ముస్లిములు రాజకీయాల్లోకి రాకూడదా?

ఎందుకు రాకూడదు? కచ్చితంగా రావల్సిందే. ఒక్క ముస్లిం సమాజమే కాదు ఏ వర్గ ప్రజలైన అన్ని విధాలుగానూ అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోవాలంటే వారు మౌలికంగా నాలుగు రంగాల్లో అభివృద్ది చెందాల్సి ఉంటుంది. అవి- 1. భౌతిక 2. విధ్య 3. ఆర్థిక 4. రాజకీయ రంగాలు. ఈ నాలుగు రంగాల్లో ఏ ఒక్కదాన్ని వదిలిపెట్టినా ఆ వర్గం అభివృద్ధి కుంటుపడుతుంది.

కాబట్టి అసలు సమస్య ముస్లిములు రాజకీయాల్లోకి రావచ్చా? రాకూడదా? అన్నది కాదు కచ్చితంగా రావలసిందే! కానీ, దానితో పాటు ఒక వర్గం పూర్తిగా అభివృద్ధి సాధించటానికి అత్యవసరమైన భౌతిక, విధ్య, ఆర్థిక రంగాల్లోనూ ముస్లిం సమాజం అభివృద్ధి చెందుతుందా? లేదా? అన్నవి సైతం ఇక్కడ తీవ్రంగా ఆలోచించాల్సిన విషయాలు.

పైగా ముస్లిం సమాజంపై అదనంగా ఒక బాధ్యత ఖురాన్ మోపుతుంది అది- “ప్రజలను మంచివైపుకు పిలవటం, చెడు నుండి ఆపటం”. ఈ సామాజిక సంస్కరణ బాధ్యతను ముస్లిం సమాజం నిర్వర్తించినప్పుడే “వారు సాఫల్యం పొందుతారు” అన్నది ఖురాన్ వాగ్దానం. ఈ పని ముస్లిం సమాజం నిర్వర్తించినంత కాలం వారిపై దైవకారుణ్యం ఉంటుంది లేదంటే గతంలో యూదులు (ఒకప్పటి ముస్లిం సమాజం స్థానంలో ఉన్న వర్గం) దైవాగ్రహానికి గురైనట్టే మీ పరిస్థితి కూడా తయారవుతుందన్నది ఖురాన్ హెచ్చరిక.

ఒకప్రక్క ముస్లిములుగా ఉంటూనే భౌతిక, ఆర్థిక, విద్య రంగాల్లో వెనుకబడిపోతూ మరోప్రక్క అల్లాహ్ మోపిన సామాజిక సంస్కరణ బాధ్యతను నిర్లక్ష్యం చేస్తూపోతూ.. సమస్యల్లో చిక్కుకుపోయే పరిస్థితి వచ్చినప్పుడు దానికి సోల్యూషన్ ముస్లిములు రాజకీయాల్లోకి రావటమే అన్న కొందరి తీర్మానమే ఓపెద్ద ఫేయిల్యూర్ కంక్లూజన్.

ఇప్పుడు జరుగుతున్నది అదే! నేడు ముస్లిములపై మతతత్వ పార్టీల వల్ల అన్ని దిక్కుల నుండి వచ్చిపడుతున్న సమస్యలపై ముస్లిముల తరఫున రాజకీయపరంగా గట్టిగా మాట్లాడేందుకు ఒక గొంతు ఉండితీరాలని చెప్పే ముస్లిములు అసలు ఇప్పటికీ తాము దేశంలో మైనార్టీ స్థానంలోనే ఉంటూ అనేక సమస్యల్లో చిక్కుకుపోవటానికి గల మూల కారణమేమిటో కనిపెట్టకుండా తాము సామాజికంగా ఎదుర్కుంటున్న సమస్యలకు సోల్యూషన్ రాజకీయంగా అధికారంలోకి రావటమే అని చెప్పటం రోగ నిర్ధారణ చేసి సరైన ట్రీట్మెంట్ ఇవ్వకుండా పైపూతగా ఏదో ఆయింట్మెంట్ రాసిచ్చేసి పంపేయటం లాంటిదన్న మాట!

కాబట్టి ముందుగా సార్వత్రిక ముస్లిం సమాజం ఏయే అంశాల్లో వెనుకబడిపోతుందో కాస్సేపు ఎమోషన్స్ ను ప్రక్కన పెట్టి లోతుగా విశ్లేషణ చెయ్యాలి.

ముస్లిం సమాజం – మధ్యస్థ సమాజం (Community of the middle way)

ఖురాన్ – “ముస్లిములైన మిమ్మల్ని ఒక ‘మధ్యస్థ సమాజం’గా చేశాము – మీరు ప్రపంచ ప్రజలకు సాక్షులుగా ఉండాలని మరియు ప్రవక్త మీకు సాక్ష్యంగా నిలబడాలని” – 2:143 అని చెబుతుంది.

ఈ వాక్యాన్ని బట్టి ముస్లిం సమాజం ఏ దేశంలోనైనా, ఏ కాలంలోనైనా తనదంటూ ఒక ప్రత్యేకతను కలిగి ఉందని తెలుస్తుంది. పై వాక్యంలో ఖురాన్ ముస్లిం సమాజానికి అతివాదం-మితవాదం, భౌతికవాదం-ఆధ్యాత్మికవాదం ఇలా అన్ని రంగాల్లోనూ సమతూకం (Balance) కనపరిచే సమాజంగా రూపుదిద్దాల్సిందిగా ఆదేశిస్తుంది. ఉన్నత నైతిక విలువలు కలిగి వాటిని ఇతరులకు నేర్పే సమాజంగా, నీతి-నిజాయితీలు కలిగి, సత్యం ధర్మం పునాదిగా ప్రపంచంలో అన్ని మత వర్గాలవారితోనూ సత్సంబంధాలు కొనసాగిస్తూ, అందరి బాగునూ కాంక్షిస్తూ ఉండే ఉత్తమ సమాజంగా కొనసాగాలని పై ఖురాన్ వాక్యం ఆదేశిస్తుంది. ఉదాహరణకు మూడు రకాల దృక్పథాలు తీసుకుందాం:

1). భౌతిక, విధ్య, ఆర్థికపరంగా అభివృద్ధి చెందాల్సిన పనిలేదు కేవలం ధార్మికంగా అభివృద్ధి చెందితే చాలు.
2). ధార్మికంగా అభివృద్ది చెందాల్సిన పనిలేదు కేవలం భౌతిక, విధ్య, ఆర్థికపరంగా అభివృద్ధి చెందితే చాలు.
3). భౌతిక, విధ్య, ఆర్థికపరంగా అభివృద్ధి చెందుతూనే ధార్మికంగానూ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది.

పై మూడు దృక్పథాల్లో ఇస్లాం దేన్ని ఆదేశిస్తుందో ఒకసారి బాగా ఆలోచన చెయ్యండి. దానికి సమాధానం కావలసిన వారు ప్రవక్త ముహమ్మద్ (స) ఒకప్రక్క ఆనాటి అనాగరిక అరబ్బు సమాజానికి దైవసందేశం అందజేస్తూ వారిని ఆధ్యాత్మిక రంగంలో అభివృద్ధి చేస్తూనే.. మరోప్రక్క భౌతిక, విద్య, ఆర్థిక, రంగాల్లోనూ వారిని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళుతూ ఆనాటి సమాజాన్ని ఏ విధంగా ఒక ఆదర్శప్రాయ మధ్యస్థ సమాజంగా నెలకొల్పారో చదివితే తెలుస్తుంది. ప్రవక్త ముహమ్మద్(స) ఆనాటి సమాజాన్ని ధార్మిక, భౌతిక, విద్య, ఆర్థిక రంగాల్లో ముందుకు తీసుకెళుతూ మరోప్రక్క ఉత్తమ నాయకుడిగా ప్రజలను పాలించి చూపిన విధానం ఈనాడు రాజకీయంగా ఎదగాలనుకునే ప్రతీ ముస్లిం నాయకుడికి కూడా ఒక ఆదర్శం అని చెప్పాలి.

నేడు ముస్లిం సమాజం అన్ని రంగాల్లోనూ రాణించలేకపోవటానికి రెండు రకాల ఆలోచనా విధానాలు కలిగిన ముస్లిములు కారణం. మొదటి రకం ముస్లిములు: భౌతిక, ఆర్ధిక, విద్యా రంగాల్లో అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తూ కేవలం ధార్మిక విద్య ఉంటే చాలనుకునే వారు. రెండవరకం: ధార్మిక విద్య అవసరమే లేదు కేవలం భౌతిక, ఆర్ధిక, విద్యా రంగాల్లో అభివృద్ధి చెందితే చాలనుకునే వారు.

ఈ రెండు ఆలోచనా విధానాలూ అత్యంత ప్రమాదకరమే! ఖురాన్ ఒక ‘మధ్యస్థ సమాజం’గా మీరు ఎదగాలని అభిలాషిస్తున్నప్పుడు ఏదో ఒకవైపే ఉండటం వల్ల సమతుల్యత (Balance) దెబ్బతింటుంది. నేడు ముస్లిం సమాజంలో అధిక శాతం మంది ఆ సమతూల్యత కోల్పోయిన బాటలోనే నడుస్తున్నారని చెప్పటం అతిశయోక్తి కాదు. అలాగని మొత్తం ముస్లిములు భౌతిక, ఆర్ధిక, విద్యా రంగాల్లో వెనుకబడిపోయున్నారన్నది నా ఉద్దేశం కాదు. కానీ, గణాంకాలను బట్టి ముస్లిం సమాజం ఆర్థిక, విద్యా రంగాల్లో కలిగుండాల్సినంత అభివృద్ధి కలిగి లేదన్నది.

కాబట్టి ముస్లింగా ఉంటూ ఒకవేళ రాజకీయంగా ఎదగాలనే సంకల్పం ఉంటే అతను కచ్చితంగా స్వార్థం-స్వలాభాపేక్షకు, కుల-మతాలకు అతీతంగా సమాజంలో ప్రజలందరినీ భౌతిక, విద్య, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ముందుకు తీసుకేళ్లే విధంగా ప్రయత్నించే నాయకుడిగా ఉండాలి. దానితో పాటు సామాజిక సంస్కరణకు పాటుపడాలి. అందరి పట్లా సమన్యాయం కలిగి ఉండాలి. అదే విధంగా ముస్లిం సమాజాన్ని ఆదర్శ మధ్యస్థ సమాజంగా తీర్చిదిద్దటానికి పాటుపడాలి. ఈ బెంచ్ మార్క్ కు సరిపోయే విధంగా ఒకవేళ ఏ ముస్లిం నాయకుడైనా నేడు ఉన్నాడు అంటే కచ్చితంగా అతన్ని సమర్ధించటంలో తప్పులేదు. దీనికి భిన్నంగా నా స్వంత మతవర్గం తరఫున పోరాడటానికి మాత్రమే నేను అధికారంలో వస్తానంటే అది ఇస్లాం ఇస్తున్న దృక్పథానికి పూర్తి వ్యతిరేకమే అవుతుంది.

అలాగే ముస్లిం సమాజం సైతం మాకున్న సమస్యలు దూరమవ్వాలంటే మా కంటూ ఓ ముస్లిం నాయకుడు ఉండాలనుకోవటం సైతం ఇస్లాం దృక్పథానికి వ్యతిరేకమే! ఎందుకంటే వారు అల్లాహ్ ను నమ్ముకుని, ఆయన ఆదేశాల ప్రకారం నడుచుకుంటూ ఉంటే వారి సమస్యలను ఆయనకంటే ఉత్తమంగా గట్టెక్కించగలవారెవ్వరు? కుల-మతాలకతీతంగా అన్ని మత వర్గాలవారితోనూ సత్సంబంధాలు కొనసాగిస్తూ, అందరి బాగునూ కాంక్షించే నాయకుడు మా తరఫున ఒకరు ఉండాలని ముస్లిములు కోరుకోవాలి. ప్రవక్త ముహమ్మద్ (స) సైతం ఒకప్పుడు అలాంటి నాయకుడే కాబట్టి.

కాబట్టి ఇప్పుడున్న నేపథ్యంలో ముస్లిములు ముందు చెయ్యాల్సింది జీవితాంతం మైనార్టీలుగా ఉంటూ సమస్యలతో నిత్యం పోరాడుతూ కూర్చునే కంటే.. తమ పిల్లలకు ఉన్నత విద్య (Education) ను అభ్యసించటానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది సమాజంలో ఉన్నత పదవులను అధిరోదించి, వారు భౌతికంగానూ, ఆర్థికంగా కానూ ఎదిగి అన్ని రంగాల్లోనూ రాణించటానికి దోహదపడుతుంది. దానితో పాటు ధార్మిక విధ్య యొక్క లోతైన అవగాహన కూడా కలిగి ఉండాలి. ఇది వారు ప్రపంచంలో ఉన్నత నైతిక విలువలతో నడుచుకొటానికి మార్గం చూపుతుంది.

తమ పిల్లలకు ఏదో సంతకం పెట్టటం వచ్చినంత చదువుంటే చాలనుకొని చదువు మధ్యలో మాన్పించేసి మెకానిక్ షాపుల్లోనో, పంచర్ కొట్టుల్లోనో లేక ఏదో చేతి పనుల్లోనో జాయిన్ చేసేసి మేము ఎదగటం లేదు, పైకి రావటం లేదని బాధపడుతూ కూర్చోకూడదు. సమస్యల్ని ఎదురీది నెగ్గటం చేతకానప్పుడు ఆ సమస్యలను తిట్టే హక్కుండదు.

కాబట్టి ముస్లిములు రాజకీయపరంగానే కాదు సామాజిక, భౌతిక, విధ్య, ఆర్థికపరంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతూనే ధార్మికంగానూ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది.

అలాగే రాజకీయంగా ఎదగాలనుకున్నప్పుడు విశ్వాసాలకతీతంగా, అన్ని కుల-మతవర్గాల ప్రజలందరి బాగోగుల కోసం, ప్రజాసేవ కోసం శ్రమపడే నాయకునిగా ఎదిగే ఉద్దేశముండాలి. అలాంటి రాజ్యస్థాపనే ఇస్లాం సైతం కోరుకునేది.

ఈ విధమైన విశాల ఆలోచనా దృక్పథాన్ని అటు ఇస్లాం మాత్రమే కాక, ఇటు అంబేడ్కర్ రచించిన భారత రాజ్యాంగం సైతం అభిలషించటం గమనార్హం. కాబట్టి భారతదేశ ముస్లిములు ఇస్లామియా చట్టాన్ని గౌరవిస్తూనే, అందరి ఉమ్మడి చట్టమైన భారత రాజ్యాంగాన్ని కూడా గౌరవించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *