రమజాన్ – సనాతన ఆరాధనా విధానం

చాలా మంది ముస్లిముల్లో ముస్లిమేతరుల్లో ఉన్న అపోహ ఏమిటంటే “రమజాన్ నెల రోజుల ఉపవాస ప్రక్రియ”.. కేవలం ముస్లిముల తాలూకు ఆరాధనా విధానం అన్నది.

నిజానికి నెల రోజుల ఉపవాస ప్రార్ధనా విధానం ప్రవక్త ముహమ్మద్ (స) తో ప్రారంభమయిన మొట్టమొదటి ప్రక్రియ కాదు అది పూర్వం గతించిన మహనీయుల నుండి పరంపరగా కొనసాగుతూ వస్తున్న “సనాతన ఆరాధనా విధానం” అన్న విషయాన్ని ఖురాన్ ప్రకటిస్తుంది.

“విశ్వసించిన ప్రజలారా! ఉపవాసం మీకు విధిగా నిర్ణయించబడింది – ఏ విధంగా మీకు పూర్వం ప్రవక్తలను అనుసరించేవారికి కూడా విధించబడిందో” – 2:183

గత చరిత్ర తాలూకు పేజీలు కాస్త తిరగేస్తే.. ఖురాన్ కు పూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితమే బైబిల్ పాతనిబంధనలో ఉపవాసం గురించి దాని మౌలిక లక్ష్యం గురించి ప్రస్తావించటం జరిగింది.

“దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధించబడినవారిని విడిపించుటయు ప్రతీకాడిని విరగ్గొట్టుటయు నే నేర్పర్చుకొనిన ఉపవాసం కాదా?” – యెషయా 58:6

అచ్చం ఇదే విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ (స) ఒక హదీసులో – “ఉపవాస లక్ష్యం అన్న పానీయాలు విడనాడటం కాదు, అబద్ధాన్ని విడనాడటం చెడు పనులు చెయ్యకపోవటం దుర్భాషలాడకపోవటం” అని చెప్పటం జరిగింది.

అలాగే ఖురాన్ లో ఉపవాసాన్ని “సౌం” అని పేర్కొనటం జరిగింది. “సౌం” అంటే.. “నిలిపివేయుట” “నిలిచిపోవుట” అన్న అర్థాలు వస్తాయి.అంటే మనస్సులో మెదిలే చెడు ఆలోచనలు, చెడు తలంపులు తలెత్తకుండా, కళ్లూ, కాళ్లూ, చేతులూ చెడు పనులకు పాల్పడకుండా, నోటిని చెడు మాటలు మాట్లాడకుండా నిలిపి వేయటం. అందుకే ఉపవాసాన్ని “సౌం” అని పేర్కొనటం జరిగింది.

“ఉపవాసం అన్నది ఒక్క ఉదరంలో భోజన పానీయాలను దిగకుండా ఆపటమే కాదు, మనస్సులో చెడు తలంపులు దిగకుండా ఆపటమే అసలు ఉపవాస లక్ష్యం”. ఇది రానున్న పదకొండు నెలల్లో ప్రతిబింబించాలి.

ఇక స్వయంగా యేసు నలభై రోజులు ఉపవాసం ఉండటమే కాక (మత్తయి 4:2), తన అనుచరులను ఉపవాసం ఉండాల్సిందిగా ఆజ్ఞాపించటమైంది.

“ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలెనని కాక, రహస్యమందున్న తండ్రికే కనపడవలెనని, నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకుని నీ ముఖము కడుగుకొనుము” – మత్తయి 6:17

అలాగే గీతాశాస్త్రంలో ఈ “ఉపవాస దీక్ష” “తపోయజ్ఞము” అని ప్రస్తావించటం జరిగింది (గీతా 4:28) అంటే- “వ్రత ఉపవాసాదులచే దేహమును తపింపచేసి స్వాధీనపరచుట” అని అర్థం. “ఉప” అంటే- “సమీపముగా” “వాసము” అనగా నివసించుట. “ఉపవాసము” అంటే “దేవునికి దగ్గరగా నివసించుట” అని అర్థం. హైందవ సంస్కృతిలో గమనిస్తే.. కార్తీకమాసంలో పూర్తి నెల ఉపవాసాలు పాటించే విధానాన్ని గమనించగలం.

ముఖ్యంగా అసలు రమజాన్ నెలకు ఇంత ప్రాధాన్యత దేనికి? అంటే.. “రమజాన్ నెల ఖురాన్ గ్రంథం అవతరించిన నెల (2:185)” కావటమే! అలాగే చాంద్రమాన పంచాంగం (Lunar Calander) ప్రకారం “రమజాన్” అన్నది 9 వ మాసం పేరు. ప్రవక్త ముహమ్మద్ (స) పూర్వం అవతరించిన గ్రంథాలన్నీ 9 వ మాసంలోనే అవతరించాయని ఒక హదీసులో పేర్కొనటం జరిగింది. చివరకు హిందూ పండితుల ప్రకారం భగవద్గీతా శాస్త్రం సైతం చాంద్రమాన పంచాంగం 9 వ నెల అయిన శుద్ధ మార్గశిర మాసంలోనే అవతరించిందని తెలియజేశారు.

ఈ విధంగా పూర్వ గ్రంథాలూ, ఖురాన్ అవతరించిన 9 వ నెల అయిన “రంజాన్” కు ఎంతో విశిష్ట ప్రాముఖ్యత ఉంది.

అందుకే, ఈ పూర్తి నెలలో సృష్టికర్త అయిన దేవుడు “ఏ విధంగా పూర్వం ప్రవక్తలను అనుసరించేవారికి ఉపవాసాన్ని విధి చేశాడో, అదే విధంగా ప్రవక్త ముహమ్మద్ (స) అనుచరులకు కూడా ఆ “సనాతన ఉపవాస దీక్ష”ను తిరిగి పాటించాల్సిందిగా ఆదేశించటం జరిగింది (2:183)”

ఇక ఈ పూర్తి నెలలో ఉపవాసం పాటించమనటం వెనుక ప్రధాన లక్ష్యం “భయభక్తులు జనించటానికి (2:183)” అని ఖురాన్ తెలుపుతుంది. ఈ లక్ష్యం పరిపూర్తి కానప్పుడు నెలరోజుల ఉపవాస దీక్ష అన్నది కేవలం పస్తులుండటంతో సమానమవుతుంది.

ఇంత గొప్ప లక్ష్యంతో కూడుకున్న ఈ రమజాన్ “సనాతన ఉపవాస దీక్ష”ను పాటించటానికి తగ్గ ఆరోగ్యం, అవకాశం, ఆర్ధిక వనరులు, సమయం లభించటం కూడా ఎంతో అదృష్టమే.

అలాంటి ఈ గొప్ప నెలను పొంది ఈ నెలంతా ఉపవాస దీక్షను ఉండబోతున్న నా తోటి ముస్లిం సోదర, సోదరీమణులందరికీ “రమజాన్ శుభాకాంక్షలు”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *