ఆరోజు సాయంత్రం రామచంద్రాపురం నుండి కాకినాడకు నాతో పాటే అక్కడ జూనియర్ కాలేజీలో చదివిన నా క్లాస్ మెట్ సురేషూ, అతనితో పాటు వచ్చిన జైనులబ్బాయి, మరో ఇద్దరు ఫ్రెండ్సూ నన్ను కలిసి ఆమాటా ఈమాట చాలా సేపు మాట్లాడుకున్నాక .. రానన్నా బలవంతంగా ఓ వారం ముందు సంగీత్ ధియేటర్ లో రిలీజైన ఖడ్గం సినిమాకు లాక్కెళ్లారు మొత్తానికి.
వాళ్లంతా ఆసక్తిగా సినిమా చూస్తున్నారు. నేను ఆ సినిమాలో ముస్లిముల గెటప్పులేసి టెర్రరిస్టుగా నటింపజేస్తున్న కొన్ని పాత్రల వైపు చూస్తున్నాను.
* * *
జలియన్ వాలాబాగ్ లో వందల మందిని చంపేసిందీ టెర్రరిజమే, రెండవ ప్రపంచయుద్ధంలో కోట్ల మందిని చంపేయటమూ టెర్రరిజమే, తమిళ టైగర్లు, మావోయిస్టులు, నక్సలేట్లు చేసేదీ టెర్రరిజమే! వారితో పాటు పాకిస్తాన్లో ముస్లిముల పేర్లు పెట్టుకుని కొందరు మూర్ఖులు చేసేదీ టెర్రరిజమే!
కానీ, కంగారూ జంతువులు ప్రత్యేకంగా ఆస్ట్రేలియాలోనే ఉంటారన్నట్టు టెర్రరిజం చేసేటోల్లంతా ముస్లిం సమాజంలోనే ఉంటారన్న చందంగా.. ప్రత్యేకంగా టెర్రరిస్టులనే ఓ జాతిని సినిమాల్లో చూపాలనుకున్నప్పుడల్లా ఇక్కడోళ్లకు తలపై టోపీ, కళ్లకు సుర్మా, పొడవాటి గెడ్డాల గెటప్పులేసి టెర్రరిస్టులుగా చిత్రీకరిస్తుంటే ఆ గెటప్పులకు మనోళ్లు భలే సూటైపోతారని నవ్వుకుంటూ ఆ ఆలోచనలతో మొత్తానికి సినిమా చూడటం అయింది.
మేమంతా నడుచుకుంటూ భానుగుడి సెంటర్ నుండి కోకిలా హోటేలుకు టిఫిన్ చెద్దామని బయలుదేరాం. ఆ వచ్చే దారిలో మా సురేషు గాడి ఫ్రెండ్స్ లో ఒకడు “టెర్రరిస్టులు అల్లాహుక్బర్” అన్న స్లోగాన్ ఎక్కువగా వాడుతుంటారు కదా.
అచ్చం ఇదే నేను మా వీధి చివర్న ఉండే మసీదులో కూడా చాలా సార్లు వింటూ ఉంటాను.
కానీ నిజంగా మీ అల్లా మీ మతంలో టెర్రరిస్టులకు అలా పలికుతూ నిజంగా జనాల్ని చంపమన్నాడా?” అనడిగేసాడు డైరెక్టుగా. బహుశా అప్పుడే చూసొచ్చిన సినిమా ప్రభావం కాబోలు.
ఆ సమయంలో అతనడిగిన ప్రశ్నకు నాకున్న, అతనికున్న వయసుకు, పైగా ఓ సామాన్య యువకుడిగా అతను అర్థం చేసుకునే స్థాయికి తగ్గట్టు ఎలా వివరించాలో చాలాసేపు నాకే పాలుపోలేదు.
* * *
టిఫిన్లు తినటం అయిపోయాక బస్ స్టేషన్ వైపుకు మెల్లగా నడుచుకుంటూ వెలుతున్న దారిలోనే సెట్టర్ దింపేసున్న ఓ వైన్ షాప్ కనపడింది.
దాని బోర్డుపై “శ్రీ శ్రీనివాసా వైన్స్” అని పెద్దక్షరాలతో రాసుంది. ఆ పేరు చదవమన్నానా ప్రశ్న అడిగిన అబ్బాయిని.
వైన్ షాపుకు “శ్రీ శ్రీనివాసుడి” పేరును వారు పెట్టుకోటాన్ని బట్టి గతంలో శ్రీనివాసుడు వైన్ తాగేవాడని గానీ, వైన్ అంటే ఆయనకు ఇష్టమని గానీ, వైన్ షాపులకు నా పేరు పెట్టుకుని లాభాలు గడించమని గానీ ఆయన చెప్పాడని నేను అనుకుంటున్నాను మీరేమంటారు?” అనడిగాను.
నా ప్రశ్నకు బస్ స్టేషన్ వైపుకు కదులుతున్న గుంపులో ఒక్కసారిగా ప్రకంపనలు బయలుదేరాయి.
అందరూ ఒక్కసారిగా నా వంక చూశారు. నేనెప్పుడూ అలా మాట్లాడటం చూడని మా సురేషు గాడు కూడా అదోరకమైన చూపుతో నావంక చూస్తున్నాడు.
“ఏం మాట్లాడుతున్నారు మీరు?” అనడిగాడా కాస్సేపు క్రితం నన్ను ప్రశ్న అడిగినా అబ్బాయి.
దేశంలో కొన్ని కోట్ల మంది ఆరాధ్యదైవం మా శ్రీనివాసుడు. ఆయన గొప్ప చరిత్ర ఉంది. ఎందరో ఆయన్ని భక్తితో కొలుస్తారు. కాబట్టి ఎవరో కొందరు ఇలాంటి బుర్రలేనోల్లు వైన్ షాపులకు శ్రీరామా వైన్స్ అనో, శ్రీనివాసా వైన్స్ అనో పేర్లు పెట్టేసుకున్నంత మాత్రనా మీరలా ఊహించేసుకోవటం ఏం బాగోలేదన్నాడతను కాస్త కోపంతో కూడిన అసహనంతో ఊగిపోతూ.
* * *
మరి ప్రపంచ వ్యాప్తంగా బిలియన్ల కొద్దీ ప్రజలు భక్తి శ్రద్ధలతో ఐదు పుట్లా ఆరాధించే అల్లాహ్.. టెర్రరిస్టులకు ‘అల్లాహుఅక్బర్’ అని పలుకుతూ టెర్రరిజం చెయ్యమని చెప్పి ఉంటాడంటారా?
బ్యాంకు లాకర్ కొట్టేయటానికి బయలుదేరేటప్పుడు కూడా ఓ దొంగోడు ఆ పని సక్సస్ అవ్వాలని దణ్దమెట్టుకునే బయలుదేరతాడు.
కాబట్టి అతని ఆరాధ్య దైవానికీ ఆ బ్యాంకు రాబరికీ లింకు పెట్టేయటం కరక్టేనంటారా? అనడిగాను.
శ్రీనివాసుడి, శ్రీరాముడి పేర్లు పెట్టుకున్న ఆ వైన్ షాప్ ఒనర్ల లాంటోల్లే ఆ అల్లాహుఅక్బర్ అని పలుకుతూ టెర్రరిజం చేసేటోల్లంతా అని నేనంటాను దానికి నువ్వేమంటావూ అనడిగాను. అతని నోట మాట రావటంలేదు.
నా లాజిక్కు అర్థమై.. ఓహో వీడడిగిన ప్రశ్నకు ఈలాజిక్కులు ఉపయోగించి వివరిస్తున్నారా స్వామీ మీరు అన్నాడు ఆగుంపులో మరొకతను నవ్వుకుంటూ నా జబ్బ మీద కొడుతూ.
* * *
ప్రపంచంలో కోట్ల మందున్న ఉత్తములైన ముస్లిములు ‘అల్లాహుఅక్బర్’ అన్న పదాన్ని ‘దేవుడే గొప్పోడు’ అన్న అర్థంలో వాడుతున్నారు. వారిలో ఒక్క శాతం కూడా ఉండని కొందరు టెర్రరిస్టులు తమ అనవగాహనతో ఆ పదాన్ని వాడుతూ టెర్రరిజం చేసినంత మాత్రానా ఆ పదాన్ని టెర్రరిస్టులు వాడేపదం అని భావించటం.. ఆ పదాన్ని నెగెటివ్ గా తీసుకోవటం ఎంతవరకు కారెక్టన్నది నీ ఆలోచనలకే వదిలిపెడుతున్నానన్నాను చివరిగా.
… ఇంతలో వారెక్కాల్సిన బస్సు వచ్చింది. మెల్లగా కదిలేళ్లుతున్న ఆ బస్సు కిటికీలోంచి నన్ను ప్రశ్నించినతను ఏదో ఆలోచనలో పడ్డట్టు నావంకే చూస్తున్నాడు.. ఆ బస్సు కదిలెళ్లిపోయింది.
“అల్లాహుఅక్బర్” – టెర్రరిస్టుల నినాదమా?
