72 కన్యలు…!?

పాకిస్తాన్ కు చెందిన యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న ఆర్జూ కాజ్మీ అనే ఓ జర్నలిస్ట్ కు, ఆల్-ఇండియా ఇమామ్ ఆసోసియేషన్ ప్రెసిడెంట్ మౌలానా సాజిద్ రషీదికీ మధ్య రెండు భాగాలుగా జరిగిన ఆసక్తికరమైన ఇంటర్యూలో ఆమె అడిగిన ప్రతీ ప్రశ్నకూ మౌలానా సాజిద్ రషీది ఎంతో ఉన్నతంగా సమాధానాలు చెప్పటం జరిగింది.

ఈ రెండు భాగాల్లోనూ ఆ నాస్తిక ముస్లిం జర్నలిస్ట్ ఆర్జూ కాజ్మీ ఇస్లాం ముస్లిములను అణగద్రొక్కుతుంది, ముస్లిములు ఇస్లాం కారణంగా భౌతికంగా ఎదగలేకపోతున్నారు అన్న కోణంలోనే అనేక ప్రశ్నలు సంధించటం దానికి మౌలానా సాజిద్ రషీది అంతే ధీటుగా ఆమెకు సమాధానాలివ్వటం చూడవచ్చు.

ఈ రెండు భాగాల్లోనూ ఆమె అడిగిన ఒక ప్రశ్నకు మౌలానా సాజిద్
రషీది ఇచ్చిన సమాధానానికి సంబంధించిన ఒక క్లిప్ మటుకు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అదిప్పుడు కొందరు ఇస్లామోఫోబులకు, నాస్తికులకు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టైంది.

అప్పటి వరకూ ఇస్లాంను ఓ ఇల్లాజిక్ ధర్మంగా నిరూపించాలని తెగప్రయత్నాలు చేస్తూ అడుతున్న ప్రతీ ప్రశ్నకూ టకటకా సమాధానాలిస్తూ పోతున్న మౌలానాకు పనికట్టుకుని ఆమె అన్ని విడియోల్లోనూ అందర్నీ అడుగుతూ ఉండే “ఖురాన్ లో పురుషులకు 72 కన్యల వాగ్దానం చెయ్యబడింది మరి ఒకవేళ స్త్రీగా నేను ఇస్లాం ప్రకారం పుణ్యకార్యాలు చేసి చనిపోతే నాకేం లభిస్తుంది? మాకంటూ స్వర్గంలో ఏ ఎంజాయ్మెంట్ ఉండదా? మాక్కూడా షాపింగ్ మాల్స్, లైబ్రెరీల్లాంటివి ఉండవా?” అని ప్రశ్నించింది. ఈ ప్రశ్న ధార్మిక అవగాహనే కాక, లోక పరిజ్ఞానం సైతం లేని కొందరికి అబ్బా! భలే ప్రశ్న అనిపించవచ్చు.

అయితే అప్పటివరకూ ప్రతీ ప్రశ్నకు లాజిగ్గా సమాధానాలిస్తూ పోతున్న మౌలానా సాజిద్ రషీది ఇచ్చిన సమాధానం నాకే కరక్ట్ అనిపించలేదు. ఈ ప్రశ్నకు మౌలానా-

“మీరు ఆ 72 కన్యలపై సర్దార్ గా ఉంటారు. మీకు మీ భర్తకూడా అక్కడ లభిస్తారు” అంటూ ఇచ్చిన సమాధానం.. “అదేంటి అక్కడ కూడా మాకు ఇక్కడుండే భార్తేనా? మాకు కూడా అంతమంది పురుషులు లభించాలికదా! మీకు 72 మాకేమో ఒక్కరా? అంటూ ఆమెకు వెటకారం చెయ్యటానికి మొత్తం ఇంటర్యూలో బాగా బలంగా మారిపోయింది.
కొందరికి ఇస్లాంపై ఉండే కుళ్లును కక్కేయటానికి అడ్వాంటేజ్ గా మారిపోయింది.

ముఖ్యంగా తెలుసుకోవలసింది కొందరు ఇస్లాం అనవగాహనాపరులైన ముస్లిములు ముల్లాలు చెప్పే ఈ 72 కన్యలు ఇవ్వబడతారనే కాన్సెప్ట్ ఖురాన్ లో ఎక్కడా లేదు! అది కొన్ని అప్రామాణిక హదీసుల సమాచారం కావొచ్చు.

ఈ 72 కన్యల కాన్సెప్ట్ అప్రామాణికం అని మీరెలా చెబుతారని ప్రశ్నించవచ్చు.

1. నిజంగా ప్రవక్త ముహమ్మద్(స) విశ్వాసులకు స్వర్గంలో 72 కన్యలు ఇవ్వబడతారన్న సమాచారం చెప్పి ఉంటే ఆ విషయం అంతకు ముందు స్వర్గనరకాల గురించి ఎంతో వివరంగా చెప్పిన ఖురాన్ లో ఉండి ఉండేది!

2. ఖురాన్, స్త్రీ, పురుషులైన విశ్వాసులైన ఇద్దరికీ వారు మనసుకోరే ప్రతీదీ స్వర్గంలో లభిస్తుందని అన్ని రకాలా బహుమానాలు ఇవ్వబడతాయని చెబుతుంది. మరి ఒక్క పురుషులను ఉద్దేశించి మాత్రమే అందమైన స్త్రీలు ఇవ్వబడతారని ఎందుకుంది? మరి స్త్రీలకు కూడా అందమైన పురుషులు ఇవ్వబడతారని ఉండాలి కదా? అన్న అమాయక ప్రశ్న చాలా మంది అడుగుతూ ఉంటారు.

3. ఇది కనీసం లోక పరిజ్ఞానం లేనోళ్లు మాత్రమే అడిగే అమాయకపు ప్రశ్న. కారణం ధార్మికంగా స్త్రీ, పురుషుల హక్కులు సమానమైనప్పటికీ.. వారి స్వభావాలు వేరు. అలాగే సమాజంలో స్త్రీ, పురుషుల శరీరనిర్మాణం నుండి వారి స్థానాలు, బాధ్యతలు, పనులు, ప్రవృత్తులు వేరు. స్త్రీలను అన్ని విధాలుగా సంరక్షించే, కాపాడే బాధ్యత పురుషునిదే. అందుకోసమే యుద్ధ సమయాల్లో భర్తలు చనిపోయిన స్త్రీల, వారి పిల్లల సంరక్షణార్థం పురుషులకు ఇద్దరేసి గానీ ముగ్గురేసి గానీ, నగులుగురేసి గానీ పెళ్లిళ్లు చేసుకోమనే ఆదేశం ఇవ్వబడింది. తప్పితే ఖురాన్ లో ఈ ఆదేశం ఇచ్చింది ప్రతీ ముస్లిం పురుషుడు నాలుగు పెళ్లిళ్లు చేసుకుని చెలరేగిపోటానికి కాదు! ఒకవేళ భర్త చనిపోతే స్త్రీలకు సైతం రెండవ వివాహం చేసుకునే హక్కు ఇస్లాం కల్పిస్తుంది.

4. సార్వత్రిక సమాజ స్వభావాన్ని (Nature of society) దృష్టిలో పెట్టుకుంటే… ఒక స్త్రీ ఏకకాలంలో ఇద్దరినీ గానీ ముగ్గురిని గానీ వివాహం చేసుకోవటానికి సిద్ధంగా ఉంది అంటే ఆ స్త్రీ పట్ల చూసే చూపే మారిపోతుంది. ఒకవేళ “బహు భర్తత్వం” కలిగి ఉండటానికి ఏ స్త్రీ అయినా సిద్ధపడినా ఏ పురుషుడూ ముందుకు కూడా రాడు!

5. కాబట్టి స్త్రీ కి సమాజంలో ఇవ్వబడిన గౌరవం, వారి స్వభావాన్ని, హోదాను, వ్యక్తిత్వాన్ని దృష్టిలో పెట్టుకునే ధార్మిక గ్రంథ ఆదేశాలు కూడా ఇవ్వబడ్డాయి. అందులో భాగంగా స్వర్గంలో పురుషులకు అందమైన స్త్రీలు ఇవ్వబడతారనే ప్రస్తావనే చేస్తూ, స్వర్గంలో ప్రవేశించే స్త్రీ, పురుషులకు వారి మనస్సు కోరుకునే ప్రతీదీ అక్కడ లభిస్తుంది అని చెప్పటం జరిగింది. ఒకవేళ స్త్రీలకు కూడా మీరు కోరుకునే విధంగా అనేక మంది పురుషులు ఇవ్వబడతారని చెబితే అది వారి వ్యక్తిత్వాన్ని కించపరచటం అవుతుంది.

6. ఖురాన్ లో స్త్రీల వ్యక్తిత్వాన్ని, వారి గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని దైవాదేశాలు ఈ విధంగా ఇవ్వబడినప్పుడు ప్రవక్త ముహమ్మద్ (స) స్వర్గంలో ప్రవేశించే వారికి 72 కన్యలు ఇవ్వబడతారనే సంఖ్యను విధంగా చెప్పి ఉంటారు?

ఈ విషయాల్నే మౌలానా సాజిద్ రషీది ఆమెకు అర్థమయ్యేలా చెప్పి ఉంటే. సమస్య లేకపోను. ఈ ప్రశ్నకు కాస్త తడబడి ఏదో చెప్పటం వల్ల ఇస్లామోఫోబులకు, కొందరు నాస్తిక్ అభ్యుదయవాదులకు చాలా వీడియోలు, ఆర్టికల్సూ తయారుచేసుకోటానికి బోలెడంత కంటెంట్ దొరికేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *