ప్రవక్త ముహమ్మద్‌(స) విషయంలోముస్లిమేతరులు చేస్తున్న అతి పెద్ద తప్పు?

గొప్ప ఉద్యమాలను నడిపిన నాయకులు చరిత్రలో ఎందరో గతించి పోయారు వారు నడిపిన ఉధ్యమాలు సైతం వారితో పాటే పుస్తకాల్లో గతకాలపు చరిత్రలుగా మిగిలిపోయాయి. కానీ, ఓ మారుమూల ఎడారి ప్రాంతంలో ఒంటరిగానే నైతిక విప్లవాన్ని ప్రారంభించి కేవలం రెండు దశాబ్దాల కాలంలోనే ఒక అనాగరిక దేశాన్ని నైతిక విలువలకు పట్టుకొమ్మగా మార్చేయ్యటమే కాక.. శతాబ్దాల తరబడి తరతరాలు ప్రజలను ప్రభావితం చేస్తూ ప్రపంచంలో అతి పెద్ద వర్గాన్ని తన దృక్పథాలపై నడిచేవారిగా మార్చేసిన ఒక ఉద్యమకారుణ్ణి కల్లో సైతం ఊహించుకోవటం కష్టమేమో!

ఆ విధంగా మానవ సమాజాలను ప్రభావితం చేసిన మహా వ్యక్తులు చరిత్రలో ఎవరైనా ఉన్నారా? అని ప్రశ్నించుకుని పరిశీలన సాగించిన వ్యక్తే ‘మెకాయిల్‌ హెచ్‌.హార్డ్‌’ అనే ఓ స్పేస్‌ సైంటిస్ట్‌. అతను కష్టపడి చరిత్రలో మానవాళిని అత్యంత ప్రభావితం చేసిన 100 మంది మహావ్యక్తుల జాబితాను సేకరించి ‘The 100 A Ranking of the Most Influential Persons in History’ అనే గ్రంథాన్ని రచించాడు.

అందులో… చరిత్రలో మానవాళిని అత్యంత “ప్రభావితం(Influence)” చేసిన 100 మంది మహా వ్యక్తుల జాబితా తయారు చేసి వారందరిలో కెల్లా అత్యధికంగా మానవాళిని ప్రభావితం చేసిన వ్యక్తిగా ప్రవక్త ముహమ్మద్‌(స)ను గుర్తించి ఆ వంద మందిలోఆయనకు మొట్టమొదటి స్థానాన్ని ఇచ్చాడు. పైగా అతను మానవ చరిత్రలో మానవాళిని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తుల్లో మొట్టమొదటి స్థానాన్ని ఇవ్వటానికి గల కారణం ఏమిటో ఇలా చెబుతున్నాడు..

”చరిత్రలో మానవాళిని ప్రభావితం చేసిన వందమంది జాబితాలో మొట్ట మొదటి స్థానం ప్రవక్త ముహమ్మద్‌కు ఇవ్వటం అన్న నా ఎంపిక చాలా మందికి ఆశ్చర్యానికి గురిచెయ్యవచ్చు కానీ ఆయన మాత్రమే చరిత్రలో ఆధ్యాత్మికంగానూ, భౌతికంగానూ గొప్ప విజయం సాధించిన ఏకైక వ్యక్తి” – మిఖాయిల్‌ హెచ్‌.హార్డ్
***
ప్రవక్త ముహమ్మద్ (స) కు ముందు – తరువాతి అరేబియా సమాజం!

ప్రవక్త ముహమ్మద్ (స) కు ముందు అరేబియా సమాజం అంటే.. నీచమైన ముఢాచారాలలో మునిగిపోయి అసలు నైతకత, మానవతా విలువలంటే ఎలా ఉంటాయో కుడా తెలియని ఆజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడే అనాగరిక జాతి. ఆడపిల్ల పుడితే సజీవంగా మట్టిలో పాతిపెట్టేసేవారు, వ్యభిచారం, తాగుడూ, జూదం, నగ్నత్వం వారికి అతి సామాన్య విషయాలు.


అలాంటి అనాగరిక జాతి సంస్కర్తగా ప్రవక్త ముహమ్మద్ (స) నియమించబడ్డారు. తప్పితే ఆయన పంపబడింది నాగరికంగా ఎంతో ఎత్తుకు ఎదిగిన జాతిని నడిపించటానికి కాదు. ఆ తరువాత ఆయన సరిగ్గా 23 ఏళ్లు నడిపిన “వ్యక్తి సంస్కరణోధ్యమం” ద్వారా వారిని ఎంతగా ప్రభావితం చేశారంటే.. ఒకప్పటి ఆ అనాగరిక అరేబియా జాతి ప్రపంచానికే ఉత్తమ నాగరికత, నైతిక విలువలు నేర్పే గురువు స్థానానికి చేరిపోయింది. వారి ప్రస్థానం కేవలం ఆధ్యాత్మికత వరకే ఆగిపోలేదు ప్రపంచ వైద్య, వైజ్ఞానిక, ఖగోళ శాస్త్ర పరిశోధనల్లో ఓ క్రొత్త మలుపు త్రిప్పేవారిగా, ఎంతో మెరుగైన సంస్కృతిని నేర్పేవారిగా మారిపోయారు. 7 వ శతాబ్దంలో భారత దేశానికి వ్యాపారం నిమిత్తం వచ్చిన అరబ్బులను ఉద్దేశిస్తూ జవహార్ లాల్ నెహ్రూ సైతం తన పుస్తకం “ది డిస్కవరీ ఆఫ్ ఇండియా”లో.. “ఎప్పుడైతే అరబ్బులు భారత దేశానికి వచ్చారో వారు తమతో పాటు ఎంతో మెరుగైన సంస్కృతిని తీసుకొచ్చారు” అని పేర్కొనటం జరిగింది.

ముహమ్మద్ (స) తీసుకొచ్చిన నైతిక విప్లవం ఓ సరిక్రొత్త ప్రపంచాన్ని సృష్టించింది. అతికొద్ది కాలంలోనే ఆసియా, యూరప్, ఆఫ్రికా, ఐరోపా, ఇండియా వగైరా సకల దేశాల ప్రజలూ ఆయన బోధల పట్ల ప్రభావితమవుతూపోయారు. పండితుల నుండి పామరులవరకూ ఎన్నో రంగాలలో పరిశోధనలు చేసిన గొప్ప తత్వవేత్తల నుండి గొప్ప విద్యావేత్తలూ శాస్త్రవేత్తల వరకు ఆయన బోధలకు ప్రభావితమయ్యారు.


తన బోధల పట్ల ప్రజలను ఆకర్షించటానికి ఆయన ఏవో అసాధారణ మహిమలో మాయలో మంత్రాలో చూపలేదు కేవలం ఆనాటి ప్రజలను ప్రతీ విషయాన్ని గుడ్డిగా కాక హేతుబద్ధంగా ఆలోచనా చేసే వారిగా మార్చేశారు. స్త్రీలకు ఉన్నతమైన హక్కులను కల్పించారు. సృష్టి నిర్మాణం పట్ల శాస్త్రీయ కోణంలో ఆలోచన చేసేవారిగా మార్చేశారు. బానిస శృంఖలాలలో మగ్గిపోతున్న పీడిత ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించటమే కాక మనుషుల మధ్య ఉచ్చనీచ భావాలను తుడిచిపెట్టేశారు. మనిషి కులం, మతం, జాతి పరంగా గొప్పవాడు కాలేడు కేవలం అతని సదాచారణ కారణంగానే దేవుని దృష్టిలో ఎవరైనా గొప్పవానిగా పరిగణించబడతారని చెప్పి సమానత్వాన్ని స్థాపించారు.

ఆనాడు ప్రవక్త ముహమ్మద్ (స) ప్రారంభించిన “వ్యక్తి సంస్కరణోధ్యమం” అక్కడితో ఆగిపోలేదు.. 14 వందల సంవత్సరాల నుండి ఈనాటి వరకు తరతరాలుగా మానవాళిని ప్రభావితం చేస్తూనే ఉంది. ప్రపంచ మానవాళిలో ఒక పెద్ద సమూహాన్ని తన ఉద్యమం వైపు ఆకర్షించగలగటం, వారిపై తన వ్యక్తిత్వం తాలూకు బలమైన ప్రభావాన్ని తరతరాలుగా వేస్తూ రావటం అన్నది ఎంతో ఉన్నత వ్యక్తిత్వం, తన ఉద్యమం పట్ల నిబద్ధత, సత్యత కలిగి ఉండే గొప్ప నాయకుడికే సాధ్యమవుతుందన్న కొలమాన్ని దృష్టిలో పెట్టుకుంటే యేసు గతించిన 600 సం.ల తరువాత ప్రవక్తగా నియమితులైన ముహమ్మద్‌(స) వ్యక్తి సంస్కరణోధ్యమాన్ని నడిపి తన ప్రభావాన్ని (Influence) మానవాళిపై ఎంత బలంగా వేయగలిగారంటే ఈనాడు ప్రపంచ జనాభాలో మూడొంతుల్లో ఒక వంతు ప్రజలు ఆయన్ని అనుసరించేంత.

ప్రపంచజనాభాలో యేసును అనుసరించేవారు సైతం నేడు మూడొంతుల్లో ఒక వంతు జనాభా ఉన్నప్పటికీ ఆయన తాలూకు ప్రభావం కేవలం ఆధ్యాత్మికం వరకే పరిమితం అయిపోయింది. కానీ ప్రవక్త ముహమ్మద్‌(స) అటు ఆధ్యాత్మిక రంగమే కాక, ఇటు భౌతిక, రాజకీయ, ఆర్థిక రంగాలలో సైతం విజయం సాధించి ఎన్నో దిశానిర్దేశాలు చెయ్యటం జరిగింది. ఇదే విషయాన్ని ఓ చరిత్రకారుడు ఈ క్రింది విధంగా అభివర్ణించటం జరిగింది.

“… తత్వవేత్త, వక్త, ప్రవక్త, శాసనకర్త, యోధుడు, భావాల విజేత, హేతుబద్ధమైన విశ్వాసాల సంస్థాపకుడు, విగ్రహాలు లేని ఆరాధనా బోధకుడు, ఇరవై ప్రపంచ సామ్రాజ్యాలు, ఒక ఆధ్యాత్మిక సామ్రాజ్య స్థాపకుడు – ఆయనే ముహమ్మద్ . మానవ ఔన్నత్యాన్ని కొలిచే సకల ప్రమాణాల రీత్యా ఆయన కంటే గొప్పవాడు ఎవడైనా ఉన్నడా అని నేడు ప్రశ్నిస్తే దానికి జవాబు లేదు” – Lamartime, History dela Turquie, Paris 1854, Vol 2, Pg 276, 277

1935 సం.లో ‘యునైటెడ్‌ స్టేట్స్‌’ సుప్రీం కోర్టు, చరిత్రలో ప్రపంచానికి గొప్ప ధర్మ శాస్రాలు అందించిన 18 మంది మహావ్యక్తులలో ఒకనిగా ప్రవక్త ముహమ్మద్‌(స)ను గుర్తించటాన్ని బట్టి ఆయన మానవాళికి అందించిన ఖురాన్ శాస్త్రం ఎంతటి హేతుబద్ధమైన న్యాయసూత్రాలను ప్రతిపాదిస్తుందో అర్థం చేసుకోగలం.
***
అయితే ఇలాంటి గొప్ప ఉధ్యమకారుని వ్యక్తిత్వం పట్ల సామాన్య ప్రజలు ఎక్కడ ఆకర్షితులవుతారో అని కొందరు పన్నిన కుట్ర ఏమిటంటే- ఆయన వ్యక్తిగత జీవితం విషయంలో లోపాలు ఎంచటం. ఆయన నిజంగా దైవ ప్రవక్తే అయితే బహుభార్యత్వం కలిగి ఉండటమేమిటి? ఆయన తనకన్నా పెద్ద వయసున్న స్త్రీని వివాహమాడటమేమిటి? ఆయన తొమ్మిదేళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకునేవాడా? స్వంత కోడలిని పెళ్లిచేసుకునేవాడా? వగైరా ప్రశ్నలు సామాన్య ప్రజల మెదళ్లలో నింపటం మొదలెట్టారు.
నిజానికి ప్రవక్త ముహమ్మద్ (స) 53 సం. ల వరకూ ఒకే భార్య కలిగి ఉండేవారు ఆ తరువాత ఆయన చేసుకున్న వివాహాలన్నీ నిత్యం యుద్ధాలు చేసుకుంటూ వేరు వేరు వర్గాలుగా విడిపోయిన వారిని కలపటానికి మాత్రమే చేసుకున్నారన్న విషయం నేటి గుడ్డి విమర్శకులకు తెలీదు. ఎందుకంటే ఎవరైనా ఒక జాతి స్త్రీని వివాహమాడితే ఆప్పట్లో ఆ జాతి మొత్తం అతన్ని అల్లుడిగా పరిగణించేది. అలా ఆయన చేసుకున్న పెళ్లిళ్లలో అధికశాతం నిత్యం కలహించుకునే వేర్వేరు వర్గాలను కలపటానికి చేసుకోవలసి వచ్చింది. పైగా ఆయన చేసుకున్న వారిలో ఒకరిద్దరు తప్ప అందరూ వితంతువులు, విడాకులైపోయిన స్త్రీలే.

ప్రవక్త ముహమ్మద్ (స) వద్ద జైద్ అనే వ్యక్తి ఉండేవాడు. అతను నోటి మాటగా కుమారుడు అని పిలబడేవాడు తప్ప అతను స్వంత పుత్రుడూ కాదు కనీసం దత్త పుత్రుడు కూడా కాడు. అతనికి ప్రవక్త ముహమ్మద్ (స) తన మేనత్త కూతురికి ఇచ్చి వివాహం కూడా చేస్తారు. అయితే ఆ వ్యక్తికీ అతని భార్యకూ పరస్పరం పొసగక విడాకులైపోతాయి. ఆ నేపథ్యంలో “దత్త పుత్రుడు కూడా స్వంత కుమారునితో సమానం” అనే ఓ దురాచారం ప్రజల్లో ఉండేది. అది ధార్మికంగానూ, నైతికంగా, ప్రకృతిపరంగానూ తప్పే. అలాంటి తప్పుడు భావనను ఆచరణాత్మకంగా తుడిచి పెట్టటానికి వారి విడాకుల అనంతరం ఆమెను పెళ్లి చేసుకోవలసి వచ్చింది.

ఇక తొమ్మిదేళ్ల వయసులో ఆయిషా (రజి) వారిని ఆయన ఎలా పెళ్లి చేసుకున్నారన్న వాదన చాలా మంది అత్యధికంగా లేవనెత్తుతూ ఉంటారు. కొన్ని హదీసుల్లో ఆమె వయసు 9 అని ఉన్నప్పటికీ.. మరికొన్ని హదీసుల్లో ఎన్నో ఆధారాలను బట్టి ప్రవక్త ముహమ్మద్ (స) ఆమెను పెళ్లిచేసుకునే నాటికి ఆమె వయసు 9 కాదు 19 అని తేల్చారు. ఆమె వయసు ఎంత అన్నది ప్రక్కన పెడితే అసలు విషయం ఏమిటంటే.. ప్రవక్త ముహమ్మద్ (స) ఆయిషా (రజి) వారిని పెళ్లి చేసుకోక ముందే ‘జాబర్ ఇబ్నె అల్ మోతిమ్’ అనే వ్యక్తితో ఆమె నిశ్చితార్థం జరిగి ఏదో కారణంగా రద్ధయిపోతుంది. దీనిని బట్టి అప్పటికే ఆమె పెళ్లీడుకొచ్చిన స్త్రీ. పైగా అప్పట్లో అలా నిశ్చితార్ధం జరిగి రద్దయిపోయిన స్త్రీని అమ్మకానికి పెట్టేసే దారుణమైన ముఢాచారం కూడా ఒకటి ఉండేది. ఆనేపథ్యంలో ప్రవక్త ముహమ్మద్ (స) స్నేహితుని కుమార్తె అయిన ఆమెను పెళ్లి చేసుకుంటారు. అది ఆమె ఇష్టపడి పెళ్లి చేసుకున్న వివాహమే తప్ప నేడు కొందరు ఊహించుకుంటున్నట్టు బలవంతపు బాల్య వివాహం కాదు.

ఇక ఆయన జీవిత కాలంలో చేసిన యుద్ధాలు సైతం కేవలం కొందరు దౌర్జన్య పరులు ఆయన ధర్మాన్ని, ఆయన అనుచరుల్ని తుదముట్టించటానికి పన్నాగం పన్ని యుద్ధానికి కాలుదువ్విన నేపథ్యంలో ప్రాణరక్షణ నిమిత్తం యుద్ధాలు చేయాల్సి వచ్చిందే తప్ప సామాన్యులపై ఉద్దేశపూర్వకంగా చేసిన యుద్ధాలు కావు. కానీ ఈ అంశాలన్నిటి చుట్టూ అనేక అపార్థాలు అల్లబడ్డాయి.

ఈ వాస్తవాలను గ్రహించకుండా పైగా అసలు ప్రవక్త ముహమ్మద్ (స) ఆనాడు చేపట్టిన “వ్యక్తి సంస్కరణోధ్యమం” గురించి ఏ మాత్రం ఆలోచన చెయ్యకుండా, ఆయన బోధల్లో హేతుబద్ధతను గురించి ఆయన ప్రభావాత్మక బోధల గురించి ఆలోచన చెయ్యక ఆయన వ్యక్తిగత జీవితంపై కొందరు కల్పించిన ఎందుకూ పనికి రాని విమర్శలను పట్టుకుని ఆయన్ని అపార్థం చేసుకోవటమే నేడు చాలా మంది ముస్లిమేతరులు ప్రవక్త ముహమ్మద్ (స) విషయంలో చేస్తున్న అతి పెద్ద తప్పు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *