ఇస్లాం నూతనమా? సనాతనమా?

ముస్లిమేతరుల్లోనేకాదు చాలా మంది ముస్లిముల్లోనూ పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం ఇస్లాం ధర్మాన్ని ప్రవక్త ముహమ్మద్ (స) అరేబియాలో స్థాపించారన్న అపార్థం ఉందనటం అతిశయోక్తి కాదు.

వాస్తవానికి ప్రవక్త ముహమ్మద్ (స) ఇస్లాం ధర్మ పునః స్థాపకుడే తప్ప వ్యవస్థాపకుడు కాదు! కేవలం గతం నుండీ అనేకమంది ప్రవక్తల ద్వారా పరంపరగా బోధించబడుతూ వస్తున్న సనాతన ధర్మమైన ఇస్లాం ఆయన ద్వారా పునః స్థాపించబడింది అంతే.
ఒక్క మాటలో ప్రవక్త ముహమ్మద్ (స) ఎవరని ఖురాన్ ను ప్రశ్నిస్తే..

“ఇది వరకు వచ్చిన ప్రవక్తల పరంపరలోనివాడే ఈ ప్రవక్త కూడా” – 53: 56 .. అన్న సమాధానం ఖురాన్ ఇస్తుంది.
****

చివరకు బాగా ఇస్లామిక్ నాలెడ్జు ఉన్న ముస్లిములు సైతం కొన్ని సందర్భాల్లో తమ రాతల్లోనో మాటల్లోనో “గత 1400 వందల ఇస్లామియా చరిత్రలో” అని చెబుతుంటారు. నిజానికి ఇస్లాం చరిత్ర 1400 సంవత్సరాల ముందు మొదలైంది కాదు మానవుడు ఉనికిలోకి వచ్చిన నాటినుండే ఇస్లాం మొదలైంది.
ప్రవక్త ముహమ్మద్ (స) ఇస్లాం వ్యవస్థాపకుడు అన్న అపార్థానికి లోనై ఉన్న వారు గమనించాల్సింది- స్వయంగా ప్రవక్త ముహమ్మద్ (స) పై అవతరించిన ఖురాన్ గ్రంథమే స్వయంగా ఇస్లాం “సనాతన ధర్మం” అన్న విషయాన్ని ప్రకటిస్తుందన్నది.

“ఇదే సనాతన ధర్మం” – ఖురాన్ 98:5

పై వాక్యం అరబ్బీ మూలం గమనిస్తే.. “వ జాలిక దీనుల్ ఖయ్యిమ” అని చూడగలం. “ఖయ్యిమ” అన్న పదానికి.. “సనాతన, పురాతన, అనాదిగా వస్తున్న” వగైరా అర్థాలున్నాయి. “సనాతన ధర్మం” అంటే.. “Evergreen” లేదా “Everlasting” అంటే “ఎప్పటికీ ఉండే ధర్మం” అని అర్థం.
కాబట్టి ప్రవక్త ముహమ్మద్ (స) కు ఇవ్వబడిన ఇస్లాం ధర్మం ఏదైతే ఉందో అది గత ప్రవక్తలందరి ద్వారా పరంపరగా ఇవ్వబడుతూ వస్తున్న ప్రాచీన మరియు సనాతన ధర్మం మాత్రమే! ఇదే ఖురాన్ ప్రకటిస్తుంది.

ప్రవక్తా! నీకు పూర్వం గతించిన ప్రవక్తలకు దేనినతే బోధించామో దానినే నీకూ బోధిస్తున్నాము” – 41:43
****

ఇస్లాం – “ఏక దేవుని విధేయతా ధర్మం”

ఇస్లాం అన్న పదానికి సంక్షిప్త నిర్వచనం – “ఏక దేవుని విధేయతా ధర్మం”. “శాంతి” అన్నది దాని నిఘంటు అర్థం. ఒకే ఒక్క సృష్టికర్త అయిన దేవునికి మాత్రమే లోబడిపోవటమే ఇస్లాం. తప్పితే అది ముస్లిముల ప్రత్యేక మతం కాదు.

“ఏక దేవుని విధేయతా ధర్మం” బోధించిన వారు ఎవరెవరు?

ఏక దేవుని విధేయతా ధర్మానికి వ్యతిరేకంగా డబ్బు సంపాదనే ధ్యేయంగా పెట్టుకుని కొందరు వంచకులైన పండితులూ, బోధకుల ద్వారా కనిపెట్టబడిందే బహుదైవాల ఆరాధనా విధానం. దానిని ఖండించటానికి, ప్రజలను ఏక దేవుని విధేయతా ధర్మం వైపుకు ఆహ్వానించి వారిని సంస్కరించటానికే అనేక మంది దైవప్రవక్తలు ఎన్నుకోబడ్డారు. ఇదే విషయం ఖురాన్ – “మేము ప్రతీ జాతిలోనూ ఒక ప్రవక్తను ప్రభవింపజేశాము అతని ద్వారా ప్రజలకు ఇలా హెచ్చరిక చేశాము- ‘ఒక్క సృష్టికర్త అయిన దైవాన్ని మాత్రమే ఆరాధించండి బహుదైవాల ఆరాధనకు దూరంగా ఉండండి (16:36)” అని చెబుతుంది.
****

గతంలో వచ్చిన ప్రవక్తలందరికీ ఒకే ధర్మం పరంపరగా ఇవ్వబడుతూ వచ్చిందన్న విషయాన్ని ఖురాన్ ఇలా వివరిస్తుంది.

“ఆయన నూహ్ (నోవహు) ప్రవక్తకు ఆజ్ఞాపించిన ధర్మాన్నే నీకు కూడా నిర్ణయించాడు. దానినే (ఓ ముహమ్మద్) ఇప్పుడు నీ వైపుకు మేము వహీ (శృతి) ద్వారా పంపాము. దానినే మేము ఇబ్రాహీంకు, మూసా (మోషే) కూ, ఈసా (యేసు) కూ బోధించాము ఈ ధర్మాన్ని స్థాపించండీ అని” – 42:13

ధార్మిక గ్రంథాలన్నిటిలో ఉన్నది ఇస్లామేనా?

నిస్సందేహంగా. ఏ ధార్మిక గ్రంథమూ ఏక దేవుని ఆరాధన విడిచిపెట్టి మీ సెంటిమెంట్ల ప్రకారం ఎవరిష్టమొచ్చినట్లు వాళ్లు మీ మీ ఇష్ట దైవాలను ఆరాధించుకోమని చెప్పటం లేదు. ఉదాహరణకు బైబిల్..

“కాబట్టి దేవునికి లోబడి ఉండుడి” – యాకోబు 4:7

అని చెబుతుంది. ఈ విధంగా దేవునికి లోబడిపోవటమే ఇస్లాం. యేసు బైబిల్లో ఏమంటున్నారంటే.. “నన్ను పంపిన దేవుని చిత్త ప్రకారమే చేయుదును గానీ నా ఇష్ట ప్రకారం కాదు” – యోహాను 5:30. ఒక్క దేవుని “చిత్త ప్రకారం చెయ్యటం” లేక దేవునికి సరండర్ అయిపోవటమే ఇస్లాం. ఇదే భాగవద్గీతలోనూ చూడగలం..

“నన్ను మాత్రమే శరణు పొందుము” – గీతా 18:62

“ఎవరినీ ఆరాధించక నన్ను మాత్రమే ఆరాధించే వాడు సత్పురుషుడు అనబడతాడు” – గీతా 9:30

ఈ విధంగా ప్రతీ ధార్మిక గ్రంథంలోనూ “ఏక దేవుని విధేయతా ధర్మమే (ఇస్లామే) బోధించబడుతూ వచ్చింది.

యేసు స్పష్టంగా ఇస్లాం బోధించారు!

“ష్లామ షబఖ్ అనా లకుమ్, ష్లామ దిలీ యాహెబ్ అనా లకున్”
యోహాను 14:27 ఆరామాయిక్ భాషలోనిదే పై వాక్యం. ఇందులో “ష్లామ” అన్న పదం రెండు సార్లు చూడగలం. దాని అర్థం- “శాంతి”. ఇదే అరబ్బీలో “ఇస్లాం”!! “శాంతినే అనుగ్రహించుచున్నాను నా శాంతినే మీకనుగ్రహించుచున్నాను” అని తెలుగులో చూడగలం.
*****

మరి ఈ అనేక దేవుళ్లూ, అనేక మతాల పరిస్థితి ఏంటి?

సమాజంలో ఉండే భిన్న మతాలు వేరు ధార్మిక గ్రంథాల్లో ఇవ్వబడిన ధర్మం వేరు. మతాలు ఎన్నయినా పుట్టుకురావొచ్చు. ధర్మం మటుకు ఒక్కటే ఉంటుంది. ధర్మం అంటే “ధారణ చేయునది” లేదా “అనుసరించదగ్గది” అని అర్థం.
అలాగే సమాజంలో ఎంతమంది మిద్యా దేవుళ్లనైనా కల్పించుకోవచ్చు. వారికీ సృష్టికర్త అయిన దేవునికీ సంబంధం లేదు. వారూ ఆయన ద్వారా పుట్టించబడిన వారే.
అలాగే చాలా మంది ఒక ఉదాహరణ చెబుతుంటారు- “అన్ని నదులూ చివరకు సముద్రంలోనే కలిసినట్టే ఎవరిని పూజించినా ఆ దేవుణ్ణి పూజించినట్టే”అని. ఇదో కరుడుకట్టిన మూర్ఖత్వ ఉదాహరణ. ఎవరినో పట్టుకుని పూజిస్టే ఆ దేవుణ్ణి పూజించినట్టే అని సంతృప్తిపడే బదులు అదేదో ఆ సృష్టికర్తైన దేవుణ్ణే పూజిస్తే సరిపోతుందిగా? అదే కదా ధార్మిక గ్రంథాలన్నీ చెబుతుంది కూడా.

“దేవుడు ఒక్కడే. రుషులు ఆయనను అనేక పేర్లతో పిలిచారు” – ఋగ్వేదం 1:164:46 అనే చూడగలం తప్ప అనేక రూపాల్లో ఆయన్ని పూజించవచ్చు అన్న ఒక్క శ్లోకాన్ని పూర్తి హిందూ శాస్త్రాల్లో ఎక్కడా చూడలేము. గతంలో వచ్చిన అనేక ఋషిశ్వరులూ, అబ్రాహాం, మోషే, యేసు నుండి ముహమ్మద్ (స) వరకు.. ఆ ఏకైక దేవుణ్ణే “సర్వేశ్వరుడు” “పరమేశ్వరుడు” “ఈల్” “ఎలోహ్” “యెహోవా” “అల్లాహ్” వగైరా అనేక భాషల్లో అనేక పేర్లతో ఆయన్ని పిలిచారే తప్ప అనేక రూపాల్లో ఆయన్ని పూజించలేదు.

యేసు సైతం “మీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన పరలోక మందు ఉన్నాడు (మత్తయి 23:9)” అని చెప్పారే తప్ప నేను దేవుణ్ణి మీరు నన్ను పూజించుకుంటే చాలు ఆ దేవుణ్ణి పూజించినట్టే అని చెప్పినట్టు పూర్తి బైబిల్లో ఎక్కాడా చూడలేము.
ఈనాడు విగ్రహాల రూపంలో ప్రజలచే ఆరాధించబడుతున్న మహనీయులంతా ఒకప్పుడు ఏ విగ్రహమూ లేకుండా ఏక దేవుని ఆరాధన చేసినవారే.
****

కాబట్టి ధార్మిక పరిరక్షకులు చెయ్యాల్సింది ఏమిటి?

మన సనాతన ధర్మాన్ని రక్షించాలని చాలా మంది హిందువులు చెబుతుంటారు. దానర్థం గుళ్లూ గోపురాలు, విగ్రహాలూ రక్షించటమనో ఇతర మతాల ప్రజలను తన్ని తరిమేయటమనో కాదు. వ్యక్తుల్లో పేరుకుపోయిన బహుదైవాల ఆరాధనను ప్రక్షాళన చేసి వేదోపనిషత్తులూ, గీతా శాస్త్రాలు ప్రబోధిస్తున్న “ఏక దేవుని విధేయతా ధర్మాన్ని” స్థాపించటం, ధార్మిక గ్రంథాల ఆదేశాల ప్రకారం ప్రజల్లో నైతిక విలువలు పెంపొందింపజేయటమే ధర్మ పరిరక్షణ అవుతుంది. ఆనాడు రాముడూ, కృష్ణుడూ వగైరా మహనీయులంతా చేసింది అదే.

ఆలాగే “క్రైస్తవ్యాన్ని కాపాడాలని” క్రైస్తవులూ చెబుతుంటారు. దానర్థం యేసును దేవుడని నమ్ముకుని చర్చీలను సంరక్షించటం, మెళ్లో శిలువ బొమ్మలు వేసుకుని తిరగటమని కాదు. యేసు పరిచయం చేసిన తండ్రి అయిన దేవుణ్ణి మాత్రమే పూజిస్తూ.. త్రిత్వం, యేసు దైవత్వవాదం, అవతారవాదం వగైరా కల్పిత విశ్వాసాల నుండి ప్రజలను ప్రక్షాళన చేసి ఏక దేవుని వైపుకు మరల్చటమే క్రైస్తవ్యాన్ని సంరక్షించటం అవుతుంది. ఆనాడు యేసు చేసింది కూడా ఇదే.

అలాగే ఇస్లాంను కాపాడుకోవాలని కొందరు ముస్లిములూ చెబుతుంటారు. దానర్థం- మసీదులను సంరక్షించుకోవటమో, దర్గా సంస్కృతిని కాపాడుకోవటమో, ఇళ్లపై పచ్చ రంగు జండాలు పెట్టుకోవటమో, సూర్మా సెంట్లు రాసుకుని ఉర్దూలో మాట్లాడుకుంటూ తిరగటమో కాదు. ఖురాన్ ఆదేశిస్తున్న తౌహీద్ అంటే దేవుని ఏకత్వాన్ని ధృఢంగా నమ్ముతూ సమాధి ఆరాధనలు, వలియల్లాల ఆరాధనల నుండి ముస్లిములను ప్రక్షాళన చేసి ఏకైక సృష్టికర్త అయిన దేవుని ఆరాధన వైపు మరల్చి, ఖురాన్ ఆదేశాల ప్రకారం నడుచుకుంటూ ప్రజలను నడిపించటమే ఇస్లాం ధర్మాన్ని కాపాడటం అవుతుంది.

ఇలాంటి ఉత్తమోత్తమ దృక్పథాలతో కూడిన ఏక దేవుని విధేయతా ధర్మమే అనాదిగా అనేక మంది ద్వారా సకల ధార్మిక గ్రంథాల్లోనూ బోధించబడుతూ వచ్చింది. ఈ ధర్మమే చివర్లో ముహమ్మద్ (స) ద్వారా ఇస్లాం అన్న పేరుతో బోధించబడింది. కాబట్టి ఇస్లాం సనాతన ధర్మమే తప్పితే ప్రవక్త ముహమ్మద్ (స) ద్వారా స్థాపించబడిన నూతన ధర్మం కాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *