ఏదైనా లోపం ఉన్నప్పుడు దాన్ని సరిచెయ్యటానికి సంస్కరణ అవసరం అవుతుంది. ధార్మిక గ్రంథాల్లో ధర్మం ఇవ్వబడింది మనిషి తన వ్యక్తిత్వంలో లోపాలను సంస్కరించుకుని నైతికంగా జీవనం చెయ్యటానికి మాత్రమే!
ఇస్లాం అంతిమ లక్ష్యం మనిషి తన నడవడికను సంస్కరించుకోవాలన్నదే. ఇదే విషయం ఖురాన్ ఎంతో స్పష్టంగా…
“తన ఆత్మను పరిశుద్ధ పరచుకున్న వ్యక్తి సఫలుడయ్యాడు, దానిని అణచి వేసినవాడు విఫలుడయ్యాడు” – 91:10 అని చెబుతుంది.
దీనిని బట్టి ఇస్లాం ఆదేశాలను అనుసరించి మనిషి తన వ్యక్తిత్వాన్ని సంస్కరించుకోవాల్సి ఉంది. తప్ప ఇస్లాం ధర్మాన్ని సంస్కరించాల్సిన అవసరం, ఆస్కారం లేదు.
ఇస్లాం ప్రవక్త ముహమ్మద్ (స) స్థాపించిన ధర్మం అన్న అతిపెద్ద అపోహ చాలా మంది ముస్లిముల్లోనే ఉందంటే అతిశయోక్తి కాదు. ప్రవక్త ముహమ్మద్ (స) ఇస్లాం పునః స్థాపకుడే తప్ప వ్యవస్థాపకుడు కానేకాదు! పూర్వ ప్రవక్తల బోధలు, పూర్వ గ్రంథాలలోని సత్యాలన్నిటినీ ఖురాన్ తనలో తీసుకుంది. దీనిని బట్టి ఇస్లాం సర్వ కాలీకం.
చాలా మంది ఇప్పటి కాలానికి తగ్గట్టుగా మీరు ఇస్లాంను సంస్కరించుకోవాల్సిన అవసరం ఉందనే ఉచిత సలహా ఇస్తుంటారు. భవిష్యత్ కాలాల ప్రజలు అనుసరించే విధంగా ఖురాన్ లోని ఆదేశాలున్నాయన్న విషయం దానిని స్టడీ చేసేవారికే తెలుస్తుంది.
మార్కెట్ లో మనం కొనే ఎలాక్ట్రానిక్ గాడ్జెట్స్ తో పాటు ఒక Do’s and Don’ts పుస్తకం కూడా ఇవ్వబడుతుంది. అదెందుకంటే ఆ ఎలక్ట్రానిక్ వస్తువు ఎలా ఉపయోగించాలో తెలుపటానికి మాత్రమే! దానిని బట్టి ఆ వస్తువును ఉపయోగించాలి తప్ప మనకు ఉపయోగించటం చేతనైనట్టు ఆ Do’s and Don’ts పుస్తకాన్ని మార్చేయకూడదు కదా!
ఇక ప్రవక్త ముహమ్మద్ (స) అనంతరం ఏర్పడ్డ హనఫీ, షాఫయి, సలఫీ, హంబలీ అనే నాలుగు రకాల విధానాలు ఇస్లాంలో సంస్కరణల నిమిత్తం ఏర్పడ్డావి కావు. ఈ నాలుగు విధానాలను ఉనికిలోకి తెచ్చిన వారు ఇస్లాం సంస్కర్తలు కూడా కారు! ప్రవక్త ముహమ్మద్ (స) జీవించి ఉండగా వివిధ దశల్లో ఆయన సున్నత్ (ఆచరణ) కు సంబంధించిన సమాచారం, వివిధ కాలాల్లో ఆయన చెప్పిన బోధలు (హదీసులు) సేకరించినప్పుడు ఏర్పడ్డ నాలుగు రకాల వర్గీకరణలు మాత్రమే! ఈ నాలుగు విధానాల్లో ఏవో కొన్ని చిన్న చిన్న మార్పులు మినహా ఏ విధానాన్ని తీసుకున్నా ఖురాన్, హదీసులకు లోబడే ఉంటాయి.
ఆ తరువాత ఏర్పడ్డ తబ్లిగ్ జమాత్, అహ్లె హదీస్, జమాతే ఇస్లామీ హింద్ వగైరా జమాత్ (సంఘాలన్నీ) ముస్లిం సమాజాన్ని వివిధ కోణాల్లో, పద్దతుల్లో సంస్కరించటానికి ఏర్పడ్డావే తప్ప ఇస్లాంను పునరుద్ధరించటానికో, సంస్కరించటానికో ఏర్పడ్డావి కావు. ఈ సంఘాలన్నీ ఏకగ్రీవంగా అనుసరించే గ్రంథం ఒక్కటే అది ఖురాన్.
కాబట్టి ఇప్పటి ఆధునిక కాలానికి ఇప్పుడున్న సామాజిక వాతావరణానికి తగ్గట్టుగా ఇస్లాంను సంస్కరించుకోవాల్సి ఉందని ఉచిత సలహా ఇచ్చేవారు ఇస్లాంను ఒకసారి స్టడీ చేస్తే అది నేటి ఆధునిక కాలంలో సైతం అనుసరణకు వీలుగా ఎంత సులువైన ధర్మమో, అందులో చెప్పబడిన ఆదేశాలు అన్ని కాలాల్లోనూ పాటించటానికి ఎంత అనువుగా ఉన్నాయో అర్థమవుతుంది.
నిజంగా ఇస్లాం ఈ కాలంలో అనుసరించటానికి సరిపోని అవుట్ డేటెడ్ ధర్మమే అయితే ఇస్లాం ఎప్పుడో చరిత్రలో కనుమరుగైపోయి ఉండేది. నేడు ప్రపంచంలో అనేకమంది ప్రముఖులచే మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేగంగా ఆధునీకులు, విద్యావంతుల ద్వారా అంగీకరించబడుతూ ఉన్న ధర్మం కూడా ఇస్లామే.
కొందరు చెబుతున్నట్టు ఇస్లాం ఇప్పటి కాలానికి తగ్గట్టుగా లేని అవుట్ డేటెడ్ ధర్మమే అయితే, ఇస్లాంను నేడు అనేకమంది స్వీకరించటం మాట అలా ప్రక్కన పెడితే దాన్ని ఎప్పుడో అందరూ విడిచిపెట్టేసి ఉండేవారు.
