ఉపవాసాలున్నప్పటికీ ఒకవేళ ఈ స్పృహ గనుక జాగృతం అవ్వకపోతే అలాంటి ఉపవాసాలు దేవుని దృష్టిలో కేవలం లంఖణాలతో సమానం. అలా ఆకలిదప్పులతో ఉండటం అల్లాహ్ కు కూడా అనవసరం.

కాబట్టి రమజాన్ రెండవరోజు నుండి వచ్చే సంవత్సరం రమజాన్ వరకు ఈ స్పృహతో నడుచుకున్నప్పుడే నెలంతా ఉపవాసాలు పాటించినదానికి సార్థకత లభిస్తుంది. తగిన పుణ్యం కూడా వస్తుంది.

ఉపవాసాల నెల రమజాన్ పండుగతో ముగిసినప్పటికీ.. ఉపవాసాల నెలలో అందరూ పాటించిన ఖురాన్ కోరుకునే ఉత్తమ వ్యక్తిత్వ విలువల్ని కొనసాగించటం అన్న ప్రక్రియ మటుకు ప్రారంభమయ్యేది రమజానైపోయిన రెండవరోజు నుండే!

కాబట్టి రమజానైపోయిన రెండవరోజు నుండి మళ్లా రమజాన్ వరకు ఉపవాసాలు ఉండకపోయినప్పటికీ.. ఆ ముప్పై రోజులు పొందిన తర్ఫీదును కంటిన్యూ చెయ్యాల్సిందే. ఖురాన్ కోరుకునే ఉత్తమ వ్యక్తిత్వ నిర్మాణం కొరకు పాటుపడుతూ, ఉపవాసాల లక్ష్యాన్ని నెరవేర్చాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *