ముస్లిం సమాజం విద్యా, వ్యాపార, ఆర్థిక, రాజకీయ రంగాలలో ఎదగాల్సినంతగా ఎందుకు ఎడగలేకపోతుంది? ఈ రంగాల్లో ఏ కొందరో తప్ప అధిక శాతం మంది ముస్లిములు ఎందుకు వెనుకబడి ఉన్నారు? ఈ టాపిక్ పై డిస్కషన్ మొన్నామధ్య వైజాగ్ నుండి విజయవాడకు నేను ట్రైన్ లో వస్తుండగా నాకూ నాతోపాటు ప్రయాణం చేసిన మరి కొందరు ముస్లిం పెద్దలకు మధ్య సాగింది.
అసలు ఈ డిస్కషన్ ఎలా మొదలైందంటే ఆ ముస్లిం పెద్ద మనుషుల్లో ఒకాయన “ఈనాడు ముస్లిములు ఆర్థిక, విద్యా, రాజకీయ, వ్యాపార రంగాలలో ఎంతో వెనుకబడిపోయి ఉన్నారు. సాఫ్ట్వేర్ ఫీల్డ్ నుండి కార్పొరేట్ స్థాయి వరకు అనేక రంగాల్లో అభివృద్ధి చెందిన ముస్లిములు ఎంతో తక్కువమంది ఉన్నారు. చివరకు ముస్లిములు పోలిటికల్ గా కూడా ఎదగలేకపోతున్నారు. నిరక్షరాస్యత, చాలీచాలని చదువులతో ఏవో చిన్నా చితకా పనులు చేసుకునే ముస్లిములే సమాజంలో ఎక్కువమంది ఉన్నారు” అంటూ వాపోవటంతో మొదలైంది.
ఈ డిస్కషన్ జరుగుతుండగా నేను “దీనికి మూల కారణం ఏమై ఉంటుంది?” అని ప్రశ్నించాను. దానికి నేను ముందుగానే ఊహించిన సమాధానమే చెప్పుకొచ్చారు వారిలో ఒకాయన.
“ముస్లిములు “దీన్” అంటూ “దునియాను” పట్టించుకోవటం మానేశారు. ఇదే అసలు ముస్లిం సమాజం అనేక భౌతిక రంగాల్లో ఎదగలేకపోటానికి అసలు కారణం అంటూ చెప్పుకుంటూ రావటం జరిగింది.
నిజానికి ఈ సమాధానం ఆయన పాపం ఎక్కడో వినో చదివో కాపీ కొట్టిందాన్నే నా ముందు చెబుతున్నాడన్న విషయం నాకు తెలుసు. చాలా మంది సోకాల్డ్ ముస్లిం అభ్యుదయవాదులు సైతం తమ రచనల ద్వారా ముస్లిం సమాజం అనేక రంగాల్లో వెనుకబడిపోటానికి కారణం వారు దీన్ కారణంగా “దునియా”ని పట్టించుకోకపోవటమే అన్న భావజాలాన్నే నూరిపోశారు.
“ముస్లిములు ‘దీన్’ లేదా ‘ఇస్లాం ధర్మం’ కోసం భౌతిక ప్రపంచాన్ని పట్టించుకోవటం మానేశారు అంటున్నారు కదా, పోనీ అలాగని “దీన్” పరంగా నైనా ముస్లిం సమాజం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందని చెప్పగలరా? అన్న ప్రశ్నకు ఆ పెద్దాయన పాపం తెల్లమోహం వేశాడు. అప్పటి వరకు సీరియస్ డిస్కషన్లకు బ్రేక్ పడి కాస్సేపు నిశబ్దం ఆవహించింది.
భౌతికపరంగా ఎదగలేనంతగా ముస్లిం సమాజం ఇస్లాం విషయంలో ఎక్కడ తలమునకలైపోయింది? లెక్కపెడితే ముస్లిం సమాజంలో ఇస్లాం, ఖురాన్ తాలూకు అనవగాహనాపరుల సంఖ్యే అత్యధికంగా ఉంది. శుక్రవారాలు తప్ప మిగతా రోజుల్లో మసీదు గదుల్లో నిశబ్దాన్ని వినవచ్చు. ముస్లిం సమాజ నియామక లక్ష్యం ఏమిటి? అన్న ప్రశ్నకు సరైన సమాధానం చెప్పే ముస్లిముల సంఖ్య వేళ్లపై లెక్కపెట్టవచ్చు! అసలు పూర్తి ఖురాన్ ను తమకు తెలిసిన భాషలో చదివి అవగాహన చేసుకున్న ముస్లిముల సంఖ్య బహు తక్కువని చెప్పటం అతిశయోక్తి కాదు.
వాస్తవం ఇదైనప్పుడు ముస్లిములు ఆర్థిక, శాస్త్ర సాంకేతిక, విద్యా, వ్యాపార, రాజకీయ రంగాలలో ఎందుకు వెనుకబడిపోయి ఉన్నారు? అన్న ప్రశ్నకు పాపం వాళ్లు “దీన్”లో మునిగిపోయి “దునియా”ను పట్టించుకోవటం మానేశారని చెప్పటం కుంటిసాకే అవుతుంది. పండుగలు, శుక్రవారాలు వచ్చినప్పుడు మసీదులకు టోపీలు పెట్టుకుని వెళ్లే ముస్లిములను, బురఖాలు ధరించి తిరిగే స్త్రీలను చూసి ముస్లిం సమాజం ఇస్లాంను ఎంతో పటిష్టంగా పాటిస్తుందని భావిస్తే అంతకు మించిన అమాయకత్వం మరొకటి ఉండదు. ఇస్లాం వేషధారణకు సంబంధించింది కాదు ఆచరణకు సంబంధించింది.
మరి ముస్లిం సమాజం పై రంగాలన్నిటిలో ఎదగలేనంతగా ఎదగకపోటానికి మీ అనాలసిస్ ఎంటో చెప్పగలరా? అంటూ మరొకాయన నన్నే ప్రశ్నించారు.
దానికి నేనిచ్చిన సమాధానం నిజంగా ముస్లిం సమాజం “ఇస్లాం” అవగాహన పెంచుకోవాల్సినంతగా పెంచుకుని విద్యా, వ్యాపార, ఆర్థిక, రాజకీయ రంగాల్లో శ్రమించాల్సినంతగా శ్రమించి ఉంటే ఈపాటికి వారు ఎంతో అభివృద్ధి సాధించి ఉండేవారు.
వివరంగా చెప్పాలంటే- నేడు ముస్లిం సమాజం విద్యా, వ్యాపార, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అభివృద్ధి సాధించలేకపోటానికి కారణం చాలా మంది చెబుతున్నట్టు వారు “దీన్” ను పట్టించుకుని “దునియాను” నిర్లక్ష్యం చెయ్యటం కాదు! “దీన్” ను లేదా “ఇస్లాం”ను అవగాహన చేసుకునే విషయంలో వారు నిర్లక్ష్యం చెయ్యటం అసలు కారణం. తద్వారా ముస్లిం సమాజంలో ఇస్లాంలో లేని అతిపోకడలు, విధానాలు, ఆచారాలు చోటు చేసుకున్నాయి. దాని కారణంగా ముస్లిమేతర వర్గాల్లో ఇస్లాం విమర్శలకు లోనవటం ప్రారంభమైంది. ఆయా విమర్శలకు సమాధానం చెప్పే స్థితిలో సైతం నేడు అధిక శాతం ముస్లిములు లేరు. కారణం వారికి స్వతహాగా ఖురాన్ జ్ఞానం లేకపోవటమే! చివరకు బురఖా, హిజాబ్ వంటి చిన్న చిన్న అంశాల పై సైతం నేడు ముస్లిమేతరులు విమర్శిస్తున్నారంటే ముస్లిం సమాజం ముస్లిమేతరులకు ఇస్లాంను అవగాహన కలిగించే విషయంలో ఎంత వెనుకబడిపోయి ఉందో అంచనా వెయ్యవచ్చు.
ముస్లిం సమాజానికి ఖురాన్ ను అందించిన అల్లాహ్ యే స్వయంగా “మానవుడికి ఏదీ లభించదు అతను శ్రమించనంత తప్ప (53:59)” అని కూడా చెబుతున్నాడు. మరొక సందర్భంలో “మేము మానవుణ్ణి శ్రమ కొరకే పుట్టించామని (90:4)” చెబుతున్నాడు. దీనిని బట్టి నేడు ముస్లిం సమాజంలో అధికులు విద్యా, వ్యాపార, ఆర్థిక, రాజకీయ రంగాల్లో వెనుకబడిపోటానికి కారణం వారు ఇస్లాం ధర్మాన్ని పాటించే విషయంలో తలమునకలైపోవటం కానే కాదు! వారు ఆయా భౌతిక రంగాల్లో శ్రమించాల్సినంతగా శ్రమించపోవటం. దానితో పాటు నేడు ఇస్లాం ప్రపంచవ్యాప్తంగా ముస్లిమేతర వర్గాల ద్వారా అనేక విమర్శలకు గురవ్వటానికి కారణం ముస్లిం సమాజం ఇస్లాంను అవగాహన చేసుకునే విషయంలో, ఇతరులకు అవగాహన కలిగించే విషయంలో శ్రమించాల్సినంతగా శ్రమించకపోవటం.
ఒక ముక్కలో చెప్పాలంటే ముస్లిం సమాజం విద్యా, వ్యాపార, ఆర్థిక, రాజకీయ రంగాల్లో వెనుకబడిపోటానికి, సార్వత్రిక ముస్లిం సమాజం నేడు ఎదుర్కుంటున్న అనేక సమస్యలు, దౌర్జన్యాలకు కారణం ఖురాన్ ఈ సమాజంపై మోపిన మౌలిక బాధ్యతను పూర్తిగా నిర్లక్ష్యం చెయ్యటమే. ఆ మౌలిక బాధ్యత- “ఇక నుండి ప్రపంచంలో మానవులకు మార్గం చూపటానికీ, వారి సంస్కరణకూ రంగంలోకి తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరే (ముస్లిములే). మీరు మంచి చేయండి అని ఆజ్ఞాపిస్తారు. చెడు నుండి ఆపుతారు. ఆల్లాహ్ ను విశ్వసిస్తారు” – 3:110 అన్నది.
దీనిని బట్టి సమాజ సంస్కరణ అన్నది ముస్లిం సమాజ మౌలిక బాధ్యత. కానీ నేడు వారిలోనే అధిక శాతం మంది సంస్కరించబడాల్సిన స్థితిలో ఉండటం శోచనీయం.
కాబట్టి అటు ధర్మం పరంగా అయినా ఇటు విద్య, వ్యాపార, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అయినా ముస్లిం సమాజం అభివృద్ది సాధించి దాని స్థితిని మార్చుకోవాలంటే చెయ్యాల్సింది ఏమిటో కూడా ఖురాన్ చెబుతుంది- “యదార్థం ఏమిటంటే, ఒక జాతి స్వయంగా తన లక్షణాలను మార్చుకోనంతవరకు అల్లాహ్ దాని స్థితిని మార్చడు (13:11)”.
ఇప్పుడు ముస్లిం సమాజం అటు ధార్మికంగా, ఇటు భౌతికంగా అభివృద్ధి సాధించాలంటే చెయ్యాల్సింది- ధర్మాన్ని వదిలిపెట్టేసి దునియాదారీ పట్టటమో లేక పూర్తిగా ప్రపంచాన్ని వదిలిపెట్టేసి ఒక్క ధార్మిక అవగాహన పెంచుకోవటం మాత్రమే కాదు.
ఒకప్రక్క ముస్లిం సమాజంలో ప్రతీ ఒక్కరూ ఖురాన్ అవగాహన పెంపొందించుకుని ఖురాన్ తమపై మోపుతున్న బాధ్యతలను నిర్వర్తిస్తూనే.. ‘విద్య’ (Education), వ్యాపార, వైజ్ఞానిక, రాజకీయ రంగాల్లో అభివృద్ధి సాధించటానికి తగినంత శ్రమ పడాలి.
ముస్లిం సమాజం భౌతిక జీవనంలో విజయం సాధించటానికి ఉన్నత విద్యకు ప్రాధాన్యత ఇవ్వటం ఎంత ముఖ్యమో నైతికంగా ఎదగటానికి ఖురాన్ అవగాహన కూడా అంతే ముఖ్యం. కాబట్టి ముస్లిములు ప్రతీ ఒక్కరూ తమ పిల్లల్ని ఐదో క్లాసు, పదో క్లాసు తరువాత పూటగడిస్తే చాలు పెద్ద చదువులు అవసరం లేదని చదువు మాన్పించేసి ఏవో చేతిపనుల్లో పెట్టేయటం వల్ల ముస్లిం సమాజంలో నిరక్ష్యరాస్యులతో కూడిన మంది పెరుగుతుంది తప్ప విద్యా, వైజ్ఞానిక, ఆర్థిక, శాస్త్రీయ, వ్యాపార, రాజకీయ రంగాల్లో ఏ విధంగానూ వారు అభివృద్ధి సాధించలేరు. కాబట్టి ముస్లిం సమాజంలో ప్రతీ ఒక్కరూ ఉన్నత విద్య (Higher education) కు ప్రాధాన్యత ఇవ్వాలి.
“ముస్లిములైన మిమ్మల్ని ఒక మధ్యస్థ సమాజంగా చేశామని (2:143)” ఖురాన్ చెబుతుంది. అంటే అటు భౌతికరంగంలోనూ, ఆధ్యాత్మిక రంగంలోనూ మధ్యే మార్గాన్ని (Moderate way) అవలంబిస్తూ తమ ఆలోచనల్లో, ఆచరణల్లో సమతుకాన్ని కనపరుస్తూ నైతికంగానూ, భౌతికంగానూ అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్లాల్సిన సమాజం అన్నమాట!
ఈ విషయాన్ని గుర్తించకపోవటమే ముస్లిం సమాజంలో అధిక శాతం మంది ధార్మికంగానే కాక, విద్యా, ఆర్థిక, రాజకీయ, వ్యాపార రంగాలలో వెనుకబడిపోవటానికి కారణం అవుతుంది.
ఇదే నేనిచ్చిన సంక్షిప్త సమాధానం. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయగలరు.
ఈ రంగాల్లో ముస్లిం సమాజం ఎందుకు వెనుకబడింది?
