100 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు /-

ప్రతీ సంవత్సరం టైమ్ మగజైన్ వివిధ రంగాలలో ప్రజలను అత్యధికంగా ప్రభావితం చేసే “100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితా (100 most influential people list)” అని విడుదల చేస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం ఇండియా నుండి షారూఖ్ ఖాన్, రాజమౌళి లాంటి వారిని కూడా ఆ 100 మంది జాబితాలో చేర్చటం జరిగింది.

అచ్చం ఇలాగే మొత్తం ప్రపంచ చరిత్రలో మానవాళిని అత్యధికంగా ప్రభావితం చేసిన “100 మంది జాబితా” కూడా ఒకటి ఉంది.
మానవాళిని అత్యంత ప్రభావితం చేసిన ఆ వంద మంది మహా వ్యక్తుల జాబితాలో.. వర్ధమాన్ మహావీర్ నుండి ప్లాటో, కార్ల్ మార్క్స్, జూలియస్ సీజర్, జొహన్నాస్ కెప్లర్, సిగ్మండ్ ఫ్రాయిడ్, అశోకుడు,సెయింట్ ఆగస్టీన్, అలెగ్జాండర్ ఫ్లెమింగ్, అలెగ్జాండర్ గ్రాహంబెల్, థామస్ ఎడిసిన్, మార్టిన్ లూథర్, లెనిన్, స్టాలిన్, జాన్ ఎఫ్. కెన్నెడీ, ఆల్బర్ట్ ఐన్ స్టీన్, అరిస్టాటిల్, గౌతమ బుద్ధుడు, సెయింట్ పాల్, జీసస్ వరకు ఎందరో మహామహులున్నారు.

‘మెకాయిల్‌ హెచ్‌.హార్డ్‌’ అనే ఓ స్పేస్‌ సైంటిస్ట్‌ సేకరించి చరిత్రలో మానవాళిని అత్యంత ప్రభావితం చేసిన మహామహులైన వ్యక్తుల తాలూకు జీవిత చరిత్రలను చదివి, లోతైన పరిశీలన ఒక గ్రంథాన్ని సైతం రచించటం జరిగింది. దాని పేరు ‘The 100 A Ranking of the Most Influential Persons in History’. అంటే “చరిత్రలో మానవాళిని ప్రభావితం చేసిన 100 మంది వ్యక్తులు” అని అర్థం.

ఈ వందమందిని తమ మాటల/చేతలు/సేవల ద్వారా మానవ జాతిని ఎంతమేరకు ఎంత ధృఢంగా ప్రభావితం చేశారు, దానిలో వారు ఎంత మేరకు విజయాన్ని సాధించారు అన్న కొలమానం ఆధారంగా వారికి 1 నుండి 100 వరకు వివిధ స్థానాలను సైతం ఇవ్వటం జరిగింది.

ఉదాహరణకు ఆ జాబితాలో గౌతమ బుద్ధుడికి 4 వ స్థానం, ఇవ్వబడితే, యేసుక్రీస్తు కు 3 వ స్థానం ఇవ్వబడినట్లు చూడగలం. కానీ ”చరిత్రలో మానవాళిని ప్రభావితం చేసిన వందమంది జాబితాలో మొట్ట మొదటి స్థానం ఇవ్వబడిన ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన ఎవరో కాదు ప్రవక్త ముహమ్మద్ (స).
****

ఎందరెందరో మహానుభావులకు వివిధ స్థానాలు ఇవ్వబడినప్పటికీ వారందరిలో 1 వ స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్‌(స) కు ఇవ్వటానికి గల కారణమేమిటో ‘మెకాయిల్‌ హెచ్‌.హార్డ్‌’ ఈ క్రింది విధంగా వివరించటమైంది.

”చరిత్రలో మానవాళిని ప్రభావితం చేసిన వందమంది జాబితాలో మొట్ట మొదటి స్థానం ప్రవక్త ముహమ్మద్‌కు ఇవ్వటం అన్న నా ఎంపిక చాలా మందికి ఆశ్చర్యానికి గురిచెయ్యవచ్చు కానీ ఆయన మాత్రమే చరిత్రలో ఆధ్యాత్మికంగానూ, భౌతికంగానూ గొప్ప విజయం సాధించిన ఏకైక వ్యక్తి”

ప్రవక్త ముహమ్మద్(స) మానవజాతిని అంతగా ప్రభావితం చేసిన విషయం ఏమిటి? అని ప్రశ్నించుకుంటే.. నీచమైన ముఢాచారాలలో మునిగిపోయి, నైతికత, మానవత్వాల విషయంలో అధఃపాతాళానికి దిగజారిపోయి, అజ్ఞానంధకారంలో కొట్టిమిట్టాడే ఒకనాటి అనాగరిక అరబ్బు జాతిని కేవలం 23 ఏడేళ్లలో ప్రపంచానికి నైతికతను మానవత్వాన్ని నేర్పేవారిగా, ఆధ్యాత్మికను బోధించేవారిగా, విజ్ఞానానికి నాగరికతకు ధ్వజవాహకులుగా మార్చివేయటమే ప్రవక్త ముహమ్మద్ (స) చేసింది.

దేవుని అస్తిత్వాన్ని గుడ్డి నమ్మకాల ద్వారా కాక, సృష్టిని శాస్త్రీయ పరిశీలన చేసి దైవ అస్తిత్వాన్ని గుర్తించటాన్ని నేర్పారాయన.

అతివాదానికి, మితవాదానికి ఆధ్యాత్మిక వాదానికి, భౌతికవాదానికి మద్యేమార్గాన్ని నేర్పారాయన.

ఆధ్యాత్మికతను కలిగి ఉంటూనే భౌతిక జీవన రంగంలో ఎలా విజయవంతమవ్వాలో నేర్పారాయన.

తోటి మానవులపట్ల కారుణ్యాన్ని కలిగి ఉండటాన్ని తోటి జీవులపట్ల దయను, కారుణ్యాన్ని కలిగి ఉండటాన్ని నేర్పారాయన.

అన్యాయం స్వంత వ్యక్తుల వైపున ఉన్నప్పటికీ న్యాయం చివరకు శత్రువు వైపు ఉన్నప్పటికీ న్యాయం వైపే నిలబడటం నేర్పారాయన.

పొరుగువాడు ఆకలిగా ఉండగా కడుపు నిండా తినటాన్ని నిషేధించి ముందు పొరుగువాని ఆకలి తీర్చి తినటాన్ని నేర్పారాయన.

పేదవారికి, అవసరార్థులకు, బాటసారులకు ఆర్థికంగా ఆదుకోవటాన్ని నేర్పారాయన.

తాము జరుపుకునే పండుగల్లో బీదసాదలను, అన్నార్తులను, ఇరుగుపొరుగు వారిని సైతం భాగస్వాములుగా చేసుకోవటాన్ని నేర్పారాయన.

స్త్రీలకు నిండైన వస్త్రాధారణను, పురుషులకు స్త్రీల పట్ల ఉత్తమ రీతిలో గౌరవించటాన్ని వారి హక్కులను న్యాయంగా చెల్లించటాన్ని నేర్పారాయన.

ఒక వ్యక్తి తన సమకాలీకులపైనే కాక తాను గతించిన తరువాత సైతం తన ప్రభావాన్ని తరతరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది ప్రజలపై చూపుతూ వారిలో నైతిక పరివర్తన తీసుకురావటం, తనను తరరాలుగా ప్రజలు అమితంగా ప్రేమించేవారిగా మార్చుకోగలగటం అన్నది ఆషామాషీ విషయం కాదు.

అది తన ఉద్యమం పట్ల ఎంతో నిబద్ధత, వ్యక్తిత్వంలో సత్యసంధత, ఉత్తమోత్తమ నైతికత-మానవతా విలువలు లాంటివి సుగుణాలు కలిగిన మహా వ్యక్తిత్వమున్న మనిషికే సాధ్యమవుతుంది. ఇదే ప్రవక్త ముహమ్మద్ (స) ను ప్రపంచ చరిత్రలో మానవాళిపై ప్రభావం చూపిన 100 మంది మహా వ్యక్తుల జాబితాలో 1 వ స్థానంలో నిలబెట్టింది.

ఈ విషయం నేడు గుడ్డిగా ప్రవక్త ముహమ్మద్ (స) ను విమర్శించే క్రైస్తవులకు, మతోన్మాదులకు, నాస్తికులకు అస్సలు తెలీదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *