“హలాల్” వెనుక కుట్ర కోణం ఉందా?

స్వయంగా పరేశ్ రావల్ లాంటి సినీనటుడే “హ్యాష్ ట్యాగ్ బాయ్ కాట్ హిమాలయా” అంటూ ట్విట్టర్లో ట్వీట్ పెట్టటాన్ని బట్టి ప్రస్తుతం హిందూ-ముస్లిం విద్వేషం ఏ స్థాయిలో అన్ని వైపులా నుండీ రెచ్చగొట్టబడుతుందో అంచనా వెయ్యవచ్చు.
హిమాలయా కంపెనీ ఒక ముస్లిం స్థాపించాడని, వాటి ప్రొడక్ట్స్ హలాల్ సర్టిఫికేషన్ తో ఉన్నాయి కాబట్టి హిమాలయా ప్రొడక్ట్స్ ను నిషేధించాలని సోషల్ మీడియాలో పోస్టులు జోరందుకున్నాయి. ఇదెంత అజ్ఞానమో తెలుసుకునే ముందు కొన్ని విషయాల్ని తెలుసుకోవాలి.

• ‘హలాల్’ అంటే ఏమిటి?

తినటానికి/వాడుటకు యోగ్యమైన లేదా అనుమతి ఉన్న (Permissible) వాటిని ‘హలాల్’ అని అంటారు. “హలాల్” చెయ్యటం అంటే- 1. హానికర పదార్థాలను తొలగించి.. 2. తినటానికి/వాడుటకు యోగ్యమైనదిగా చేయటం అని అర్థం.
ఉదాహరణకు- ఆల్కహాల్, చచ్చిన జంతువు, పంది మాంసం, రక్తం వగైరా సేవించటానికి యోగ్యం కానివి ధార్మిక గ్రంథాల ప్రకారం ‘నిషేధింపబడ్డాయి’. మెడికల్ సైన్స్ సైతం ఈ పదార్థాలు అనారోగ్యం కలుగజేస్తాయని చెబుతుంది. కాబట్టి ఇవి ‘హరామ్ (Forbidden)’ పదార్థాలు.

• ‘హలాల్ సర్టిఫికేషన్’ దేనికి?

“హలాల్ సర్టిఫై ఫుడ్స్ (Halal Certified Foods)” అంటే- “హానికరమైన పదార్థాలు లేని అత్యుత్తమ ప్రమాణాలతో శుద్ది (Purify) చెయ్యబడిన వస్తువులు/పదార్థాలు” అని అర్థం. ఒక్క మాంసాహార ఎగుమతులపైనే కాక బిస్కెట్లు, కేకులు, ఐస్ క్రీమ్స్, పిజ్జాలు ఇంకా కాస్మోటిక్స్ కొన్ని రకాల మెడిసిన్స్ వగైరా వాటి మీద కూడా ‘హలాల్’ సర్టిఫికేషన్ ఉంటుంది. వాటిలో ‘ఆల్కహాల్’ను కలుపలేదని, ఇంకా ‘గ్లిసరిన్’ ‘జిలాటిన్’ లాంటి పదార్థాలు హానికరమైన ‘పంది కొవ్వు’ నుండి సేకరించినవి కాదని నిర్ధారించటానికి మాత్రమే ‘హలాల్’ సర్టిఫికేషన్ తీసుకోవటం తప్పనిసరి అవుతుంది.

• ‘హలాల్ సర్టిఫికేషన్’ తీసుకోవటం మాఫియానా?

“హలాల్” పదార్థాలను/వస్తువులను అమ్మేది కేవలం ముస్లిం కంపెనీలు మాత్రమే అన్నది ‘హలాల్’ వస్తువులను నిషేధించాలని నిరసన చేస్తున్నవారు ఊహించుకునేది. దానికి ఉదాహరణ ‘హిమాలయా ప్రొడక్ట్స్ ను నిషేధించాల’ని సోషల్ మీడియాలో గోల చెయ్యాటమే!

వీరందరికీ తెలీని విషయమేమిటంటే- ఒక్క ‘హిమాలయా’ కంపెనీ మాత్రమే కాదు .. ‘ఆదానీ’, ‘రిలయన్స్’ ప్రొడక్ట్స్ సైతం హలాల్ సర్టిఫికేషన్ తో విక్రయించబడుతూ ఉంటాయన్నది.

అంతేకాదు, ‘టాటా కన్స్యూమర్ & కెమికల్ ’ ‘పార్లే’ ‘హిందుస్తాన్ యూనీలివర్ లిమిటెడ్’ ‘కృష్ణ ఇండస్ట్రీస్’ ‘క్వాలిటీ ఫుడ్స్’ ‘అమూల్’ ‘డాబర్’ ‘మిల్క్ డైరీ’ ‘నెస్ట్లే’ మాత్రమే కాదు చివరకు ‘పతాంజలి’ సైతం హలాల్ సర్టిఫికేషన్ తో తమ ప్రొడక్స్ ను ఇంటర్నేషనల్ మార్కెట్ లో అమ్ముతుంటాయని చాలా మందికి తెలీదు. చివరకు ITC, Mc Donald’s, KFC లాంటి కాంపెనీలు కూడా ముస్లిం సంస్థలు కావు.
ఇవేమీ ముస్లిముల కంపెనీలు కావు. అలాంటప్పుడు వీరంతా హలాల్ సర్టిఫికేషన్ తీసుకుని హలాల్ మాఫియా నడుపుతున్నారని అనుకోవచ్చా?

• ‘హలాల్ సర్టిఫికేషన్ ’ అవసరం ఏమిటి?

‘ప్రాసెస్ ఫుడ్’ ‘ఫ్రొజెన్ ఫుడ్’ డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా పెరగటం, ముస్లిం దేశాల్లో హలాల్ సర్టిఫైడ్ ఫుడ్స్ కు అధిక ప్రాధాన్యత ఉండటం వలన అంతర్జాతీయ స్థాయిలో ప్రొడక్ట్స్ ను ఎగుమతి చేస్తున్న కంపెనీలన్నీ ‘హలాల్ సరిఫికేషన్’ను అదనంగా తీసుకోవటం జరుగుతుంది. పైగా ‘హలాల్ సర్టిఫికేషన్’ ఈ మధ్య కాలంలో మొదలవ్వలేదు ఎప్పటి నుండో అమలులో ఉంది.

• హలాల్ ఫుడ్స్ కు ఉన్న మార్కెట్ వ్యాల్యూ ఎంత?

అంతర్జాతీయ మార్కెట్ లో హలాల్ ప్రొడక్ట్స్ కు 42.5% మార్కెట్ షేర్ ఉంది. అంటే ప్రపంచవ్యాప్తంగా సుమారు 2.6 ట్రిలియన్ డాలర్ల హలాల్ ప్రొడక్ట్స్ టర్నోవర్ జరుగుతుంది.
ఇండియాతో సహా అంతర్జాతీయంగా మార్కెట్లో “హలాల్ సర్టిఫైడ్ ఫుడ్స్“ కు అంత పెద్ద మార్కెట్ ఉండటం వలన ఇండియాలోనే కాక ఫారిన్ కంట్రీస్ కు తమ ప్రొడక్ట్స్ ఎగుమతి చేసే అతిపెద్ద కంపెనీలన్నీ హలాల్ సర్టిఫికేషన్ అదనంగా తీసుకుంటూ ఉంటాయి. భారత దేశంలో అమ్మకాల వరకు ఫుడ్ ప్రొడక్ట్స్ పై ‘FSSAI (Food Safety and Standards Authority of India)’ లైసెన్స్ సరిపోతుంది.

• ‘హలాల్’ కేవలం మాంసాహారాలకే వర్తిస్తుందా?

‘హలాల్ టూరిజం’ ఎప్పుడైనా విన్నారా? ‘హలాల్ టూరిజం’ ప్యాకేజ్ లను కూడా కొన్ని కంపెనీలు మార్కెట్టింగ్ చేస్తున్నాయి. అంటే వాటి ‘హాలిడే ప్యాకేజ్‘లో అవి ఆల్కహాల్ సప్లై చేయకుండా, హానికర పదార్థాలు లేని ఫుడ్ ను మాత్రమే అందించటం జరుగుతుంది.
మహారాష్ట్రకు చెందిన ‘P.P FOODS’ అనే సంస్థ నిజానికి ‘బియ్యం’ ఎక్స్ పోర్ట్ చేసే కంపెనీ. ఈ కంపెనీ ఎటువంటి మాంసాహార ఉత్పత్తులు ఎగుమతి చెయ్యదు. కానీ ఈ సంస్థ సైతం బియ్యం ప్యాకట్లపై ‘హలాల్ సర్టిఫికేషన్’ తీసుకుంటుంది. అలాగే ప్రముఖ “ITC” కంపెనీ ఇండియా నుండి ముస్లిం దేశాలకు ఎగుమతి అయ్యే గోధుమ ప్యాకెట్లపై సైతం ‘హలాల్’ సర్టిఫికేషన్ తో ఎగుమతి చేస్తుంది. ఇవి కాక, ‘ఆదానీ’, ‘రిలయన్స్’ ‘టాటా’ ‘హిందుస్తాన్ లివర్’ వగైరా కంపెనీలన్నీ కిరాణా సామాన్లు, కాస్మోటిక్స్ నుండి మెడిసిన్స్ వరకు ‘హలాల్’ సర్టిఫికేషన్ తో ఎగుమతి చేస్తుంటాయి. కారణం కొన్ని ట్రిలియన్ డాలర్ల టర్నోవర్ ఉండటమే.

• ‘హలాల్’ హిందువులపై బలవంతంగా రుద్దబడుతుందా?

ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ కంపెనీలన్నీ తమ ప్రొడక్ట్స్ పై ‘హలాల్ సరిఫికేషన్’ను తీసుకోవటం హిందువులకు వ్యతిరేకంగా కుట్రపన్నటానికో, వారిపై హలాల్ ను బలవంతంగా రుద్దటానికో మాత్రమే అని ఊహించుకోటానికి మించిన అజ్ఞానం మరొకటి ఉండదు.

నిజానికి ‘హలాల్’ సర్టిఫైడ్ ఫుడ్స్ అమ్ముతున్న లేక ఎగుమతి చేస్తున్న కంపెనీలు కేవలం ముస్లిములకు చెందినవి మాత్రమే కావు. అంతర్జాతీయంగా ప్రొడక్ట్స్ ను ఎగుమతి చేసే.. ‘ఆదానీ’, ‘రిలయన్స్’ ‘టాటా’ ‘హిందుస్తాన్ లివర్’ వగైరా కంపెనీలన్నీ కూడా హలాల్ సర్టిఫికేషన్ తీసుకుంటాయి.

కాబట్టి కొందరు కాషాయ కండువాలు మెళ్లో వేసుకుని ‘హలాల్’ ను బ్యాన్ చేయ్యాలని మాంసం షాపుల ముందో, అంగళ్ల ముందో కాస్సేపు డ్యాన్స్ కట్టినప్పటికి.. పై అంతర్జాతీయ కంపెనీలన్నీ కోట్ల రూపాయల వ్యాపారాలు మూసేసుకోవటం జరగని పని.

ఒకవేళ ఇప్పుడు ‘హలాల్’ వస్తువులు నిషేధించాలని గోల చేస్తున్న వారిలో ఎవరైనా రేపన్న రోజున ఇంటర్నేషనల్ మార్కెట్ లో వస్తువులు ఎగుమతి చేసే కంపెనీ పెడితే వాల్లు కూడా హలాల్ సర్టిఫికేట్ లేనిదే బిజినెస్ చెయ్యలేరు.

• ‘హలాల్ సర్టిఫైడ్’ పదార్థాలు కొనే నిర్బంధం ఉందా?

హలాల్’ పదార్థాలు/వస్తువులు మాకు ఇష్టం లేదు అన్నప్పుడు మానేయ్యవచ్చు. తప్పితే దానికి వేరేగా స్టేట్మెంట్ ఇచ్చి, వ్యతిరేకించి నినాదాలు చేసి హడావిడి చెయ్యాల్సిన పని అస్సలు లేదు.
ఉదాహరణకు మార్కెట్లో ‘గో మూత్రం’ సీసాలు కూడా అమ్మబడుతుంటాయి. దానర్థం వాటిని అందరూ కచ్చితంగా కొనుక్కుని త్రాగాలన్న నిర్బంధం ఉన్నట్టు కాదు కదా! వాటిని అమ్మటం ఇతర మతస్తుల విశ్వాసాలను కించపరచటం కూడా అవ్వదు. ‘గో మూత్రం’ ఇష్టం ఉన్నోల్లు కొనుక్కుని తాగుతారు ఇష్టం లేనోల్లు మానెయ్యవచ్చు కూడా. అలాగే హలాల్ సర్టిఫికేషన్ ఉన్న పదార్థాలు ఇష్టం ఉన్నోల్లు తింటారు, ఇష్టం లేనోల్లు మానెయ్యవచ్చు.
ఏ ఒక్క మతవర్గానికో ఇష్టం లేదని అంతర్జాతీయ ఎక్స్ పోర్ట్ కంపెనీలు కోట్లలో జరిగే వ్యాపారాలు మూసేసి ఇంట్లో కూర్చోలేవు కదా!

ప్రపంచవ్యాప్తంగా హలాల్ ఫుడ్స్ తాలూకు డిమాండ్ మరియు టర్నోవర్ తాలూకు అవగాహన లేని వారే ‘హలాల్ సర్టిఫైడ్ ఫుడ్స్’ను ‘హలాల్ మాఫియా’ అని భ్రమ పడుతుంటారు. అలాంటి మిడి మిడి జ్ఞానం ఉన్నవారే.. ముస్లిమేతరులపై బలవంతంగా రుద్దటానికే “హలాల్ సర్టిఫైడ్” పదార్థాలు అమ్ముతున్నారని తెగ బాధపడిపోయి, మాకు అన్యాయం జరిగిపోతుందని హలాల్ ఫుడ్స్/ప్రొడక్ట్స్ ను బాయ్ కాట్ చెయ్యాలని హడావిడి చేస్తుంటారు.

అలాగే చాలా చోట్ల చికెన్/మటన్ షాపులపై “హలాల్ మాంసం అమ్మబడును” అని రాసి ఉండటాన్ని చూడగలం. అది కూడా వ్యాపార టెక్నిక్కే! కారణం మనది హిందూ, ముస్లిములు కలిసి ఉన్న మిశ్రమ సమాజం. హలాల్ మాంసాహారం తినే ముస్లిం కస్టమర్లను ఆకర్షించటానికి అటు ముస్లిం వ్యాపారస్తులే కాక.. ముస్లిమేతర వ్యాపారస్తులు సైతం కోళ్లూ, మేకల్నీ హలాల్ చెయ్యించి మాంసం షాపుల్లో అమ్ముతుంటారు. దానికి కారణం ముస్లిమేతరుల మత విశ్వాసాలను కించపరచటం కాదు. ఒకవేళ హలాల్ వద్దు అనుకుంటే మానేసి హలాల్ లేనిదే కొనుక్కోవచ్చు అందులో ఏ ఇబ్బందీ లేదు హడావిడి చెయ్యాల్సిన పనికూడా లేదు.

ఇక్కడ అర్థం చేసుకోవలసింది…

“ద్వేషం ఎప్పుడూ జ్ఞానం ద్వారా వ్యాపించదు. అది వ్యాపించగలిగేది అజ్ఞానం ద్వారా మాత్రమే”.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *