రమజాన్ ‘ఘనంగా వీడ్కోలు’ పలకాల్సిన నెలా?

రమజాన్ ‘ఘనంగా వీడ్కోలు’ పలకాల్సిన నెల కాదు! కానీ, రంజాన్ ఇచ్చే తర్ఫీదును రాబోయే పదకొండు నెలల్లోనూ కొనసాగించటానికి ప్రతీ వ్యక్తీ తన జీవితంలో ‘ఘనంగా ఆహ్వానం పలకాల్సిన’ నెల. అవును రమజాన్ మాసంలో ఉపవాసాలు నేర్దేశించబడినవి ఆ ఒక్క నెలలో ఉపవాసాలు ఉండి, పుణ్యాలు సంపాదించుకుని రమజాన్ ను ఘనంగా వీడ్కోలు పలికేసి మిగతా పదకొండు నెలల్లో ఎలా పడితే అలా ఇష్టమొచ్చినట్లు నడుచుకొటానికి కాదు!

రమజాన్ తరువాత కూడా ఈ నెలలో పొందిన తర్ఫీదు, భయభక్తులను కొనసాగిస్తూ రాబోయే పదకొండు నెలల్లోనూ ఒక ఉపవాసి మాదిరిగా ఉత్తమ నైతిక విలువలతో జీవితం కొనసాగించాలి. అప్పుడే ఈ నెలంతా కఠినమైన ఉపవాసాలు ఉండటంలో ఒక అర్థం ఉంటుంది.
******

“ఉపవాసికి సంతోషం లభించే రెండు సందర్భాలున్నాయి. ఒకటి అతను ఉపవాసం విరమణ (ఇఫ్తార్) చేసినప్పుడు, రెండు- ప్రళయదినాన అతని ఉపవాసానికి బహుమానంగా తన ప్రభువును కలుసుకున్నప్పుడు” – ప్రవక్త ముహమ్మద్ (స) [సహీహ్ ముస్లిమ్ 1151]

ఈ హదీస్ ను బట్టి ‘ఉపవాసం’ మరియు ‘ఇఫ్తార్’ అనే రెండు సందర్భాలు అతి ప్రాముఖ్యమైన విషయాలను సూచిస్తున్నాయి. మొదటిది- ‘ఉపవాస సమయం (Fasting period)’ మనిషి పూర్తి జీవితాన్ని సూచిస్తే… రెండవది- ఇఫ్తార్ సమయం (Iftar Period) అన్నది పరలోకంలో లభించే ‘బహుమానాన్ని’ సూచిస్తుంది.

ఎలా అయితే ఒక విశ్వాసి ఉదయం నుండి సాయంత్రం వరకూ ఉపవాసం ఉండి, ఉపవాస విరమణ (ఇఫ్తార్) చేసినప్పుడు ఎలాంటి గొప్ప ఆనందానుభూతి పొందుతాడో.. అలాగే మనిషి, రమజాన్ నెలలో ఉపవాసం తాలూకు ‘నిష్ఠ’తో మిగతా నెలల్లోనూ నైతిక విలువలతో కూడిన జీవితాన్ని గడిపి పరలోకంలో గొప్ప ప్రతిఫలం పొందినప్పుడు సరిగ్గా అలాంటి ఆనందానుభూతినే పొందుతాడు. అందుకే పై హదీసులో ‘ఉపవాసికి రెండు సంతోషకర సందర్భాలున్నాయ’ని చెప్పటం జరిగింది
******

ఒక ఉపవాసి ఎలాంటి నడవడికను, ప్రవర్తనను ఈ ముప్పై రోజులూ కలిగి ఉంటాడో ఆలాగే అతను రాబోయే పదకొండు నెలల్లోనూ ఒక ఉపవాసిగా జీవితం గడపాలి. అదే రంజాన్ ఉద్దేశం.

‘ఉపవాసి’గా జీవితం గడపటం అంటే:-

చెడు పనులపై ఉపవాసం ఉండటం…
చెడు ఆలోచనలపై ఉపవాసం ఉండటం…
అతని విపరీత కోరికలపై ఉపవాసం ఉండటం…
తనకు ఇవ్వబడిన స్వేచ్ఛను దుర్వినియోగపరచటం నుండి ఉపవాసం ఉండటం…

అందుకే ప్రవక్త ముహమ్మద్ (స) ఒక హదీసులో- “ఉపవాస లక్ష్యం అన్న పానీయాలు విడనాడటం కాదు అబద్ధాన్ని విడనాడటం, చెడు పనులు చెయ్యకపోవటం, దుర్భాషలాడకపోవటం” అన్నారు.

మరొక హదీసులో ప్రవక్త ముహమ్మద్ (స) – “ఉపవాస స్థితిలో ఉండగా ఎవరైనా మిమ్మల్ని దూషిస్తే.. నేను ఉపవాసంలో ఉన్నాను అని చెప్పండి” అని చెబుతారు. దీనిని బట్టి ఉపవాసం అంటే- ఒక ముస్లిం కేవలం భోజన పానీయాల నుండి తన్నుతాను దూరంగా పెట్టటం మాత్రమే కాదు…

ఇతరుల పట్ల ప్రతికూలంగా ఆలోచించకపోవటం ఉపవాసం…
ఇతరులను దూషించకపోవటం ఉపవాసం…
ఇతరుల పట్ల చెడు ఆలోచించకపోవటం ఉపవాసం…

ఈ విధంగా రమజాన్ ఉపవాసాల నెల అన్నది మనిషి పూర్తి జీవితాన్ని నైతికంగా నియంత్రించే శిక్షణా కాలం (Training period) లాంటిది.

కాబట్టి రంజాన్ మాసం ప్రతీ సంవత్సరానికోసారి వస్తుంది. మీరు ఏ విధమైన ప్రపంచంలో జీవిస్తున్నారో గుర్తు చేస్తుంది. ఒక వ్యక్తి సకల చెడుల నుండి తన్ను తాను నియంత్రించుకుంటూ జీవితం ఎలా గడపాలో నేర్పి వెళుతూ ఉంటుంది.

కాబట్టి రంజాన్ ఒక విశ్వాసిని భౌతికంగా అన్న పానీయాలకు దూరంగా ఉంచటంతో పాటు చెడు విషయాల నుండి కూడా దూరంగా ఉంచి అతనికి నైతికంగా జీవించటానికి ప్రత్యేక శిక్షణ (Training) ఇచ్చే నెల అయితే… ఆ శిక్షణను పొంది రాబోయే నెలల్లో ప్రతీ చెడు నుండి దూరంగా ఉంటూ జీవిత కాల ఉపవాసి మాదిరిగా అతను మారిపోవాలి.

రమజాన్ నెలలో అన్నపానీయాలతో పాటు చెడు ఆలోచనలు, చెడు పనులకు ఎలా అయితే దూరంగా ఉంటాడో మిగతా నెలల్లో ఆహారపానీయాలు సేవిస్తూ ఉన్నప్పటీ చెడు ఆలోచనలు, చెడు పనులను దూరంగా ఉంచే ప్రక్రియను మటుకు జీవిత కాలం కొనసాగించాలి.

కాబట్టి ముస్లిం అంటే కేవలం ఒక్క ‘రమజాన్ మాసపు ఉపవాసి’గా కాక, ‘జీవిత కాల ఉపవాసి’గా మారిపోయి ఉత్తమ నైతిక విలువలతో కూడిన జీవితం గడపాలి. అప్పుడే ఒకవ్యక్తి నిజ ముస్లింగా దైవం దృష్టిలో పరిగణించబడతాడు. అలాంటి ఉత్తమ ముస్లిములుగా ఆ సృష్టికర్త అయిన దేవుడు అందరినీ మార్చాలని కాంక్షిస్తూ మీ అందరికీ ముందస్తు ‘ఈదుల్ ఫిత్ర్’ శుభాకాంక్షలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *