హేతుబద్ధమైన ఆలోచనా విధానాన్ని నేర్పేది ధర్మం అయితే.. మూఢ నమ్మకాలను, మూఢాచారాలనూ నేర్పేది మూఢత్వ మత వ్యవస్థలోని స్వార్థపరులైన కొందరు మత బోధకులు. వారి ప్రధాన లక్ష్యం ప్రజల్ని ఆలోచన లేని మూర్ఖులుగా మార్చిపడేసి వారి ద్వారా అర్థంపర్థం లేని ముఢాచారాల్ని, క్రతువుల్ని చేయించి వారి ద్వారా లాభం సంపాదించటం. అలాంటి వాటిలోదే ముహర్రం నెలలో కొందరు నామమాత్ర ముస్లిములు రోడ్లపై జండా పంజాలను, ఇత్తడి పళ్లాల వంటి వాటిని కర్రలకు తొడిగి రోడ్లపై ఊరేగింపుతో జరుపుకునే “పీర్ల పండుగ”
మూఢత్వ మతవ్యవస్థ పేరుకుపోయి ఉన్న అనేక మూఢాచారాల్లో ఒకటైన ఈ పీర్ల పండగను ముస్లిముల పండుగ అనేకంటే.. కొందరు నామమాత్ర ముస్లిములు జరుపుకునే తంతు అనటమే సరైనది.
ఎందుకంటే ఇస్లాం అలాంటి అర్థంపర్థం లేని క్రతువులు చెయ్యమని ఎంతమాత్రం ఆదేశించదు కనుక.
ప్రతీ మత వర్గంలోనూ ధర్మాన్ని హేతుబద్ధంగా ఆచరించేవారితో పాటు తమ ఆలోచనా సామర్థ్యానికి లాక్ చేసేసుకుని హేతువిరుద్ధమైన మూఢాచారాలను అవలంబించే వారు కూడా ఉంటారు. అలాంటి కొందరు అనవగాహనాపరులు ముస్లిం సమాజంలోనూ ఉన్నారు. అలాంటి వారి ద్వారా ప్రతీ సంవత్సరం ముహర్రం నెలలో రోడ్లపై ప్రదర్శించబడే విన్యాసం పీర్ల పండుగైతే.. రెండవది బ్లేడ్లు, కత్తులతో ఒళ్లంతా రక్తాలు కారేలా పిచ్చెక్కినట్టు కొట్టుకుంటూ నిర్వహించే “మాతం” అన్నమాట! ఇవేకాక రొట్టెల పండుగలు, దర్గాల్లో సమాధి ఆరాధనలు, మీలాదున్నబీ పేరుతో ఊరేగింపులు వగైరా ముఢాచారాలు ముస్లిం సమాజంలో కొందరి ద్వారా ఆయా సందర్భాల్లో అతి పవిత్రంగా నిర్వహింపబడుతుంటాయి.
‘పంజా’ లేదా ‘ఆలం’ అని పిలిచే జండాలను, ఇత్తడి పళ్లాల వంటి వాటిని కర్రలకు తొడిగి రోడ్లపై ఊరేగిస్తూ పీర్ల పండుగ జరుపుకోటం.. నిప్పుల గుండం తొక్కడం, రక్తం కారేలా ఒంటిని కోసుకోవడం, కొరడాలతో కొట్టుకోవడం లాంటి ఆచారాలను ప్రవక్త ముహమ్మద్ (స) గానీ ఆయన శిష్యులు (సహాబాలు) గానీ అవలంబించినట్టు చరిత్రలో ఎక్కడా చూడలేము. ఇస్లాం ఎంతో ఉన్నతమైన హుందా అయిన ఆరాధనా విధానాలను, క్రతువులను నిర్దేశిస్తుంది తప్ప అర్థంపర్థం లేని పిచ్చి చేష్టలు చెయ్యమని అస్సలు ఆదేశించదు.
ఒకానొకప్పుడు కర్బలా మైదానంలో జరిగిన ధర్మయుద్ధంలో హజ్రత్ హుస్సేన్ (రజి)ను అతి తక్కువ సంఖ్యలో ఉన్న ఆయన అనుచరులను శత్రు సైన్యం కుట్రపూరితంగా చంపి, ఆయన తలను ఇంకా ఆయన అనుచరుల తలలను బల్లాలకు, కత్తులకూ గుచ్చి కరాళ నృత్యం చేసుకుంటూ ఊరేగింపుగా వారి నాయకుడైన యజీద్ దగ్గరకు వెళతారు. దానికి సింబాలిక్ గా నేడు కొందరు నామమాత్ర ముస్లిములు ఊరేగించేవే ‘పీర్లు’ అంటే.
అటువంటప్పుడు ఆనాడు శత్రు సైన్యం ప్రదర్శించిన పైశాచికత్వానికి గుర్తుగా నేడు కొందరు ఊరేగిస్తున్న పీర్లు వారికి ఎలా పవిత్రం అవుతాయో ఎప్పటికీ అర్థం కాని లాజిక్కే!
రంజాన్ నెలలో ఖురాన్ అవతరించినందుకు గానూ ఆనెలంతా ఉపవాసాలుండి జరుపుకునేది “ఈదుల్ ఫిత్ర్ (దానాల పండుగ)” ఒకటైతే.. దైవమార్గంలో ప్రవక్త ఇబ్రాహీం(స) చూపిన గొప్ప త్యాగనిరతికి జ్ఞాపకార్థంగా జరుపుకునేది ‘ఈదుల్ అద్ హా (త్యాగాల పండుగ)” రెండవది. ఇస్లాం నిర్దేశించే ఈ రెండు పండుగలూ మనిషి వ్యక్తిత్వంలో దానగుణాన్ని, ప్రేమా, త్యాగనిరతి వగైరా గొప్ప భావజాలాన్ని పెంపొందిచే పండుగలైతే.. పీర్ల పండుగ, రొట్టెల పండుగ, దర్గా సంస్కృతి వగైరా ఇస్లాం అవగాహన కించిత్తుకుడా లేని కొందరు నామమాత్ర ముస్లిముల ద్వారా కనిపెట్టబడిన ఆచారాలనటంలో సందేహం లేదు.
పెద్దగా ఇస్లాం అవగాహన లేని కొందరు కవులు, అభ్యుదవాదులుగా ఫీలయ్యే మరి కొందరు పీర్ల పండుగ, దర్గాహ్ సంస్కృతి, రొట్టెల పండుగలు ముస్లిములు, బహుజనుల కలుపుగోలు సంస్కృతికి ప్రతిబింబంబాలని చెబుతుంటారు. ముస్లిం, బహుజనుల ఐక్యత తప్పనిసరే! కానీ దానికి మూఢాచారాలు, గుడ్డి నమ్మకాలు ఆధారం కాకూడదు కదా? ముఖ్యంగా ప్రజలను హేతుబద్ధమైన ఆలోచనా విధానాన్ని నేర్పే ధార్మిక గ్రంథాల శాస్త్రీయ ధర్మం ఆధారంగానే ఐక్యపరచాలి. అప్పుడే పూర్తి సమాజం పురోగాభివృద్ధి సాధిస్తుంది.
కాబట్టి ప్రవక్త ముహమ్మద్ (స) మనవళ్లైన హజ్రత్ హసన్ మరియు హుసేన్ ల వీరోచిత ప్రాణత్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ రోడ్లపై పీర్లను ఊరేగిస్తూ డ్యాన్సులు కట్టేకంటే.. రక్తం కారేలా కోసుకోవటం, గుండెలపై బాదుకోవటం, కొరడాలతో కొట్టుకోవటం, నిప్పుల గుండం తొక్కటం లాంటి తింగరి చేష్టలు చేసేకంటే.. వారి ఆదర్శాలను పాటించటమే నిజానికి వారిని ప్రేమించటం అవుతుంది.
ఇస్లాంతో సంబంధం లేని “పీర్ల పండుగ”
