కాలిఫోర్నియాకు చెందిన ప్రముఖ క్యాథలిక్ క్రైస్తవ మత గురువు “హిలారియన్ హేగీ” ఇస్లాం స్వీకరించటం ప్రస్తుతం మీడియాలో హాట్ టాపిక్. నిజానికి ఈయన కంటే ముందు చాలా మంది ప్రముఖ క్రైస్తవ మత గురువులు ఇస్లాం స్వీకరించిన సంఘటనలు ఉన్నాయి. అలాగే యునైటెడ్ స్టేట్స్, బ్రిటన్, యూరప్ వగైరా అభివృద్ధి చెందిన దేశాల్లో అనేక మంది క్రైస్తవులు అత్యధికంగా స్వీకరిస్తున్న ధర్మం కూడా ఇస్లామే.
కాబట్టి క్యాథలిక్ క్రైస్తవ మత గురువు “హిలారియన్ హేగీ” ఇస్లాం స్వీకరించటం పెద్దగా ఆశ్చర్యపడాల్సిన విషయం ఏమీ కాదు. ఒకరకంగా చెప్పాలంటే ఒకప్పటి “ఫార్ రైట్ పార్టీ”కి చెందిన జోరం వాన్ క్లావెరన్, ఆర్తుర్ వాంగర్, అర్నౌడ్ వాన్ డూర్న్ తో పాటు రిచర్డ్ ఎం.సీ. కిన్నే, అబ్రాహామ్ కిల్లింగ్టన్ లాంటి కరుడు కట్టిన ఇస్లాం ద్వేషకులే ఇస్లామోఫోబియాను వీరలెవల్లో ప్రజల్లో రెచ్చగొడుతూ ఏదో సందర్భంలో ఖురాన్ చదివి, ఇస్లాంను స్టడీ చేసి వారే తిరిగి ఇస్లాంను స్వీకరించటం జరిగింది.
వీరందరూ ఇస్లాంను దారుణంగా ద్వేషిస్తూనే తిరిగి ఎలా ఇస్లాంలోకి కన్వర్ట్ అయ్యారో స్వయంగా వారే వివరిస్తూ చెప్పిన అనేక వీడియోలు యూట్యూబ్ లో కూడా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్నవారు చూడవచ్చు. నిజానికి ఇలాంటి కరుడుగట్టిన ఇస్లాం ద్వేషకులు తిరిగి ఎందుకు ఇస్లాం స్వీకరించారు? కారణం ఏమిటి? అన్నదే అసలు ఆలోచించాల్సిన మరియు ఆశ్చర్య పడాల్సిన విషయం.
అయితే క్యాథలిక్ క్రైస్తవ మత గురువు “హిలారియన్ హేగీ” ఇస్లాం స్వీకరించటం “నాకు తిరిగి ఇంటికి రావటం” లాంటిదని చెప్పటమే నన్ను ఆకర్షించిన అంశం. ఇలా చెప్పటాన్నిబట్టి చాలా మంది క్రైస్తవుల్లో ఇస్లాం కంటే క్రైస్తవ్యమే పాతది కదా!? కాబట్టి ఇస్లాం స్వీకరించటం తిరిగి ఇంటికి రావటం ఎలా అవుతుందన్న అనుమానం కూడా మొదలవ్వొచ్చు.
ఒకరకంగా “హిలారియన్ హేగీ” క్రైస్తవుల్లో “ఇస్లాం కొత్తగా పుట్టుకొచ్చిన ధర్మం, ఇస్లాం కంటే క్రైస్తవ్యమే పాతది” అన్న మూఢనమ్మకాన్ని పటాపంచలు చేసి పారేశాడని చెప్పాలి. ఈ వాదన స్వయంగా నేను చాలా మంది క్రైస్తవుల నుండి వింటూ వస్తున్నదే.
ఎందుకంటే సామాన్య క్రైస్తవులకు సైతం అవగాహన లేని విషయం- నిజానికి క్రైస్తవులు అనుసరించే క్రైస్తవ్యం యేసుకు తెలీని మతం అన్నది! అసలు యేసు క్రైస్తవ మత స్థాపకుడు సైతం కానే కాదు. యూదుల సంస్కర్త, ప్రవక్త అయిన యేసు అనుచరులు అంతియొకయో అన్న ప్రాంతంలో మొట్టమొదటిసారి క్రైస్తవులుగా పిలువబడినట్లు బైబిలే చెబుతుంది.
యేసు అనంతరం దాదాపు మూడువందల సంవత్సరాల తరువాతే రోములో కౌన్సిల్ ఆఫ్ నైసియాలో సభలో “కైసర్ ఫ్లావిస్ కాన్స్టన్ టైన్” ఆధ్వర్యంలో ప్రస్తుత క్రైస్తవుల విశ్వాసాలైన “త్రిత్వం”, “యేసు దైవత్వ వాదం” వగైరా సిద్ధాంతాలు క్రైస్తవంలో ప్రవేశపెట్టబడ్డాయని “ది ఎన్సైక్లోపీడియా బ్రిటానికా” కూడా అంగీకరిస్తుంది. ఆ తరువాతే యేసు బోధించిన ఒకనాటి “ఏక దేవుని ఆరాధన ధర్మం” కనుమరుగైపోయి రోమనీకరణ చెయ్యబడిన క్రైస్తవ మతం ఉనికిలోకి రావటం జరిగింది.
కానీ, యేసు అనంతరం దాదాపు ఆరువందల సంవత్సరాల తరువాత ప్రవక్త ముహమ్మద్(స) పరంపరగా వస్తున్న ఏక దేవుని ఆరాధన ధర్మాన్నే (ఇస్లాంను) తిరిగి పునః స్థాపించారు. ఈ విషయాన్నే ఖురాన్ క్రైస్తవులకు జ్ఞాపకం చేస్తుంది.
కాబట్టే ఇస్లాంను లోతుగా స్టడీ చెయ్యటంలో భాగంగా నేటి పరిశీలనా దృష్టి కలిగిన క్రైస్తవులు తిరిగి బైబిల్, ఖురాన్ గ్రంథాలను పరిశీలనగా చదివి బహుదైవారాధనా విశ్వాసాలైన త్రిత్వం, యేసు దైవత్వ వాదాలను విడిచిపెట్టి ఒకనాడు యేసు బోధించిన “ఏక దేవుని ఆరాధన ధర్మాన్నే (ఇస్లాంను)” స్వీకరిస్తున్నారు. ఇదే యూరప్, బ్రిటన్, అగ్రరాజ్యాల్లో అత్యధికంగా క్రైస్తవులు, క్రైస్తవ పండితులు, మత గురువులు కోకొల్లలుగా ఇస్లాంను స్వీకరించటానికి కారణం.
అందుకే “హిలారియన్ హేగీ” సైతం ఖురాన్ పరిశీలనగా చదివిన తరువాతే ఇస్లాం స్వీకరించటం “నాకు తిరిగి ఇంటికి రావటం” లాంటిదని చెప్పటం జరిగింది.
ఇది నిజానికి నాలుగు ముక్కల్లో తేలిపోయే టాపిక్ కాదు. ఈ పాయింట్స్ పై సామాన్య క్రైస్తవులు ఎమోషనల్ గా ఫీలైపోవటం కంటే పైన నేను చెప్పిన పాయింట్స్ కొంతకాలం పాటు అవగాహనతో లోతైన పరిశీలన చేస్తే అర్థం అవుతాయి.
చివరిగా ఇస్లామోఫోబియాను అంతర్జాతీయ స్థాయిలో పెంచిపోషించటంలో కొందరు క్రైస్తవ, యూద పండితుల కృషి సామాన్యమైనది కాదనే చెప్పాలి. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత 60,000 యాంటీ – ఇస్లామిక్ పుస్తకాలు అచ్చువేయటం అంటే వారి ఇస్లామోఫోబియా ఏ స్థాయిదో అర్థం చేసుకోవచ్చు. ఈ యాంటీ ఇస్లాం ప్రాపగండా కారణంగానే కొందరు ఆలోచనా పరులైన క్రైస్తవులు ఖురాన్ ను స్టడీ చేసి ఇస్లాం స్వీకరించటానికి ఓ ప్రధాన కారణమయ్యిందని చెప్పటం అతిశయోక్తి కాదు.
ఇస్లాం కంటే క్రైస్తవ్యమే పాతది కదా!?
