మనిషి తాకులు జీవన రంగాలు రెండుగా వర్గీరించబడతాయి. అందులో ఒకటి వ్యక్తిగత జీవన రంగమైతే.. రెండవది- సామాజిక జీవన రంగము. వ్యక్తిగత జీవన రంగంలో నిత్యం “మంచి భావాలు”, “చెడు భావాలు” ఉన్నట్టే… సామాజిక జీవన రంగంలో సైతం “మంచి వ్యక్తులు” అలాగే “చెడ్డ వ్యక్తులు” కూడా ఉంటారు.
మనిషి ఒంటరిగా ఉన్నా, బహిరంగంలో ఉన్నా అతని అంతరంగంలో నిత్యం “మంచీ”-“చెడు” అనే ఆలోచనలు కలుగుతూనే ఉంటాయి. మంచి ఆలోచనలు మంచి చెయ్యమని ప్రేరేపిస్తూ ఉంటే.. చెడు తలంపులు విషయవాంఛల పట్ల తీవ్ర వ్యామోహాన్ని పెంచి అతని ఆలోచనలు వెర్రితలలు వేసేలా ప్రేరేపిస్తూ ఉంటాయి. మనిషి అంతరంగంలో కలిగే ఈ రెండు ఆలోచన మధ్య మనిషి తీవ్ర సంఘర్షణ నిత్యం ఎదుర్కొంటూ ఉంటాడు.
కాబట్టి మనిషి వ్యక్తిగత జీవన రంగంలో చెడు తలంపుల పట్టు నుండి మనస్సును తప్పించి, మంచి ఆలోచనల వైపు నడిపించటానికి నిత్యం చేసే గట్టి కృషిని లేదా ప్రయత్నాన్నే “అంతరంగ జిహాద్ (INTERNAL JIHAD)” అంటారు. దీనినే సామాన్య పరిభాషలో “ఆత్మ ప్రక్షాళన” అని.. ఇంగ్లీష్ లో “సెల్ఫ్ ప్యూరిఫికేషన్” అని అంటారు.
చెడు తలంపుల నుండి అదుపు సాధించి.. మనస్సును మంచి ఆలోచనల వైపు నడిపించే తీవ్ర కృషిలో చాలా మంది ఓడిపోతూ ఉంటారు. అతికొద్ది మందే విజయం సాధిస్తూ ఉంటారు. అలాంటి వారినే “సక్సెస్ఫుల్ పర్సన్స్” అంటారు. ఇదే విషయం ఖురాన్ ఈ క్రింది విధంగా పేర్కొంటుంది.
“నిశ్చయంగా తన ఆత్మలో (పెల్లుబికే చెడులను) పరిశుద్ధ పరచుకున్న వ్యక్తి సఫలుడయ్యాడు, దానిలో (అంకురించే మంచిని) అణచి వేసినవాడు విఫలుడయ్యాడు” – ఖురాన్ 91:9-10
ఈ చెడు ఆలోచనలు పరిశుద్ద పరచుకుని అతనిలో అంకురించే మంచి ఆలోచనల వైపు నడిపే ప్రక్రియే “అంతరంగ జిహాద్”! ఈ జిహాద్ ను ఒక్క ముస్లిములే కాదు మనిషిగా పుట్టిన ప్రతీ ఒక్కరూ జీవితాంతం చేస్తూ ఉండాల్సిందే. ఇదే విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ (స) ఈ క్రింది విధంగా చెబుతున్నారు.
“ఏ వ్యక్తి అయితే దైవ ప్రసన్నత కొరకు తన హృదయంలో మెదిలే చెడులతో పోరాడుతాడో అతడే వాస్తవంగా జిహాద్ చేసిన వాడు”
ప్రవక్త ముహమ్మద్ (స) పై ప్రబోధనం ప్రకారం ప్రతీ మనిషి ఏకాంతంగా ఉన్నప్పుడు, బహిరంగంగా ఉన్నప్పుడు తన హృదయంలో మెదిలే చెడు ఆలోచనలకు లొంగిపోకుండా తన మనస్సును మంచి ఆలోచనల గుప్పెట్లో పెట్టటానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అది ఎంతో శ్రమతో కూడుకున్న పని. అలా హృదయంలో మెదిలే చెడు ఆలోచనలతో మనిషి యుద్ధం చేయాల్సి ఉంటుంది. దానినే “అంతరంగ జిహాద్” అంటారు.
****
“బహిరంగ జిహాద్”
ఎలా అయితే మనిషి చెడు ఆలోచనల పట్టు నుండి తన మనస్సును మంచి ఆలోచనల వైపు నడిపించేందుకు తీవ్ర మైన కృషి చేస్తుంటాడో.. అలాగే సాజిక జీవన రంగంలో వ్యక్తులను చెడు నుండి ఆపి మంచి వైపుకు నడపటానికి తీవ్రమైన కృషి చేస్తూ ఉండటం అతని సామాజిక బాధ్యత అవుతుంది. ఆ బాధ్యత పేరే “బహిరంగ జిహాద్”. దానినే ఖురాన్ ఈ క్రింది విధంగా చెయ్యమంటుంది.
“ఇక నుండి ప్రపంచంలో మానవులకు మార్గం చూపటానికి, వారి సంస్కరణకు రంగంలో తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరే! మీరు మంచి చెయ్యండి అని ఆజ్ఞాపిస్తారు. చెడు నుండి ఆపుతారు..” – ఖురాన్ 3:110
దీనిని బట్టి వ్యక్తిగతంగా తమను తాము ప్రక్షాళన చేసుకున్న వారు ఎక్కడికోపోయి ఏకాంతంగా బ్రతకటానికి వీల్లేదు కానీ.. వారు సమాజాన్ని ప్రక్షాళన చేసే బాధ్యతను కూడా కలిగి ఉన్నారని పై ఖురాన్ వాక్యం ద్వారా తెలుస్తుంది. అంతేకాదు దుష్ట నాయకుల దౌర్జన్యం, రాజకీయ ఆధిపత్యం క్రింద నలిగిపోతున్న ప్రజానీకాన్ని వారి కబంధ హస్తాల నుండి రక్షించి, మంచి వ్యక్తుల రాజకీయ ఆధిపత్యం క్రిందకు తీసుకువచ్చే బాధ్యతను కూడా కలిగి ఉన్నారు. అదే విషయాన్ని ఖురాన్ ఈ క్రింది విధంగా వివరిస్తుంది.
“మీకు (ముస్లిములకు) ఏమైంది, ఈ బలహీనులైన పురుషులు, స్త్రీలు, పిల్లల కోసం దైవమార్గంలో ఎందుకు యుద్ధం చెయ్యరు? వారు, మా ప్రభూ! మమ్మల్ని ఈ జనావాసం నుండి విముక్తిని కలిగించు, ఇక్కడి (నాయక) జనం మహా దుర్మార్గులు, మా కోసం ఎవరైనా నీ పక్షాన ఎవరినైనా సమర్ధకులను, సహాయకులను సన్నద్ధపరచు అని వేడుకున్నారే!” – ఖురాన్ 4:75
ఈ విధంగా వ్యక్తులను మంచి ఆలోచనల వైపు నడపటం చెడు నుండి ఆపటం మరియు పీడిత ప్రజలను దుష్టనాయకుల దుష్టపాలన, అధికారం వారి దురాక్రమణల నుండి రక్షించటం, వారి కోసం దౌర్జన్యపరులతో పోరాడటం “బహిరంగ జిహాద్” అవుతుంది.
ప్రవక్త ముహమ్మద్ (స) చేసిన యుద్ధాలన్నీ దాదాపుగా ఈ కోవలోకే వస్తాయి. ఇది తెలియని కొందరు ఇస్లాంను బలవంతంగా వ్యాప్తి చెయ్యటానికి ప్రవక్త ముహమ్మద్ (స) యుద్ధాలు చేశారని, కత్తితో ఇస్లాం బలవంతంగా వ్యాపించిందని చవకబారు మాటలు మాట్లాడుతుంటారు. ఇది ఇస్లాం ప్రబోధిస్తున్న “అంతరంగ జిహాద్” మరియు “బహిరంగ జిహాద్!” జిహాద్ యొక్క ఈ ఉత్తమ లక్ష్యం సైతం తెలియని కొందరు అరమెదడు మేధావులు జిహాద్ అంటే మోసానికీ, ఉగ్రవాదానికి ప్రత్యామ్నాయ పదంగా వాడుతూ ముస్లిములను “జిహాదీ” లను హేళన చెయ్యటమే కాక “లవ్ జిహాద్” అనే పొంతన లేని దిక్కుమాలిన పదబంధకాన్ని వెలుగులోకి తెచ్చారు.
