“యదార్థం ఏమిటంటే, ఒక జాతి స్వయంగా తన లక్షణాలను మార్చుకోనంతవరకు అల్లాహ్ దాని స్థితిని మార్చడు. అల్లాహ్ ఒక జాతిని తన శిక్షకు గురిచేసే నిర్ణయం తీసుకున్నప్పుడు దానిని ఎవరు తొలగించదలచుకున్నా అది తొలగదు” – 13:11
ఒక జాతి స్వయంగా తన లక్షణాలను మారుకోవటం అంటే ఏమిటి?
పతనావస్థకు చేరుకున్న ఒక జాతి తిరిగి ఉన్నత స్థితికి రావాలన్నా ఆజాతిపై వచ్చిపడే శిక్షలు లేదా తీవ్రమైన సమస్యలు తొలగిపోవాలన్నా ఆ జాతి తక్షణం చెయ్యల్సింది స్వయంగా తన లక్షణాలను మార్చుకోవటం మాత్రమే అని ఖురాన్ చెబుతుంది.
దీనిని బట్టి పతనావస్థకు చేరుకున్న జాతి తన లక్షణాలను గనుక మార్చుకుంటే తిరిగి అది మంచి స్థితికి చేరుకునే అవకాశం ఉందనే విషయం ఇక్కడ స్పష్టమవుతుంది.
ఒక జాతి మొత్తం తన లక్షణాలు మార్చుకోవటం అన్నది ఆ జాతిలో ఉన్న ప్రతీ ఒక్కరూ 1. వ్యక్తిగత సంస్కరణ 2. సామాజిక సంస్కరణ అనే రెండు ప్రధాన బాధ్యతలను నిర్వర్తించటంపై మాత్రమే ఆధారపడి ఉంటుంది.
వ్యక్తిగత సంస్కరణ అంటే:
A. తమ ఆరాధనల పట్ల నిర్లక్ష్యం వహించకపోవటం B. తమ విశ్వాసాలను ఖురాన్ ఆదేశాల ప్రకారం సంస్కరించుకుని, చెడు అలవాట్లను మానుకోవటం C. తలిదండ్రుల, బంధువుల, బీదసాదల, పొరుగువారి హక్కులు చెల్లించటం వగైరా. ఇవి సమాజంలో ప్రతీ ఒక్కరూ ఎవరికి వారే వ్యక్తిగతంగా సంస్కరించుకోవలసిన అంశాలు. ఈ విషయంలో ఖురాన్ హెచ్చరిక – “తన ఆత్మను పరిశుద్ధ పరచుకున్న వ్యక్తి సఫలుడయ్యాడు, దానిని అణచి వేసినవాడు విఫలుడయ్యాడు” – 91:10
సామాజిక సంస్కరణ అంటే:
B. సమాజంలో మంచిని ఆదేశించటం, చెడును నిరోధించటం మరియు దైవధర్మాన్ని ప్రజలలో సర్వసామాన్యం చెయ్యటం. B. విశ్వాసుల మధ్య నైతికత-ఐక్యతల కొరకు పాటు పడటం
ఒక జాతి తన లక్షణాలను మార్చుకోవటం అన్నది పైన పేర్కొనబడిన అంశాలన్నిటి పై ఆధారపడి ఉంటుంది. ఇక్కడొక సందేహం రావొచ్చు. ముస్లిం సమాజ లక్ష్యం కేవలం వ్యక్తిగత-సామాజిక సంస్కరణ మాత్రమేనా? విద్యా,వైజ్ఞానికా, ఆర్థిక, రాజకీయ రంగాల్లోనూ ముందుకెళ్లాల్సిన పని లేదా? అని. కచ్చితంగా ప్రతీ ముస్లిం విద్యా,వైజ్ఞానికా, ఆర్థిక, రాజకీయ అన్ని రంగాల్లోనూ అభివృద్ది చెండాల్సిందే కానీ, దానితో పాటు అదనంగా అతనిపై ఖురాన్ మోపుతున్న బాధ్యతను కూడా అతను నిర్వర్తించాల్సి ఉంటుంది.
ఎందుకంటే…
“ముస్లిం” అన్నది ఐడెంటిటీ కాదు! బాధ్యతాయుత హోదా!
“ఇక నుండి ప్రపంచంలో మానవులకు మార్గం చూపటానికీ, వారి సంస్కరణకూ రంగంలోకి తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరే (ముస్లిములే). మీరు మంచి చేయండి అని ఆజ్ఞాపిస్తారు. చెడు నుండి ఆపుతారు. ఆల్లాహ్ ను విశ్వసిస్తారు” – 3:110
ఖురాన్, ముస్లిం సమాజంపై మోపుతున్న పై బాధ్యతలను సంపూర్ణంగా నిర్వర్తిస్తుందా? అన్నదే ఇక్కడ గమనించాల్సిన విషయం. దీనికి సమాధానం – ముస్లిం సమాజంలో ఏ కొందరో తప్ప అధిక శాతం మంది ఈ బాధ్యత నుండి దూరమైపోయారన్నది నిర్వివాదం.
ఇది చదవటానికి కాస్త ఇబ్బంది కలిగించే అంశమైనా ఇక్కడ నిజాన్ని ఒప్పుకోక తప్పదు. ముస్లిములు కంటే ముందు సామాజిక సంస్కరణ బాధ్యతను ఒకప్పుడు అల్లాహ్, యూదులకు అప్పజెప్పాడన్న విషయం ఖురాన్ చదివే ప్రతీ ముస్లింకూ ఎరుకే! వారికోసం ఎంతోమంది ప్రవక్తలను, గ్రంథాలను పంపాడు. కానీ, వారు సైతం పాపంచిక ధ్యాసలో పడిపోయి తమకు ఇవ్వబడిన బాధ్యతను మరచిపోయినప్పుడు వారిని ఆ బాధ్యత నుండి తప్పించి, ప్రవక్త ముహమ్మద్(స) అనుచరులకు సామాజిక సంస్కరణ బాధ్యతను అప్పగించాడు. వారికి సకల శుభాలు కల ఖురాన్ గ్రంధాన్ని ప్రసాదించాడు. ఇచ్చి ఏమంటున్నాడంటే…
“విశ్వాసులరా! మీలో ఎవరైనా ధర్మం నుండి వైదొలగిపోతేపోవచ్చు. అల్లాహ్ ఇంకా ఎంతో మందిని సృష్టిస్తాడు. అల్లాహ్ వారిని ప్రేమిస్తాడు. వారు అల్లాహ్ ను ప్రేమిస్తారు” – 5:54
ధర్మం నుండి వైదొలగిపోవటం అంటే ఇస్లాం వదిలిపెట్టేయటం అని మాత్రమే కాదు ముస్లిముల ఇంట పుట్టి, పైకి ఉర్దూ/అరబిక్ పేర్లు పెట్టుకున్నప్పటికీ ఒకవేళ వారిపై ఖురాన్ మోపుతున్న బాధ్యతలను వారు నిర్లక్ష్యం చేస్తూ, ఖురాన్ ఆదేశాలకు భిన్నంగా తమ ఇష్టమొచ్చినట్లు నడుచుకునే ముస్లిములు సైతం ధర్మం నుండి వైదొలగిపోయిన వారి జాబితాలోకే పరిగణించబడతారు. అలాంటి నేపథ్యంలో అల్లాహ్ ముస్లిములకు చేస్తున్న హెచ్చరిక- “ఒకవేళ మీరు విముఖులైతే, అల్లాహ్ మీ స్థానంలో మరో జాతిని దేన్నైనా తీసుకువస్తాడు. వారు మీవంటి వారై ఉండరు” – 47:38
కాబట్టి తక్షణం ముస్లిం సమాజం చెయ్యాల్సిందేమిటి?
ఒకప్రక్క ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సమాజంపై ఇస్లామోఫోబియా రూపంలో విరుచుకుపడుతున్న అనేక సమస్యలు, మరోప్రక్క మత విద్వేష రాజకీయాలు నడుపుతున్న నాయకులు, వారి భక్త గణం నుండి ఎదురవుతున్న అనేక హింసా, దౌర్జన్యాలు ఒక్కసారిగా విరుచుకు పడటం ఒకవేళ దైవాగ్రహమే గనుక అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికైనా సార్వత్రిక ముస్లిం సమాజం మేల్కొని, దైవానుగ్రహాన్ని పొందటానికి మరియు ముస్లిం సమాజం అభివృద్ధి చెందటానికి తక్షణం చెయ్యల్సిన నాలుగు పనులున్నాయి.
లేదంటే పరిస్థితులు ఒక్కసారి చేజారిపోయాక ఇక చేసేదేమీ ఉండదు.
(ఇంకా ఉంది)
ముస్లిములు తమ బాధ్యతను గుర్తిస్తున్నారా? Part – 2
