ఇస్లాం విమర్శకులు లేవనెత్తే విమర్శల్లో ఒకటి- ఇస్లాం యుద్ధాలలో పట్టుబడ్డ స్త్రీలను సెక్స్ బానిసలు (Female Sex Slaves) గా మార్చి వారిని లైంగికంగా వాడుకోవటానికి అనుమతిస్తుంది అన్నది. పైగా వారి ఈ వాదనను సమర్ధించుకోవటానికి ఈ క్రింది ఖురాన్ వాక్యం చూపుతుంటారు.
“ఇంకా ఇతరుల వివాహబంధంలో ఉండే స్త్రీలు కూడా మీకు హరామ్, మీ చేతికి (యుద్ధంలో) చిక్కిన స్త్రీలు తప్ప” – 4:24
ఇస్లాం చుట్టూ పేరుకుపోయిన అనేక అపార్థాలు సాధారణంగా ఒకటి ఖురాన్ వాక్యాల అర్థాన్నీ, సందర్భాన్ని అవగాహన చేసుకోకుండా చదవటం వల్ల, లేదా ఇస్లాం పేరుమీద కొందరు అనవగాహనాపరులైన ముస్లిములు చేసే పనుల వల్ల ఏర్పడినవే! దీనికి తోడు ఐ.ఎస్.ఎస్ అనే ఉగ్రవాద సంస్థ సిరియా, ఇరాక్ యజీదీ స్త్రీలను బలవంతంగా బంధించి సాగించిన అత్యాచారాలు అంతర్జాతీయ మీడియాలో రావటంతో ఖురాన్ స్త్రీలను లైంగిక బానిసలుగా మార్చటానికి అనుమతిస్తుందనే అపార్థం చాలా మందిలో నాటుకుపోయింది.
యుద్ధంలో చిక్కిన స్త్రీలను ఆనాడు ఖురాన్ ఎందుకు ధర్మసమ్మతం చెయ్యటం జరిగింది? అన్న ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు ముహమ్మద్ (స) ప్రవక్తగా ఎన్నుకోబడకపూర్వపు సమాజాల స్థితిగతులను, అప్పటి యుద్ధ నియమాలనూ ఒకసారి పరిశీలించాల్సి ఉంటుంది. ఎందుకంటే యుద్ధాల్లో పట్టుబడిన స్త్రీ, పురుషులు బానిసలుగా మార్చబడే ప్రక్రియ అప్పటికే ఎన్నో దేశాల్లో కొనసాగుతూ వస్తుంది. ఒక వర్గంపై దౌర్జన్యంగా తెగబడి అక్కడి సంపదను కొల్లగొట్టేయటం, దొరికిన స్త్రీ, పురుషులను బలవంతంగా లాక్కెళ్లి బానిసలుగా మార్చి సేవలు చేయించుకోవటం లాంటి దుశ్చర్యలు అప్పటికే అనేక దేశాల్లో కొనసాగుతూ వస్తున్నాయి. ఉదాహరణకు నల్ల నీగ్రోలను అమెరికన్లు బంధించి తమ బానిసలుగా మార్చుకుని సాగించిన దురాగతాల మాదిరిగా అన్నమాట. ఇలా బలవంతంగా తెగబడి బానిసలుగా మార్చిన సంఘటన ఇస్లామియా చరిత్రలో ఒక్కటి లేదు.
ఇక అప్పట్లో సైనిక శక్తితో ఎదిగిన రాజ్యాల మధ్య అమలయ్యే చట్టాలు, యుద్ధ నియమాలను గమనిస్తే.. ఇరు వర్గాల మధ్య యుద్ధం ఒకవేళ సంభవిస్తే అందులో – గెలిచిన వర్గం ఓడిపోయిన వర్గం తాలూకు యుద్ధ సొత్తును స్వంతం చేసుకోవటంతో పాటు పట్టుబడ్డ పురుషులు, స్త్రీలు ఖైదు చెయ్యబడి బానిసలుగా మార్చబడతారు. ఈ నియమానికి ఒప్పుకుంటే.. ఒకటి వారు యుద్ధానికి తలపడాలి.. లేదా మానుకోవాలి. అదీ కండీషన్. ఆ విధంగా యుద్ధాల్లో పట్టుబడ్డ స్త్రీ పురుషుల పట్ల అప్పట్లో ఘోర అత్యాచారాలు జరిగేవి. పురుషులను బానిసలుగా అమ్మేసేవారు స్త్రీలను అంగట్లో సరుకుమాదిరిగా బజార్లో నిలబెట్టి బలవంతంగా వ్యభిచార గృహాలకు అమ్మేసేవారు.
అటువంటి అనాగరిక దురాచారాలు కొనసాగుతున్న నేపథ్యంలో అరేబియాలో ప్రవక్త ముహమ్మద్ (స) ఇస్లాం బోధను ప్రారంభించారు. ఆయన బోధలకు ప్రజాదరణ పెరుగుతూపోయే కొద్దీ అరేబియా ఆయన పాదాక్రాంతమైపోతే ఎక్కడ తమ అధికారం కోల్పోవలసివస్తుందేమోనని అప్పటికే అనేక ముఢాచారాలను ప్రజలపై రుద్దుతూ డబ్బు సంపాదిస్తూ వస్తున్న పండిత వర్గం మరియు జాతి సర్దారులు ప్రవక్త ముహమ్మద్ (స) చేస్తున్న ధర్మప్రచారాన్ని నిలిపివెయ్యటానికి ఆయనపై, ఆయన అనుచరులపై దౌర్జన్యాలు, ఘోరమైన అత్యాచారాలు చెయ్యటం మొదలెట్టారు. అక్కడితో ఆగక ప్రవక్త ముహమ్మద్ (స) ను ఆయన అనుచరులపై మూకుమ్మడిగా దాడిచేసి అంతం చెయ్యటానికి సిద్ధపడిపోయారు.
ఆ నేపథ్యంలో ప్రవక్త ముహమ్మద్ (స)కు తన మరియు తన శిష్యుల ప్రాణరక్షణ నిమిత్తం దౌర్జన్య పరులకు వ్యతిరేకంగా యుద్ధం చెయ్యమన్న ఆజ్ఞలు బయలుదేరాయి. ప్రవక్త ముహమ్మద్ (స) తన జీవిత కాలంలో చేసిన యుద్ధాలన్నీ ఈ కోవకు చెందినవే. తప్పితే ఇస్లాంను బలవంతంగా వ్యాప్తి చెయ్యటానికో, తీవ్రవాదం చెయ్యటానికో చేసినవికావు.
ఇక యుద్ధం అనగానే.. యుద్ధ నియమాలు, చట్టాలు కూడా సహజంగా అమలవుతాయి. కానీ, అప్పటికే క్రూరమైన యుద్ధ నియమాలు కొనసాగుతూ వస్తున్న నేపథ్యంలో ప్రవక్త ముహమ్మద్ (స) యుద్ధ సందర్భాల్లో తన అనుచరులకు ఇచ్చిన ఆదేశాలు ఏమిటంటే- స్త్రీలను గానీ, పిల్లలను గానీ, వృద్ధులను గానీ చంపకూడదు. చెట్లకు ఎటువంటి హనీ కలిగించకూడదు, ముఖ్యంగా ఫలవంతమైన చెట్లను అస్సలు హాని తలపెట్టకూడదు అన్నవి.
బహుశా యుద్ధల్లో ఇలాంటి నైతిక నియమాలు పెట్టిన రాజును చరిత్రలో భూతద్దం పెట్టి వెదికినా దొరకరేమో! ఎందుకంటే అప్పటికే ప్రపంచంలో ఎక్కడ ఏ రెండు రాజ్యాల మధ్య యుద్ధం జరిగినా పట్టుబడ్డ ఖైదీలను బానిసలుగా మార్చి, వారితో క్రూరంగా వ్యవహరించే తీరు కొనసాగేది. అటువంటి నేపథ్యంలో ఖైదీలుగా పట్టుబడి బానిసలుగా మార్చబడే వారి విషయంలో వ్యవహరించవలసిన ఉత్తమ వైఖరి ఎలా ఉండాలో కూడా ఖురాన్ లో ఆజ్ఞలు అవతరించటం ప్రారంభమయ్యాయి.
“మీరు వారిని పూర్తిగా అణచివేసిన తరువాత ఖైదీలను గట్టిగా బంధించండి. ఆ తరువాత వారికి మేలైనా చెయ్యండి లేదా వారి నుండి పరిహారం (సొమ్ము) తీసుకుని వదిలేయండి” – 47:4
“మీ బానిసలలో ఎవరైనా మీకేదైనా (సొమ్మును) ఇచ్చి, విడుదలకు సంబంధించిన లిఖితపూర్వక ఒప్పందం మీతో చేసుకోదలిస్తే – వారిలో మీకు మంచితనం కానవచ్చిన పక్షంలో వారికి వ్రాత పత్రం వ్రాసి ఇవ్వండి, అల్లాహ్ మీకు ప్రసాదించిన ధనంలో నుండి వారికీ కొంత ఇవ్వండి” – 24:33
ప్రపంచవ్యాప్తంగా యుద్ధల్లో పట్టుబడి బానిసలుగా మార్చబడే వారిని అత్యంత హీనంగా చూస్తున్న నేపథ్యంలో పై ఖురాన్ వాక్యాలు బానిసలకు కూడా ఉన్నత హక్కులు ప్రసాదించింది. వారు పరిహారంగా ఎంతో కొంత డబ్బిచ్చి స్వతంత్రులు కావటానికి, ఒకవేళ వారి వద్ద డబ్బు లేకపోతే వారు గడువు తీసుకుని విడుదల పొందటానికి ఖురాన్ అవకాశమివ్వటమే కాదు, పైగా వారు సంపాదించుకోవటానికి ధన సహాయాన్ని కూడా చెయ్యాల్సిందిగా విశ్వాసులకు ఆజ్ఞాపించటం జరిగింది.
యుద్ధల్లో పట్టుబడ్డ బానిస స్త్రీలంటే అప్పట్లో ఓ పబ్లిక్ ప్రాపర్టీగా భావించి వేశ్యావృత్తిలో బలవంతంగా దింపే నేపథ్యం కొనసాగుతున్న నేపథ్యంలో.. ఖురాన్ ఇచ్చిన ఆజ్ఞ ఏమిటంటే..
“మీ బానిస స్త్రీలు శీలవతులుగా ఉండగోరునప్పుడు మీరు మీ ప్రాపంచిక స్వలాభాల కోసం వాళ్లను బలవంత పెట్టకండి” – 24:33
అంతేకాదు, బానిస స్త్రీలను హీనంగా చూస్తున్న ఆనాటి నేపథ్యంలో చివరకు వాళ్లను వివాహం చేసుకోవటానికి కూడా ఖురాన్ అనుమతి నిచ్చింది.
“మీ స్వాధీనంలో ఉన్నటువంటి బానిస స్త్రీలలో ఎవరైనా అతడు వివాహం చేసుకోవాలి” – 4:25
స్వయంగా ప్రవక్త ముహమ్మద్ (స) చేసుకున్న వివాహాల్లో సఫియా (రజి) వారు ఒకప్పుడు బానిస. ఆయన ఆమెను వివాహమాడటం జరిగింది. ఈ విధంగా బానిస స్త్రీలకు ఖురాన్ ఉన్నత స్థానం కల్పించింది. ఇక ఖురాన్ 4:24 లో “యుద్ధంలో చిక్కిన స్త్రీలను ఎందుకు ధర్మసమ్మతం చెయ్యటం జరిగింది? అన్న ప్రశ్నకు ఇప్పుడు సమాధానం గమనిస్తే..
పైన మనం చెప్పుకున్నట్టు యుద్ధల్లో పట్టుబడ్డ బానిస స్త్రీలంటే అప్పట్లో ఏ దేశంలోనైనా ఓ పబ్లిక్ ప్రాపర్టీగా భావించి వేశ్యావృత్తిలో బలవంతంగా దింపే నేపథ్యం కొనసాగేది. ఆయా స్త్రీల జీవితాలు అతి దుర్భరంగా సాగేవి.
ఇక యుద్ధంలో విజయం సాధించిన వారు యుద్ధంలో పట్టుబడ్డ ఖైదీల విషయంలో ఒకటి వారిని విడిచిపెట్టేయాలి లేదా చంపేయాలి.
ఇస్లాం అలా పట్టుబడ్డ ఖైదీలను అన్యాయంగా చంపటాన్ని నిషేధిస్తుంది. పైగా యుద్ధ నియమాల ప్రకారం శత్రు సైన్యాన్ని విడిచిపెట్టేసేలా ఉంటే ఇక పట్టుకోవటం దేనికి? ఒకవేళ స్త్రీ, పురుష ఖైదీలను ఒంటరిగా వదిలిపెడితే సమాజం చూస్తూ ఊరుకోదు. అలాగని ఆయా ఖైదీలను కాన్సన్ట్రెషన్ క్యాంపుల్లో పెడితే వారి జీవితం అత్యంత దుర్భరంగా మారుతుంది. అటువంటి నేపథ్యంలో ఖురాన్ యుద్ధల్లో పట్టుబడ్డ స్త్రీ, పురుషులను పోషించే బాధ్యత విశ్వాసులైన పురుషులకు ఇచ్చింది. యుద్ధాల్లో పట్టుబడి తమ ఆధీనంలో వచ్చిన స్త్రీలను ఏదో పబ్లిక్ ప్రాపర్టీగా భావించి వారితో ఎవరుపడితే వారు, ఎలా పడితే అలా వ్యవహరించకుండా.. వారిని గౌరవంగా తమ భార్యలతో సమానంగా ఇళ్లల్లో స్థానం కల్పించి, మీరు తినేదే వారికి తినిపిస్తూ, మీరు తొడిగేదే వారికీ తొడిగిస్తూ సగౌరవంగా చూసుకునేందుకు వారిని మాత్రం ధర్మ సమ్మతం చెయ్యటం జరిగింది. అంతేకాదు తమ ఆధీనంలో వచ్చిన స్త్రీల ద్వారా సంతానం కలిగితే వారికి తండ్రులుగా ఉండాల్సిందిగా ఆదేశించటం జరిగింది. ఒకవేళ వారు అలా ఉండటానికి ఇష్టపడకపోతే.. వారు ఎంతో కొంత సొమ్మును పరిహారంగా ఇచ్చి విడుదల పొందటానికి, లేదా తరువాత ఇస్తామని చెప్పి విడుదల పొందటానికి కూడా అనుమతినిచ్చింది. తప్పితే వారిపై బలవంతం చెయ్యటానికో వేశ్యా వృత్తిలో దింపటానికో అనుమతినివ్వటం లేదు.
ఇవన్నీ ఆనాటి యుద్ధాలు జరుగుతున్న నేపథ్యంలో ఇవ్వబడిన తాత్కాలిక ఆజ్ఞలు, నియమాలు. ఆ పరిస్థితులు ఈనాడు లేవు. పైగా యుద్ధాల్లో తమ భర్తలు మరణించగా అనేక మంది విశ్వాసులైన స్త్రీలు వితంతువులుగా మారేవారు, వారి పిల్లలు అనాధలయ్యేవారు. అటువంటి నేపథ్యంలో ఖురాన్..
“అనాధాలకు న్యాయం చెయ్యలేమనే భయం మీకు కలిగితే, మీకు నచ్చిన స్త్రీలను ఇద్దరేసి గానీ, ముగ్గురేసి గానీ, నాలుగురేసి గానీ వివాహం చేసుకోండి. వారితో న్యాయంగా వ్యవహరించలేమనే భయం మీకు కలిగితే ఒక్కామెనే పెళ్లి చేసుకోండి” – 4:3
అని ఆజ్ఞాపించటం జరిగింది. ఈ వాక్యం పట్టుకుని కొందరు సగం మెదడు గాళ్లు ఖురాన్ నలుగురిని వివాహం చేసుకోవటానికి అనుమతిస్తుందని కుప్పిగంతులేస్తుంటారు. నిజానికి పై వాక్యాలన్నీ ఆనాడు యుద్ధాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇవ్వబడ్డ వాక్యాలు. అచ్చం ఇలాంటి ఆజ్ఞే బైబిల్లోనూ చూడగలం.
“.. యోధులందరూ తలా యొక స్త్రీని తీసికొందురు, ఇద్దరేసి స్త్రీలు వారికి దొరుకుదురు” – న్యాయాధిపతులు 5:30
***
ఇక ఆనాడు బానిస వ్యవస్థను ఇస్లాం పూర్తిగా తుడిచిపెట్టటానికి ఏర్పరిచిన మరొక ప్రక్రియ ఏమిటంటే.. విశ్వాసులు తెలియక చేసే పొరపాట్లూ, తప్పులకు పరిహారంగా బానిసలను విడుదల చెయ్యమని చెప్పింది. పైగా ఖురాన్ పేర్కొనే పుణ్యకార్యాలలో బానిసను విడిచిపెట్టటం అతి పెద్ద పుణ్యకార్యంగా ఖురాన్ పేర్కొనటం జరిగింది… “ఎవరినైనా బానిస బంధనాల నుండి విముక్తిగావించటం, లేదా ఆకలిగొన్న నాడు సమీప అనాధుడికి లేదా దిక్కు లేని అనాధులకు అన్నం పెట్టటం” – 90:13,14
ఈ వాక్యం ప్రకారం ఆనాడు విశ్వాసులు బీదసాదలకు దిక్కులేనివారికి అన్నం పెట్టటం ఎంత పుణ్య కార్యమో బానిసలను స్వతంత్రులను చెయ్యటం కూడా అంతే పుణ్యకార్యంగా భావించటం జరిగేది. బానిసలను ఖరీదు చేసి మరీ వారిని విడుదల చేసేవారు. ఈవిధంగా బానిసత్వం (Slavery) అనే వ్యవస్థను ఇస్లాం క్రమంగా అంతమొందించింది.
సెక్స్ బానిసత్వాన్ని ఇస్లాం అనుమతిస్తుందా?
