జంతు బలి దానం

బక్రీద్ రోజున దైవ మార్గంలో ఒక ముస్లిం జంతు ‘బలి దానం (ఖుర్బానీ)’ ఇవ్వటం అన్న క్రతువు నిర్వహించేసినంత మాత్రానా అతను సత్కార్య స్థాయికి చేరుకున్నట్టేనా?

బక్రీద్ రోజు జంతు బలి ఇవ్వటం అన్నది దేనికి గుర్తు? ఒకనాడు ప్రవక్త ఇబ్రహీం(అలై) దైవమార్గంలో ఇచ్చిన బలికి ‘గుర్తు (Symbol)’గా నిర్వహించే క్రతువు మాత్రమే!

ఒక ముస్లిం జంతు బలిని ఇచ్చినంత మాత్రానా ఇంతకూ సృష్టికర్త అయిన దేవుడు కోరుకుంటున్నది ఏమిటి? ఆ జంతువుల రక్త-మాంసాలనా? కానే కాదు! మరేమిటి?

“వాటి (జంతువుల) మాంసమూ అల్లాహ్ కు చేరదు, వాటి రక్తమూ చేరదు. కానీ మీ భయభక్తులు ఆయనకు చేరుతాయి” ఖురాన్ – 22:37

పై వాక్యాన్ని బట్టి ఒక ముస్లిం భయభక్తుల వైఖరిని అవలంబించకుండా కేవలం నామమాత్రంగా జంతు బలి ఇవ్వటం అన్న క్రతువు నిర్వహించినంత మాత్రానా ఆ బలి దేవుని దృష్టిలో వ్యర్థమనే కదా అర్థం.

దీనిని బట్టి ఒక ముస్లిం జంతు బలిని ఇవ్వటంతో పాటు చేయవలసిన “ఖుర్బానీలు (త్యాగాలు)” ఏమిటో ఖురాన్ ఈ క్రింది విధంగా తెలియజేస్తుంది.

“మీరు అమితంగా ప్రేమించే వస్తువులను (దైవ మార్గంలో) ఖర్చుపెట్టనంత వరకూ మీరు సత్కార్య స్థాయికి చేరుకోలేరు” – 3:92

దీనిని బట్టి ఒక ముస్లిం బక్రీద్ రోజున ఇవ్వాల్సిన బలి కేవలం జంతువు మాత్రమే కాదు- అతను అమితంగా ప్రేమించే వాటిని త్యాగం చెయ్యగలగాలి అంటే-

అమితంగా ప్రేమించే ధనాన్ని త్యాగం చెయ్యాలి…

అమితంగా ప్రేమించే వస్తువులను త్యాగం చెయ్యాలి…

అమితంగా ఇష్టపడే ఆహార పదార్థాలను త్యాగం చెయ్యాలి…

వీటితో పాటు ఒక ముస్లిం –

ఇతరుల పట్ల కలిగుండే ఈర్ష్యా-ధ్వేషాలను బలి ఇవ్వాలి…

తోటి వ్యక్తుల పట్ల కలిగుండే ప్రతికూల ఆలోచనలను బలి ఇవ్వాలి…

తనలో ఉండే అహంకారాన్ని, గర్వాన్ని బలి ఇవ్వాలి…

వదులుకోలేని బలహీనతలను బలి ఇవ్వాలి…

చెడు కోరికలను, చెడు ఆలోచనలను బలి ఇవ్వాలి…

ఈ రకమైన వైఖరిని అవలంబించటమే దేవుని పట్ల భయభక్తులను కలిగి ఉండటం అవుతుంది. ఈ వైఖరి కలిగుండి ఇచ్చే బలులే దేవుని దృష్టిలో స్వీకరించబడతాయి.

తప్పితే ఈ రకమైన భయభక్తుల వైఖరి అవలంబించకుండా డబ్బులు వెచ్చించి ప్రతి సంవత్సరం జంతు బలి బలులు ఇచ్చుకుంటూ పోయినంత మాత్రానా అలాంటి బలులతో అల్లాహ్ కు అవసరం ఎంతమాత్రం ఉండదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *