హలాల్ ఆహారం, హలాల్ సంపద గురించి వినటం జరిగింది తప్ప “హలాల్ నికాహ్ (ధర్మ సమ్మతమైన వివాహం)” అన్న పదం వినటానికి కాస్త కొత్తగా ఉంది కదూ!
ఇలాంటి పదం కూడా ఒకటుందన్న విషయం ముస్లిం సమాజంలో తినే త్రాగే సందర్భాల్లో ఎంతో నిష్టగా హలాలా? హరామా? అన్నది చూసి మరీ తినీ త్రాగే చాలా మంది ముస్లిములకే బహుశా తెలియదంటే అతిశయోక్తి కాదేమో!
బహుశా అందుకే నేడు ముస్లిం సమాజంలో ఎవరైనా యువకుడు వరకట్నం తీసుకోకుండా వివాహం చేసుకుంటే అది ఆదర్శ వివాహమని సోషల్ మీడియాలో మాధ్యమాల్లో సైతం పెద్ద సెన్సేషన్ గా మారిపోతుంది. నిజానికి అలా పెళ్లి చేసుకోవటం పెద్ద ఘనకార్యం ఏమీ కాదు. ఇస్లాం ఆదేశాన్ని పాటించటం మాత్రమే అవుతుంది. కాకపోతే ఏ ఒక్క ముస్లిం యువకుడో ఎక్కడో అలా ఆదర్శ వివాహం చేసుకుంటే ప్రస్తుత ముస్లిం సమాజ నేపథ్యంలో అదో పెద్ద వార్తై కూర్చుంటుంది. ఇది నేటి ముస్లిం సమాజ దుస్థితికి అద్దం పడుతుంది.
చివరకు మీరు ఇంట్లో వండుకునే మాంసం సైతం ఎంతో నిష్టగా ముస్లిముల అంగళ్లలోనే ఎందుకు కొంటారు? హలాల్ చేసిన మాంసాహారాలున్న హోటేళ్లకే ఎందుకు వెళ్ళి తింటారు? అని ఏ ముస్లిమును ప్రశ్నించినా అతనిచ్చే సమాధానం- “దేవుడు మా ఖురాన్ లో చచ్చిన దాన్ని, ఇతర దేవతల పేరుతో బలిచ్చిన మాంసాన్ని “హరామ్ (నిషిద్ధం)” చేశాడు కాబట్టి! మేము చచ్చినా హలాల్ కాని దాన్ని అంటే హరామ్ ను అస్సలు ముట్టనే ముట్టము” అనే చెబుతాడు.
మరి మీరు వడ్డీ వ్యాపారం ఎందుకు చెయ్యరని ప్రశ్నిస్తే “దేవుడు ఖురాన్ లో వడ్డీ వ్యాపారం చెయ్యటాన్ని నిషేధించాడు కాబట్టి మేము అలాంటి హరామ్ సంపాదన జోలికి వెళ్లము” అనే సమాధానమే చెబుతాడు
ఇలా జీవితంలో అనేక రంగాల్లో ఎంతో నిష్టగా “హలాల్ (ధర్మ బద్ధం)” “హరామ్ (ధర్మ విరుద్ధం)” చూసుకునే అధిక శాతం మంది ముస్లిములు.. తమ జీవితంలో అతి పెద్ద ఘట్టమైన వివాహం విషయంలో హలాల్, హరామ్ లు ఎందుకు చూసుకోరు అన్నదే బిలియన్ డాలర్ల ప్రశ్న.
తాము చేసుకుంటున్నది “హలాల్ నికాహ్” అంటే ఖురాన్ ఆదేశానుసారం, ప్రవక్త ముహమ్మద్ (స) ను ఆదర్శంగా తీసుకుని చేసుకుంటున్న వివాహమా? లేక ఖురాన్ ఆదేశానికి భిన్నంగా ప్రవక్త ముహమ్మద్(స) ఆదర్శానికి వ్యతిరేకంగా చేసుకుంటున్న “హరామ్ నికాహ్”నా? అన్నది అస్సలు ఎందుకు గమనించరన్నదే చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. అలాగని నూటికి నూరు శాతం ముస్లిం సమాజం అలానే ఉందని నా ఉద్దేశం కాదు. ఏ కొందరో ఇస్లాంను నిష్టగా పాటించేవారున్నప్పటికీ అధిక శాతం మంది ఇస్లాం ఆదేశాలను తుంగలో తోక్కేశారన్నది నిజం.
ఖురాన్ ధర్మ సమ్మతం “(హలాల్) చేసిన నికాహ్” :-
“స్త్రీలను మీరు ధనం చెల్లించి వివాహమాడటం మీకు “హలాల్” చెయ్యబడింది” – ఖురాన్ 4:24
పై ఖురాన్ వాక్యంలో “స్త్రీలకు ధనం చెల్లించి వివాహమాడటాన్నే “హలాల్”గా నిర్ధారించటం జరిగింది. దీనికి వ్యతిరేకంగా స్త్రీల వద్ద నుండి ధనం తీసుకుని వివాహం చేసుకోవటం “హరామ్” అన్న విషయం వేరేగా చెప్పాల్సిన పని లేదు. పరిశుభ్రమైన వాటినే తినాలని చెప్పినప్పుడు అడ్డమైన గడ్డీ తినొద్దని వేరేగా చెప్పనక్కర్లేదు.
“స్త్రీలకు వారి మహార్ సంతోషంగా విధిగా భావిస్తూ చెల్లించండి” – ఖురాన్ 4:4
అన్న ఖురాన్ ఆదేశాన్ని బట్టి ముస్లిం పురుషులు స్త్రీలకు “సంతోషంగా ఎంతో కొంత ధన రూపంలోనో కానుకలనో బహుమతిగా చెల్లించి పెళ్లి చేసుకోవటమే “విధి (ఫర్జ్)”! ఆ విధంగా చేసుకునే ధర్మ సమ్మతమైన వివాహాన్నే ఖురాన్ పరిభాషలో “హలాల్ నికాహ్” అంటారు. దీనికి రివర్సులో స్త్రీల వద్ద నుండి “కట్నకానుకలు తీసుకుని వివాహం చేసుకుంటే “హరామ్ నికాహ్” అవుతుంది.
అలాగే వరకట్నం తీసుకోనప్పటికీ.. కొందరు పెళ్లిలో తొడుక్కునే ఖరీదైన శేర్వాణీల నుండి బిర్యానీ వడ్డింపుల వరకూ దాదాపు నాలుగు పెళ్లిళ్లు చెయ్యటానికి సరిపడా డబ్బును అమ్మాయి తరఫున తలిదండ్రుల చేత ఖర్చు పెట్టించీ, స్వతహాగా భారీ రిసెప్షన్లు ఏర్పాటు చేసుకుని ఊళ్లో సగం మంది జనాభాను పిలిచి మరీ భారీ స్థాయిలో వివాహం చేసుకుంటూ ఉంటారు.. పైకి మేము ఆదర్శ వివాహం చేసుకుంటున్నామని డప్పు కొట్టుకుంటూ! అది కూడా తప్పే!
“తక్కువ ఖర్చుతో ఏ నికాహ్ అవుతుందో ఆ నికాహ్ అత్యంత శుభాలు కలది” అని స్వయంగా ముస్లిములు ప్రాణం కంటే అమితంగా ప్రేమించే ప్రవక్త ముహమ్మదే (స) చెప్పారు.
తక్కువ ఖర్చుతో అంటే మరీ దీనంగా పెళ్లిని సంతాప సభలా చేసుకోమని కాదు. అనవసరమైన ఆర్భాటాలు, సంగీత్ ల పేరుతో డ్యాన్సులు, లక్షల్లో ఖరీదైన ఫంక్షన్ హాళ్లూ, ఆవేవో పసుపులు రాసే అర్థం పర్థం లేని ఆచారాలు, ఆయా పనికి మాలిన ఆచారాల పేరుతో పదేపదే బిర్యానీలు, వీటన్నిటికీ లక్షలు కోట్లలో అప్పులూ.. వగైరా వ్యవహారాలు లేకుండా వచ్చే అతిధులకు కనీస ఏర్పాట్లేవో చేసి తక్కువలో తక్కువ ఖర్చుతో సింపుల్ గా పెళ్లి చేసుకోవటం కూడా “హలాల్ నికాహ్”లో భాగమే. ఒకవేళ ధనవంతులైతే ఉందికదా అని డబ్బును నీళ్ల ప్రాయంగా ఖర్చు పెట్టేయకుండా తమ ధనాన్ని ధార్మిక కార్యక్రమాలకో.. తమ కుటుంబంలోనే బీదరికంలో ఉన్నవారికో ఉపయోగించగలగాలి. మొత్తానికి లేమిలోనూ కలిమిలోనూ ఇస్లాంను ఇస్లాం లానే పాటించాలి తప్ప తమకనువుగా మార్చేసుకోకూడదు.
ఇస్లాం వివాహాన్ని సులభతరం చేసి వ్యభిచారాన్ని లేకుండా చేసే సుందర సమాజాన్ని సూచిస్తుంటే.. దీనికి పూర్తి భిన్నంగా ముస్లిం సమాజం వివాహా వ్యవస్థను ఖరీదైన తంతుగా, కష్టంగా మార్చేయటం.. పైగా వరకట్నం పేరుతో స్త్రీ హింసలూ, చావులు చోటుచేసుకోవటం ముస్లిం సమాజాన్ని సామూహికంగా పతనావస్థకు దగ్గర చేస్తుంది.
ఒక రకంగా చెప్పాలంటే.. “ఇతర దేవతల పేరుతో కాక అల్లాహ్ పేరుతో బలిచ్చిన వాటిని తినటమే హలాల్” అవుతుందన్న ఖురాన్ ఆదేశం లాంటిదే.. “స్త్రీల వద్ద నుండి ధానాన్ని తీసుకోవటానికి బదులు ధనాన్ని ఇచ్చి వివాహమాడటమే హలాల్” అవుతుందన్న ఖురాన్ ఆదేశం కూడా!
బాధాకరమైన విషయం ఏమిటంటే తినే త్రాగే విషయాల్లో హలాల్, హరామ్ నిష్టగా పాటించే ముస్లిం సమాజంలో అధిక శాతం మంది వివాహం విషయం వచ్చినప్పటికి హలాల్, హరామ్ ల ప్రస్తావన ప్రక్కన పెట్టేయటం!
అంతకు మించిన బాధాకరమైన విషయం ఒకరికొరకు పెళ్లి పిలుపులకు వెళ్లినప్పుడు సైతం తాము తీసుకుంటున్న కట్నం రకం, తీసుకుంటున్న బంగారం గ్రాముల సంఖ్య ఎంతపెద్దదైతే చెప్పుకునేటప్పుడు అంత గొప్పగా స్టేటస్ సింబల్ గా ఫీలవటం! దానిని కనీసం వరకట్నంగా భావించి దాన్ని స్వతహాగా ఖురాన్ “హరామ్” చేసిందన్న స్పృహ కోల్పోవటం.. ప్రవక్త ముహమ్మద్ (స) సున్నత్ కు వ్యతిరేకం అన్న జ్ఞానం లేకపోవటం.. పైగా అలాంటి వివాహాన్ని ఖురాన్ వాక్యాల సహితంగా చేసుకోవటం. ఎంత విచిత్రం కదా!
అబ్బే! కట్నం మేము అస్సలు బలవంతంగా తీసుకోవటం లేదు వాళ్లే వద్దన్నా వినకుండా ఆనందంగా ఇస్తున్నారు అందులో తప్పేముందని చెప్పే ప్రబుద్ధులు కూడా కొందరున్నారు. ఇది ఎలాంటిదంటే.. “అబ్బే! ఆ వస్తువును కావాలాని దొంగతనం నేనెక్కడ చేశాను? ఏదో ఆ టైమ్ లో అది నా చేతికి తగిలితే తీసి జేబులో పెట్టుకున్నానంతే” అది దొంగతనం ఎలా అవుతుంది? అని దొంగతనాన్ని సమర్ధించుకోవటం లాంటిదన్న మాట!
తప్పని తెలిసీ తప్పు చెయ్యటం పాపం అవుతుంది. వద్దన్న తప్పును ఎదోలా చెయ్యటానికి అడ్డ దారులు వెతికి సమర్ధించుకోవటం అనాగరికత అవుతుంది.
మీరు పెళ్లిచేసుకునేటప్పుడు అందాన్నో, కుటుంబ నేపథ్యాన్నో, ధనాన్నో కాక ధార్మిక జ్ఞానాన్ని చూసి పెళ్లి చేసుకోమన్నారు ప్రవక్త ముహమ్మద్ (స). ఇది నేడు వరకట్నం తీసుకుని పెళ్లి చేసే అబ్బాయిల తలిదండ్రులకూ, కనీసం వారికి బుద్ధి లేకపోయినా.. వరకట్నం తీసుకుని మరీ పెళ్లి చేసుకుంటున్న బుర్ర తక్కువ యువకులకూ ఎప్పటికీ మింగుడు పడని విషయం.
“అయినా ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఇస్లాంలో ఉన్న అన్ని రూల్స్ ఎక్కడ పాటించటం ఎక్కడ అవుతుందండీ? కొన్ని విషయాల్లో అన్ని రూల్సూ పాటించాలంటే అవ్వదూ” .. అన్న డైలాగులు వాడే ముస్లిములు సైతం ముస్లిం సమాజంలో కోకొల్లలుగా ఉన్నారంటం అతిశయోక్తి కాదు. వారలా చెప్పటం పరోక్షంగా “ఇస్లాం అవుట్ డేటెడ్ (ఈ కాలానికి పనికి ధర్మం)” అయిపోయిందని ముద్ర వెయ్యటమన్న మాట.
ఇస్లాం లాంటి అల్లాహ్ ఇష్టపడే ధర్మాన్ని కలిగి ఉండి కూడా నేటి ముస్లిం సమాజం సామూహిక కష్టాలను, ప్రమాదలను, సామాజిక వివక్షను అన్ని వైపుల నుండీ ఎదుర్కుంటుందంటే ఆ జాతి మొత్తం సామూహికంగా చేసే తప్పులే కారణమవుతాయి.
వ్యభిచారం, దైవేతరుల ఆరాధన, చచ్చిన జంతు మాంసం, వడ్డీ వ్యాపారం ఎంత హరామో వరకట్నం తీసుకుని పెళ్లి చేసుకోవటం కూడా అంతే “హరామ్” అవుతుంది. దానికి బదులు అతి తక్కువ ఖర్చుతో ఖురాన్ ఆదేశాల ప్రకారం స్త్రీలకు ధనాన్ని ఇచ్చి వారిలో ధార్మిక జ్ఞానాన్ని చూసి పెళ్లి చేసుకోవటం “హలాల్ నికాహ్” అవుతుంది.
ఒక గొప్ప సమాజం నిర్మాణం అవ్వటం అన్నది కొన్ని ఉన్నత భావాలు ఆశయాలు కల కుటుంబ వ్యవస్థ నుండే ప్రారంభమవుతుంది. “అయినా కట్నం తీసుకోవటం ఈ రోజుల్లో మామూలే కదండీ”.. అని మాట్లాడే అబ్బాయి తలిదండ్రులు.. “కట్నం ఇవ్వాలని లేకున్నా అంత ఆదర్శంగా వివాహం చేసుకునేవారు ఈ రోజుల్లో లేకనే కదండీ కట్నం ఇవ్వాల్సి వస్తుందీ” అని వాపోయే అమ్మాయి తలిదండ్రులు.. “కట్నం వద్దంటే అదేం లోపముందో అని అనుమానిస్తారు కాబట్టి లైఫ్ లో సెటిలవ్వటం కోసం కట్నం తీసుకుంటున్నామని కుంటి సాకులు చెప్పే యువకులు” ముస్లిం సమాజంలోనూ ఉన్నంత కాలం ముస్లిం సామాజిక వర్గం ఉన్నత స్థితికి చేరుకోవటం పీడకల్లో సైతం సాధ్యపడని విషయం.
ఇస్లాం లాంటి ఉన్నత ధర్మాన్ని పాటించటానికి అచంచల విశ్వాసమే కాదు ఏ మాత్రం తొణకని ధైర్యం, సాహసం కూడా అవసరమే.
హలాల్ నికాహ్
