ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్టుగా చెడును చెడు ద్వారానే తొలగించమని ఇస్లాం చెప్పటం లేదు, కానీ- “చెడును శ్రేష్ఠమైన మంచి ద్వారా తొలగించమని చెబుతుంది. అంటే మనపట్ల చెడు తలపెట్టాలని చూసే శత్రువుల పట్ల సైతం శ్రేష్ఠమైన మంచితోనే వ్యవహరించాలన్నది ఇస్లాం నేర్పుతున్న నైతిక విలువల్లో అత్యంత ప్రధానమైన అంశం.
సాధారణంగా ఎదుటి వ్యక్తి మన పట్ల మంచిగా వ్యవహరిస్తే అతని పట్ల మనమూ మంచిగా వ్యవహరించటం, ఎదుటి వ్యక్తి మన పట్ల చెడుగా వ్యవహరిస్తే అతని పట్ల మనమూ చెడుగానే వ్యహరించటం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఈ పద్ధతికి భిన్నంగా ఖురాన్ మన పట్ల చెడుగా వ్యవహరించేవారి విషయంలో సైతం ఏకపక్షంగా శ్రేష్ఠమైన మంచితోనే వ్యవహరించాలని చెప్పటం జరుగుతుంది.
తద్వారా జరిగే పరిణామం “మన పట్ల శతృభావం కలవాడు సైతం మనకు ప్రాణ స్నేహితుడైపోవటాన్ని మనం గమనించగలం”. ఇదే విషయాన్ని ఖురాన్ చెబుతుంది.
దీనికి వ్యతిరేకంగా మన పట్ల చెడుగా వ్యవహరించేవారి పట్ల మనమూ చెడుగానే వ్యహరించటం వల్ల మన పట్ల శతృభావం కలవాడు ఇంకా కరుడుకట్టిన శత్రువుగా మారిపోతాడు.
“చెడును శ్రేష్ఠమైన మంచి ద్వారా తొలగించటం” అన్నది ఉత్తమోత్తమ వ్యక్తిత్వ నిర్మాణానికి అత్యంత అవశ్యకమైన సూత్రం. ఇంకా ఇదే ఖురాన్ వాక్యంలో “ఈ సుగుణ యోగం (అంటే చెడును శ్రేష్ఠమైన మంచి ద్వారా తొలగించటం అన్న సుగుణ యోగం) మహా అదృష్టవంతులకు తప్ప మరెవరికీ దక్కదు” – 41:35 అని చెప్పటం జరిగింది. అంటే ఇలాంటి ఉత్తమ గుణం కలిగి లేని వ్యక్తులు మహా దురదృష్ట వంతులు అని వేరేగా చెప్పాల్సిన పని లేదు కదా.
