“జిహాద్” అన్న పదానికి అర్థం ఇదే

చెడు ఆలోచనలతో పోరాడటం, శాంతి స్థాపనకు చేసే తీవ్రమైన కృషి ‘ప్రయత్నం’.. అణచివేతకు, అన్యాయానికి వ్యతిరేకంగా చేసే ‘ధర్మపోరాటం’ అన్న అర్థాలే తప్పా జిహాద్ అన్న పదం పూర్తి ఖురాన్లో మోసానికో లేక ఉగ్రవాదానికో ప్రత్యామ్నాయంగా ఎక్కడా వాడబడలేదు. ఖురాన్ లో వాడబడని అర్థంలో కాక వేరే అర్థంలో ఎవరు ఎక్కడ వాడినా అది చెల్లదు.

“జిహాద్” అన్న అరబీ భాషా పదానికి ధాతువు జ.హ.దా. అంటే దానర్థం- “శ్రమించటం (To struggle)” “కృషి చెయ్యటం (To strive)” మాత్రమే! దీనిని దృష్టిలో పెట్టుకుంటే.. ‘జిహాద్ శక్తి (Spirit of Jihad)’ అన్నది నిర్మాణం కొరకే తప్ప.. విచ్చిన్నానికి కాదు!
ఉదాహరణకు..

సమాజంలో మంచికోసం శ్రమించటం, ప్రజా సేవ చెయ్యటం జిహాద్..

కఠిన సమయాల్లో నవ్వగలగటం, కష్టాల్లో సహనంగా ఉండగలటం జిహాద్..

తన బద్ధ శత్రువునైనా క్షమించగలగటం జిహాద్..

హృదయంలో మెదిలే చెడులతో పోరాడటం జిహాద్..

వృద్ధ తలిదండ్రులను అప్యాయతతో చూసుకోవటం జిహాద్..

ప్రజలను నిజాయితీతో పాలించటం జిహాద్..

చెడు రూపుమాపి శాంతి స్థాపనకు కృషి చెయ్యటం జిహాద్..

జాతి జనుల కోసం అవసరమైతే ఆత్మబలిదానం ఇవ్వటం జిహాద్..
ఎవరైనా ఆశక్తి ఉండి మొత్తం ఇస్లాంను అధ్యయనం చేశాక వారిని “జిహాద్” అన్న పదాన్ని నిర్వచించమంటే పై అర్థాలే చెబుతారు.
* * * *

మరి టెర్రరిజం చేస్తున్న ‘ఉగ్రవాదులు’ జిహాదీలు కారా?

అసలు ముందుగా అల్ – ఖైదా, ఐ.ఎస్ ఉగ్రవాదులు టోపీలు గెడ్డాలు పెట్టుకుని, ఉర్దూ/అరబిక్ పేర్లను పెట్టుకోవటాన్ని బట్టి వారంతా ముస్లిములేనని భావించటం దూరం నుండి చూసి కంచర గాడిదలను అరేబియన్ గుర్రాలని అపార్థం చేసుకోవటం లాంటిదే!

ఉదాహరణకు: షాహిన్ బాగ్ ప్రొటెస్ట్ జరుగుతుండగా రామ్ భక్త్ గోపాల్ అనే వ్యక్తి “జై శ్రీరాం” అని పలుకుతూనే గన్ ఫైరింగ్ చేసిన సంఘటన దేశమంతా చూసింది. అలాగే మైనారిటీలపై, ముస్లిముల పై “జై శ్రీరామ్” అనే చెప్పమంటూ అనేక దాడులు జరిగాయి.. ఢిల్లీలో ముస్లిములపై జై శ్రీరామ్ నినాదాలు చేస్తూనే దాడులు చేసినట్టు అనేక పత్రికల్లో చదివాం. దానర్థం శ్రీరాముడు రామాయణంలో తన అనుచరులను “జై శ్రీరామ్” అని పలుకుతూ దౌర్జన్యాలు చెయ్యమన్నాడని అనవచ్చా? అచ్చం జిహాద్ పరిస్థితి కూడా అదే. ఒకవేళ ఎవరైనా తీవ్రవాదం చేస్తూ దానిని “జిహాద్” అని చెబితే దానిని మూర్ఖత్వం అనాలి. ఒకవేళ ఎవరైనా ఉగ్రవాదం చేస్తే దానికి “జిహాద్” అని పేరుపెడితే దానిని అజ్ఞానం అని చెప్పాలి.
* * * *

స్వాతంత్రోద్యమంలో ప్రాణాలు అర్పించిన ముస్లిములు అసలు “జిహాదీ”లంటే!

కొందరు సోషల్ మీడియాలో వెటకారంగా ముస్లిములను “జిహాదీలు” అని పిలుస్తూ హేళన చేస్తుంటారు. నిజానికి “జిహాదీ” అంటే అన్యాయానికి, అధర్మానికి, దౌర్జన్యానికి చెడుకు వ్యతిరేకంగా పోరాడే యోధుడు అని అర్థం. ఈ విషయం ఉగ్రవాదం చేసేటోల్లను పట్టుకుని జిహాదీలని, వారు చేసేది జిహాద్ అని పేర్లు పెట్టే అర మెదడు విశ్లేషకులకు తెలీదు.

అన్యాయంగా ఈ దేశసంపదను దోచుకొని, ఈ దేశ ప్రజలను అణచివేతకు గురిచేసిన బ్రిటిష్ ప్రభుత్వపు బానిస సంకెళ్ళ నుండి భారత దేశాన్ని విముక్తి చేయటానికి వారి దౌర్జన్యానికి వ్యతిరేకంగా తమ తోటి హిందూ సోదరులతో భుజం కలిపి ఈ దేశం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా విడిచిపెట్టిన వెలకొద్దీ ముస్లిం వీరులు నిజమైన జిహాదీలంటే.

“లవ్ జిహాద్” ఓ దిక్కుమాలిన పదబంధం!

పై విశ్లేషణలో జిహాద్ యొక్క అసలు అర్థం చదివాక ఎవరికైనా “లవ్ జిహాద్” అన్నది ఎంత అజ్ఞానపురితమైన పొంతనలేని పనికిమాలిన పదబంధమో అర్థం చేసుకోగలరు.
అన్యాయాన్ని, చెడును, మోసాన్ని, దౌర్జన్యాన్ని అణచటానికి చేసే ప్రయత్నం జిహాద్ అయితే.. మోసం చెయ్యటాన్నో, అన్యాయం చెయ్యటాన్నో “జిహాద్” అని ఎవరైనా అంటే అలాంటి వారిని అజ్ఞానులు లేక మూర్ఖులు అని చెప్పినా తక్కువే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *