ప్రవక్త ముహమ్మద్(స) – సామాజిక సంస్కర్త

ముహమ్మద్ అంటే ఎవరు? అన్న ప్రశ్నకు “ఆయన ముస్లిములు అనుసరించే ప్రవక్త”, “అరేబియాలో 1400 సం.ల క్రితం ప్రవక్తగా నియమించబడ్డ వ్యక్తి”, “ఇస్లాం ధర్మాన్ని బోధించిన ప్రవక్త” వగైరా సమాధానాలే ఎవరైనా చెప్పేది.

కానీ, వీటన్నిటినీ దాటుకుని కాస్త ఆయన జీవిత చరిత్రను సంక్షిప్తంగా పరిశీలించే ఎవరైనా ఆయనను కేవలం ఇరవై మూడేళ్ల కాలంలో నైతిక, మానవతా విలువలకు దూరమైపోయి నీచమైన ముఢాచారాలు, ఆజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడే ఓ అనాగరిక జాతి ప్రజల్ని ప్రపంచానికి ఉత్తమ నైతిక-ఆధ్యాత్మిక-మానవతా విలువల్ని నేర్పే గురువులుగా, ఉత్తమ నాగరికతకు, విజ్ఞానానికి ధ్వజవాహకులుగా తీర్చిదిద్దిన ఓ ‘అత్యుత్తమ సామాజిక సంస్కర్త’గా గుర్తించగలుగుతారు.

ముహమ్మద్(స) అంటే ఖురాన్ గ్రంథాన్ని బోధించిన చివరి ప్రవక్తగానే ముస్లిం సమాజంలో అధిక శాతం మంది ఆయనను పరిచయం చేస్తూ ఉండటం వల్ల నిజానికి ఆయన ఓ ‘గొప్ప సామాజిక సంస్కర్త’ కూడా అన్న కోణం ముస్లిమేతరుల దృష్టిలో మరుగున పడిపోయిందనటం అతిశయోక్తి కాదేమో.

నీతి బోధలవరకే ఆయన సంస్కరణ పరిమితం కాలేదు!

చరిత్రలో గౌతమ బుద్ధుడు, స్వామీవివేకానంద, రాజారామ్మోహన్ రాయ్ లాంటి చాలా మంది సంస్కర్తలు గతించారు. వారందరూ మానవ జీవనానికి సంబంధించి కొన్ని రంగాలను సంస్కరించటం వరకే పరిమితమయ్యారు. ఇంకా చెప్పాలంటే వారి సంస్కరణలు సైతం కేవలం నీతిబోధలు చెయ్యటం వరకే పరిమితమయ్యాయి.
కానీ, ప్రవక్త ముహమ్మద్(స) చరిత్రను చదివే ఎవరికైనా ఆయన మనిషి తాలూకు వ్యక్తిగత, కుటుంబ, ఆధ్యాత్మిక, రాజకీయ, ఆర్ధిక, వ్యాపార, భౌతిక సమస్త జీవన రంగాలను సైతం సంస్కరించిన ఓ సామాజిక సంస్కర్తగా ఓ హీరోలా ఓ నాయకునిలా ఆయన దర్శనమిస్తారు.

పైగా ఆయన తెచ్చిన సంస్కరణలు కేవలం ఏదో చెట్టు క్రింద కూర్చుని ప్రజలకు నీతి వాక్యాలు, విశ్వాసాలు బోధించటం వరకే ఆగిపోలేదు. ఆయన సమాజ సంస్కరణ కోసం చెప్పిన ప్రతీ ఆదేశాన్ని ఆచరణరీత్యా పాటించి చూపించారు. ఆయన నిర్మించిన సమాజం కేవలం కొన్ని విశ్వాసాలు, నమ్మకాల వరకే పరిమితమైన సమాజం కాదు కానీ, మంచి పనులను ఆచరణరీత్యా పాటించే ఉన్నత వ్యక్తిత్వం కలిగిన ప్రజలతో కూడిన సుందర సమాజం.

అందుకే సరోజినీ నాయుడు ప్రవక్త ముహమ్మద్(స) బోధించిన ఇస్లాం ధర్మాన్ని ఉద్దేశిస్తూ చెప్పిందేమిటంటే.. “ప్రజాస్వామిక వ్యవస్థను ఆదేశించటమే కాక, ఆచరించి చూపిన తొలి ధర్మం అదే. మస్జిద్ లో అజాన్ పలకగానే ఆరాధకులందరూ వచ్చి చేరినప్పుడు, రైతు, రాజు ప్రక్కప్రక్కనే దైవం సమక్షంలో మోకరిల్లి ‘దేవుడే గొప్పవాడు’ అని ప్రకటించినప్పుడు ఇస్లాంలోని ప్రజాస్వామిక విధానం ప్రజల్లో రోజుకు ఐదు సార్లు మూర్తీభవించి దర్శనమిస్తుంది”
*****

ఆయన నైతిక విలువలను ఆచరణాత్మకంగా స్థాపించారు

నల్ల జాతీయుల్ని బానిసలుగా మార్చి వారిపట్ల ఆనాటి అరబ్బులు దారుణమైన వివక్ష ప్రదర్శిస్తూ వారిని అత్యంత హీనంగా చూస్తున్న నేపథ్యంలో ప్రవక్త ముహమ్మద్(స) “నల్లవానికి తెల్లవానిపై గానీ, తెల్లవానికి నల్లవానిపై గానీ ఎలాంటి ప్రాముఖ్యతా లేదు మీలో ఎవరైతే ప్రవర్తన రీత్యా గొప్పవారో వారే దైవం దృష్టిలో గొప్పవారు” అని నీతి బోధలు చెయ్యటం వరకే ఆయన సంస్కరణ పరిమితం కాలేదు. బిలాల్ అనే ఓ నల్ల నీగ్రో బానిసను అప్పట్లో ఖురైష్ అరబ్బులు ఎంతో గౌరవ ప్రదంగా భావించే కాబా మసీదుపై నమాజ్ కొరకు పిలిచే బాధ్యత కొరకు నియమించి “మానవులంతా సమానమే” అన్న నినాదాన్ని ఆచరణాత్మకంగా చూపటం జరిగింది. బానిస స్త్రీలను సైతం వివాహం చేసుకోవలసిందిగా ఆదేశించటం జరిగింది. ఆ విధంగా ఉచ్చనీచ బేధభావాలను ఆచరణాత్మకంగా నాటి సమాజం నుండి తుడిచిపెట్టటం జరిగింది.

అమ్మాయిలను అతి హీనంగా చూస్తూ, అమ్మాయి పుడితే పురిటిలోనే చంపేసే ఆనాటి అనాగరిక అరబ్బులకు ఆయన నేర్పిన నైతిక-ఆధ్యాత్మిక విలువల కారణంగా వారు అమ్మాయి పుట్టటమే అదృష్టంగా భావించే వారిగా మారిపోయారు. అశ్లీల్లత, నగ్నత్వం అతి సామాన్యంగా మారిపోయి ఉన్న ఆనాటి సమాజంలో స్త్రీలు నిండైన వస్త్రాధారణతో సమాజంలో మసలాలని, పురుషులకు పరాయి స్త్రీల వైపు చెడు దృష్టితో చూడటం నిషిద్ధమని ఆదేశించి వ్యభిచారానికి పురికొల్పే సమస్త మార్గాలను మూసివేశారు.

ఆడవాళ్లను అంగట్లో సరుకులు మాదిరిగా వేలంవేసి వ్యభిచారం చేయించే సమాజంలో స్త్రీకి ఎంతో గొప్ప స్థానం ఉందని ఆమెకు ఎంతో కొంత ధనాన్ని బహుమానంగా ఎదురిచ్చి మరీ వివాహం చేసుకునే విధానాన్ని నేర్పి వరకట్న జాఢ్యాన్ని ఆనాడే ఆయన ఖండించారు. ఆ విధంగా ఆయన వ్యభిచారాన్ని కష్టతరంగానూ, వివాహాలను సులభతరంగానూ మార్చివేశారు. అంతేకాదు స్త్రీలకు ఆస్తిహక్కును, విడాకులు తీసుకునే హక్కులను అందించటమే కాక, “పురుషులకు మహిళలపై ఉన్నటువంటి హక్కులే ధర్మం ప్రకారం మహిళలకు కూడా పురుషులపై వున్నాయ”ని చెప్పి స్త్రీ, పురుషులకు సమన్యాయం, సమాన హక్కులను నిర్దేశించటం జరిగింది.

మద్యం అతిపెద్ద వ్యాపారంగా సాగుతూ, నిత్యం మద్యం మత్తులో మునిగి తూగుతూ ఉండే ఆనాటి అరబ్బు ప్రజలకు ఆయన ఇచ్చిన నైతిక శిక్షణ ఎలాంటిదంటే ఎప్పుడైతే ఆయన “మీలో ఇక నుండి ఎవరూ సారాయి జోలికి పోకూడదని” మద్యాన్ని నిషేధించారో అరేబియా పుర వీధుల్లో సారాయి కాలువలా ప్రవహించింది.

మీరు సంపాదించే ధనంలో బీదలు, అవసరార్ధులు, అనాధలకు కూడా భాగం ఉందని చెప్పి దానాలు చెయ్యటాన్ని విధి చేసేశారు. పొరుగువాడు ఆకలితో ఉండి తాను మాత్రమే కడుపు నిండా భుజించే వ్యక్తి విశ్వావే కాదని హెచ్చరించారు.

బహుశా అందుకేనేమో జార్జ్ బెర్నార్డ్ షా ప్రవక్త ముహమ్మద్(స) గురించి “ఆయన మానవ జాతి రక్షకుడని చెప్పాలి. అలాంటి వ్యక్తి నేటి ఆధునిక సమాజానికి నిరంకుశ నాయకత్వం వహిస్తే అతడు ప్రపంచ సమస్యలన్నిటిని పరిష్కరించి, నేడు కరువైన శాంతిని స్థాపించి, మానవాళికి సుఖ సంతోషాలను అందజేస్తాడని నా గట్టి నమ్మకం” అని చెప్పటం జరిగింది.
*****

ఆయన బోధించిన ధర్మం, చేస్తున్న సమాజ సంస్కరణ నచ్చని కొందరు దుర్మార్గులు ఆయనకు, ఆయన అనుచరులకు శత్రువులుగా మారి దౌర్జన్యానికి తెగబడినప్పుడు, వారితో సంధి సర్దుబాట్లకై ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ పరిస్థితి చెయ్యి దాటిపోయినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఆత్మరక్షణ కోసం యుద్ధానికి సిద్ధమైనప్పుడు సైతం రణభూమికే మానవత్వం నేర్పాడాయన. చివరకు శత్రువులకు చెందిన స్త్రీలను గానీ, వృద్ధుల్ని, పిల్లల్ని చంపరాదని, ఫలాలనిచ్చే చెట్లను నరకటం, కాల్చటం చెయ్యరాదని కఠినమైన ఆదేశాలు జారీచేశాడాయన.

ఆయన చేసుకున్న పెళ్లిళ్లు సైతం ఆనాటి అరబ్బులు అనేక వర్గాలుగా విడిపోయి ఒకరికొకరు ఏమాత్రం కలవటానికి సిద్ధపడని నేపథ్యంలో వారందరినీ కలపటానికి వర్గాంతర వివాహాలను ప్రోత్సహించటమే మార్గం అవుతుంది కాబట్టి ఆయన వివిధ వర్గాల నుండి స్త్రీలను వివాహాలను చేసుకోవాల్సివచ్చింది. యాభై మూడేళ్ళ వరకు కేవలం ఒకే భార్య కలిగి ఉన్న ఆయన ఆ తరువాత పెళ్లి చేసుకున్న స్త్రీలలో అధికశాతం మంది వితంతువులు వయసు మళ్లినవారే.

కానీ ఆయన చరిత్ర చదవని కొందరు మూర్ఖులు మటుకు ఆయన ఇస్లాం స్థాపన కొరకు దౌర్జన్యంగా యుద్ధాలు చేసినట్లుగా ఆయనను ఓ స్త్రీలోలుడుగా చిత్రీకరించటం జరిగింది.

పరలోక సాఫల్యానికి దేవుడు, ధర్మాలను కేవలం నమ్ముకోవటం వరకే కాక ఆ ధర్మం బోధిస్తున్న “మంచి” మానవ జీవనానికి చెందిన అన్ని రంగాలలోనూ ఆచరణాత్మకంగా ప్రదర్శించబడాలన్న నియమం ఆధారంగా నిర్మించబడిన సమాజానికి మించిన సుందర సమాజం మరి ఎక్కడ ఉంటుంది?
పైగా ఆయన చేసిన సమాజ సంస్కరణ తాలూకు ప్రభావం ఆయన కేవలం తన సమకాలీకులపైనే వెయ్యలేదు. అది పధ్నాలుగు వందల ఏళ్లకు పైగా ఈనాటికీ కొనసాగుతూనే ఉంది. ఆయనను అనుసరించేవారు ఈనాటికీ ప్రపంచ జనాభాలో మూడవ వంతు ఉన్నారంటే ఆయన ఏ విధమైన సామాజిక సంస్కర్తో అంచనా వెయ్యవచ్చు.

బహుశా అందుకే మైఖేల్ హెచ్ హార్ధ్ అనే ఓ స్పేస్ సైంటిస్ట్ ప్రపంచ చరిత్రలో మానవాళిపై అత్యధికంగా ప్రభావం చూపిన వందమంది వ్యక్తుల జాబితా తయారు చేసి వారిలో మొదటి స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్(స) ఇచ్చి దానికి కారణం “ఆయన ఒక్కడు మాత్రమే లౌకిక, ఆధ్యాత్మిక రెండు రంగాల్లోనూ ఆశ్చర్యకరమైన విజయాన్ని సాధించిన వ్యక్తి” అని చెప్పుకుంటూ రావటం జరిగింది.

అటు గుడ్డి నమ్మకాలు, మూఢ విశ్వాసాలు బోధించే మత వ్యవస్థకూ, ఇటు దేవుడు ధర్మం అవసరం లేదు, మనిషి జీవితానికి మంచీ-చెడులంటూ ఏమీ లేవు మనసుకు నచ్చింది చేసుకుంటూ ఏ దిక్కూ దివాణం లేకుండా బ్రతికేస్తే చాలని చెప్పే నాస్తిక వాదాలకు భిన్నంగా.. ఈ విశ్వానికి ఒక సృష్టికర్త ఉన్నాడన్న విషయాన్ని ఏవో గుడ్డి నమ్మకాల ఆధారంగా కాక సృష్టిని శాస్త్రీయ పరిశీలన చేసి విశ్వసించటాన్ని నేర్పాడాయన. భౌతిక వాదానికి, ఆధ్యాత్మిక వాదానికి, అతి వాదానికి, మితవాదాలకు భిన్నంగా పూర్తి హేతుబద్ధమైన విశ్వాసాల ఆధారంగా మధ్యే మార్గాన్ని (Modest way), ఒక సంపూర్ణ జీవన విధానాన్ని నేర్పాడాయన.

ఇక ఆయన చేసిన సంస్కరణలను, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన ఉన్నత స్థానాన్ని చూసి వోర్వలేని కొందరు ఆయనపై సృష్టించిన అబద్ధాల విషయంలో థామస్ కార్లయిల్ ఏమంటున్నాడంటే…

“ఈ వ్యక్తి (ముహమ్మద్) చుట్టూ పేరుకుపోయిన అబద్ధాలు మనకే తలవంపులు తెచ్చే విధంగా ఉన్నాయి”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *