ఇన్నాళ్లు “హిజబ్ స్వచ్చందం” అని వాదించిన వారంతా ఏమైపోయారు?

“చూసారా, మేము ఇన్నాళ్లూ నెత్తీ నోరు బాదుకుంటూ చెబుతూనే ఉన్నాం! ముస్లిం సమాజంలో స్త్రీలు హిజాబ్ వల్ల అణచివేతకు గురవుతున్నారని కానీ మీరు వినలేదు!! ఈ రోజు మామాటే నెగ్గింది. దీనికి ఇరాన్ లో స్త్రీలు హిజాబ్ లను తొలగించుకుని తగలబెట్టి చేస్తున్న నిరసనలే సాక్ష్యం.. ఇది చాలదా?”

అంటూ పట్టరాని పిచ్చి ఆనందంతో చంకలు గుద్దుకుంటున్న ఇస్లామోఫోబులు మరియు ఫేస్బుక్ హిజాబోఫోబిక్ రైటర్స్ అక్కడితో ఆగక “ఇన్నాళ్లూ హిజాబ్ స్వచ్చందం” అని వాదించిన వారంతా ఏమైపోయారు?” అని ప్రశ్నిస్తూ మేము చేస్తున్న వాదనలో విజయం మాదే అన్నంత ఫీలింగ్ లోకి వెళ్లిపోతున్నారు.

ఇరాన్ స్త్రీలు చేస్తున్న అర్థం లేని నిరసల కారణంగా ఫేస్బుక్ లో ‘ఇస్లామోఫోబులకు” ‘హిజాబోఫోబులకు” మంచి కంటెంట్ దొరికినట్టైంది. ఇన్నాళ్లు ఇస్లాం స్త్రీలకు స్వేచ్ఛనిస్తుందని, హిజబ్ స్వచ్చందం అని వాదించిన వారంతా ఇప్పుడు ఏమైపోయారు? అని ప్రశ్నించటం మొదలెట్టేశారు.

ప్రస్తుత నేపథ్యంలో ఇరాన్ లో జరుగుతున్న నిరసనలను అడ్వాంటేజ్ గా తీసుకుని ఇస్లాం స్త్రీలను అణగ ద్రొక్కుతుందని, ముస్లిం స్త్రీలు బలవంతం మీద హిజాబ్ ధరిస్తూ తమ స్వేచ్ఛను కోల్పోతున్నారని పొడవాటి వ్యాసాలు రాసిపారేస్తున్న ఫేస్బుక్ అభ్యుదయవాదులు, ఇస్లామోఫోబులు మరి కర్నాటకలో “హిజాబ్ మా హక్కు” “మేము మా తలలపై మాత్రమే వస్త్రం కప్పుకున్నాం మా మెదళ్లకు కాదు” అంటూ ఫ్లా కార్డులు పట్టుకుని ‘ఇంట్లోవాళ్ల బలవంతం మీదనో మతపరమైన ఒత్తిళ్లకు లోనయో హిజాబ్ ధరించటం లేదని తమ ఇష్టానుసారమే ధరిస్తున్నామ’ని చెబుతూ తమ స్వరాన్ని అగ్రరాజ్యాల వరకు వినపడేలా ఇప్పటికీ పోరాటం చేస్తున్న ముస్లిం స్త్రీల విషయంలో ఏమని సమాధానం చెబుతారు?

ఇరాన్లో హిజాబ్ ను తొలగించుకుని చేస్తున్న నిరసనలను, కర్నాటకలో హిజాబ్ కోసం చేస్తున్న నిరసనలను రెండిటినీ ప్రక్కప్రక్కన పెట్టి చూస్తే.. ఇరాన్ లో అక్కడి ప్రభుత్వ మత ఛాందస వాదానికి ప్రజలు విసిగెత్తిపోవటం కారణం. కర్నాటకలో స్త్రీల వ్యక్తిగత స్వేచ్చకు భంగం కలిగించే విధంగా హిజాబ్ బ్యాన్ చేస్తూ ప్రభుత్వ విధానాలను తీసుకురావటం కారణం.

కానీ, చిత్రమేమిటంటే- సోషల్ మీడియా నాస్తిక అభ్యుదయవాదులు కర్నాటకలో హిజాబ్ మా హక్కని ముస్లిం స్త్రీలు నిరసనలు తెలియజేస్తున్నప్పుడు వారు ఇస్లాం మత విశ్వాసాల వల్ల ఆ విధంగా కండిషనింగ్ చెయ్యబడ్డారని తీర్మానాలు చేశారు. ఇప్పుడు ఇరాన్ లో హిజాబ్ లు తొలగించుకుని నిరసనలు చేస్తున్న నేపథ్యంలో ఇస్లాం షరియా వల్ల స్త్రీలు అణచివేతకు గురవుతున్నారు కాబట్టి వారు హిజాబ్ కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారని తీర్మానిస్తున్నారు.

రెండూ పరమ విచిత్రమైన తీర్మానాలే! ఈ రెండిటిలో కామన్ గా కనిపించే విషయం ఏదోలా ఇస్లాంను మధ్యలో ఇరికించి విమర్శించటం.

ఇరాన్లో వెల్లువెత్తుతున్న నిరసనలకు మూల కారణం అక్కడి ప్రభూత్వ ఛాందస విధానాలకు జనం విసుగెత్తిపోవటం. నిజానికి ఇరాన్ పోలీస్ కస్టడీలో మహ్సా అమీని అనే 22 యేళ్ల యువతి చనిపోవటం ఖండించతగ్గ విషయమే! కానీ, ప్రస్తుతం అక్కడి స్త్రీలు ఇరాన్ ప్రభుత్వ ఛాందస విధానాలకు వ్యతిరేకంగా హిజాబ్ లను తొలగించుకుని తగలబెట్టి చేస్తున్న నిరసనల్లో ఏ మాత్రం అర్థం లేదు.

ఇరాన్ మహిళలు జుట్లు కత్తిరించుకుని, హిజాబ్ లు తొలగించుకుని రోడ్లపై చేస్తున్న నిరసలు ఒకరకంగా ఇరాన్ ప్రభుత్వ మత ఛాందస విధానాలకు వ్యతిరేకంగా ఆగ్రహంతో చేస్తున్న నిరసనలే అయినప్పటికీ.. వారు అసలు చెయ్యల్సింది జుట్లు కత్తిరించుకోవటం, హిజాబ్ లు తొలగించుకోవటం తగలేట్టేయటం లాంటి పిచ్చి పనులతో కూడిన నిరసనలు కానే కాదు..  “మీరు నడుపుతుంది నిజంగా ఇస్లామిక్ ప్రభుత్వమైతే మీరు పాటిస్తున్న ఇలాంటి కఠినమైన మత ఛాందస విధానాలు, చట్టాలు ఇస్లాంలో ఎక్కడ రాసున్నాయి? ఒక ముస్లిం స్త్రీ హిజాబ్ ధరించనంత మాత్రాన అది ఆమెను అరెస్టు చేసి శిక్షించేంత పెద్ద నేరమని ఇస్లాంలో ఎక్కడ రాసుంది? వేటి ఆధారంగా మీరు ఈ విధమైన విధానాలు పాటిస్తున్నారు?” అని నిలదీసి ప్రశ్నించాల్సింది.

ఇరానీ మహిళలు చేస్తున్న ప్రస్తుత నిరసనల కారణంగా అదేదో ప్రపంచవ్యాప్త ముస్లిం సమాజ నిరసనల మాదిరిగా ప్రొజెక్ట్ చెయ్యబడుతుంది సోషల్ మీడియాలో కొందరి ద్వారా.

ఒక మంచి ఆచారాన్ని/విధానాన్ని పాటింపజేసే విషయంలో సైతం ప్రజలను బలవంత పెట్టటం, ఉన్మాదాన్ని ప్రదర్శించటం వంటివి చేసినప్పుడు సహజంగానే ప్రజల్లో దాని పట్ల ఒకరకమైన ఏవగింపు, వ్యతిరేకత జనించటం కామన్. ఇరాన్ లో జరిగింది అదే.

పూర్తి ఖురాన్ ను జాగ్రత్తగా చదివితే మనిషి ఆరోగ్యకరమైన జీవనం కోసం అనేక విధి-నిషేధాలను చెప్పిన ఖురాన్ వాటిని పాటించటం/పాటించకపోవటం వల్ల కలిగే లాభ-నష్టాలను గురించి చెప్పి, పైగా “ధర్మంలో ఎటువంటి బలవంతం లేదు” “ఇష్టపడిన వారు దీనిని విశ్వసించవచ్చు మరియు ఇష్టపడని వారు దీనిని తిరస్కరించవచ్చు (ఖురాన్ 18:29)” అంటూ ఇస్లాం ధర్మాన్ని అనుసరించటం, అనుసరించకపోవటం అన్నది వ్యక్తుల పర్సనల్ ఛాయిస్ కే వదిలిపెట్టేసింది.

ప్రస్తుత నేపథ్యంలో ముస్లిం సమాజంలో మత చాందస భావాలతో సంకుచిత ఆలోచనలు కలిగి ఉన్న ముస్లిములను వాటి నుండి బయట పడేసే ఏకైక మార్గం వారికి ఇస్లాం ధర్మం యొక్క విశాల దృక్పథాలను అవగాహన పరచటమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *