రియల్ ఇస్లాం & సోకాల్డ్ ముస్లిమ్స్

ఇస్లాంకు బద్ధ శత్రువులు ఎవరో కాదు స్వయంగా ఇస్లాం పూర్తి అవగాహన లేని సోకాల్డ్ ముస్లిములే! ఇస్లాం ఎంతో విశాల శాస్త్రీయ దృక్పథాలు కలిగిన గొప్ప ధర్మమే కావొచ్చు, కానీ ఇస్లాం తాలూకు అటూ ఇటూ కాని జ్ఞానంతో కొందరు సోకాల్డ్ ముస్లిములు చేసే చవకబారు చేష్టల కారణంగా ముస్లిమేతరుల దృష్టిలో ఇస్లాం అనేక సార్లు అపార్థానికి గురికాబడుతూనే ఉంటుంది.

ఇస్లాం యొక్క పూర్తి అవగాహన లేని ఆ కొందరు సోకాల్డ్ ముస్లిములు ఖురాన్, హదీసులలో ఉన్న ‘రియల్ ఇస్లాం’తో సంబంధం లేకుండా తమ స్వంత భావాలకనుగుణంగా ఇస్లాంను కుదించుకుని, స్వతహాగా ఛాందస భావాలతో కూడిన ఒక కల్పిత మతాన్ని రూపొందించుకుని చేసే చిల్లర చేష్టలను చూసి బహుశా వారు ఖురాన్ ఆదేశాలకనుగుణంగానే ఈ పనులన్నీ చేస్తున్నారు కాబోలు అని ముస్లిమేతరులు భావిస్తూ ఉంటారు.

అలాంటి మత ఛాందస భావాలతో కూడిన ఉన్మాదులు అన్ని మతాల్లోనూ ఉంటారు, ముస్లిం సమాజంలోనూ కొందరున్నారు. వీరిని తాలిబాన్, అల్-ఖైదా, ఐ‌ఎస్‌ఐ‌ఎస్ వగైరా తీవ్రవాద వర్గాల్లోనూ చూడవచ్చు. ఇప్పుడు వారు ఇరాన్ నుండి వార్తల్లో కెక్కారు.
మహ్సా అమీని అనే ఓ 22 ఏళ్ల యువతిని హిజాబ్ సరిగ్గా ధరించనందుకు అక్కడి పోలీసులు సెప్టెంబర్ 13 న అరెస్టు చెయ్యటం, రెండ్రోజుల తరువాత ఆమె చనిపోవటం ఆమె డెడ్ బాడీని అప్పగించటంతో ఇరాన్ లో నిరసనలు వెల్లువెత్తాయి.

మెజారిటీ షియా వర్గపు ముస్లిములున్న సోకాల్డ్ ఇస్లామిక్ స్టేట్ అయిన ఇరాన్ లోని సనందాజ్ నగరంలో మహిళలు హిజాబ్ లను తొలగించి మరీ అక్కడి ప్రభుత్వపు మత ఛాందస విధానాలకు వ్యతిరేకంగా తమ నిరసన తెలియజేస్తున్నారు. ఇరాన్ పోలీసులైతే సి‌సి టీవీ ఫుటేజ్ ఆధారంగా ఆమె సడన్ గా స్ట్రోక్ కి గురై చనిపోయిందని ఆమెను కొట్టి చంపలేదని ఖండిస్తున్నప్పటికీ అక్కడి పరిస్థితి చెయ్యిదాటి పోయింది. ఇరాన్ నిరసనలతో అట్టడుగుతుంది. నిజనిజాలు ఏమిటన్నవి ఇంకా పూర్తిగా తెలియ లేదు.

మరోప్రక్క ఎప్పటిలానే సోషల్ మీడియాలో ఇస్లామిక్ షరియా, హిజాబ్ లపై చర్చలు మొదలైపోయాయి. మీడియా దీనిని “హిజాబ్ మర్డర్” గా అభివర్ణించటంతో సోషల్ మీడియాలో “హిజాబో ఫోబియా” మరొక్కసారి పెల్లుబికింది. హిజాబ్ స్త్రీలపై బలవంతంగా రుద్ధబడుతున్న ఆచారమని, ఇస్లాంలో స్త్రీలు హిజాబ్ కారణంగా స్వేచ్ఛను కోల్పోతున్నారని ‘నాస్తిక హిజాబ్ రైటర్స్’ తమ రచనలతో మరోసారి రెచ్చిపోవటం ప్రారంభించారు.

మరో ప్రక్క సోషల్ మీడియాలో ఇస్లాంలో సంస్కరణలు తేవాల్సిన అవసరం ఉందన్న వాదనలతో కొందరు అభ్యుదయవాదులు, హిజాబ్ బలవంతపు ఆచారమని, ఇస్లాం కఠినమైన చట్టాలు కలిగి ఉందని వగైరా విమర్శలతో ఇస్లామోఫోబులు తెగ బిజీ అయిపోయారు.
ఈ పరిణామాలకు కారణం ఇరాన్ గవర్నమెంట్ ఇస్లామిక్ షరియా పాటించటం కాదు! ఇస్లాంలో లేని మతఛాందసవాదాన్ని పాటించటం.

మహ్సా అమీని చనిపోవటంతో రియాక్షన్ గా ఇరాన్ మహిళలు జుట్లు కత్తిరించుకుని, హిజాబ్ లు తొలగించుకుని రోడ్లపై చేస్తున్న నిరసలు ఒకరకంగా ఇరాన్ ప్రభుత్వ మత ఛాందస విధానాలకు వ్యతిరేకంగా ఆగ్రహంతో చేస్తున్న నిరసనలే కావొచ్చు. నిజానికి వారు అసలు చెయ్యల్సింది జుట్లు కత్తిరించుకోవటం, హిజాబ్ లు తొలగించుకోవటం తగలేట్టేయటం లాంటి పిచ్చి పనులతో కూడిన నిరసనలు కాదు..

“మీది నిజంగా ఇస్లామిక్ ప్రభుత్వమైతే మీరు పాటిస్తున్న ఇలాంటి కఠినమైన మత ఛాందస విధానాలు, చట్టాలు ఇస్లాంలో ఎక్కడ రాసున్నాయి? ఒక ముస్లిం స్త్రీ హిజాబ్ ధరించనంత మాత్రాన అది ఆమెను అరెస్టు చేసి శిక్షించేంత పెద్ద నేరమని ఇస్లాంలో ఎక్కడ రాసుంది? వేటి ఆధారంగా మీరు ఈ విధమైన విధానాలు పాటిస్తున్నారు?” అని గట్టిగా ప్రశ్నించాల్సింది.

పై ప్రశ్నలకు ఇరాన్ ప్రభుత్వం ఎప్పటికీ సమాధానం చెప్పలేదు. నిజంగా పై విధంగా ప్రశ్నించి ఉంటే ఇరాన్ ప్రభుత్వం నోరు మూయబడి ఉండేది. ప్రపంచం మొత్తానికి రియల్ ఇస్లాంకూ, ఇలాంటి కొందరి మత ఛాందసవాదుల విధానాలకూ మధ్య ఉన్న తేడా కూడా తెలిసేది. బాధాకరమైన విషయమేమిటంటే అక్కడి ప్రభుత్వానికీ ఇస్లాం పట్ల అవగహానలేదు సరికదా, అక్కడి ప్రజలకు అంతకంటే ఇస్లాం పూర్తి అవగాహనలేదు!

నిజానికి ఖురాన్, హదీసుల్లో ఉన్న ‘రియల్ ఇస్లాం’లో ఇలాంటి ఛాందస భావాలతో కూడిన విధానం లేదు. ఏ విషయంలోనూ ఇస్లాం వ్యక్తులను నిర్బంధించటం లేదు. అన్నివిషయాల్లోనూ ఇస్లాం స్వేచ్ఛనిస్తుంది. నిజానికి మనిషికి పూర్తి స్వేచ్ఛను ఇవ్వటమూ ప్రమాదమే అలాగే పూర్తిగా నిర్బంధించినా ప్రమాదమే. కానీ ఇస్లాం ఈ రెండింటికి మధ్య నిర్బంధంతో కూడిన స్వేచ్చను ఇస్తుంది. “తినండి త్రాగండి కానీ మితిమీరకండి (7:31)” అని చెబుతుంది.

ఖురాన్ ఆరోగ్యకరమైన చక్కటి జీవితాన్ని గడపటానికి, సత్సమాజ నిర్మాణానికి అనేక ఆదేశాలను ఇచ్చింది. ఇతరులతో ఎలా మాట్లాడాలి, తలిదండ్రులు, ఇరుగుపొరుగువారితో, బంధువులతో ఎలా వ్యవహరించాలి, ఏమి తినాలి, తినకూడదు వగైరా ఆదేశాలతో పాటు.. సమాజంలో పరాయి స్త్రీలతో పురుషులు ఎలా వ్యవహరించాలి, స్త్రీలు ఎలా నడచుకోవాలి, వారు సొసైటీలో తిరిగేటప్పుడు వస్త్రాధారణ ఎలా ఉండాలి వగైరా అనేక సూచనలను ఖురాన్ ఇస్తుంది. ఆరోగ్యానికి హానికరమైన కొన్ని ఆహార పదార్థాలను, వ్యభిచారాన్ని, మత్తు పానీయాలను ఖురాన్ నిషేధించింది కూడా.

ఈ విధంగా ఖురాన్ అనేక సూచనలను విధి-నిషేధాలను తెలియజేసి “మీకు ఇష్టమున్నా లేకపోయినా ఇస్లాంను చచ్చినా మీరు బలవంతంగానైనా అనుసరించాల్సిందే” అన్న కఠిన నియమాన్ని ఎక్కడా విధించలేదు సరికదా..

ధర్మంలో ఎటువంటి బలవంతం లేదు “ఇష్టపడిన వారు దీనిని విశ్వసించవచ్చు మరియు ఇష్టపడని వారు దీనిని తిరస్కరించవచ్చు (ఖురాన్ 18:29)” అంటూ ఇస్లాం ధర్మాన్ని అనుసరించటం, అనుసరించకపోవటం అన్నది వ్యక్తుల ఇష్టాయిష్టాలకే వదిలిపెట్టేసింది.

అతివాదులు ముస్లిములు కాగలరా?

అతివాదాన్ని, మతోన్మాదాన్ని ప్రదర్శించేవారు ముస్లిములే కాదు. ఎందుకంటే ఖురాన్, ముస్లిం సమాజాన్ని ఉద్దేశించి “మధ్యస్థ సమాజం” (2:143) అని చెబుతుంది.

మధ్యస్థ సమాజం (Moderate society) అంటే-

అతివాదానికీ, మితవాదానికీ ఆధ్యాత్మిక వాదానికీ, భౌతిక వాదానికీ ప్రతీ జీవన రంగంలో మధ్యే మార్గాన్ని అవలంబిస్తూ తమ అలోచనల్లో, ఆచరణల్లో సమతూకం (Balance) కనపరుస్తూ నీతీ, నిజాయితీ, న్యాయం కనపరిచే ఉత్తమ సమాజం అని అర్థం.

కాబట్టి ఇస్లాంను అనుసరించేవారు మతోన్మాదాన్ని ప్రదర్శిస్తే అది ఇస్లాం లోపం కాదు. ఆ మతోన్మాదాన్ని ప్రదర్శించేవారిదే తప్పు వారు ముస్లిం పేర్లు తగిలించుకుని ఎంత పెద్ద గెడ్డాలు పెంచినా సరే. వారి ప్రవర్తన ఇస్లాంతో సంబంధం లేనిది అని అర్థం చేసుకోవాలి. వారి ప్రవర్తనను బట్టి వారిని “సోకాల్డ్ ముస్లిములు”గా గుర్తించాలి.

అలాంటి సోకాల్డ్ ముస్లిముల చవకబారు చేష్టలను బట్టి హడావిడిగా ఇస్లాంను విమర్శించటం, అపార్థం చేసుకోవటానికి బదులు వారు చేసే పనుల్ని నిజంగా ఇస్లాం ఆదేశిస్తుందా? లేదా? అన్నది కాస్త పరిశీలించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *