ముస్లిములు తమ బాధ్యతను గుర్తిస్తున్నారా? Part – 3

సార్వత్రిక ముస్లిం సమాజం నేడు ఎదుర్కుంటున్న అనేక సమస్యలు, దౌర్జన్యాల నుండి కాపాడబడాలన్నా, దైవానుగ్రహం పొందాలన్నా మరియు ముస్లిం సమాజం భౌతికంగా అభివృద్ధి చెందాలన్నా దానికి తక్షణం చెయ్యల్సిన నాలుగు పనులున్నాయి.

1. ఖురాన్ మోపుతున్న మౌలిక బాధ్యతను గుర్తించాలి

“ఇక నుండి ప్రపంచంలో మానవులకు మార్గం చూపటానికీ, వారి సంస్కరణకూ రంగంలోకి తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరే (ముస్లిములే). మీరు మంచి చేయండి అని ఆజ్ఞాపిస్తారు. చెడు నుండి ఆపుతారు. ఆల్లాహ్ ను విశ్వసిస్తారు” – 3:110

ఈ వాక్యాన్ని బట్టి అసలు ముస్లిం సమాజ నియామక లక్ష్యమే మానవులకు మార్గం చూపటం, సమాజ సంస్కరణ అని తెలుస్తుంది. వారు సమాజంలో “మంచి చేయండి అని ఆజ్ఞాపిస్తారు. చెడు నుండి ఆపుతారు”.

అంటే పనులన్నీ మానేసి కేవలం ధర్మ ప్రచారం చేస్తూ కూర్చోమని కాదు. వారు భౌతిక జీవనంలో ఉద్యోగాలు, చదువులు, వ్యాపారాలు చేస్తూనే తమ సమయాన్ని తమ పరిసరాల్లో నివసించే, తమ పొరుగున ఉండే ముస్లిమేతరులకు సర్వమానవుల మతాలు, కులాలు వేరైనా అందర్నీ సృష్టించిన దేవుడు ఒక్కడే అని ఆయన హిందూ శాస్త్రాల్లో సర్వేశ్వరుడిగా, బైబిల్లో యాహ్వేగా, ఖురాన్ లో అల్లాహ్ గా పిలువబడ్డాడని, అలాగే కులమతాలు వేరైనా మానవులంతా ఒకే జంట సంతానమన్న విషయాన్ని అన్ని ధార్మికగ్రంథాలూ ఏకగ్రీవంగా ప్రకటిస్తున్నాయని, అలాగే సకల మానవుల ధర్మం ఒక్కటే అని ఆ ధర్మం వైదిక ధర్మంగా, సనాతన ధర్మంగా, ఇస్లాంగా అనేక కాలాల్లో బోధించబడిందన్న విషయాన్ని స్పష్టపరచాలి. తద్వారా సమాజంలో మతసామరస్యం సైతం స్థాపించబడుతుంది.

ఈ పని చెయ్యటం ప్రతీ ముస్లిం ప్రాథమిక బాధ్యత. ఈ పని చేస్తున్నంత కాలం ముస్లిం సమాజం పై ప్రమాదం ఎటునుండి వచ్చినా రక్షణ కవచంగా అల్లాహ్ కారుణ్యం ఉంటుంది. లేదంటే అల్లాహ్ తరఫునే శాపం వచ్చి పడుతుంది.

“నిశ్చయంగా, ఎవరైతే మేము అవత రింపజేసిన స్పష్టమైన బోధనలను, మార్గదర్శకత్వాలను – ప్రజల కొరకు దివ్య గ్రంథంలో స్పష్టపరచిన పిదప కూడా – దాచుతారో! వారిని అల్లాహ్‌ తప్పక శపిస్తాడు (బహిష్కరిస్తాడు). మరియు శపించగలవారు కూడా వారిని శపిస్తారు. (2:159)

2. ధర్మంలో మనకు అనుకూలంగా ఉన్నవాటిని అనుసరించటం మానెయ్యలి

ధర్మంలో మనకు అనుకూలంగా ఉన్న అంశాల్ని అనుసరిస్తూ మిగతావాటిని వదిలి పెట్టటం అన్నది జాతి నాశనానికి కారకం అవుతుంది. ఉదాహరణకు: ఖురాన్ ఐదు పుట్లా నమాజ్ చదవమన్నప్పుడు ఉద్యోగాలు, వ్యాపారాల వల్ల సాధ్యం కాదని శుక్రవారం మాత్రమే వెళ్లటం ధర్మాన్ని మనకు అనుకూలంగా మార్చేసుకోవటం అవుతుంది. అలాగే ఖురాన్, పురుషులకు మహార్ ఇచ్చి పెళ్లి చేసుకొమంటే మహార్ (కట్నం) ఎదురు తీసుకుని పెళ్లి చేసుకోవటం ధర్మాన్ని మనకు అనుకూలంగా మార్చేసుకోవటం అవుతుంది. ఖురాన్ లో అల్లాహ్ ఒక్క నన్ను తప్ప ఎవర్నీ వేడుకోవద్దని చెబుతుంటే దర్గాలు, సమాధుల వద్ద ప్రార్థిస్తే సిఫారసు లభిస్తుందని, వేడుకోళ్లు స్వీకరించబడతాయని ఎవరో చెబితే ఖురాన్ ఆదేశాన్ని తుంగలో త్రొక్కేయటం ధర్మాన్ని మనకు అనుకూలంగా మార్చేసుకోవటం అవుతుంది.

ముస్లిం సమాజంలో ఎవరైనా ఖురాన్ ఆదేశాలను ప్రక్కన పెట్టి స్వంత ఆలోచనల ఆధారంగా నడుచుకుంటూ ధర్మంలో అనుకూలంగా ఉన్నవాటిని అనుసరిస్తూ మిగతావాటిని వదిలి పెట్టేయటం మానెయ్యలి. ఒక్క మాటలో చెప్పాలంటే ముస్లిములు తమ ఆలోచనలను బట్టి ధర్మాన్ని మార్చేసుకోకూడదు. కానీ, ధర్మాన్ని బట్టి తమ ఆలోచనలను మార్చుకోవాలి.

3. ముస్లిం సమాజంలో జమాతులన్నీ అనైక్యతను విడిచి ఐక్యమవ్వాలి

సమాజంలో మనకు నచ్చిన జమాత్ లను, మనకు నచ్చిన వ్యక్తులను సమర్థించటం మనకు నచ్చని తోటి జమాత్ వర్గాలకు చెందిన ముస్లిములను హీనంగా చూడటం, శత్రువులుగా భావించి వారిని దూరం పెట్టటం, ముస్లిం సమాజంలో వ్యక్తులు అనేక సంఘాలుగా విడిపోయి ఒకరికొకరు సహకరించుకోకపోవటం అన్నది సార్వత్రిక ముస్లిం సమాజానికే అది ఎంతో ప్రమాదకరం. ఇదే విషయాన్ని అల్లాహ్ ఈ క్రింది విధంగా తెలియజేస్తున్నాడు.

“సత్యతిరస్కారులు పరస్పరం సహాయం చేసుకుంటారు. ఒకవేళ మీరు పరస్పరం సహాయం చేసుకోకపోతే భూమిపై హింసా దౌర్జన్యాలూ, అల్లకల్లోలమూ చెలరేగుతాయి” – 8:73

అసలు ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సమాజంపై విరుచుకుపడుతున్న అనేక సమస్యలకు, జరుగుతున్న దౌర్జన్యాలకు అసలు కారణం ముస్లిం సంఘాల మధ్య ఐక్యత లేకపోవటం. ఐక్యత లేనప్పుడు ముస్లిం సమాజం ఎంతపెద్దదైనా శత్రువులకు దానిపై దౌర్జన్యం చెయ్యటం ఎంతో సులువవుతుంది. అదే విషయం అల్లాహ్ పై వాక్యంలో చెబుతున్నాడు. అల్లాహ్ చెప్పిందే నేడు ముస్లిం సమాజంలో జరుగుతుంది.

కాబట్టి ఇతర మతావర్గాల నుండి సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే ఐక్యమవ్వటం కాదు. సమస్య రానప్పటికీ ముస్లిం సమాజంలో ఎన్ని జమాతులు ఉన్నా వారి విధానాలు వేరు వేరుగా ఉన్నా వారి జమాత్ ఐడెంటిటీలను చెరిపేసుకోనక్కర్లేదు. అన్ని జమాత్ సభ్యులు కలిసి కట్టుగా ఉంటూనే సహాయ సహకారాలు అందించుకోవాలి. తద్వారా ముస్లిం సమాజం పటిష్టం అవుతుంది. లేదంటే ఖురాన్ చెబుతున్నట్టే “హింసా దౌర్జన్యాలూ, అల్లకల్లోలమూ చెలరేగుతాయి”.

4. ముస్లిం సమాజం విద్యారంగంలో అభివృద్ధి చెందాలి

ఒకప్రక్క ముస్లిం సమాజంలో ప్రతీఒక్కరూ ఖురాన్ తమపై మోపుతున్న బాధ్యతలను నిర్వర్తిస్తూనే.. ‘విద్య’ (Education) కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ విషయంలో ముస్లిం సమాజం ఎంతో వెనుకబడి ఉంది అంటే అది అతిశయోక్తికాదు.
నైతికంగా ఎదగటానికి ఖురాన్ అనుసరణ ఎంత ముఖ్యమో, భౌతిక జీవనంలో అభివృద్ధి చెందటానికి ఉన్నత విద్యకు ప్రాధాన్యత ఇవ్వటం కూడా అంతే ముఖ్యం. కాబట్టి ముస్లిములు ప్రతీ ఒక్కరూ తమ పిల్లల్ని ఐదో క్లాసు, పదో క్లాసు తరువాత పూటగడిస్తే చాలు పెద్ద చదువులు అవసరం లేదని చదువు మాన్పించేసి ఏవో చేతిపనుల్లో పెట్టేయటం వల్ల ముస్లిం సమాజంలో నిరక్ష్యరాస్యులతో కూడిన మంది పెరుగుతుంది తప్ప వారివల్ల ముస్లిం సమాజం విద్యా, వైజ్ఞానిక, ఆర్థిక, శాస్త్రీయ, వ్యాపార, రాజకీయ రంగాల్లో ఏ విధంగానూ అభివృద్ధి చెందలేదు. కాబట్టి ముస్లిం సమాజంలో ప్రతీ ఒక్కరూ ఉన్నత చదువులకు (Higher education) ప్రాధాన్యత ఇవ్వాలి.

నేడు ముస్లిం సమాజంపై విరుచుకుపడుతున్న సమస్యల నుండి తప్పించబడాలన్నా ముస్లిములు అల్లాహ్ అనుగ్రహం పొందాలన్నా తక్షణం ఎవరికి వారే వ్యక్తిగత సంస్కరణతో పాటు, సామాజిక సంస్కరణ పట్ల నడుం బిగించాలి. అలాంటి ముస్లిములు తప్ప అందరూ నష్టానికి గురై ఉన్నవారే. ఇదే విషయాన్ని ఖురాన్ ఈ క్రింది విధంగా హెచ్చరిస్తుంది.

“నిస్సందేహంగా మానవుడు పెద్ద నష్టానికి గురై ఉన్నాడు. విశ్వసించి సత్కార్యాలు చేస్తూ ఉండేవారు, ఒకరికొకరు సత్యోపదేశం, సహాన బోధ చేసుకునేవారు తప్ప” – 103: 1-3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *