ప్రజలతో మర్యాదగా మాట్లాడాలి

నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందన్నది ఓ పాతకాలం సామెత. ఇదే విషయాన్ని ఎంతో కాలం ముందే ఖురాన్ “ప్రజలతో మర్యాదగా మాట్లాడాలి” అని  ఆదేశించటం జరిగింది.

తోటి వ్యక్తులతో సానుకూలమైన సంబంధాలు కొనసాగటానికి మర్యాదపూర్వకమైన “నోటి మాట” అత్యంత అవసరం. మన నోటి నుండి వెలువడే మాట విషయంలో ప్రవక్త ముహమ్మద్ వారు చాలా చక్కటి విషయాన్ని చెప్పారు. అదేమిటంటే “ఎవరైతే సర్వేశ్వరుడైన దేవుని పట్ల, అంతిమ దినం పట్ల విశ్వాసం కలిగి ఉంటారో వారు ప్రజలతో మాట్లాడితే మర్యాదగా మాట్లాడాలి లేదా మౌనంగా ఉండటం ఉత్తమం”.

దీనినే The Art of Positive Speaking (సానుకూలంగా మాట్లాడే కళ) అంటారు. ఈ కళను ఎవరైతే నేర్చుకుంటారో వారు కుటుంబ వ్యవహారాల నుండి ఉద్యోగ, వ్యాపార వ్యవవహారాల వరకు ప్రతీదీ సానుకూలంగా నిర్వహించగలుగుతారు.

ఒకానొక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ శిష్యులు ఫలానా స్త్రీ దైవారాధన ఎంతో నిష్టగా చేస్తూ ఉంటుంది కానీ ప్రజలతో ఆమె చాలా దురుసుగా మాట్లాడుతుంటుంది ఆమె స్వర్గానికి వెళుతుందా? అని ప్రశ్నించగా “ఆమె నరకవాసి” అంటారు. అలాగే ఫలానా స్త్రీ దైవారాధనకు సమయం తక్కువగా కేటాయించినప్పటికీ ప్రజలతో ఎంతో మృదువుగా మాట్లాడుతూ మంచిగా వ్యవహరిస్తుంది మరి ఆమె పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తే “ఆమె స్వర్గవాసి (ఇబ్నె హన్బల్,2, 440)” అంటారు.   

అందుకే ఖురాన్…  “నీ కంఠస్వరాన్ని కొంచెం తగ్గించి మాట్లాడండి (31:19)” “మాట్లాడితే సూటిగా మాట్లాడండి (33:70)” “పలికితే న్యాయమే పలకండి (6:152)” “మీ నోట అత్యంత మంచి మాటలనే పలకండి (17:53)” “మృదువుగా మాట్లాడండి (20:44)” తలిదండ్రులతో కసురుకుంటూ మాట్లాడకండి (17:23)” అంటూ ఒక్క మాట విషయంలోనే ఖురాన్ ఎన్నో ఆదేశాలు ఇవ్వటం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *