కరుడుగట్టిన ధ్వేషం నుండి ఇస్లాం వైపుకు..

ఇస్లాం పట్ల ధ్వేషం విషయంలో ఏ ఒక్క ఇస్లామోఫోబిక్ అయినా అమెరికన్ మిలట్రీ ఆఫీసర్ గా పనిచేసిన “రిచర్డ్ ఎం.సీ. కిన్నే”తో సరిపోరని చెప్పటం అతిశయోక్తి కాదేమో.

ఎందుకంటే ఇస్లాంను ధ్వేషించే, విమర్శించే వారు చాలా మంది ఉండొచ్చు. కానీ స్వయంగా తన చేతులతో శక్తివంతమైన బాంబును తయారుచేసి ముస్లిములను చంపెయ్యాలనుకున్నంత ధ్వేషం అతనిది. ముస్లిములు కనపడితే వారి తలలు నరికెయ్యాలన్నంత కోపం అతనిది.

అలాంటి కరుగట్టిన ఇస్లాం ధ్వేషి.. చివరికి ఇస్లాంనే స్వీకరించి ప్రస్తుతం ఇస్లాం అవగాహన లేని ఎందరికో ఇస్లాం వాస్తవ బోధలు నేర్పుతున్న అతని జీవిత కథ చాలా ఆశక్తికరమైంది.

****

అమెరికా మధ్య పశ్చిమ ప్రాంతమైన ఇండియానా రాష్ట్రంలో ‘మున్సీ’ కి చెందిన “రిచర్డ్ ఎం.సీ. కిన్నే” యూ.ఎస్. మిలట్రీ ఉండగా ఇరాక్ తో యుద్ధం చేస్తున్నప్పుడు గాయపడి 25 సం.లకే రిటైర్ అవ్వాల్సి వచ్చింది. ఇస్లాం తన ప్రధాన శత్రువు అన్న నిర్ణయానికి అప్పటికే వచ్చేశాడు. ఇండియానా మున్సీ లో ఉన్న ఇస్లామిక్ సెంటర్ ను బాంబ్ పెట్టి పేల్చేసి కనీసం అక్కడకు రోజూ వచ్చే రెండుమూడొందల మందిని చంపేయ్యాలని పథకం పన్నాడు.

ఇస్లాం పట్ల ఇంత పగను, ధ్వేషాన్ని ఏ ఒక్కరిలో అయినా ఎవరు నూరి పోయ్యగలరు? నిస్సందేహంగా ఇస్లామోఫోబియాను పెంచి పోషించే ఒక్క మీడియా తప్ప ఎవరు కాగలరు. మీడియా ఇస్లాం పట్ల నిత్యం వెళ్లగక్కే పైత్యం, ఎక్కడ ఏ ముస్లిం పేరు పెట్టుకుని నేరం చేసినా దానిని “ఇస్లామిక్ టెర్రరిజం” అంటూ పదే పదే చెబుతూ మీడియా ప్రదర్శిస్తూ ఉండే ఉన్మాదం ఆ రిచర్డ్ లో ఇస్లాం పట్ల ధ్వేషాన్ని క్రమంగా తార స్థాయికి తీసుకెళ్లింది. అతన్నో కరుడుగట్టిన ఇస్లామోఫోబిక్ గా మార్చేసింది.

ఎంతవరకు అంటే జీవితంలో ఎంతో కొంత ముస్లిం సముదాయాన్ని చంపేసేంత. దానికి ప్రారంభం తన ఇంటి దగ్గర్లోనే “మున్సీ ఇస్లామిక్ సెంటర్” నుండి ప్రారంభించాలని పన్నాగం పన్నాడా రిచర్డు.

దాన్ని బాంబ్ పెట్టి డిటోనేటర్ ద్వారా పేల్చేసి అక్కడకు రోజూ వచ్చే రెండొందల మంది పురుషులూ, స్త్రీలను చంపేయటంతో మొదలెడితే మహా అయితే తనపై టెర్రరిస్ట్ అనే ముద్ర పడొచ్చు లేదా ఉరి శిక్ష పడొచ్చు అంతేగా అనుకున్నాడు. దానికి ప్రయత్నాలు కూడా మొదలెట్టేశాడు ఎవరికీ తెలియకుండా.

ఎందుకో ఈ ముస్లిములకో చివరి అవకాశం ఇద్దామనుకున్నాడు. తాను బాంబ్ పెట్టి పేల్చేయ్యాలనుకున్న ఇస్లామిక్ సెంటర్ కే ఓ రోజు వెళ్లాడు. లోపలికి అడుగేట్టగానే అక్కడ అతనికి సాదర ఆహ్వానం లభించింది.

అందరూ అతని పట్ల వ్యవహరిస్తున్న తీరు ప్రదర్శిస్తున్న గౌరవం అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అందులో ఒకతను రిచర్డ్ ను ఎంతో ఆప్యాయతతో మాట్లాడి ఖురాన్ ను అతని చేతిలో పెట్టాడు. ముస్లిములను చూస్తేనే మండిపోయే ఆ మనిషి ఖురాన్ లోని కొన్ని పేజీలను అటూ ఇటూ తిప్పటం మొదలెట్టాడు. అందులో… “ఒక మానవుణ్ణి అన్యాయంగా చంపిన వాడు సమస్త మానవులను చంపినట్లే ఒక మానవుడి మనిషి ప్రాణాన్ని కాపాడినవాడు మొత్తం మానవుల ప్రాణాలను కాపాడినట్లే” అన్న వాక్యం కనపడింది. ఈ వాక్యం ఆ రిచర్డును ఆలోచనలో పడవేసింది.

ముస్లిం పేర్లు పెట్టుకుని టెర్రరిజం చేస్తున్న టెర్రరిస్టులకు ఖురాన్ సరిగ్గా అర్థం కాలేదా? లేక వారెప్పుడూ ఖురాన్ చదవలేదా? అన్న మొట్టమొదటి ప్రశ్న బయలుదేరింది అతనిలో. టెర్రరిజం చేస్తున్న వారి ప్రకారం అయితే ఖురాన్లో అందర్నీ చంపేస్తే పుణ్యమని ఉండాలి కదా? పైగా ఒకణ్ణి చంపితే మొత్తం మానవులను చంపినంత పాపం అంటుందేమిటీ పుస్తకం? అంటూ అతని మదిలో మెదిలిన ప్రశ్నలే అతనితో పూర్తి ఖురాన్ ను కూర్చోబెట్టి చదివించాయి.

ఖురాన్ పూర్తిగా చదవటం మొదలెట్టాక అది అతనితో ఇస్లాంను లోతుగా అధ్యయనం చెయ్యటం వైపు అడుగులు వేసేలా చేసింది. ఆ ఖురాన్ అతనిలో మెదిలే ప్రతీ ప్రశ్నకూ సమాధానం ఇస్తూ పోతుంది. అతనిలో ఇస్లాం పట్ల అలుముకున్న అపార్థాల మబ్బులన్నీ వీడటం మొదలెట్టాయి. ప్రవక్త ముహమ్మద్ (స) జీవిత విధానం, ఆయన బోధలు అతని ఆలోచనల్లో ఇస్లాం పట్ల ఉన్న ధ్వేషాన్ని ఇష్టంలోకి మార్చేశాయి. నేడు జరుగుతున్న టెర్రరిజానికీ ఇస్లాంకూ కించిత్తు సంబంధం లేదన్న విషయం అతనికి సుస్పష్టమైంది.

అన్యాయంగా ఏ ఒక్కడినైనా చంపటానికి ఖురాన్ అనుమతి ఇవ్వనప్పుడు ముస్లిం పేర్లు పెట్టుకుని టెర్రరిజం చేస్తే అది ఇస్లామిక్ టెర్రరిజం ఎలా అవుతుంది? అన్న వాస్తవాన్ని గ్రహించటమే కాక ఇస్లాం టెర్రరిజాన్ని అణుచుతుంది అన్న సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ప్రపంచానికి ఈ వాస్తవాలు తెలియజేయటానికి తానే ఇస్లాంను స్వీకరించాడు.

ఇస్లాం పట్ల అతని కరుడుగట్టిన ధ్వేషం దాన్ని లోతుగా అధ్యయనం చేశాక ఇస్లాం పట్ల అది ప్రేమగా మారిపోయింది. ఏ ఇస్లామిక్ సెంటర్ నైతే అతను బాంబు పెట్టి పేల్చేయ్యాలనుకున్నాడో ఆ ఇస్లామిక్ సెంటర్ లోనే అతను ప్రధాన ఇస్లాం వక్తగా మారిపోయాడు.

“రిచర్డ్ ఎం.సీ. కిన్నే” పేరును యూట్యూబ్ లో టైప్ చేస్తే అతను ఇస్లాంపై ఇచ్చిన కొన్ని లెక్చర్స్, అతను ఒకప్పుడు ఇస్లాంను ఎంతలా ధ్వేషించేవాడో ఎలా ఇస్లాంకు దగ్గరయ్యాడో చెప్పిన ఎన్నో ఇంటర్యూలనూ మీరూ చూడవచ్చు.

ఇస్లాం పట్ల ఒకప్పుడు తాను ప్రదర్శించిన ధ్వేషాన్ని తలచుకుని ఇప్పటికీ బాధపడుతుంటాడా రిచర్డు. బరువెక్కిన గుండెతో ఎంత పెద్ద తప్పుచేశానో అని ఇప్పటికీ కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉంటాడా మనిషి.

ఎంతైనా ఇస్లామోఫోబియాకు ఆధారం అజ్ఞానమే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *