ఇస్లాం ధర్మానికున్న రెండు మౌలిక ప్రత్యేకతలు 1. అది ఆచరణకు అతి సులువైన ధర్మం కావటం 2. అతివాదానికి, మితవాదానికి అతీతంగా మద్యే మార్గాన్ని నిర్దేశించటం.
ఆది నుండీ అత్యధిక శాతం మంది ధార్మికులు భ్రష్టుపట్టిపోటానికి కారణాల్లో ఒకటి- వారు ధర్మంలో లేని అతిపోకడలు ప్రదర్శించటం. రెండు- వారు ధర్మంలో లేని కఠిన ఆచారాలు ప్రవేశపెట్టి ధర్మాన్ని కఠినతరం చేసెయ్యటం. ఒకనాటి యూదులు చేసిన ఈ రెండు తప్పులనే నేడు ముస్లిం సమాజంలో అధికులు నిస్సంకోచంగా పునరావృత్తం చెయ్యటం బాధాకరం.
ఆ విధంగా ఇస్లాంలో లేని అతిపోకడల్లో ఒకటి కాబాకు కాలి నడకన వస్తామని మొక్కుకుని దేశాలు దాటి కాలినడకన వెళ్లటం. అలాంటి సాహసాలు ఈ మధ్య కాలంలో కొందరు చెయ్యటాన్ని చూస్తున్నాం. ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే మొత్తం ముస్లిం సమాజంలో ఎక్కడో ఇద్దరో ముగ్గురో ధర్మంలో లేని అలాంటి కల్పిత ఆచారాలను అనుసరించటం కూడా కాదు, కానీ అలాంటి పిచ్చి పనుల్ని ముస్లిం సమాజంలో అధికశాతం మంది ముస్లిములు సమర్ధించటం.
ఈ మధ్య కేరళ నుండి ఓ యువకుడు కాబా గృహానికి హజ్ చెయ్యటం కోసమని కాలి నడక మొదలెట్టాడు. అతని ఊరూరా కాలి నడకన వస్తూ ఉంటే వేల కొద్దీ ముస్లిములు అతనికి నీరాజనాలు పలుకుతున్నారు. అతనితో సెల్ఫీలు దిగేవారు కొందరైతే అతను చేస్తున్నది ఎంతో పెద్ద పుణ్యకార్యమని అతనిపై పూలు చల్లటాలు అతనితో కలిసి పాదయాత్రలు చెయ్యటం లాంటి పిచ్చిపనుల్ని మరి కొందరు ముస్లిములు చెయ్యటం వారి ఇస్లాం అవగాహనలోని డొల్లతనాన్ని ఎత్తి చూపుతుంది.
ఇలాంటి వార్తలు కొందరు ముస్లిములు సోషల్ మీడియాలో పోస్టు చేయగా “ఇదే అసలు హజ్” అని “మాషా అల్లాహ్” “అల్హందులిల్లాహ్” అని వందల్లో కామెంట్లు, వేలల్లో లైకులు షేర్లు చేస్తూ వారిపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు మరికొంత మంది ముస్లిములు. దీనిని బట్టి ముస్లిం సమాజంలో ఇస్లాం అనవగాహనాపరుల శాతం ఎంత ఉందో అంచనా కట్టవచ్చు.
నిజానికి తమను తాము హింసించుకుంటూ హజ్ చెయ్యమని ఇస్లాం ఎక్కడా ఆదేశించటం లేదు. ఒక్క హజ్ మాత్రమే కాదు నమాజ్ నుండి ఉపావాసాల వరకు ఏ క్రతువునైనా తమను తాము హింసించుకుంటూ ఆచరించమని ఎక్కడా చెప్పలేదు. పైగా దేశాలు దాటి కాలినడకన కాబాకు వస్తే అత్యధిక పుణ్యఫలం లభిస్తుందని కూడా ఏ హదీసులోనూ రాయబడి లేదు సరికదా కాలినడకన హజ్ కోసం దూరాల నుండి కాబాకు రావటాన్ని స్వయంగా ప్రవక్త ముహమ్మద్(స) వారే నిషేధించటం జరిగిందన్నది గమనార్హం.
ప్రవక్త ముహమ్మద్(స) శిష్యుల్లో ఒకరైన ఉక్బా బిన్ అమీర్ తన సోదరి కాబాకు కాలినడకన వస్తానని మొక్కుకున్నారని ఆయన ముందు ప్రస్తావించినప్పుడు “అలాంటి మొక్కుబడులు అల్లాహ్ కు అవసరం లేదు, మీ సోదరిని స్వారీ చేసి వెళ్లమని చెప్పండి (అబూదావూద్ 3297)” అని ఆదేశిస్తారు.
ఇదే విషయం మరొక హదీసులో “కాబా గృహానికి కాలినడకన వెళ్లటాన్ని అల్లాహ్ కోరుకోవటం లేదు, మీరు వాహనంపై ప్రయాణం చేసి వెళ్లండి (తిర్మిదీ 1536)” అని ఆదేశించటం జరిగింది.
ఒకానొక సందర్భంలో కాబా గృహానికి నడచి వస్తానని మొక్కుకున్న ఓ వృద్ధుడు తన ఇద్దరు కొడుకుల సహాయంతో కాబాకు నడచి వెళ్లటాన్ని ప్రవక్త ముహమ్మద్(స) వారు గమనించి “ఆ విధంగా అతను తనను తాను హింసించుకోవటం అల్లాహ్ కు ఏమాత్రం అవసరం లేదని వారించి అతన్ని వాహనమెక్కి ప్రయాణం చేసి కాబా గృహానికి వెళ్లమని ఆదేశిస్తారు (సహీహ్ బుఖారీ 1865)”
ముఖ్యంగా గమనించాల్సింది- హజ్ అన్నది కేవలం ఆర్థికంగా స్థితిపరులైతేనే చెయ్యటం విధి అవుతుంది తప్పితే అనారోగ్యంతో బాధపడేవారికి, హజ్ చేసేంత స్థితిపరులు కానివారికి అది ఎంతమాత్రం విధి కాదు. పైగా కాలినడకన దేశాలు దాటి వెళ్లటం అస్సలు విధి కాదు సరికదా పై హదీసుల ప్రకారం అలా చెయ్యటం నిషిద్ధం కూడా.
సంవత్సరాల తరబడి నడుచుకుంటూ దేశాలు దాటివెళ్లే విలువైన సమయాన్ని ప్రజలకు ఇస్లాం అవగాహన కల్పించటంలో వినియోగించటం దేవుని దృష్టిలో ఇంకా ఎంతో విలువైన పని అవుతుంది. పైకి చూడ్డానికి మనకు బాగా అనిపించే ఏ ఆరాధనా విధానమైనా ధర్మంలో లేనిదైతే అది ఆచరించటం తప్పవుతుంది.
ప్రవక్త (స) రాకడ ఉద్దేశమే ధర్మాన్ని సులభతరం చెయ్యటం!
“ఈ ప్రవక్త వారిపై మోపబడి ఉన్న బరువులను దించుతాడు. వారు బంధింపబడి ఉన్న శృంఖలాలను త్రెంచుతాడు” – ఖురాన్ 7: 157
పై ఖురాన్ వాక్యం ప్రవక్త ముహమ్మద్(స) రాకడలో ఉన్న ఒక మౌలిక ఉద్దేశాన్ని తెలుపుతుంది. అదేమిటంటే ధార్మిక పండితులు అతిశయానికిపోయి ధర్మంలో లేని మూఢాచారాలు, కట్టుబాట్లు, నియమ నిబంధనలను ప్రజలపై విధించి ధర్మాన్ని కఠినతరం చేసేసి ప్రజలను ఏ బరువుల క్రిందనైతే నొక్కిపెట్టి ఉంచారో, ఏ బానిస శృంఖలాల క్రిందనైతే వారిని బంధించి పెట్టారో వాటన్నిటి నుండీ ప్రవక్త ముహమ్మద్(స) విముక్తి కలిగిస్తారన్నది.
అసలుసిసలైన ధర్మాన్ని పరిచయం చేసి ధర్మంలో లేని పనికిమాలిన కల్పిత మూఢాచారాలు, కట్టుబాట్ల తాలూకు బరువులను ప్రజలపై నుండి దించి ధర్మాన్ని సులభతరం చెయ్యటం ప్రవక్త రాకడలోని లక్ష్యమైనప్పుడు ఇస్లాంలో లేని కఠిన కల్పిత ఆచారాలను తిరిగి ప్రవేశ పెట్టి ధర్మాన్ని కఠినతరం చెయ్యటం ఎంతవరకు సబబు?
ఇస్లాంలో లేని అతి పోకడలు
