అంతర్జాతీయ వార్తలు చదివేవారికి 2008 లో “ఫిత్నా” అనే ఓ యాంటీ ఇస్లామిక్ షార్ట్ ఫిల్మ్ విడుదలపై ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సమాజంలో నిరసనలు వెల్లువెత్తాయన్న సంగతి బహుశా తెలిసే ఉంటుంది.
ఇస్లాం అత్యంత ప్రమాదకర మతమని, హింసను ప్రేపిస్తుందని, టెర్రరిజం నేర్పుతుందని, స్త్రీలను అణచివేస్తుందని, ఖురాన్ ఓ ఫాసిస్టు పుస్తకమని అభివర్ణిస్తూ తీసిందే “ఫిత్నా” అనే పేరుతో తీసిన లఘు చిత్రం.
దీనిని నిర్మించింది నెదర్లాండ్స్ కు చెందిన “ఫార్-రైట్ ఫర్ ఫ్రీడం (PVV)” పోలిటికల్ పార్టీ అధ్యక్షుడు మరియు తీవ్రమైన ఇస్లామోఫోబిక్ అయిన “గీర్ట్ విల్డెర్స్”. ఇతనెంత తీవ్రమైన ఇస్లాం ధ్వేషకుడంటే ఒక ప్రక్క రాజకీయాల్లో ఉంటూనే తనలానే ఇస్లాం పట్ల విపరీతమైన ధ్వేషం కలిగి ఉన్న కొందర్ని పోగేసి “యాంటీ ఇస్లామిక్ మూవ్మెంట్” కూడా మొదలెట్టాడు.
దాని లక్ష్యం ఇస్లాంతో ఉగ్రవాదాన్ని ముడిపెట్టి ప్రజల్ని ముస్లిములకు వ్యతిరేకంగా రెచ్చగొట్టటం, ప్రవక్త ముహమ్మద్ (స) ను అవమానిస్తూ వ్యంగ్యంగా కార్టూన్లు వెయ్యటం, ప్రపంచంలో జరుగుతున్న ఉగ్రవాద ఘటనలకు కారణం ఇస్లామే అని ప్రచారం చెయ్యటం.
అంతటితో ఆగకుండా ఇస్లాంను వక్రీకరిస్తూ 2008లో “గీర్ట్ విల్డెర్స్” “ఫిత్నా” అనే షార్ట్ ఫిల్మ్ తీసి ఇంటర్నెట్ లో కూడా విడుదల చెయ్యటం జరిగింది. ఆ తరువాత ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం సమాజం నిరసనల కారణంగా దానిని బ్యాన్ చెయ్యటంతో ఆ గొడవ అక్కడితో సద్దుమణిగింది.
ఇంతవరకు మాత్రమే చాలా మందికి తెలుసు. కానీ, ఆ తరువాత జరిగిన ఓ ఆశ్చర్యకరమైన సంఘటన బహుశా చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఇస్లాం పట్ల ధ్వేషాన్ని రగిలిస్తూ “గీర్ట్ విల్డెర్స్” తీసిన ఈ చిత్రం తనకు కుడి భుజంగా ఉంటూ దాన్ని నిర్మించటంలో పంపిణీ చెయ్యటంలో ప్రధాన బాధ్యత వహించిన “అర్నాడ్ వాన్ డూర్న్ (Arnoud van Doorn)”ను ఇస్లాం వైపునకు అడుగులు వేసేలా చేసింది.
“అర్నాడ్ వాన్ డూర్న్” నిజానికి “ఫార్-రైట్ ఫర్ ఫ్రీడం (PVV)” పోలిటికల్ పార్టీ మెంబర్. అంతేకాక “గీర్ట్ విల్డెర్స్” స్థాపించిన “యాంటీ ఇస్లామిక్” సంస్థలో ప్రధాన సభ్యుడు కూడా. ఇస్లాంను విపరీతంగా ధ్వేషిస్తూ దారుణమైన పదజాలంతో ఇస్లాం వ్యతిరేక ప్రసంగాలు చేసేవాడు.
ఎప్పుడైతే 2008 లో “ఫిత్నా” అనే ‘యాంటీ-ఇస్లామిక్’ చిత్రాన్ని నిర్మించటం జరిగిందో అప్పుడు ప్రపంచంలో ముస్లిములంతా కలిసి దాన్ని వ్యతిరేకించటంతో అప్పటివరకూ ఇస్లాంను కేవలం వినికిడి సమాచారంతో విమర్శిస్తూ ఉండే ఆ మనిషికి అసలు ఇస్లాంను లోతుగా తెలుసుకోవాలని మొట్టమొదటిసారి అనిపించింది. ఖురాన్ ను, ప్రవక్త ముహమ్మద్ (స) బోధనల్ని తానే స్వయంగా చదవటం మొదలెట్టాడు. ఆ పరిశీలన వాన్ డూర్న్ ను మరింత లోతుగా ఆలోచించేలా చేసింది. అప్పటివరకూ ఇస్లాం పట్ల తన మెదడులో ఎక్కించుకున్న ఆపార్థాలన్నీ పటాపంచలైపోయాయి.
ఇస్లాం పట్ల ధ్వేషంతో తాను చేస్తూ వచ్చిన విమర్శలు ఎంత అబద్ధమో తెలుసుకున్నాడు. ఇస్లాం పట్ల తాను అప్పటివరకూ చేస్తూ వచ్చిన విమర్శలకు, ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ (స) బోధనల్లో ఉన్న ఇస్లాంకు అసలేమాత్రం పొంతన లేదన్న విషయాన్ని గ్రహించాడు.
ఇస్లాం పట్ల ధ్వేషం రగిలించటానికి తీసిన చిత్రం అతన్ని ఇస్లాంను పరిశీలించటానికి కారణమయ్యింది. స్వతహాగా ఇస్లాంను లోతైన పరిశీలన చేసిన అర్నాడ్ వాన్ డూర్న్ ఇస్లాం స్వీకరించి ప్రపంచాన్ని ఆశ్చర్య పరిచాడు. కొన్నాళ్లకు అతని కొడుకు సైతం తండ్రి మాదిరిగానే ఇస్లాంను పరిశీలించి అతను కూడా ఇస్లాం స్వీకరించాడు. ఒకప్పుడు యాంటీ-ఇస్లామిక్ మూవ్మెంట్ నడిపిన వాన్ డూర్న్ ఆ తరువాత ఇస్లాం యొక్క యదార్థతను తెలియజేయటం మొదలెట్టాడు.
ఇస్లాం నేడు అనేక మంది ద్వారా అపార్థానికి గురవటానికి కారణమేంటి, ముస్లిం సమాజం ఇస్లాం వాస్తవికతను అర్థం చేసుకోవటంలో, దాన్ని ప్రజలకు అవగాహనపరచటంలో ఎక్కడ ఫేయిలవుతున్నారు, వగైరా అనేక అంశాలను చక్కగా వివరిస్తూ ఇస్లాం వాస్తవికతను గురించి అర్నాడ్ వాన్ డూర్న్ ఇచ్చిన ఎన్నో ప్రసంగాలను ఎవరైనా చూడాలనుకునేవారు యూట్యూబ్ లో చూడవచ్చు.
ఒకప్పుడు ఇస్లాం పట్ల తాను ప్రదర్శించిన విపరీతమైన ధ్వేషానికి గాను ఆ ధ్వేషంతో తాను యాంటీ ఇస్లామిక్ ఫిల్మ్ సైతం తీసినందుకు సమస్త ముస్లిం సమాజానికి బహిరంగ వేదికపై నిలబడి క్షమాపణ చెబుతూ ఇస్లాం గొప్పతనాన్ని వివరిస్తూ సుదీర్ఘ ప్రసంగం సైతం ఇవ్వటం జరిగింది. వినాలనుకునేవారు ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చు.
Link:https://www.youtube.com/watch?v=oo8jGbv0M8k&t=357s
