అనగనగా ఒక జాతి ఉండేది. ఆ జాతిని అల్లాహ్ ఎంతో అనుగ్రహించాడు. వారికోసం ప్రవక్తలనూ, ధర్మశాస్త్రాన్నీ అవతరింపజేశాడు. అంతేకాదు, అల్లాహ్ ఆ జాతిని ప్రపంచ ప్రజలను సంస్కరించే ఉత్తమ జాతిగా ఎన్నుకున్నాడు కూడా. వారికి ఇతర జాతుల కంటే ఎన్నో అనుగ్రహాలను ప్రసాదించాడు.
కాలక్రమేణా ఆ జాతి ప్రజలు తమకు ఇవ్వబడిన బాధ్యతను నిర్లక్ష్యం చేస్తూ పోయారు. ధర్మశాస్త్రంలోని ఆదేశాలను అతిక్రమిస్తూ ధర్మాన్ని వదిలిపెట్టి క్రమంగా పూర్తిగా ప్రపంచంలో మునిగిపోయారు. తమ ఇష్టానుసారంగా నడుచుకోవటం మొదలెట్టారు. తరువాత వారికి ఆపదలు చుట్టుముట్టటం మొదలయ్యాయి. వారిపై ఇతర జాతుల నుండి అనేక హింసలు, దౌర్జన్యాలు ఎదురయ్యాయి. ఇంకా వారిపై క్రూరులైన నాయకులు ఆధికారులుగా నియమించబడ్డారు.
అయినప్పటికీ తమను అల్లాహ్ కాపాడుకుంటాడన్న అపోహలో ఆ జాతి మునిగి ఉండేది. ఆ జాతి ప్రజలు క్రమంగా దైవాగ్రహానికి గురైపోతున్నామన్న విషయాన్ని గుర్తించలేకపోయేవారు. చివరకు ఆ జాతి ప్రజలు అల్లాహ్ శాపానికి గురై ఉన్న దేశం నుండే వెళ్లగొట్టబడిన తరువాత వారి స్థానంలో అల్లాహ్ మరొక జాతిని లేపాడు.
ప్రపంచ ప్రజలను సంస్కరించే బాధ్యతను ఆ క్రొత్త జాతికి ఇస్తూ వారి కోసం ఒక ప్రవక్తను పంపాడు, ధర్మశాస్త్రాన్ని కూడా ఇచ్చాడు. ఆ ప్రవక్తే ముహమ్మద్(స). ఆయన ద్వారా ఇవ్వబడిన గ్రంథమే ఖురాన్. దైవాగ్రహానికి గురైన ఒకప్పటి జాతే యూదులు. వారి స్థానంలో ఎన్నుకోబడ్డ క్రొత్త జాతి ప్రజలే ముస్లిములు.
యూదుల స్థానంలో ప్రపంచ ప్రజలను సంస్కరించే ఉత్తమ జాతిగా ముస్లిములను ఎన్నుకున్న తరువాత వారికి స్వయంగా అల్లాహ్ చేస్తున్నదే ఈ క్రింది హెచ్చరిక..
ఒకవేళ మీరు విముఖులైతే, అల్లాహ్ మీ స్థానంలో మరో జాతిని దేన్నైనా తీసుకుని వస్తాడు. వారు మీ వంటి వారై ఉండరు” – 47:38
దీనిని బట్టి ఒకవేళ ముస్లిం సమాజం సైతం తన మౌలిక బాధ్యతను మరచిపోతే గతంలో యూదులు దైవాగ్రహానికి గురైపోయి తమకివ్వబడిన గొప్ప స్థానం నుండి ఎలా అయితే కొట్టివెయ్యబడ్డారో అలాగే ముస్లిం సమాజం సైతం తన బాధ్యతను మరచిపోతే దైవాగ్రహానికి గురైపోతుంది. అల్లాహ్, ముస్లిం సమాజం స్థానంలో మరొక క్రొత్త జాతిని తీసుకొస్తాడన్న విషయం తేటతెల్లమవుతుంది.
******
వ్యక్తిగతంగా ఎవరిపైనైనా ఏదైనా సమస్య వచ్చిపడటం వేరు, పూర్తి సమాజంపై మూకుమ్మడిగా సమస్యలు వచ్చిపడటం వేరు. దేశవ్యాప్తంగా సార్వత్రిక ముస్లిం సమాజంపై అనేక దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్న ప్రస్తుత నేపథ్యంలో ప్రతీ ముస్లిం ఆత్మ పరిశీలన చేసుకోవలసిన సమయం ఇది.
అసలు ముస్లిం సమాజంపై వచ్చిపడే సమస్యలకు మూల కారణం తెలుసుకోకుండా “నాడు అల్లాహ్, ముసాను కాపాడుకున్నట్లే నేడు ముస్లిం సమాజాన్ని రక్షించుకుంటాడని” ఫేస్బుక్కుల్లో వ్యాసాలు రాసుకుంటూ.. “అల్లాహ్ యే ముస్లిములను రక్షించుకుంటాడని” కొటేషన్లు రాసుకుని టైంపాస్ చేస్తూ పగటి కలల్లోనే కాలం గడిపేస్తే నాడు యూదుల విషయంలో జరిగిందే నేడు ముస్లిం సమాజం విషయంలోనూ జరుగుతుందనటం అతిశయోక్తి కాదు.
నిజంగా ఏదైనా ఒక జాతి అల్లాహ్ ఆదేశాల ప్రకారం నడుచుకుంటూ ఉన్నట్లైతే దానిపై ఏదైనా సమస్యలు వచ్చిపడితే అవి అల్లాహ్ తరఫు నుండి పరీక్షలవుతాయి. అప్పుడు ఆ సమస్యల నుండి తప్పించటం అన్నది అల్లాహ్ తరఫు నుండే జరుగుతుంది.
కానీ, ఆ జాతి మొత్తం గనుక దానికి ఇవబడిన మౌలిక బాధ్యతలను మరచిపోయి, దైవాదేశాలను నిర్లక్ష్యం చేస్తూ నిద్రావస్థలో గడుపుతూ ఉంటే ఆ జాతిపై వచ్చిపడే సమస్యలు అల్లాహ్ తరఫు నుండి శిక్షలవుతాయి.
ఒకవేళ ఆ జాతి మేల్కొని తనను తాను సంస్కరించుకుంటే ఆ జాతిని ఆ సమస్యల సుడిగుండం నుండి తప్పించేవాడు, సహాయం చేసేవాడు కూడా ఒక్క అల్లాహ్ తప్ప మరొకడు ఉండడు. ఇదే విషయం ఖురాన్ ఈ క్రింది విధంగా స్పష్టపరుస్తుంది.
“యదార్థం ఏమిటంటే, ఒక జాతి స్వయంగా తన లక్షణాలను మార్చుకోనంతవరకు అల్లాహ్ దాని స్థితిని మార్చడు. అల్లాహ్ ఒక జాతిని తన శిక్షకు గురిచేసే నిర్ణయం తీసుకున్నప్పుడు దానిని ఎవరు తొలగించదలచుకున్నా అది తొలగదు” – 13:11
ఇంతకూ ఒక జాతి స్వయంగా తన లక్షణాలను మారుకోవటం అంటే ఏమిటి?
(ఇంకా ఉంది)
ముస్లిములు తమ బాధ్యతను గుర్తిస్తున్నారా? Part – 1
